close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మల్టీ క్యాప్‌ మార్పులతో ఎవరికి మేలు?

మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు గిరాకీ
ఫండ్‌ మేనేజర్లకు సంకటం
కొన్ని లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్లుగా మారే అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌

ల్టీ క్యాప్‌ తరగతికి చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు తప్పనిసరిగా 25 శాతం చొప్పున నిధులను మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లలో మదుపు చేయాలని సెబీ తెచ్చిన కొత్త నిబంధనలు మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాల్లో, రిటైల్‌ మదుపర్లలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నిబంధనలు ఏమేరకు అమలవుతాయి, దీన్ని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఎవరికి మేలు జరుగుతుంది....? అనే కోణాల్లో చర్చ జరుగుతోంది.

లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో పెట్టుబడి పెట్టే వాటిని మల్టీ క్యాప్‌లుగా భావిస్తారు. కానీ వీటి పెట్టుబడుల తీరుతెన్నులు చూస్తే... అవి లార్జ్‌ క్యాప్‌ లేదా లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌గానే ఉంటున్నాయి. దాదాపు 70- 80 శాతం నిధులను కేవలం పెద్ద కంపెనీల షేర్లకు కేటాయిస్తూ చిన్న, మధ్య స్థాయి కంపెనీల వైపు చూడని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే పేరుకు తగ్గట్లుగా, అన్ని తరగతులకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సిందేనంటూ సెబీ తాజాగా స్పష్టం చేసింది. దీనివల్ల దాదాపు రూ.30,000 కోట్ల మేరకు పెట్టుబడులు పెద్ద కంపెనీల నుంచి మధ్య, చిన్న కంపెనీల్లో మల్టీ క్యాప్‌ ఫండ్లు మళ్లించాల్సి వస్తుంది. ఉన్నఫళంగా పెద్ద కంపెనీల షేర్లు విక్రయించి, ఆ సొమ్మును చిన్న, మధ్యస్థాయి కంపెనీలపై పెట్టుబడులు పెట్టటం అంత సులువైన విషయం కాదనేది మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల వాదనగా ఉంది. తగినంత పెట్టుబడి అవకాశాలు చిన్న కంపెనీల షేర్లలో లేనట్లు సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే కొత్త నిబంధనలను మరోసారి పరిశీలించాల్సిందిగా సెబీకి విన్నవించాయి. కానీ, మల్టీ క్యాప్‌ ఫండ్‌ అనే పేరు ఉంటే మాత్రం తప్పనిసరిగా పెట్టుబడుల కేటాయింపు నిబంధనలను పాటించాల్సిందే... అని సెబీ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.


చిన్న మదుపరులకు ప్రయోజనమే..

స్టాక్‌ మార్కెట్లో సాధారణంగా చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్లను రిటైల్‌/ చిన్న మదుపరులు అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇటువంటి షేర్లలో నేరుగా కానీ, ఫండ్‌ పథకాల ద్వారా కానీ పెట్టుబడులు పెట్టిన మదుపరులు గత రెండు, మూడేళ్లలో బాగా నష్టపోయారు. సెబీ జారీ చేసిన తాజా నిబంధనలతో వచ్చే కొద్ది రోజుల్లో మల్టీక్యాప్‌ ఫండ్లు తమ అజమాయిషీలోని నిధులను కొంత మేరకు చిన్న కంపెనీలకు మళ్లించాల్సి వస్తుంది. దీనివల్ల చిన్న, మధ్యతరహా కంపెనీల షేర్లకు గిరాకీ లభించి ఆ షేర్లు పెరిగే అవకాశముంది. ఇది చిన్న మదుపరులకు మేలు జరిగే అవకాశముంది.


‘కేటగిరీ’ మార్చుకుంటాయేమో...

మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ వర్గాలను తాజా మార్పులపై సంప్రదించగా పెద్ద షేర్లు విక్రయించి, చిన్న షేర్లకు పెట్టుబడులు మళ్లించటానికి బదులు మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ‘కేటగిరీ’ని మార్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు చెప్పారు. అంటే ప్రస్తుతం మల్టీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని లార్జ్‌ క్యాప్‌ లేదా లార్జ్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ అని మార్చుకొని అందుకు సెబీ అనుమతి తీసుకుంటారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు ఇప్పటికే మార్కెట్లో తగినన్ని పెట్టుబడి అవకాశాలు లభ్యంకాక ఇబ్బంది పడుతున్నాయి. పెట్టుబడి పెట్టేందుకు అనువైన స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు ఈ ఫండ్లకు లభ్యం కావటం లేదు. దీంతో కొన్ని ఫండ్లు కొత్తగా పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయి. ఎస్‌బీఐ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ దీనికి ఉదాహరణ.


కొంత ఊరట

తాజా నిబంధనలను అమలు చేయటానికి మల్టీ క్యాప్‌ ఫండ్లకు నాలుగు నెలల సమయం దొరికింది. ఈ లోపు క్రమానుగతంగా లార్జ్‌ క్యాప్‌ పెట్టుబడులను తగ్గించుకొని, ఆ మేరకు చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లలోకి మళ్లించవచ్చు. లేదా వీటిని తమ లార్జ్‌ క్యాప్‌ పథకాల్లో విలీనం చేయటం. వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలించవచ్చని సెబీ వివరించింది. అంతేగాక యూనిట్‌ హోల్డర్లను ఇతర పథకాల్లోకి మారాలని కోరే వీలుందని పేర్కొంది.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.