కారు, బైక్‌ల‌కూ నామినీ..  - Now-you-can-add-a-nominee-to-your-car-and-bike
close

Updated : 19/05/2021 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారు, బైక్‌ల‌కూ నామినీ.. 

ఒక వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, అత‌ని/ ఆమె పేరుపై ఉన్న కారు లేదా బైక్‌ల‌ను విక్ర‌యించే ప‌క్రియ కాస్త సంక్లిష్టంగానే ఉండేది. చ‌ట్ట‌బ‌ద్ధమైన వార‌సుని పేరుపైకి వాహ‌న‌పు హ‌క్కుల‌ను బ‌దిలీ చేసేందుకు, కుటుంబస‌భ్యులు, వివిధ కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌వ‌ల‌సి వ‌చ్చేది. పైగా ఈవిధానం ఒక ప్రాంతీయ రవాణా కార్యాల‌యం(ఆర్‌టీఓ) నుంచి మ‌రొక కార్యాల‌యాన‌కి భిన్నంగా ఉంటుంది. మ‌ర‌ణించిన వ్య‌క్తి ఒక ఆర్‌టీఓ ప‌రిధిలోనూ, చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన వారుసులు మ‌రొక ఆర్‌టీఓ ప‌రిధిలోనూ నివ‌సిస్తుంటే ఈ ప్ర‌క్రియ మ‌రింత స‌వాలుగా మారుతుంది. ఈ ప‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది నామినేష‌న్. 

వాహ‌నాల‌కూ నామినీ స‌దుపాయం..
ఈ విధానాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకు, రోడ్ ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ వారు సెంట్ర‌ల్ మోటార్ వెహిక‌ల్స్ నిబంధ‌న‌లు 1989లో కొన్ని మార్పులు చేశారు. వాహన యజమాని ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో నామినీని పేర్కొన‌వ‌చ్చు. ఒక‌వేళ వాహన యజమాని మరణిస్తే, నామినీ త‌న పేరుకు యాజ‌మాన్య హ‌క్క‌లును బదిలీ చేసుకోవ‌చ్చు. కారు కొనుగోలు స‌మ‌యంలో గానీ, త‌రువాత గానీ నామినీ పేరును తెలియ‌జేయ‌వ‌చ్చు.. అయితే ఎవ‌రిని.. నామినేట్ చేస్తారో ఆ వ్య‌క్తికి సంబంధించిన ఐడి ఫ్రూఫ్‌ని స‌బ్మిట్ చేయాలి. 

ఓన‌ర్‌షిప్ బదిలీ చేసుకునే విధానం..
వాహ‌న య‌జమాని మ‌ర‌ణించిన‌ట్ల‌యితే, నామినీ ఈ స‌మాచారాన్ని 30 రోజుల్లోపు రిజ‌స్ట్రేష‌న్ అధికారుల‌కు తెలియ‌జేయాలి. ఇది పూర్తిచేస్తే, నామిని మూడు నెల‌ల‌పాటు య‌జ‌మానిగా వాహ‌నాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. 

ఓవ‌ర్‌షిప్‌ను పూర్తిగా అత‌ను/ ఆమె పేరుపై మార్చుకునేందుకు, వాహ‌న అసులు య‌జ‌మాని మ‌ర‌ణించిన నాటి నుంచి మూడు నెల‌ల‌లో ఫారం 31ని కూడా నామినీ స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

నామినీని ఎప్పుడు మార్చ‌వ‌చ్చు..
విడాకులు తీసుకున్న‌ప్పుడు, ఆస్తి పంప‌కాలు చేసేప్పుడు,  ఆస్తుల‌ను బ‌దిలీ(వాహ‌నం విక్ర‌యించ‌కుండా) చేయు సంద‌ర్భంలో నామినీ మార్చుకోవ‌చ్చు. 

రుణంపై కొనుగోలు చేసివుంటే..
ఒక‌వేళ రుణం తీసుకుని కారు లేదా బైక్‌ కొనుగోలు చేసివుంటే..  ముందుగా మిగిలిన ఉన్న బ‌కాయిల‌ను నామినీ చెల్లించాలి. వాహ‌నంపై ఉన్న రుణం పూర్తిగా చెల్లించిన‌ట్లు రుణ‌దాత నో-అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్ ఇచ్చిన త‌రువాత మాత్ర‌మే బ‌దిలీ చేసుకోవ‌డం వీల‌వుతుంది. 

వాహ‌నం య‌జ‌మాని మ‌ర‌ణం త‌రువాత వాహ‌నం మ‌రొక‌రి పేరుపై మార్చుకునే ప్ర‌క్రియ‌ను నామినేష‌న్ స‌దుపాయం సుల‌భ‌త‌రం చేస్తుంది.  యాజ‌మాన్య హ‌క్కులు పొందితే వాహ‌నాన్ని వినియోగించు కోవ‌డంతో పాటు విక్ర‌యించ‌డమూ సుల‌భం అవుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని