close

కథనాలు

కుమార్‌ మంగళం బిర్లాకు ఆ రోజుల్లో కష్టాలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఘనత ఆయన పూర్వీకుల సొంతం. తరతరాలుగా వస్తున్న వ్యాపారం సామ్రాజ్యం ఆయన కుటుంబానికి ఉంది. కానీ, అప్పటి వరకు వ్యాపారాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న తండ్రి హఠాన్మరణంతో ఆయన బాధ్యతల భారం ఆయన భుజస్కంధాలపై పడింది. అయినా ఏ మాత్రం జంకలేదు. కుటుంబ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాతలు, తండ్రి నెలకొల్పిన ప్రమాణాల్ని ఏమాత్రం తగ్గనీయలేదు. తన చేతికిచ్చిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏకంగా 16రెట్లు పెంచారు. ఆయన ఎవరో కాదు.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా. విద్యార్థిగా ఆయన కూడా ఒక ఇష్టం లేని చదువు చదివి తీవ్రంగా అవస్థలుపడ్డారు. కానీ, ఆయన కష్టానికి తగిన ఫలితం కోర్స్‌ టాపర్‌ రూపంలో దక్కింది. ఆ విశేషాలేంటో చదవండి.. 

కుటుంబానిది ఘన చరిత్ర...

బిర్లాలకు ఘన చరిత్ర ఉంది. వీరిది రాజస్థాన్‌కు చెందిన మార్వాడీ కుటుంబం. ప్రస్తుత బిర్లా గ్రూప్‌నకు ఆద్యుడు శివ్‌ నారాయణ్‌ బిర్లా. రాజస్థాన్‌ నుంచి ముంబయికి మకాం మార్చి.. 1857లో వ్యాపార సామ్రాజ్యానికి అంకురార్పణ చేశారు. తొలుత టెక్స్‌టైల్‌, సిమెంట్‌, లోహ పరిశ్రమల్ని ప్రారంభించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో బల్‌దేవ్‌ దాస్‌ బిర్లాను దత్తత తీసుకున్నారు. తండ్రి వ్యాపార వారసత్వాన్ని బలదేవ్‌ విజయవంతంగా కొనసాగించారు. అనంతరం ఆయన కుమారుడు ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా(జి.డి.బిర్లా) వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. జి.డి.బిర్లా స్వాంతంత్ర్య సమరయోధులు. గాంధీజీకి సన్నిహితుడు. అనంతరం వచ్చిన బసంత్ కుమార్‌ బిర్లా, ఆయన కుమారుడు ఆదిత్య విక్రమ్‌ బిర్లా తమ వంతుగా వ్యాపారాన్ని విస్తరించారు. అలా దేశ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ బిర్లా గ్రూప్‌ నాలుగో తరానికి చేరింది. అందులో ఒక భాగమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ప్రస్తుతం కుమార్‌ మంగళం బిర్లా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇష్టం లేకుండానే సీఏలో టాప్‌...

వ్యాపారంలో భాగంగా బిర్లా కుటుంబం కోల్‌కతాలో నివసిస్తుండగా.. కుమార్‌ మంగళం జన్మించారు. కొన్ని రోజులకి వారు తిరిగి ముంబయి చేరుకున్నారు. హెచ్.ఆర్‌. కాలేజ్ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌లో కుమార్‌ మంగళం బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఇష్టం లేకున్నా తండ్రి కోరిక మేరకు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో జాయిన్‌ అయ్యి పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు. అయితే, తన జీవితంలో సీఏ చదివిన నాలుగేళ్లే అత్యంత కష్టకాలమని కుమార్‌ చెబుతుంటారు.

28ఏళ్లకు వ్యాపార బాధ్యతలు...

తండ్రి ఆదిత్య విక్రమ్‌ బిర్లా 1995లో అకస్మాత్తుగా చనిపోయారు. దీంతో అనుకోకుండానే కుమార్‌ మంగళం బిర్లా వ్యాపార బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అప్పటికి ఆయన వయసు కేవలం 28ఏళ్లు. కంపెనీలోని ఉద్యోగుల సగటు వయసు 58 ఏళ్లు. అంటే కుమార్‌ మంగళంతో కలిసి పనిచేయాల్సిన వారంతా ఆయనకంటే పెద్దవారు. నిజానికి ఆయన వ్యాపారాన్ని నిర్వహించలేరని అంతా అనుకున్నారు. కానీ, వారి అంచనాల్ని తలకిందులు చేస్తూ వ్యాపార విస్తరణలో తనదైన శైలిలో దూసుకుపోయారు. దీంతో తొలినాళ్లలో ఆయన్ని విమర్శించిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. నిజానికి కుమార్‌ మంగళం పూర్తి బాధ్యతలు తీసుకోవడానికి రెండేళ్ల ముందు నుంచే తండ్రి వద్ద వ్యాపార మెలకువలు నేర్చుకున్నారు. తండ్రితో చర్చిస్తూ అనేక అంశాలపై పట్టు సాధించారు. కానీ, బయటి వ్యక్తులతో కలవడానికి అంతగా ఇష్టపడకపోవడం, అంతర్ముఖుడు కావడంతో ఆయనకు వ్యాపారాన్ని నిర్వహించే సామర్థ్యం లేదని అందరూ అనుకున్నారు. కానీ, అది తప్పని నిరూపించారు. వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు.

రెండు బిలియన్‌ డాలర్ల నుంచి 48బిలియన్ డాలర్లకు...

బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్లలో కుమార మంగళం బిర్లా వ్యాపారాన్ని అనేక రంగాలకు విస్తరించారు. ఉన్న వ్యాపారాల్ని తనదైన వ్యూహాలతో సుస్థిరం చేశారు. ఆధునిక వ్యాపారంలో ఇతర కంపెనీల్ని కొనుగోలు చేయడానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. గత 20ఏళ్లలో నోవెలిస్‌, కొలంబియన్‌ కెమికల్స్‌, సీటీపీ డీఎమ్‌బీహెచ్‌ ఇలా వివిధ రంగాలకు చెందిన దాదాపు 36 కంపెనీల్ని ఆదిత్య బిర్లాలో విలీనం చేశారు. వీటిలో కెనడా, అమెరికా, చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్టు, థాయ్‌లాండ్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. ఇలా 1995లో రెండు బిలియన్‌ డాలర్లుగా ఉన్న గ్రూప్‌ రాబడి ప్రస్తుతం 48.3బిలియన్ డాలర్లకు చేర్చారు. ప్రస్తుతం ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన కంపెనీలు 42 దేశాల్లో విస్తరించాయి. లక్షా 20వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. కుమార్‌ మంగళం స్థాపించిన వాటిలో ఐడియా సెల్యూలార్‌ ఒకటి. అయితే తాజాగా ఆ రంగంలో నెలకొన్న పోటీ వల్ల ఆ కంపెనీ తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి వొడాఫోన్‌తో జట్టుకట్టింది. మొత్తానికి భారీ నష్టాల నుంచి కాపాడడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. కంపెనీని మూసివేసి.. దానిపై ఆధారపడ్డ అనేక మంది పొట్టకొట్టడానికి బదులు.. మరో సంస్థతో చేతులు కలిపి ముందుకు సాగుతున్నారు.

పిల్లలు వ్యాపారానికి దూరం...

అనుకోకుండా వ్యాపారంలోకి ప్రవేశించిన కుమార మంగళం.. తన పిల్లలకు మాత్రం స్వేచ్ఛ కలిపించారు. ఆయన కుమారుడు ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. కుమార్తె అనన్య బిర్లా సంగీతంలో శిక్షణ పొందుతోంది. మరో కూతురు అద్వైతేశ బిర్లా సైతం వ్యాపారానికి దూరంగానే ఉంది. భార్య నీరజ బిర్లా ముంబయిలోని ‘బిర్లా స్కూల్‌’ బాధ్యతలు చూసుకుంటున్నారు. కుమార మంగళం అనేక విద్యాసంస్థలకు బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు ‘బిట్స్‌’ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌కి ఛైర్మన్‌గానూ ఉన్నారు. కుమార మంగళం విలాసంగా జీవించడానికి ఇష్టపడుతుంటారు. అనేక మంది పారిశ్రామికవేత్తలకు అడ్రస్‌గా మారిన దక్షిణ ముంబయిలో రూ.425కోట్లు విలువ చేసే జతియా హౌజ్‌ను గత డిసెంబరులో సొంతం చేసుకున్నారు. కుమార్‌ మంగళానికు బీఎండబ్య్లూ కార్లంటే భలే ఇష్టం. ఫైవ్‌ సిరీస్‌ సెడాన్‌లోనే ఆయన ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే సెస్నా సైటేషన్‌, గల్ఫ్‌ స్ట్రీమ్‌ జీ100 రకానికి చెందిన ప్రైవేటు జెట్లు కూడా ఉన్నాయి.

విదేశాల్లోనూ దాతృత్వ కార్యక్రమాలు...

సామాజిక బాధ్యతలో భాగంగా కుమార్‌ మంగళం బిర్లా అనేక దాతృత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భారత్‌లోనేగాక ఈజిప్టు, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లోనూ సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏటా దాదాపు ఐదు వేల గ్రామాల్లో 70లక్షల మందికి ఆదిత్య గ్రూప్‌ నుంచి సాయం అందుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆధ్వర్యంలో 56 పాఠశాలలు నడుస్తున్నాయి. దాదాపు 45వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే తరచూ నిర్వహించే వివిధ కార్యశాలలు, నైపుణ్య కార్యక్రమాల ద్వారా ఏటా మరో లక్షల మంది లబ్ధిపొందుతున్నారు.

ఎంత ఒత్తిడిలో వ్యాపారంలోకి ప్రవేశించినా.. వాటన్నింటినీ అధిగమించి తానేంటో నిరూపించుకున్నారు కుమార్‌ మంగళం బిర్లా. కుటుంబానికి ఉన్న ఘన చరిత్రను మరింత ఇనుమడింపజేశారు. వ్యాపార ఆదాయాన్ని 16 రెట్లు పెంచి భారతీయ వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశాల్లోనూ ఉపాధి కల్పిస్తూ.. దాతృత్వ కార్యక్రమాలు చేపడుతూ భారతీయుల వ్యాపార విలువల్ని చాటుతున్నారు. ఇటీవల ఆయన నేతృత్వంలో థాయ్‌లాండ్‌లో సంస్థ 50వ వార్షికోత్సవం జరుపుకొంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  


కథనాలు

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.