close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎలక్ట్రానిక్స్‌ కొనుగోళ్ల తీరు మారింది

‘కొవిడ్‌ పొదుపే’ ప్రధాన కారణం 

ఎన్నడూ లేనంతగా డిష్‌వాషర్ల అమ్మకాలు

రిఫ్రిజరేటర్లు, వాషింగ్‌మెషీన్లలోనూ హైఎండ్‌కే ప్రాధాన్యం

ఈనాడు ఇంటర్వ్యూ

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా గృహోపకరణాల విభాగాధిపతి విజయ్‌ బాబు

‘వినియోగదారులు ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు కొనుగోలు చేసే తీరును కొవిడ్‌ గణనీయంగా మార్చింది. గతంలో పని నడిచిపోతే చాలు అన్నట్లు, కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ, అధిక ధర అయినా వెచ్చించి, హైఎండ్‌ ఫీచర్లు ఉన్నవి ఎక్కువ మంది కొంటున్నారు. కొవిడ్‌ వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, బయటికి వెళ్లడం బాగా పరిమితం కావడంతో పొదుపు పెరగడమే ఇందుకు కారణం. డిష్‌వాషర్లు అయితే గతంలో ఎన్నడూ లేనంతగా అమ్ముడు పోతున్నాయి’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా కన్జూమర్‌ అప్లయన్సెస్‌ అధిపతి విజయ్‌ బాబు చెప్పారు. గత పదేళ్లలోనే అధికంగా ఈ పండుగ సీజన్‌ అమ్మకాలు సాగాయని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విశేషాలు..

ఈనాడు వాణిజ్య విభాగం

పండుగ అమ్మకాలపై ఆర్థిక మందగమన ప్రభావం ఉందా ?
ఈ దసరా-దీపావళికి జరిగిన అమ్మకాలు గత పదేళ్లలోనే అధికమన్నది మా అంచనా. ఎల్‌జీ ఇండియా అమ్మకాల్లో 32 శాతం వృద్ధి లభించింది. ఆర్థిక మందగమన ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఇందుకు వేర్వేరు కారణాలున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల దాదాపు 3 నెలల పాటు ఇళ్లనుంచి బయటకు పెద్దగా కదిలినవారు లేరు. ఇక అయిదారు నెలలుగా కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే అవసరం లేక ఇంధన వ్యయమూ ఆదా అవుతోంది. ఏదైనా ఊర్లు వెళ్లడం, వేడుకలు, సరదాగా హోటల్‌కు వెళ్లడం వంటివి నిలిచిపోయి, సగటు మధ్యతరగతికి నెలకు రూ.10,000 వరకు ఆదా అవుతోంది. మరికొన్ని అనవసర ఖర్చులు కూడా తగ్గించుకున్నారు. ఇలా ఆదా అయిన మొత్తాలను, ఇంటికి అవసరమైన, ఆరోగ్య సంరక్షణకు దోహదపడే ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల కొనుగోలు కోసం వాడుకున్నారు. ఆఫర్లు ఇస్తారనే ఉద్దేశంతో పండుగల వరకు వేచి చూశారు. అందుకే ఒక్కసారిగా గిరాకీ వచ్చింది.

ఏయే ఉత్పత్తులకు అధిక గిరాకీ లభించింది ?
దసరా సమయంలో సాధారణంగా టీవీల అమ్మకాలు అధికంగా సాగుతాయి. వాటి ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఓఎల్‌ఈడీ మోడల్‌ అమ్మకాలు బాగున్నాయి. బయట తినడం తగ్గించడం, అందరూ ఇళ్లలోనూ భిన్న రకాల వంటకాలు తయారు చేసుకోవడం ప్రారంభించడం, ఎప్పటికప్పుడు వేడి చేసుకునేందుకు మైక్రోవేవ్‌ ఓవెన్లు కొంటున్నారు. పాత్రలను శుభ్రం చేశాక నీటి ఆవిరితో 99.9 శాతం క్రిమిరహితంగా మార్చే డిష్‌ వాషర్లు, ఇదేవిధంగా వాషింగ్‌మెషీన్లకు ఎనలేని గిరాకీ వచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో పనిమనుషులపై ఆధారపడటం తగ్గించడం వల్లే ఈ మార్పు. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా రూ.55,000 విలువైన డిష్‌వాషర్లు కొంటున్నారంటే, కొవిడ్‌ వల్ల చేసిన పొదుపే కారణం.

ఏయే విభాగాల్లో ఎంతటి వృద్ధి నమోదైంది ?
ప్రీమియం శ్రేణి 300 లీటర్ల కంటే పైస్థాయివి, సైడ్‌బైసైడ్‌ డోర్‌ ఉండే రిఫ్రిజరేటర్లలో 60 శాతం, వాషింగ్‌మెషీన్ల అమ్మకాలలో 60 శాతానికి పైగా వృద్ధి లభించింది. డిష్‌వాషర్లయితే ఇప్పటివరకు ఎన్నడూలేని స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున, ఐటీ, బ్యాంకింగ్‌ సహా పలు రంగాల సంస్థలు ఇంటి నుంచే పనికి 2021 జూన్‌ వరకు అనుమతులిస్తున్నందున, ఇంటి పనులను సులభతరం చేసే  గృహోపకరణాల అమ్మకాలు కొనసాగుతాయనే భావిస్తున్నాం. ఈ నెల నుంచి వివాహాలు కూడా ఉన్నాయి. శుభకార్యాల ఖర్చులు తగ్గిస్తున్నందున, ఇళ్లలోకి బంగారం, ఖరీదైన గృహోపకరణాలు కొనడమూ పెరుగుతోంది.

కొనుగోళ్లలో పల్లెలు, నగరాల మధ్య అంతరం ఉందా ?
గ్రామాల్లోనూ పనిమనుషుల లభ్యత ఉండటం లేదు. పైగా నగరాల్లో పిల్లలుండి, పెద్దలు మాత్రమే గ్రామాల్లో ఉంటే, వారి ఆరోగ్య సంరక్షణ కోసం వారికీ పంపుతున్నారు. ఆధునిక గృహోపకరణాలపై నోటి మాట ప్రాచుర్యం ద్వారా పక్క్కవారూ తెలుసుకుని కొంటున్నారు. అందుకే 2-3 అంచె పట్టణాల నుంచీ వీటికి గిరాకీ వస్తోంది. పంటలు కూడా మొత్తంమీద బాగుండటం కలిసి వస్తోందనే చెప్పాలి. ఆర్థిక సంస్థలు సులభ వాయిదా రుణాలివ్వడం ఉపకరించింది.

ఆరోగ్య సంరక్షణే ప్రచారాస్త్రంగా మలచుకున్నారా ?
అవుననే చెప్పాలి. రిఫ్రిజరేటర్లలో హైజీన్‌ డీఓడరైజర్‌ ఉన్నవి, రూ.30,000-50,000 వేల విలువైన ఎయిర్‌ ప్యూరిఫైయర్లు విక్రయిస్తున్నాం. దిల్లీలో ఎక్కువగా, ఇతర మెట్రోలలో ఎయిర్‌ ప్యూరిఫైయర్ల అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో గాలి శుభ్రతను వెల్లడిస్తూ, దుమ్ము - చెడు వాసనలను ఈ యంత్రాలు నియంత్రిస్తాయి. వీటిలోని ఫిల్టర్లను 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.. అయితే 3-4 నెలలకు ఒకసారి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.


Tags :

కథనాలు

మరిన్ని

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.