ATS: ఎవరైనా వాహన సామర్థ్య పరీక్ష కేంద్రాలు పెట్టొచ్చు! - SPVs state govts cos be allowed to open automated testing stations
close

Published : 25/09/2021 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ATS: ఎవరైనా వాహన సామర్థ్య పరీక్ష కేంద్రాలు పెట్టొచ్చు!

మార్గదర్శకాలు జారీ చేసిన రోడ్డు రవాణా, రహదారుల శాఖ

దిల్లీ : వాహన సామర్థ్య పరీక్షలు నిర్వహించే ‘ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)’ల ఏర్పాటుపై కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ వంటి ప్రత్యేక సంస్థలు, అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తుల బృందం లేదా ఒకే వ్యక్తి.. ఇలా ఎవరైనా ఏటీఎస్‌ ప్రారంభించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. సింగిల్‌ విండో పద్ధతిలో ఏటీఎస్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. అయితే, రిజిస్టరింగ్‌ అథారిటీ హోదా రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ వద్ద ఉంటుందని వెల్లడించింది.

ఒకవేళ సామర్థ్య పరీక్షల్లో విఫలమైతే.. కొంత రుసుము చెల్లించి పునఃపరీక్షకు వాహన యజమాని దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. పునఃపరీక్షలోనూ వాహనం విఫలమైతే.. ఆ వాహనం కాలం చెల్లినట్లుగా ధ్రువీకరిస్తారని పేర్కొంది. ఒకవేళ యజమాని సామర్థ్య పరీక్ష ఫలితాలపై సంతృప్తి చెందనట్లైతే.. కొంత రుసుము చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అప్పీలియేట్‌ అథారిటీ పాక్షిక లేదా పూర్తిస్థాయి తనిఖీకి ఆదేశించాలి. ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా ఈ పరీక్ష పూర్తికావాలి. ఒకవేళ తనిఖీలో వాహనం సమర్థంగానే పనిచేస్తున్నట్లు తేలితే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీకి అప్పీలియేట్‌ అథారిటీ ఆదేశాలివ్వాలి. అప్పీలియేట్‌ అథారిటీదే తుది నిర్ణయం.

ఏటీఎస్‌లు కేవలం సామర్థ్య పరీక్ష కేంద్రాలుగా మాత్రమే పనిచేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. వాహన మరమ్మతులు, విడిభాగాల విక్రయాలు సహా ఇతర ఎలాంటి సేవలకు అనుమతి లేదని తెలిపింది. అలాగే టెస్టింగ్‌ కేంద్రాల్లో సరిపడా స్థలం ఉండాలని పేర్కొంది. వాహన్‌ పోర్టల్‌కు అనుసంధానించగలిగే సైబర్‌ భద్రత కలిగిన ఐటీ వ్యవస్థ సైతం ఉండాలని తెలిపింది. వాణిజ్య వాహనాలకు ఎనిమిదేళ్ల వరకు ప్రతి రెండేళ్లకోసారి.. ఆ తర్వాత ప్రతి ఏడాది సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇక వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌(15 ఏళ్ల తర్వాత) సమయంలో పరీక్షకు వెళ్లాలి. ఆ తర్వాత ఐదేళ్లకోసారి లేదా ఆలోపు రిజిస్ట్రేషన్‌ రిన్యువల్‌ ఉంటే అప్పుడు సామర్థ్య పరీక్షకు వెళ్లాల్సిందే. ఇక ఏటీఎస్‌లను ప్రతి ఆర్నెళ్లకోసారి ‘నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ క్యాలిబ్రేషన్‌ లేబోరేటరీస్‌(ఎన్‌ఏబీఎల్‌)’ ఆడిట్‌ చేస్తాయి. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చు ఏటీఎస్‌ నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది.

తొలి దశలో 75 ఏటీఎస్‌ల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. తర్వాతి దశలో మరో 450-500 స్టేషన్లకు అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం 26 ఏటీఎస్‌లకు అనుమతి లభించిందని.. వీటిలో ఏడు ఇప్పటికే మనుగడలోకి వచ్చాయని తెలిపారు.

కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల కాలుష్య కారకాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తుక్కు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. సొంత బండ్లు 20 ఏళ్లకు, వాణిజ్య వాహనాలైతే 15 ఏళ్లకు సామర్థ్య పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షలో విఫలమైతే రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని