close

కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేటుగాళ్లతో కంప్యూటర్లకు కరోనా‘వైరస్’‌..!

 ‘వర్క్‌ఫ్రం హోం’ను క్యాష్‌ చేసుకొంటున్న హ్యాకర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పక్క ప్రపంచం మొత్తం కరోనావైరస్‌ (కొవిడ్‌-19)తో భయభ్రాంతులకు గురవుతుంటే.. కొందరు కేటుగాళ్లు దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా భయాలను, గందరగోళాన్ని క్యాష్‌ చేసుకొనే పనిలోపడ్డారు. ఇందుకు ముఖ్యంగా కంప్యూటర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొన్నట్లు బెంగళూరుకు చెందిన ‘సుబెక్స్‌’ అనే సంస్థ పేర్కొంది. ఇది టెలికం కంపెనీలకు అనలటిక్స్‌ సేవలను అందజేస్తుంది. 

ప్రస్తుతం కరోనావైరస్‌ భయంతో చాలా కంపెనీలు ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని ప్రోత్సహిస్తున్నాయి. ఇది హ్యాకర్లకు అనువుగా మారింది. ఉద్యోగులు ఇళ్ల దగ్గర నుంచి పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో ఉన్నంత సైబర్‌ సెక్యూరిటీ ఇళ్లవద్ద ఉండే నెట్‌వర్క్‌లకు ఇవ్వడం కుదరదు. దీనిని హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకొని వారి డివైజ్‌లు, రౌటర్లను హ్యాక్‌ చేసి మాల్వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సుబెక్స్‌ పేర్కొంది. 

హ్యాక్‌ చేసిన డివైజ్‌లు(కంప్యూటర్లు, రౌటర్లు) బాట్స్‌వలే పనిచేస్తాయి. ఇవి బాట్‌నెట్‌కు కనెక్ట్‌ అవ్వగలవు. ఒక్కసారి ఉద్యోగి ఆఫీస్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌కాగానే ఇవి వ్యవస్థపై సైబర్‌ దాడులు నిర్వహిస్తాయని సుబెక్స్‌ ఇంటర్నెట్‌ థింగ్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ప్రయుక్త కె.వి వెల్లడించారు. 
 

ప్రస్తుతం ఉన్న ఆందోళనకర పరిస్థితులను తమకు అనుకూలంగా వాడుకొని హ్యాకర్లు నెట్‌వర్కుల్లోకి చొరబడి తక్షణమే హ్యాక్‌ చేయడంగానీ, తర్వాత వినియోగించుకొనేలా ట్రొజన్‌ను చొప్పించడంగానీ చేసే అవకాశాలు ఉన్నాయి. సుబెక్స్‌  సంస్థకు 62పట్టణాల్లో హనీపాట్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ (హ్యాకర్లను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన డమ్మీ వ్యవస్థ) ఉంది. ఇప్పటికే ఈ వ్యవస్థ కరోనావైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చోట్ల వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ప్రదేశాల్లో మాల్వేర్‌ కదలికలను గుర్తించింది. 

గత 28 రోజుల్లో ఆరోగ్య రంగం, తయారీ రంగం మినహా ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన అన్ని రంగాల్లో ఈ మాల్వేర్‌ దాడులను సుబెక్స్‌ గుర్తించింది. ఈ మెయిల్స్‌, సోషల్‌మీడియా లింక్స్‌, ఇన్‌స్టెంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో ఫిషింగ్‌ దాడులు బాగా పెరిగాయి. ఈ పెరుగుదల ఒక్క భారత్‌లోనే 39శాతం వరకు ఉంది. ‘coronavirus emergency declared,’ ‘1,000 coronavirus deaths in last 16 hours’,‘this drug could save your life from corona’, డబ్ల్యూహెచ్‌వో విరాళాలు వసూలు చేస్తోందనే లింక్‌లతో ఈ ఇ-మెయిల్స్‌ వస్తున్నాయి. 

2019 నుంచే సిద్ధం..
హ్యాకర్లు 2019 నుంచి సైబర్‌ దాడులకు సిద్ధమయ్యారు. చివరి నాలుగు నెలల్లో భారీగా వీరు మాల్వేర్‌ను కొనుగోలు చేసినట్లు సుబెక్స్‌ తెలిపింది. వీటిని డిసెంబర్‌, జనవరిలో వినియోగించటం మొదలు పెట్టారని చెప్పింది. 23రకాల కామన్‌ఫైల్‌ ఎక్స్‌టెన్షన్లను హ్యాకర్లు వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. వీటిల్లో rar, zip, mp3, mp4, xlsx, docx, EPS వంటివి కూడా ఉన్నట్లు గత 26రోజుల్లో గుర్తించామని పేర్కొంది. వీటిల్లో ఎన్‌క్రిప్టెడ్‌ మాల్వేర్‌ ఉంటోదని వివరించింది. ముఖ్యంగా “corona_health_update.pdf (attributed to centres for disease control), origin-of-corona_cnn.mp4, covid19_mandatory_work_from_measures.pdf, corona_safety_alert.docx and secondary_corona_infections.pdf.” వంటి ఫైల్స్‌ వస్తున్నాయని తెలిపింది. కరోనావైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వాలు చేసే ప్రకటనలను బట్టి ఈ మాల్వేర్‌ పైళ్లు కూడా మారుతున్నట్లు గుర్తించామని సుబెక్స్‌ పేర్కొంది. ‘వర్క్‌ఫ్రం హోం’ సమయంలో అనుమానాస్పద ఫైల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.