close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరోగ్య బీమా ప్రీమియం భారం

5%-20% వరకు పెంపు

కొత్త నిబంధనలతో పాలసీల్లో పారదర్శకత

అక్టోబరు 1 నుంచి వర్తింపు

ఈనాడు - హైదరాబాద్‌

కరోనా వైరస్‌ వ్యాప్తితో సాధారణ చికిత్సా విధానంలో ఏన్నో మార్పులొచ్చాయి. వైద్య విధానంలోనూ అధునాతన పద్ధతులొచ్చాయి. ఫలితంగా ఎప్పుడో రూపొందించిన ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. వీటిని పాలసీదారులకు మరింత ప్రయోజనకరంగా మార్చడం, పారదర్శకత పెంచేందుకు వీలుగా ఐఆర్‌డీఏఐ గత ఏడాది సెప్టెంబరు 27న పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మినహాయింపుల జాబితాను తగ్గించడం, రోబోటిక్‌ సర్జరీలాంటి ఆధునిక చికిత్స పద్ధతులకూ పరిహారం వర్తించేలా కొత్త పాలసీలను రూపొందించాలని సూచించింది. కొత్త నిబంధనలతో పాలసీలను అక్టోబరు 1, 2020 నుంచి అమల్లోకి తేవాలని తెలిపింది. కొన్ని ప్రామాణిక నిబంధనలకూ కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబరు 1 నుంచి బీమా ప్రీమియం భారమయ్యే అవకాశం ఉంది.

ప్రీమియం నిర్ణయం బీమా సంస్థలకే

పాలసీల్లో కొత్త మార్పులు చేసేందుకు ఇప్పటికే బీమా సంస్థలు సిద్ధం అయ్యాయి. ఐఆర్‌డీఏ నిబంధనలు పాటించడం, కొవిడ్‌-19లాంటివాటి నేపథ్యంలో ప్రీమియాన్ని సవరించేందుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో పాలసీలను బట్టి, 5%-20% వరకు ప్రీమియాన్ని పెంచే అవకాశం ఉంది. ఇందులో 5 శాతం ప్రీమియం పెంచేందుకు ఐఆర్‌డీఏ అనుమతి అవసరం లేదు. దీనికి మించి పెంచాలంటే తప్పనిసరిగా నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. అయితే, ప్రీమియాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలకోసారి చెల్లించే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది.

ముందస్తు వ్యాధుల విషయంలో...

కొత్త నిబంధనల ప్రకారం పాలసీ తీసుకునే నాటికి, 48 నెలల క్రితం వరకూ వైద్యుడు ధ్రువీకరించి, చికిత్స అందించిన జబ్బులనే ముందస్తు వ్యాధులుగా గుర్తిస్తారు. వీటికి మినహాయింపు వర్తిస్తుంది. ఎనిమిదేళ్లు వరసగా ప్రీమియం చెల్లించి, ఆరోగ్య బీమా కొనసాగించిన వారికి, ఆ తర్వాత ఎలాంటి చికిత్సలకైనా పరిహారం ఇవ్వాల్సిందే. శాశ్వత మినహాయింపుగా దాన్ని పేర్కొంటే తప్ప క్లెయింని తిరస్కరించే హక్కు లేదు.

30 రోజుల్లో

ఐఆర్‌డీఏ కొత్త నిబంధనల ప్రకారం బీమా సంస్థ పాలసీదారుడికి క్లెయింను చెల్లించడం లేదా తిరస్కరించడం అనేది 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. లేని పక్షంలో అన్ని పత్రాలు అందిన తేదీ నుంచి లెక్కించి, క్లెయిం మొత్తానికి బ్యాంకు వడ్డీ రేటు కన్నా 2శాతం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.

ఏప్రిల్‌ 1 నుంచి పాత పాలసీలకు.

కొత్తగా పాలసీలు తీసుకునే వారికి అక్టోబరు 1 నుంచి మారిన నిబంధనలతో పాలసీలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 30 వరకూ పాలసీలను తీసుకున్న, పునరుద్ధరణ చేసుకున్న వారికి ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి.


హెచ్‌ఐవీ.. మానసిక అనారోగ్యానికీ..

కొత్తగా వచ్చే పాలసీల్లో 12 రకాల అధునాతన చికిత్సలతోపాటు, హెచ్‌ఐవీ, మానసిక అనారోగ్యం, అల్జీమర్స్‌లాంటి వాటికీ కవరేజీ వర్తిస్తుంది. ప్రీమియాన్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. బీమా సంస్థలన్నీ ఒకే నిబంధనల ఆధారంగా క్లెయిం సెటిల్‌మెంట్‌ చేస్తాయి. బీమా సంస్థ సేవలు, క్లెయిం చెల్లింపుల చరిత్ర ఆధారంగా పాలసీదారుడు సంస్థను ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుంటుంది.

- రష్మి నందర్గి, హెడ్‌ (రిటైల్‌ హెల్త్‌ అండర్‌రైటింగ్‌) బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌


అర్థం చేసుకోవడం సులభం

ప్రామాణిక మినహాయింపులు ఉండటంతో పాలసీలను పోల్చుకోవడం సులభం అవుతుంది. దీనివల్ల అయోమయానికీ తావుండదు. వాయిదాల్లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించడం వల్ల వైద్య పాలసీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది.

- ప్రసూన్‌సిక్దర్‌, ఎండీ-సీఈఓ, మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ


విశ్వాసర పెరుగుతుంది

ప్రామాణిక నిబంధనలు అమలు చేయడం ద్వారా పాలసీదారుల్లో ఆరోగ్య బీమాపై విశ్వాసం పెరుగుతుంది. ఆసుపత్రులతో బీమా సంస్థలు వ్యవహరించే తీరు ఒకే విధంగా ఉండటంతో, ఆసుపత్రులు మరింత మెరుగైన చికిత్సలను అందించే వీలూ కలుగుతుంది. క్లెయిం తిరస్కరణలు తగ్గడం, వేగంగా పాలసీకి పరిహారం చెల్లించడం లాంటివి పాలసీదారులకు మేలు చేస్తాయి.

- ఎస్‌.ప్రకాశ్‌, ఎండీ, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌


 


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.