close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్థిక వ్యవస్థ.. స్వచ్ఛ ఇంధనంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదగాలి

రెండు లక్ష్యాలను ఏకకాలంలో సాధించాలి
రాబోయే రెండు దశాబ్దాల్లో తలసరి ఇంధన వినియోగం రెట్టింపు
ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ
అహ్మదాబాద్‌

రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ చోటు దక్కించుకుంటుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థపరంగానే కాదు.. స్వచ్ఛ ఇంధనం విషయంలోనూ భారత్‌ బలమైన శక్తిగా అవతరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ సాంకేతికతల్లోనూ.. ఇంధన నిల్వ, వినియోగంలోనూ కొత్త పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన పండిట్‌ దీన్‌దయాల్‌ పెట్రోలియం యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవ కార్యక్రమంలో అంబానీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచంలో ఇంధన వినియోగం ఇప్పుడున్న దానితో పోలిస్తే రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌లో తలసరి ఇంధన అవసరాలు కూడా ప్రస్తుతం కంటే రెట్టింపు అవుతాయి. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ ఇంధనం విషయంలో బలమైన శక్తిగా అవతరించాలన్న లక్ష్యాన్ని ఏకకాలంలో భారత్‌ సాధించాల్సిన అవసరం ఉంద’ని అంబానీ పేర్కొన్నారు. ఇంధన రంగంలో ఎన్నో ఊహించని మార్పులు రానున్నాయని.. అవి ప్రజలు, ప్రపంచ భవితపై ప్రభావం చూపించనున్నాయని తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఇంధన విప్లవాన్ని అనుసంధానించడంలో భారత్‌ విజయవంతమైతే.. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా భారత్‌ అవతరిస్తుందని అన్నారు. ఆ పరిణామం భారతీయులందరినీ సంపన్నులుగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమయ్యే ఇంధనాన్ని పర్యావరణానికి హాని జరగకుండా ఏమేరకు ఉత్పత్తి చేయగల్గుతామన్నదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు అని అంబానీ అన్నారు.

నమ్మకంతో అడుగేయండి
కొవిడ్‌-19 పరిణామాలు సృష్టించిన అనిశ్చితులను చూసి ఆందోళన చెందవద్దని స్నాతకోత్సవ కార్యక్రమంలోని విద్యార్థులను ఉద్దేశించి ముకేశ్‌ అన్నారు. బలమైన సంకల్పం, నమ్మకంతో ముందుకు అడుగులు వేయాలని వాళ్లకు సూచించారు. ‘భారత్‌ భవిష్యత్‌ ఎంతో గొప్పగా ఉండనుంది. మనది చాలా పురాతన దేశం. గతంలో ఇలాంటి ఎన్నో కుదుపులను దేశం ఎదుర్కొంది. ప్రతిసారి వాటిని తట్టుకొని గట్టిగా నిలబడింది. భారతీయుల్లో నరనరాన నాటుకుపోయి ఉన్న బలమైన సంకల్పమే ఇందుకు కారణం. కొవిడ్‌-19 అదుపులోకి వచ్చిన తర్వాత భారత్‌ అనూహ్య రీతిలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడాన్ని మనం చూస్తామ’ని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధితో మీ లాంటి యువత, నైపుణ్యవంతులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి అవకాశాలు యువ పారిశ్రామికవేత్తలే సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. మీలోనూ విజయవంతమైన అంకుర సంస్థల సృష్టికర్తలను తాను చూస్తానని పేర్కొన్నారు. నిరంతరం నేర్చుకుంటూ ముందుకు వెళ్లడాన్ని కొనసాగించాలని, నిజమైన విద్యార్థి జ్ఞాన సముపార్జనను ఎప్పుడూ ఆపేయడని ఆయన అన్నారు. 

కొవిడ్‌-19తో పోరాటంలో అలసత్వం వద్దు..: కొవిడ్‌-19తో మనం చేస్తున్న పోరాటంలో ప్రస్తుతం కీలక దశలోకి భారత్‌ అడుగుపెట్టిందని ముకేశ్‌ అంబానీ అన్నారు. ఈ దశలో ఏమాత్రం అలక్ష్యం వహించకూడదని సూచించారు.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.