close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా కల్లోలం

ఐరోపాలో పెరిగిన కేసులతో మళ్లీ లాక్‌డౌన్‌ భయాలు
అంతర్జాతీయంగా వెల్లువెత్తిన అమ్మకాలు
కుదేలైన స్టాక్‌ మార్కెట్లు

812 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌
రూ.4.23 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి

కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మదుపరికి సోమవారం ఊహించని షాక్‌ తగిలింది. ఐరోపాలో కరోనా కేసులు విజృంభించడం, మరోదఫా లాక్‌డౌన్‌ విధించొచ్చన్న భయాలతో ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ సెగ మన సూచీలకూ తగిలింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలూ తోడవ్వడంతో దేశీయ మదుపరికి నష్టకన్నీరే మిగిలింది. ఈ కన్నీటి విలువ.. రూ.4.23 లక్షల కోట్లు.
కరోనా నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ విధించొచ్చన్న అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి. ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు కుదేలయ్యాయి.. దేశీయంగా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో, సెన్సెక్స్‌, నిఫ్టీ 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.24 లక్షల కోట్లు పతనమై రూ.154.76 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్‌ ఉదయం 38,812.69 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. అనంతరం ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఇంట్రాడేలో 38,990.76 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. మళ్లీ కోలుకోలేకపోయింది. చివరకు 811.68 పాయింట్ల నష్టంతో 38,034.14 వద్ద ముగిసింది. నిఫ్టీ 254.40 పాయింట్లు కోల్పోయి 11,250.55 దగ్గర స్థిరపడింది.
సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 నష్టాలతో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.67%, భారతీ ఎయిర్‌టెల్‌ 5.81%, టాటా స్టీల్‌ 5.58%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 5.15%, ఎం అండ్‌ ఎం 4.90%, మారుతీ 4.90%, యాక్సిస్‌ బ్యాంక్‌ 4.52%, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.24% మేర డీలాపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌ 0.86%, ఇన్ఫోసిస్‌ 0.67%, టీసీఎస్‌ 0.57% చొప్పున రాణించాయి.
రూట్‌ మొబైల్‌ అదరగొట్టింది: రూట్‌ మొబైల్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో నమోదైన తొలిరోజే అదరగొట్టాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధరైన రూ.350తో పోలిస్తే షేరు 102 శాతం లాభంతో రూ.708 వద్ద నమోదైంది. ఇంట్రాడేలో రూ.735 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 86 శాతం దూసుకెళ్లి రూ.651.10 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలో సైతం 85.8 శాతం లాభపడి రూ.650.30 వద్ద స్థిరపడింది.

మార్కెట్ల నష్టాలకు కారణాలివే
* ఐరోపా దేశాల్లో కరోనా మరోసారి విజృంభించడం అంతర్జాతీయంగా మదుపర్లను కలవరపెట్టింది. డెన్మార్క్‌, గ్రీస్‌, స్పెయిన్‌ కొత్త నిబంధనలను విధించడం, బ్రిటన్‌ మళ్లీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించొచ్చన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

* ఐరోపా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. జులై తర్వాత అతిపెద్ద నష్టాలను నమోదుచేశాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు కకావికలమయ్యాయి.
* ఈ వారం అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సహా ఏడుగురు సభ్యులు పలు కమిటీల ముందు ప్రసంగించనున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్‌కు దిశానిర్దేశం వంటివాటికి ఇవి కీలకం కానున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడటం కూడా ప్రభావం చూపింది.
* సెప్టెంబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు లాభాలు స్వీకరించారు. మార్చి కనిష్ఠాల నుంచి సూచీలు 50 శాతం దూసుకెళ్లడంతో కొంత దిద్దుబాటు రావొచ్చన్న అంచనాలు పెరిగాయి
అమెరికా మార్కెట్లు డీలా
కరోనా కేసులపై భయాలకు అక్రమ నగదు బదిలీలో దిగ్గజ బ్యాంకులున్నాయన్న ఆరోపణలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు డోజోన్స్‌ సూచీ 750 పాయింట్లు, నాస్‌డాక్‌ 120 పాయింట్ల చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.