సానుకూలంగానే కదలొచ్చు కానీ..
close

Updated : 13/09/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సానుకూలంగానే కదలొచ్చు కానీ..

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం

పరిమిత లాభాలకే అవకాశం

ఎటువంటి ప్రతికూల వార్తలూ లేవు

దేశీయ, అంతర్జాతీయ గణాంకాలే కీలకం

సిమెంటు, బ్యాంకు షేర్లు రాణించొచ్చు

విశ్లేషకుల అంచనాలు

ఎటువంటి ప్రతికూల వార్తలూ లేనందున, దేశీయ సూచీలు ఈ వారమూ సానుకూలంగానే కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  దేశీయంగా జులై పారిశ్రామికోత్పత్తి సూచీ 11.5 శాతం రాణించింది. ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బణ వివరాలు సోమవారం విడుదల కానున్నాయి. వీటితో పాటు అమెరికా, ఐరోపా ద్రవ్యోల్బణ గణాంకాలు, నిరుద్యోగ అంకెలు; ఐరోపా కేంద్ర బ్యాంకు విధాన నిర్ణయాలను మదుపర్లు గమనించవచ్చు. నిఫ్టీకి 17,500 వద్ద నిరోధం ఎదురుకావొచ్చని.. ఒక వేళ ఏదైనా దిద్దుబాటు కనిపిస్తే 17,200 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మంగళవారం ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యే విజయా డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌, అమి ఆర్గానిక్స్‌ షేర్లపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..

* వాహన రంగానికి ప్రకటించబోయే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ)ల పథకం ఆధారంగా ఆ రంగ షేర్లు చలించొచ్చు.

* స్వల్పకాలంలో వృద్ధి అంశాలు, కరోనా ఔషధాలకు గిరాకీ అంతగా లేనందున, ఔషధ కంపెనీల్లో పెట్టుబడులపై మిశ్రమ ధోరణలున్నాయి.

* సిమెంటు కంపెనీల షేర్లు రాణించొచ్చు. జులై, ఆగస్టు నెలల్లో తగ్గిన ధరలు, సెప్టెంబరులో పెరుగుతాయనే అంచనాలు ఇందుకు నేపథ్యం.

*ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కీలక సూచీల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జులైతో పోలిస్తే ఆగస్టులో ఎఫ్‌ఎమ్‌సీజీ విక్రయాలు 14.5 శాతం తగ్గాయని అంచనా.

* జియో ఫోన్‌ ఆవిష్కరణ దీపావళికి వాయిదా పడడం టెలికాం షేర్లపై ప్రభావం చూపొచ్చు. నిధుల సమీకరణకు తోడు టారిఫ్‌ పెంపు అంచనాల మధ్య భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు రాణించవచ్చు. టెలికాం రంగానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం నాటి సమావేశంలో ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తుందేమోనని మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

* ఐటీ షేర్లు జీవన కాల గరిష్ఠాలను తాకిన నేపథ్యంలో కొంత స్థిరీకరణ కావొచ్చు. మధ్యకాలానికి  ఇవి సానుకూలంగానే ఉన్నాయి.

*  లోహ, గనుల కంపెనీలు సానుకూల చలనాలను కొనసాగించవచ్చు. బలమైన ధరలు ఇందుకు మద్దతు పలకవచ్చు. దశాబ్ద కాల గరిష్ఠానికి అల్యూమినియం ధరలు చేరినందున, ఆ లోహ తయారీ కంపెనీల షేర్లపై దృష్టిపడొచ్చు.

* చమురు కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణిలో ట్రేడవవచ్చు. అంతర్లీనంగా సానుకూలతలు కనిపిస్తున్నాయి. రిఫైనరీ కంపెనీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు బలంగా కనిపించవచ్చు.

* సానుకూల సెంటిమెంటుతో బ్యాంకు షేర్లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు రాణించొచ్చు. ప్రైవేటు రంగ, మధ్య స్థాయి బ్యాంకు షేర్లు ఇప్పటికే రాణించడం గమనార్హం.

* యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణికి పరిమితమవ్వొచ్చు. మొత్తం మీద ధోరణి సానుకూలంగానే ఉంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని