close
 • కరోనా జంతువులకు సోకుతుందన్న వార్తల నేపథ్యంలో శునకాలకు ఆ ముప్పు తప్పించేందుకు పెంపకందారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌ పట్టణంలో బుధవారం పెంపకందారులు శునకాలకు మాస్క్‌లు ధరించి నెలవారీ ఇంజెక్షన్ల కోసం పశువైద్యశాలకు తీసుకొచ్చారు.
 • మెదక్‌ జిల్లా కౌడిపల్లికి చెందిన యువకులు షేక్‌పేటలో గంగిరెద్దులను ఆడించి జీవనం సాగించేవారు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఉపాధి లేక రూ.3వేలకు ట్రాలీ ఆటో మాట్లాడుకొని స్వగ్రామానికి బయలుదేరారు. గచ్చిబౌలి వద్ద పశువును ఆటో ఎక్కించనున్నట్లు తెలిపారు.
 • బహ్రెయిన్‌ దేశం భారత్‌కు సహాయంగా అందజేసిన 40 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కంటైనర్‌లను ఐఎన్‌ఎస్‌ తల్వార్ న్యూమంగళూరు ఓడరేవుకు తీసుకొచ్చింది.
 • విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన జన్మదినం సందర్భంగా మొక్క నాటారు. తన మనమడు, మనవరాలికి మొక్కల ప్రాధాన్యతను వివరించారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేస్తూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ను అభినందించారు.
 • వరంగల్‌ నగర సమీపంలోని పెగడపల్లి గ్రామం వద్ద పంట పొలాలు భూమికి పచ్చని రంగేసిట్లుగా ఇలా కనిపించాయి.
 • కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు సహా పలు పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈనెల 18 వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.
 • కరోనా మహమ్మారి కారణంగా మూతికి మాస్కులు తీయని ఈ రోజుల్లో... నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన ఆనందం ఉన్నప్పటికీ మిఠాయిలను సైతం ముట్టలేదు మన తెరాస నాయకులు. ఖమ్మంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు, తెరాస నేతలకు మిఠాయిలు తెప్పించారు. చాలాసేపటి వరకు వీటిని ఎవ్వరూ ముట్టలేదు. ఆ తర్వాత కొందరే బలవంతంగా తిన్నారు. దీంతో మిఠాయిలు పంపిణీ చేసే యువకుడు నిశ్చేష్టుడై నిల్చున్నాడు. ఈ దృశ్యాన్ని ఈనాడు కెమెరాలో బంధించింది.
 • కొవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో గీత కార్మికులు కల్లు పోసేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. ఖమ్మం జిల్లా పినపాక మండలం ఉప్పాకలో భౌతిక దూరం పాటిస్తూ ఇలా కల్లు పోస్తున్నారు. భూమిలో గుణపం పాతి దానికి మీటరు పొడవు కలిగిన ఒక అంగుళం మందం కలిగిన ప్లాస్టిక్‌ పైపును కట్టారు. ఆ పైపు ద్వారా గీత కార్మికులు కల్లు పోస్తున్నారు. దీన్ని న్యూస్‌టుడే క్లిక్‌మన్పించింది.
 • జాతీయ రహదారి మీదుగా 90 టైర్లున్న భారీ వాహనంపై (లారీ) కొత్త రైలు ఇంజిన్‌ను మంగళవారం తరలించారు. తమిళనాడు నుంచి మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్‌ ప్లాజాకు సమీపంలో రైలు ఇంజిన్‌ను తరలిస్తున్న భారీ వాహనాన్ని వాహనదారులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.
 • హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆసుపత్రిలో మంగళవారం వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. ఆసుపత్రి తలుపు తీయగానే ఒక్కసారిగా అందరూ నెట్టుకుంటూ రావడంతో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు ఇబ్బందిపడ్డారు.
 • ఆక్సిజన్‌ పడకల కొరతతో కొందరు ఇంట్లోనే రోగికి ప్రాణవాయువు అందేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోఠిలో ఓ వ్యక్తి ఇలా ఆక్సిజన్‌ సిలిండర్‌ను తీసుకెళ్తూ కనిపించాడు.
 • విశాఖ జిల్లా పద్మనాభం పోలీసు స్టేషన్‌ సమీపంలోని గోస్తనీ విద్యాపీఠ్‌ హైస్కూల్‌ వద్ద లక్ష్మణ ఫలాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చూడడానికి రామ సీతాఫలం వలే కనబడినా ఈ చెట్టు ఆకులు పూర్తి భిన్నం. పండుకు కూడా ఉమ్మెత్తు కాయకు ఉన్నట్లు చిన్నపాటి బొడిపెలు ఉంటాయి. పాఠశాల వ్యవస్థాపకుడు కాళ్ళ సూరిబాబు అయిదేళ్ల క్రితం అరకు నుంచి తీసుకువచ్చి ఇంటి సమీపంలో నాటినట్లు తెలిపారు. ఫలంతో పాటు దీని ఆకులు, బెరడు, వేళ్లు సైతం ఆయుర్వేద ఔషధాల తయారీలో వినియోగిస్తారని సూరిబాబు చెబుతున్నారు.
 • కొవిడ్‌ శరవేగంగా విస్తరిస్తుండటం.. ఇసుక కొరత కారణంగా విజయనగరం జిల్లాలో పనులన్నీ పడకేశాయి. దీంతో జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రానికి భోగాపురం, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, గజపతినగరం, జామి, బొండపల్లి ప్రాంతాలకు చెందిన కూలీలు పనుల కోసం నిత్యం వస్తుంటారు. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిలో గతంలో నిర్మాణ రంగం వేగంగా ఉన్నప్పుడు పనులు దొరికేవి. ప్రస్తుతం అరకొరగానే నిర్మాణాలు జరగడంతో రోజూ ఉదయాన్నే వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. విజయనగరం కోట కూడలి వద్ద కార్మికులు బాబు మాకు పని ఉంటే చూపించండని వేడుకొంటున్నారు.
 • తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన సంగాని బేతాళుడు అనే మత్స్యకారుడు స్థానిక వైనతేయ వారధి వద్ద మంగళవారం గాలం వేయగా అందులో దానికి 12 కిలోలు ఉన్న పండుగప్ప చిక్కింది. గోదావరి నదిలో ఇంత పెద్ద పండుగప్పలు అరుదుగా దొరుకుతాయని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపను పలువురు స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దీనిని స్థానిక చేపల మార్కెట్‌ వద్ద రూ.12 వేలకు కొనుగోలు చేశారు.
 • కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామస్థులు చేపట్టిన చర్యలు అందరినీ ఆలోచింప జేస్తున్నాయి. సర్పంచి, ఉప సర్పంచి ముత్తాబత్తుల రాజు, విశ్వేశ్వరి, వార్డు సభ్యులు, కార్యదర్శి హిమబిందు ఆధ్వర్యంలో కరోనా కట్టడి పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తదితర సూచనలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరికైనా జ్వరం ఇతర లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు.
 • కరోనా మహమ్మారికి మందులు కంటే.. ఇంటిలో లభించే దినుసులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందేశాన్ని ఇస్తూ తూర్పుగోదావరి జిల్లా రామవరం మూలారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల చిత్రలేఖనం ఉపాధ్యాయుడు మందపల్లి సత్యానందం చిత్రాన్ని రూపొందించారు. పప్పు ధాన్యాలు, కూరల్లో ఉపయోగించే ధనియాలు, జీలకర్ర, సబ్జా గింజలు, యాలకులు మొదలైన వాటితో మెరుగైన రక్షణ లభిస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో మనోధైర్యం కల్పించేందుకు ఔషధ గుణాలు కలిగిన వీటితో రెండు రోజులు శ్రమించి సేవ్‌ ఇండియా చిత్రాన్ని ఆయన రూపొందించారు.
 • ఈ వాహనాలను చూశారా? వాహనాలు సరే.. వీటిపై ఇంత భారీగా ట్యాంకులు ఉన్నాయేమిటా అనుకుంటున్నారు కదూ! అదేనండి విశేషం. ఇవి ఆక్సిజన్‌ ట్యాంకులు. చెన్నై నుంచి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలానికి మూడు భారీ వాహనాలు ఆక్సిజన్‌ సిలిండర్లతో జాతీయ రహదారి వెళుతున్నాయి. మంగళవారం నెల్లూరు జిల్లా కోవూరు వద్ద డ్రైవర్లు అల్పాహారం కోసం కొద్ది సేపు రోడ్డుపై నిలిపారు. వరుసగా భారీ వాహనాలు ఉండడంతో ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు.
 • కరోనా భయం ప్రజలను క్రమంగా వెంటాడడం తీవ్రం చేస్తోంది. బెంగళూరు నగరంలో నిత్యం 20 వేలకు తగ్గని కేసులను చూస్తే ఎవరైనా అప్రమత్తం కావాల్సిందే. నగరవాసులు దుస్తులు, ఇతర భద్రత ఉపకరణాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీపీఈ కిట్‌ ధరించి అత్యవసరాలకు మంగళవారం వీధుల్లోకి వచ్చిన ఓ సామాన్యుడు.. బెంగళూరు ఎన్‌.ఆర్‌.పేట కాలనీలో కనిపించాడిలా.
 • అందరి ప్రాణాలనూ కాపాడడానికి కరోనా లాక్‌డౌన్‌ విధించినట్లు ప్రభుత్వం ప్రకటించినా.. పేదల బతుకులను మాత్రం వీధిన పడేసినట్లే కానవస్తోంది. కష్టాన్నే నమ్ముకున్న లాగుడు బండి కార్మికుడి బతుకు చిత్రమే ఈ విషయానికి దర్పణం పడుతోంది. దుకాణాల నుంచి వివిధ ప్రాంతాలకు సరకులు తరలించే ఈ కార్మికుడు మంగళవారం పనులేమీ లేక కర్ణాటకలోని బెళగావి వీధుల్లో కదలిపోతున్న దృశ్యం.
