పండగల వేళ.. కార్డులతో జాగ్రత్త
close

Published : 15/10/2021 03:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండగల వేళ.. కార్డులతో జాగ్రత్త

చుట్టూ రకరకాల ఆఫర్లు.. ఎక్కడ చూసినా.. రాయితీలు.. క్రెడిట్‌ కార్డులతో కొంటే నగదు వెనక్కి.. పండగల వేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో క్రెడిట్‌ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది.. లేకపోతే అనవసరంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. బిల్లులు సరైన సమయానికి చెల్లించకపోతే.. అప్పుల ఊబిలో చిక్కుకుపోవడమూ ఖాయం. ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఏం చేయాలో తెలుసుకుందామా...

నగదు తీసుకోవద్దు: పండగల వేళ నగదు అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్‌ కార్డును వినియోగించకూడదు. కార్డులతో నగదును తీసుకుంటే.. దానికి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. పైగా.. దీనికి అదనపు సమయమూ ఉండదు. మీరు డబ్బు తీసుకున్న మరుక్షణం నుంచే వడ్డీ ప్రారంభం అవుతుంది. వడ్డీతోపాటు, ఇతర రుసుములనూ భరించాల్సి వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకూ డబ్బు కోసం కార్డును వాడొద్దు.

కనీస మొత్తం చెల్లిస్తూ: క్రెడిట్‌ కార్డు బిల్లులో కనీస మొత్తం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఇది వెసులుబాటు మాత్రమే. కానీ... మొత్తం బాకీని చెల్లించినప్పుడు ఉండే ప్రయోజనాలు ఇక్కడ లభించవు. మీ కార్డు వాడకం నిష్పత్తి పెరిగడంతోపాటు, క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం పడుతుంది. కనీస మొత్తం చెల్లించగా.. మిగిలిన బాకీపై వడ్డీ చెల్లించాల్సిందే. కాబట్టి, మొత్తం బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో కనీస బాకీకి మించి చెల్లించడం మంచిది. దీనివల్ల వచ్చే బిల్లులో వడ్డీ తగ్గుతుంది.

ఆలస్యం చేస్తే..: పండగల వేళ కొనుగోళ్లు చేసినప్పుడు.. బిల్లులను సకాలంలో తీర్చే ఏర్పాటు చేసుకోండి. వ్యవధి తీరిన తర్వాత చెల్లిస్తే.. ఆలస్యపు రుసుము వర్తిస్తుంది. అంతేకాదు.. మీ క్రెడిట్‌ నివేదికలోనూ దీన్ని ప్రస్తావిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా రుణాలు తీసుకునేందుకు మీకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. అందుకే, వ్యవధికి ముందుగానే బిల్లు చెల్లించేయడం ఉత్తమం.

అందుబాటులో ఉంటేనే..: క్రెడిట్‌ కార్డుతో కొనేటప్పుడు.. ఆ వస్తువు ధరమీకు అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఆ కొనుగోలు మీ బడ్జెట్‌కు మించి ఉంటే.. బిల్లు చెల్లించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుగానే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటమే మేలు.

సరైన కార్డును వాడాలి: కొనుగోలు చేసేటప్పుడు.. ఏ కార్డును ఎంపిక చేసుకోవాలన్నదీ ముఖ్యమే. ముందుగా మీ దగ్గరున్న కార్డులను పరిశీలించండి. ఏ బ్యాంకు కార్డుతో ఎక్కువ రాయితీలు వస్తున్నాయి, రివార్డులు అధికంగా ఉన్నాయో చూడండి. ఆ తర్వాత ఆ కార్డుతో కొనండి. మరోవైపు కార్డులను ఎంపిక చేసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేటు, వార్షిక రుసుములు లేని వాటినే తీసుకోవాలి. మీకు ఇప్పటి వరకూ క్రెడిట్‌ కార్డు లేదా? కొత్తగా కార్డును తీసుకుంటున్నారా? అయితే, మీకు ఏ బ్యాంకు కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న విషయం ముందు తెలుసుకోండి. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోండి. ఒకవేళ మీరు దరఖాస్తు చేసినా.. కార్డు ఇవ్వకపోతే ఆ విషయం మీ క్రెడిట్‌ నివేదికలో ఉంటుంది. మళ్లీ కొత్త కార్డు దరఖాస్తు చేసినప్పుడు ఇప్పటికే తిరస్కరించడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు.

స్టేట్‌మెంటు చూసుకోండి: కొనుగోలు చేసిన ప్రతి వస్తువు బిల్లు మీ దగ్గర ఉంచుకోండి. దీంతో మీ కార్డు స్టేట్‌మెంట్‌ను పోల్చి చూడండి. ఏమైనా తేడాలుంటే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి. వివరాలు తనిఖీ చేసేందుకు కొంత సమయం పడుతుంది. కానీ, పొరపాటున అధిక మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

క్రెడిట్‌ కార్డు వాడటం ఒక కళే. మనం జాగ్రత్తగా వాడితే ప్రయోజనాలు ఎన్నో. నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం. దీన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని