Latest Telugu News, Headlines, Breaking News, Articles
 • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సాయంత్రం కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న సీజేకు ఆలయ పాలకమండలి సభ్యులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

 • బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. బుధవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శివాత్మిక ఇలా ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

 • ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సద్దుల బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు. స్వయంగా బతుకమ్మను పేర్చడంతో పాటు పాటలు పాడి సందడి చేశారు.

 • సినీ నటుడు మహేశ్‌బాబు తన సోదరుడు రమేశ్‌బాబుకు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కృష్ణతో కలిసి వారిద్దరు దిగిన ఫొటోను ఆయన పోస్టు చేశారు. తనకు అన్నయ్య ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారని తెలుపుతూ మహేశ్‌ ఈ పోస్టు పెట్టారు.

 • రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు.

 • సినీ నటుడు జగపతిబాబు చెన్నైలోని ఓ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి లంచ్‌ చేశారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన వారితో సరదాగా సమయం గడిపినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. జగపతిబాబు నటిస్తున్న ‘సింబా.. ద ఫారెస్ట్‌ మ్యాన్‌’ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.

 • జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన సైనికుడు గజ్జన్‌ సింగ్‌ కుటుంబాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పరామర్శించారు. శవపేటికను స్వయంగా మోయడమే కాకుండా కుటుంబసభ్యులతో కలిసి దగ్గరుండి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేయించారు.

 • దసరా ఉత్సవాలకు మైసూర్‌ ప్యాలెస్‌ను విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. రకరకాల థీమ్స్‌తో అలంకరణలు చేశారు. విద్యుద్దీపాల వెలుగులతో తీర్చిదిద్దిన టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా రూపం విశేషంగా ఆకట్టుకుంటోంది.

 • సినీనటి మెహరీన్‌ తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. వీటిలో ఆమె తన పోజులతో ఆకట్టుకున్నారు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నాతో కలిసి ఆమె నటిస్తున్న ‘ఎఫ్‌3’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాల్లో మెహరీన్‌ ‘హనీ’ పాత్ర పోషించారు.

 • వరంగల్‌ మహానగర ప్రజలు దసరా పండగను జరుపుకొనేందుకు పల్లెల బాట పడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన వారంతా తమ సొంతూరికి వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. హనుమకొండ బస్టాండ్‌లో ఈ విధమైన రద్దీ కనిపించింది. 

 • త్వరలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ సరికొత్త జెర్సీల్లో మెరిసిపోనున్నారు. బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.  ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా దీనికి నామకరణం చేశారు.  డార్క్‌ బ్లూ జెర్సీల్లో.. న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే పోజులిచ్చారు.

 •  ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. 

 • దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారు బుధవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

 • సినీనటి పూజా హెగ్డేకు ఆచార్య చిత్రబృందం ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలో ఆమె ‘నీలాంబరి’ పాత్రకు సంబంధించిన ఫొటోను పంచుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది.

 • అర్మేనియా దేశ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అక్కడి ఎవరన్‌ పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అరరత్‌ మిర్జోయన్‌తో కలిసి మొక్క నాటారు. దాన్ని మితృత్వాన్ని పెంచే మొక్కగా(ట్రీ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌) జైశంకర్‌ పేర్కొన్నారు.

 • బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి హమీదా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫొటోషూట్‌లో ఆమె దిగిన ఫొటోలను పలువురు ట్విటర్‌లో పంచుకున్నారు. వీటిలో ఆమె నీలం రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఫొటోలకు హమీదా ఫ్యాన్స్‌ లైక్‌, కామెంట్స్‌ చేస్తున్నారు.

 • గత సీజన్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానెల్‌ ఫేమ్‌ గంగవ్వ బతుకమ్మను పేర్చారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆమె ‘బతుకమ్మ పేరుస్తున్న’ అంటూ పోస్టు పెట్టారు. ఆమె నటించిన ‘రాజరాజ చోర’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 • రెండు తలలతో విచిత్రంగా కన్పిస్తున్న ఈ తాబేలు మస్సాచుసెట్స్‌లోని బర్డ్‌సే కేప్‌ వైల్డ్‌ లైఫ్‌ సెంటర్‌లోనిది. దీనికి ఆరు కాళ్లున్నాయి. రెండు వారాల క్రితమే ఇది జన్మించింది. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్న ఈ అరుదైన జీవి కదలికలను వన్యప్రాణి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

 • లఖింపుర్‌ ఖేరీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ కేసులో నిందితుడైన అశీష్‌ మిశ్రా తండ్రి, కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. సుప్రీం న్యాయమూర్తితో విచారణ చేయించాలని వినతిపత్రం సమర్పించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోని, గులాంనబీ ఆజాద్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. 

 • వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉన్న వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బండమీదిమామిడితండాలో పొలాల వద్దకెళ్తున్న రైతులకు ఏఎన్‌ఎం సునీత మంగళవారం టీకాలు వేశారు. మీ పని మీది.. నా పని నాది అన్నట్లుగా రైతన్నలు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి టీకాలు వేశారు. దీంతో సర్పంచి లక్ష్మి, వార్డుసభ్యులు ఆమెను అభినందించారు. 

 • దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాపట్ల పట్టణంలోని నందిరాజుతోట శివాలయంలో బాలికలను నవదుర్గలుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.  

 • మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ తరుణంలో మీ అందరి ఆశీస్సులు కావాలని పేర్కొంటూ ఈ చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. 

 • ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా నుంచి ఓ ప్రేమ గీతం విడుదలైంది. ‘చూపే బంగారమాయెనే  శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ అంటూ సాగే ఈ పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకొంది. 

 • హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకలో భాగంగా అమ్మవారిని 11వేల నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

 • ఈ చిత్రం చూడండి.. మల్లె తోట విరగబూసినట్లు ఉంది కదూ.. కానీ ఇది చిక్కుడు చేను. చేనంతా పూతతో తెల్లటి మల్లెలను తలపిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అశ్వారావుపేట మండలం జమ్మిగూడెంలో రహదారికి పక్కనే ఉన్న ఈ వనం చూపరులను ఆకట్టుకుంటోంది. 

 • వనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి జస్వంత్‌.. ఇందిరాపార్కు వద్ద తల్లి చిరువ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండే జస్వంత్‌ సెలవురోజుల్లోనూ ఆమెకు సహకారిగా ఉంటాడు. తల్లి ధనియాలు, ఇతర వెచ్చాలు విక్రయించే చోటులోనే కూర్చుని తన చదువులో నిమగ్నమవడం చూపరులకు ఆసక్తి కలిగించింది. జస్వంత్‌ తదేక దీక్షతో హోంవర్క్‌ చేసుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

 • యువ కథానాయిక పూజాహెగ్డే పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అఖిల్ ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. 

 • మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీ కళాశాలలో జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్‌ మహా-2021 కార్యక్రమంలో కూరగాయలతో తయారు చేసి, ప్రదర్శించిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 రకాల కూరగాయలతో 75 కిలోల బరువుతో దీనిని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు రూపొందించారు.   

 • దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భీమవరంలోని ఆర్యవైశ్యవర్తక సంఘ భవనంలోని వాసవీమాత మంగళవారం రాత్రి ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు రూ.కోటి విలువ చేసే కరెన్సీ నోట్లు, బంగారం, వెండి నాణేలతో అమ్మవారిని, ఆలయ వేదికను అలంకరించారు.

 • తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు.  

 • విశ్వానికి సంబంధించిన అత్యంత వివరమైన త్రీడీ మ్యాప్‌ ఇది. వర్చువల్‌ రియాలిటీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌ లేబొరేటరీ ఫర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మ్యూజియాలజీ శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. దీనిద్వారా విశ్వంలోకి వర్చువల్‌ పర్యటనలు చేపట్టవచ్చు.

 • బడిలో గడపాల్సిన బాల్యం చెత్త బండిలో గడుస్తోంది. సంచార జాతుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలు.. వారికి ఉద్దేశించిన పథకాల అమలు ఎలా ఉందో చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. చెత్త రిక్షాకు చుట్టూ వలకట్టి అందులో తన బిడ్డను ఉంచి దానిలోకే వ్యర్థాలను పోగు చేస్తోంది ఓ తల్లి. పాలకొల్లు తహశీల్దార్‌ కార్యాలయం ఎదురుగా కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

 • ‘మిస్‌ వైజాగ్‌-2021’ పోటీలు బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో మంగళవారం నిర్వహించారు. 21 మంది తమ అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. వీరిలో ముగ్గురిని ప్రధాన విజేతలుగా ప్రకటించారు.  

 • గత ఏడాది కొండరాళ్లు దొర్లిపడి భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం విదితమే. అప్పట్లో ఆగమేఘాలపై పనులు చేపట్టి రాళ్లు పడకుండా ఇనుప వలను ఏర్పాటు చేశారు. మంగళవారం దుర్గగుడికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు తాము తీసుకున్న చర్యలను వివరిస్తున్న దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు

 • ఎక్కడికి వెళ్లాలన్నా కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేయించుకున్నట్లు సర్టిఫికెటు తప్పనిసరిగా చూపించాలనే భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న చోట ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు. దసరా ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఆవరణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. భవానీ మాలధారణతో వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారు.

 • విజయవాడలోని కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాగా.. స్థానిక వైకాపా నాయకులు ఇంద్రకీలాద్రిపై ఉన్న క్యూలైన్లకు ఫ్లెక్సీలు కట్టారు.. వీటిని భక్తులకు కనిపించేలా ప్రదర్శించారు.

 • ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జగిత్యాల జిల్లా పరిషత్తు భవనం ఆవరణలో మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున పేర్చిన బతుకమ్మను ట్రాక్టర్‌లో వేడుకల ప్రాంగణానికి తీసుకువచ్చారు.

 • దసరా పండుగ నేపథ్యంలో తమ తమ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మంగళవారం కిక్కిరిసిపోయింది. మరో పక్క భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.

 • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారాలైన సప్తమాతృకలకు చిహ్నంగా ఇక్కడ ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు.

 • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మలయప్పస్వామి గజ వాహనంపై కొలువుదీరి దర్శనం ఇచ్చారు.

 • అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన 48వ ‘సేఫ్‌ వే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌’లో దాదాపు వెయ్యి కిలోల గుమ్మడికాయ బహుమతిని గెలుచుకుంది. 994 కిలోలున్న ఈ గుమ్మడికాయను పండించిన వాషింగ్టన్‌కు చెందిన జెఫ్‌.. దాదాపు రూ.15 లక్షల ఫ్రైజ్‌ మనీని దక్కించుకున్నారు. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న