 • బెంగళూరు నగర శివారు తావరకెరె వద్ద తాత్కాలిక చితాగారం.. నిరంతరాయంగా మండుతూనే ఉంది. కరోనా తీవ్రతకు వచ్చి పడుతున్న పార్థివదేహాలను దహనం చేసే ప్రక్రియ మంగళవారం పొద్దుగూకినా ఇంకా కొనసాగుతోన్న హృదయ విదారక ఘట్టం
 • ప్రజల ఇంటి వద్దకే రేషన్‌ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇంటింటికీ రావాల్సిన వాహనాలు ఒకేచోట నిలిపి పంపిణీ చేస్తుండటంతో జనం గుంపులుగా చేరుతున్నారు. ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా సరకుల కోసం ఎగబడుతున్నారు. అందులో కొందరు మాస్కులు ధరించడం లేదు. కర్నూలు నగరం సమీపంలోని జొహరాపురం ప్రాంతంలో కనిపించిన దృశ్యం ఇది. జిల్లాలో ఒక్కరోజే దాదాపు 1,396 కొవిడ్‌ కేసులు నమోదైనా క్షేత్రస్థాయిలో మాత్రం జాగ్రత్తల పాటింపు మృగ్యంగా మారింది.
 • కలిమి లేములు కావడి కుండలన్న చందంగా పచ్చని చిగురింత ఓవైపు, మోడైన చింత మరోవైపు కలిసి నిలిచిన తరువు ఇది. కర్నూలు జిల్లాలోని గూడూరు మండలం చనుగొండ్ల-కోడుమూరు రహదారిలో ఉన్న చింతచెట్టు ఇలా ఒక దిక్కు ఎండిపోగా, మరో పక్కన కళకళలాడుతూ కనిపిస్తోంది.
 • వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి హాజరై వస్తూ మంత్రులందరూ మాస్కులు పెట్టుకొన్నారు. పెద్దిరెడ్డి మాత్రం పెట్టుకోలేదు. నీకు మాస్క్‌ లేదు కదా.. దూరం జరుగన్నా అంటూ సరదాగా ఆయన్ని ముందుకు తోస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ.
 • పగటి కర్ఫ్యూ బుధవారం నుంచి అమలవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వివిధ అవసరాల నిమిత్తం జనాలు భారీగా దుకాణాల వద్ద కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు రద్దీ లేని విజయవాడ బీసెంట్‌ రోడ్డు మంగళవారం సాయంత్రం ఇలా కిక్కిరిసిపోయింది.
 • మైలవరం మార్కెట్‌ యార్డులో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు తమ కష్టం వర్షార్పణం అయిందని ఆవేదన చెందారు.
 • గుజరాత్‌లోని పల్సాద్‌ జిల్లా పార్టీ గ్రామంలో నివసించే గౌరవ్‌ పటేల్‌ అనే కాటికాపరి మానవత్వం చాటుకున్నాడు. జరుగుతున్న తన నిశ్చితార్థాన్ని విడిచి.. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఏప్రిల్‌ 26న గౌరవ్‌ నిశ్చితార్థం. ఇంతలో కరోనాతో చనిపోయిన ముగ్గురి మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అయితే దహన సంస్కారాలు నిర్వహించేందుకు వినియోగించే యంత్రాలలో లోపం తలెత్తింది. సమాచారం అందుకున్న గౌరవ్‌ హుటాహుటిన శ్మశానానికి చేరుకుని స్వయంగా దహన సంస్కారాలు నిర్వహించారు.
 • విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళ కొవిడ్‌తో బాధపడుతూ కేజీహెచ్‌కు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంది. కొవిడ్‌ వార్డులో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో ఇలా ఆరు బయటే పడుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో వైద్యుల నుంచి పిలుపురావడంతో వార్డులోకి తరలించారు. అప్పటివరకూ నేలపైనే పడుకొని కుమారునితో ఇలా నిరీక్షిస్తూ కన్పించారు.
 • పై చిత్రాన్ని చూస్తే ఏదో తోరణం కట్టినట్టు కనిపిస్తుంది కదా. కానీ అది కాదు.. నివాసం కోసం కరెంటు తీగలపై గిజిగాడు అనే పిచ్చుకల జాతి పక్షులు నిర్మించుకున్న గూళ్లు అవి. ఈ జాతి పిచ్చుకలు నివాసం, రక్షణ కోసం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటాయి. ముళ్ల చెట్లపై, ఎవరూ ఎక్కని కొమ్మలపై గూళ్లను నిర్మించుకుంటాయి. ఇక్కడ మరింత జాగ్రత్తగా నీటి కుంట పై నుంచి వెళ్లే కరెంటు తీగలపై కట్టుకున్నాయి. ఇది నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామ శివారులో కనిపించింది.
 • మెక్సికోలో ఘోర మెట్రో రైలు ప్రమాదం సంభవించింది. మెక్సికో నగరంలోని 12వ మెట్రో లైన్‌లో సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి రైలు వంతెన కుప్పకూలింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు బోగీలు రహదారిపై ఉన్న వాహనాలపై పడ్డాయి.

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా

దేవ‌తార్చ‌న

రుచులు