రూపే కు మాస్టర్‌కార్డ్‌ మేలు చేస్తుందా?
close

Updated : 17/07/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూపే కు మాస్టర్‌కార్డ్‌ మేలు చేస్తుందా?

ఆర్‌బీఐ ఆదేశాల ప్రభావం 5 బ్యాంకులపై

స్థానికంగా డేటా నిల్వ చేయాలనే నిబంధనలను పాటించలేదనే కారణంతో ఈనెల 22 నుంచి కొత్తగా కార్డులు (డెబిట్‌, క్రెడిట్‌, ప్రీ-పెయిడ్‌) జారీ చేయరాదని మాస్టర్‌కార్డ్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిషేధించింది. ఈ పరిణామం దేశీయ ‘రూపే’ కార్డుకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. మాస్టర్‌కార్డ్‌పై నిషేధం వల్ల దేశీయంగా 5 బ్యాంకులు, ఒక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ), మరొక కార్డుల జారీ సంస్థ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని ఆర్థిక పరిశోధనా సేవల సంస్థ అయిన నొమురా రీసెర్చ్‌ విశ్లేషించింది. అయితే ఇప్పటికే జారీ అయిన, వినియోగంలో ఉన్న కార్డుల విషయంలో ఎటువంటి సమస్యా ఉత్పన్నం కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసినందున, ప్రస్తుత వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

కో-బ్రాండెడ్‌కు ఇబ్బందే

ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకుతో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ కార్డ్‌ కూడా మాస్టర్‌కార్డ్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ సంస్థలు కొత్తగా జారీ చేసే కార్డులకు మాస్టర్‌కార్డు సేవలు పొందలేవు. ఇతర పేమెంట్‌ గేట్‌వే సంస్థలను (వీసా, రూపే) ఇవి ఆశ్రయించాలి. ముఖ్యంగా కో-బ్రాండెడ్‌ కార్డులు జారీ చేసే సంస్థలు అధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ పూర్తిగా మాస్టర్‌కార్డు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇతర సంస్థలు జారీ చేసే కార్డుల్లో మాస్టర్‌కార్డు వాటా 10 - 45 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కోటక్‌ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు మాస్టర్‌కార్డు సేవలు తీసుకోవడం లేదు. అటువంటి బ్యాంకులకు ఎటువంటి సమస్య లేదు.

* ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డుల జారీ నిమిత్తం వీసా వరల్డ్‌వైడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంకు వెల్లడించింది. దీనివల్ల వచ్చే 2 నెలల వ్యవధిలో తమ ఖాతాదార్లకు ఆర్‌బీఎల్‌ బ్యాంకు వీసా కార్డులు జారీ చేయగలుగుతుంది. ఇతర పేమెంట్‌ గేట్‌వేలతో ఒప్పందం కుదుర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు యెస్‌ బ్యాంకు వర్గాలు పేర్కొంటున్నాయి.

* గతంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ను సైతం ఆర్‌బీఐ ఇదే తరహాలో నిషేధించింది.

ప్రభుత్వ బ్యాంకులన్నీ..

తాజా పరిణామాలు దేశీయ పేమెంట్‌ గేట్‌వే అయిన ‘రూపే’ కార్డుకు మేలు చేసే విధంగా ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. చెల్లింపుల మార్కెట్‌ను వీసా, మాస్టర్‌కార్డు శాసిస్తున్న తరుణంలో దేశీయంగా రూపే కార్డును ప్రవేశపెట్టారు. ఈ కార్డు ఎంతో వేగంగా వినియోగదార్లకు దగ్గరవుతోంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా ‘రూపే’ కార్డులే జారీ చేస్తున్నాయి. అందువల్ల లావాదేవీ సంఖ్యలో, చెల్లింపుల మొత్తాల్లో ‘రూపే’ ఇప్పటికే ఈ విపణిలో 30 శాతాన్ని మించిపోయింది. ఈ మార్కెట్లో ప్రస్తుతం వీసా అగ్రస్థానంలో ఉండగా, మాస్టర్‌కార్డు, రూపే తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నాయి.  మాస్టర్‌కార్డుపై నిషేధం వల్ల, కొత్త కార్డుల జారీకి రూపే వైపు బ్యాంకులు మొగ్గుచూపొచ్చని, ఆ మేరకు రూపే కార్డుకు ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 90  కోట్ల డెబిట్‌ కార్డులు, 60 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. డెబిట్‌ కార్డుల విపణిలో రూపే, వీసా, మాస్టర్‌కార్డులకు దాదాపు సమాన వాటా ఉండగా,  క్రెడిట్‌ కార్డుల విషయంలో వీసా, మాస్టర్‌కార్డులదే ఆధిపత్యం. ఈ పరిస్థితీ ఇక మారే అవకాశం కనిపిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని