పరీక్షలో...
పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని డిగ్రీ స్థాయిలో వస్తాయి. అభ్యర్థులకు అవగాహన నిమిత్తం వెబ్సైట్లో మాదిరి ప్రశ్నపత్రాలు ఉంచారు. వీటిద్వారా ప్రశ్నల సరళిపై ఒక అవగాహనకు రావచ్చు. పరీక్షకు ముందు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులోకి వస్తుంది. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.
స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. స్టేజ్ -1 స్క్రీనింగ్ టెస్టు. ఇందులో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రాటింగ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్మెంట్లు, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్ -2కి వెళ్తారు. స్టేజ్ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆపై వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ దశలన్నీ పూర్తిచేసుకున్నవారికి మెడికల్ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.
అర్హతలు...
ఫ్లయింగ్ బ్రాంచ్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ / ప్లస్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచ్: ఇందులో ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎల్రక్టానిక్స్/ మెకానికల్) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచ్: ఇందులో అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. అకౌంట్స్ పోస్టులకు 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1996 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు..
ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 235 ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తులు: డిసెంబరు 1 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.
పరీక్షలు: ఫిబ్రవరిలో నిర్వహించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి.
వెబ్సైట్: https://afcat.cdac.in