చికిత్సఖర్చులకు.. వేచిచూడాలి..
close

Published : 30/07/2021 02:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చికిత్సఖర్చులకు.. వేచిచూడాలి..

ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తర్వాత అన్ని సందర్భాల్లోనూ వెంటనే పరిహారం అందకపోవచ్చు. అనుకోకుండా ప్రమాదం బారిన పడిన సందర్భంలోనే చికిత్స ఖర్చులు చెల్లిస్తుంటాయి. ఇక మిగతా విషయాల్లో వేచి ఉండే వ్యవధి ఉంటుంది.

* 30-90 రోజుల వరకూ: ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్న తర్వాత 30-90 రోజుల వరకూ సాధారణ వేచి ఉండే వ్యవధిగా పరిగణిస్తారు. ఇది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. ఈ సమయంలో దాదాపు అన్ని చికిత్సలకూ బీమా పాలసీ రక్షణ కల్పించదు. ముందే చెప్పినట్లు ప్రమాదం వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడే చికిత్స ఖర్చులను చెల్లిస్తుంది. కొత్తగా పాలసీ తీసుకున్న సందర్భంలోనే ఈ సాధారణ వేచి ఉండే వ్యవధి వర్తిస్తుంది. 

* ప్రత్యేక వ్యాధుల చికిత్సలకు: కొన్ని ప్రత్యేక వ్యాధుల చికిత్సకు పాలసీ తీసుకున్న నిర్ణీత సమయం తర్వాతే అనుమతినిస్తాయి బీమా సంస్థలు. కంటి శుక్లాలు, హెర్నియా, హైడ్రోసెల్‌, పీఓడీ తదితర చికిత్సలకు సాధారణంగా రెండేళ్లపాటు వేచి చూసే సమయం ఉంటుంది. ఈ లోపు ఈ చికిత్సలు చేయించుకుంటే పాలసీ నుంచి ఎలాంటి పరిహారమూ అందదు.

* ముందస్తు వ్యాధులుంటే: పాలసీ తీసుకునే ముందే కొన్ని నిర్ణీత వ్యాధులు ఉన్నప్పుడు.. వాటి చికిత్సకు కొన్నాళ్లపాటు పరిహారం ఇవ్వరు. బీమా సంస్థలు, వ్యాధుల రకాల్ని బట్టి, ఇది 1-4 ఏళ్లపాటు ఉంటుంది. అంటే, ఈ వ్యవధిలో ఈ వ్యాధులు, దీనికి సంబంధించిన ఇతర లక్షణాలకు చికిత్స చేయించుకుంటే జేబు నుంచి ఖర్చులను భరించాల్సిందే.

* ప్రసూతి ఖర్చులు: ఇప్పుడు చాలా పాలసీలు ప్రసూతి ఖర్చులనూ చెల్లిస్తున్నాయి. అయితే, పాలసీ తీసుకున్న రోజు నుంచి 9 నెలల నుంచి 4 ఏళ్ల వరకూ వేచి ఉండే సమయంగా పరిగణిస్తాయి.

* పునరుద్ధరణ సమయంలో పాలసీ విలువను పెంచుకుంటే.. కొత్తగా ఆ పెంచిన మొత్తంపై నిబంధనల మేరకు వేచి ఉండే సమయాన్ని పొడిగించే అవకాశం ఉంది.

బృంద బీమా పాలసీలకూ.. వ్యక్తిగత పాలసీలకూ మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే.. ఈ వేచి ఉండే వ్యవధులకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకటికి రెండుసార్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా పాలసీ తీసుకునేటప్పుడు తక్కువ వేచి ఉండే వ్యవధితో ఉన్న వాటివైపు మొగ్గు చూపాలి. పాలసీదారులు 10-15 శాతం అధిక ప్రీమియం చెల్లించడం ద్వారా వేచి ఉండే సమయాన్ని తగ్గించుకునే వీలును ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు కల్పిస్తున్నాయి. ఇది పాలసీ, వేచి ఉండే వ్యవధి ఎంత తగ్గుతుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

- శశాంక్‌ ఛఫేకర్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని