• తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం భోగి పండుగను ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్యక్రమాలు చేశారు. అనంతరం సహస్ర నామార్చన చేప‌ట్టారు. సాయంత్రం ఆండాళ్‌ అమ్మవారిని, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. కొవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు.

 • సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్‌లోని జ్యూమెరాత్‌ బజార్‌, ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో యువతీ యువకులు గాలిపటాలను ఎగురవేస్తూ సరదాగా గడిపారు.

 • భోగి పండగ సందర్భంగా రాజమహేంద్రవరంలోని పలు వీధుల్లో వేసిన భోగిమంటల నుంచి వెలువడిన పొగ ఇలా నగరమంతా వ్యాపించింది. రైలు, రోడ్డు వంతెనపై నుంచి చూసినప్పుడు గోదావరి చెంత నగరం ఇలా పొగచూరినట్లు కనిపించింది.

 • ‘ఆర్మీ డే’ సందర్భంగా శనివారం జైసల్మేర్‌ లొంగేవాలాలోని భారత్‌-పాక్‌ బోర్డర్‌లో అతి పెద్ద మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. 225 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పు, 1400 కిలోల బరువుతో దీన్ని తయారు చేశారు. దీన్ని ఇప్పటికే నాలుగుసార్లు వివిధ సందర్భాల్లో వేర్వేరు చోట్ల ప్రదర్శించారు.  ప్రపంచంలోనే ఖాదీతో చేసిన అతి పెద్ద జాతీయ జెండా ఇదే కావడం విశేషం.

 • సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోని సెయింట్‌ సావా టెంపుల్‌ వద్ద బాణసంచా పేల్చి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అక్కడి సంప్రదాయ క్రైస్తవులు జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం శుక్రవారం న్యూ ఇయర్‌ సంబురాలు చేసుకున్నారు.

 • శ్రీలంకలోని అంపారా జిల్లా పల్లక్కడు గ్రామంలో డంపింగ్‌యార్డుకు ఏనుగులు ఆహార అన్వేషణకు తరచూ వస్తుంటాయి. కానీ ఇక్కడి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిని గజరాజులు ప్రాణాలొదులుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఈ కారణంగా 20 ఏనుగులు మృతి చెందాయి. వీటిలో ఇటీవల చనిపోయినవే మూడు ఉండటం గమనార్హం. ఈ ఏనుగులకు శవపరీక్షలు చేయగా పొట్టలో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • సంక్రాంతి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలొచ్చారు. దాదాపు 10వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యక్తి ఇలా గోధుమ గడ్డి ఉన్న తలపాగా ధరించి సంగమానికి రావడం అందరినీ ఆకట్టుకుంది.

 • ముంబయిలోని ధారావిలో తమిళ మహిళలు పెద్దఎత్తున ఒక్క చోటుకు చేరి పొంగల్‌ వేడుకలు చేసుకున్నారు. పొంగల్‌ వంటను వండి భక్తిశ్రద్ధలతో భగవంతుడికి నైవేద్యంగా పెట్టారు.

 • తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న గోశాల వద్ద సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా సీఎం తన సతీమణి భారతికి అరిసె ముక్క ఇచ్చి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

 • సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌ నగరవాసులు పెద్దఎత్తున స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్‌లోని వివిధ మార్గాల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. తెలుగుతల్లి వంతెనపై తీసిన చిత్రమిది.

 • సినీనటులు సూర్య, జ్యోతిక దంపతులు సంప్రదాయబద్ధంగా పొంగల్‌ వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను జ్యోతిక తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో ఇద్దరు కలిసి సంక్రాంతి ప్రత్యేక వంటకాన్ని వండుతూ సందడి చేశారు. అభిమానులకు పొంగల్‌, సంక్రాంతి, లోహ్రి శుభాకాంక్షలు తెలుపుతూ జ్యోతిక పోస్టు పెట్టారు.

 • రియల్‌ ఎస్టేట్ రంగం దూకుడుతో హైదరాబాద్‌లోని శివారు భూములు రూ.కోట్ల ధర పలుకుతున్నాయి. దీంతో హయత్‌నగర్‌ మండలం కుంట్లూరుకు చెందిన రైతు చంద్రారెడ్డి తన పొలం చుట్టూ పది సీసీ కెమెరాలు అమర్చారు. భూమి కబ్జాదారుల కోరల్లో చిక్కుకోకుండా ఈ ఏర్పాట్లు చేశానని ఆయన తెలిపారు. చరవాణితో వీటిని అనుసంధానం చేసుకున్నానని, ఇంటి నుంచే పొలంలో జరిగే కదలికలు తెలుసుకుంటున్నానని వివరించారు. 

 • మహిళలు ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు.. సిద్దిపేటకు చెందిన కొత్వాల్‌ లావణ్య.  కొత్వాల్‌ లావణ్య - శ్రీనివాస్‌లకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. స్వతహాగా వీరు మంత్రి అభిమానులు కావడంతో.. ఆయన పేరిట గత నవంబరు 25న స్థానిక కేసీఆర్‌ నగర్‌లో ‘హరీశన్న హేర్‌ కటింగ్‌ సెలూన్‌’ను ప్రారంభించారు. ఆర్థికంగా ఇబ్బందులుండటంతో శ్రీనివాస్‌.. అతడి భార్యకు తర్ఫీదు ఇచ్చారు. పట్టు సాధించిన ఆమె ప్రస్తుతం రోజులో నలుగురికి హెయిర్‌ కటింగ్, షేవింగ్‌ చేస్తున్నారు.  

 • ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలు ప్రకృతి ఒడిలో అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప వీరు ఎవరికీ గుర్తు రారు. నాగరిక జీవనానికి దూరంగా ఉంటూ ఉన్నంతలో తమ మనుగడను కాపాడుకుంటున్నారు. విద్యుత్తు, స్వచ్ఛ తాగునీరు అందించకపోయినా ఎవరినీ నిందించడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకుని మానవత్వం చూపించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై ఉంది.   

 • హైదరాబాద్‌ పలు సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. మినీ భారతదేశాన్ని తలపిస్తుంది. సంక్రాంతి పండగకు నగర వాసులు పల్లెలకు పయనమయ్యారు. పట్నం సగం ఖాళీ అయింది. కరోనా తదితర కారణాల వల్ల వెళ్లలేకపోయిన వారు ఇక్కడే తమ సంప్రదాయాలకు అనుగుణంగా పండగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నగరవాసులకు ఆ లోటు లేకుండా చేసేందుకు హైటెక్‌ సిటీ శిల్పారామంతోపాటు పలు చోట్ల సంప్రదాయ బద్ధంగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 

 • సంక్రాంతి పండగ వేళ.. సొంతూళ్లకు వెళ్లేందుకు వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలవారు ఆరాంఘర్‌ కూడలి వద్ద ప్రైవేటు వాహనాలు, సరకు రవాణా వాహనాల్లో ప్రయాణించైనా ఊర్లకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. అలా ఓ కారు ఆగగానే చుట్టూ చేరిన చిత్రమిది.

 • అభివృద్ధిలో ఆకాశాన్నంటుతున్నా పారిశుద్ధ్యం నిర్వహణలో అధ్వాన పరిస్థితికి నిదర్శనమిది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, కాలుష్య రసాయనాలతో కూకట్‌పల్లి ముళ్లకత్వ చెరువు నీరు రంగు మారి దుర్గంధం వెదజల్లుతోంది. వ్యర్థాలు చుట్టూ నల్లటి తెట్టులా పేరుకుపోయాయి. పక్షులతో పాటు సమీప ప్రాంతాలవాసులు అవస్థల పాలవుతున్నారు. 

 • జంతు ప్రదర్శనశాలలో స్వేచ్ఛగా విహరిస్తున్న వన్యప్రాణుల్లా కనిపిస్తున్నాయి కదూ.. నిజానికివి శిల్పాలు. జూబ్లీహిల్స్‌లో ఓ ఇంటి యజమాని ఇలా సహజత్వం ఉట్టిపడేలా తయారు చేయించుకుని ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. 

 • కరోనా వేళ సైతం తప్పనిసరిగా విధులకు రావాల్సిన ముఖ్యమైన ఉద్యోగుల కోసం ఐటీ సంస్థలు ప్రైవేటు మినీ బస్సులు అద్దెకు తీసుకున్నాయి. బస్సులు, మెట్రో రైళ్లలో రద్దీ నేపథ్యంలో వైరస్‌ ముప్పు లేకుండా ఇలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులను తీసుకెళుతున్నాయి. సంస్థల వద్ద వారిని దించి ఖాజాగూడలో ఆగిఉన్న వాహనాలివి.

 • శంకర్‌పల్లి మండల కేంద్రంలో గురువారం రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. స్వయంగా ట్రాక్టర్‌ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే యాదయ్య తదితరులు ఉన్నారు.

 • తెలంగాణ గ్రామీణ వంటకం జొన్నరొట్టెల తయారీ కొత్త పుంతలు తొక్కుతోంది.  ఇప్పుడివి సూపర్‌ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. ఇప్పటి వరకు చపాతీలు, పుల్కాలు దొరికేవి. మిగతా వాటితో పోలిస్తే జొన్నరొట్టెలు చేయడం కాస్త భిన్నం. ఉపాధికి  గ్రామాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఎంతోమంది మహిళలు జొన్నరొట్టెలు చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. ఇందులో క్రమంగా యంత్రాలు వస్తున్నాయి.   

 • తుంగభద్ర నది నుంచి అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. ఏకంగా తమ ఎద్దుల బండ్లను నీరు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఇసుకను తోడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి మూగజీవాలను నది మధ్యలో ఉంచి ఇసుక బండిలో నింపుతున్నారు. అలంపూర్, కొర్విపాడు, పుల్లూరు, కల్లుగోట్ల ప్రాంతాల నుంచి ఇసుకను ఇలా తీసుకొచ్చి వివిధ గ్రామాల్లో బండి ఇసుక రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు.

 • వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వేద పండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు

 • ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి పురందేశ్వరి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని ఆయన అన్నారు. తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 • కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ శివారు కోకిలంపాడు రోడ్డు, కాకర్ల, మల్లేలలో కోడి పందేలు నిర్వహించారు. బరుల వద్దకు స్థానికులు భారీగా తరలివచ్చి పందేలను తిలకించారు.

 • సంక్రాంతి అంటేనే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముందు రంగవల్లికలు గుర్తుకువస్తాయి. పల్లెల్లో నేటికీ ఇవి కనిపిస్తున్నాయి. కానీ పట్టణాలు, నగరాల్లో కొన్ని చోట్ల మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే సంకాంత్రి పండగను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న శిల్పారామంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హరిదాసుల కీర్తనలతో పాటు గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. వీటిని అక్కడివారు ఆసక్తిగా తిలకించారు.

 • యజమానికి తోడుగా నడకకు వచ్చిన ఈ శునకం ఎత్తు ఆరు అడుగులు. గ్రేట్‌ డేన్‌ జాతికి చెందిన ఇది వెనక కాళ్ల మీద నిలుచున్నపుడు దాదాపు మనిషి పొడవు అంత ఎత్తు ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన కార్తికేయరెడ్డి పెంచుతున్న దీని వయసు ఏడాది. శునక జాతుల్లో ఇదే ఎత్తైనది అని డాగివిల్లే నిర్వాహకురాలు అమృత, డాని పెట్‌ స్టోర్‌ నిర్వాహకుడు డాని తెలిపారు. హైదరాబాద్‌ ఆదర్శనగర్‌ ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో కనిపించింది ఈ ఎత్తైన శునకం.

 • విశాఖలోని సాగర్‌నగర్‌ తీరం వద్ద మత్స్యకారుల వలకు గురువారం విభిన్న ఆకృతుల సముద్ర జీవులు చిక్కాయి. ముక్కు భాగం సూదిగా ఉండే ముక్కుడు టేకు, పెద్ద పరిమాణంలోని జెల్లీ ఫిష్‌లు లభ్యమయ్యాయి. జెల్లీ ఫిష్‌లు ఎందుకూ ఉపయోగపడని కారణంగా తిరిగి వాటిని సాగర జలాల్లోకి విడిచిపెట్టారు.

 • అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని అంతంతమాత్రంగా పండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాప్తాడు మండల కేంద్రానికి చెందిన ఆషాబీ తన ఎకరా పొలంలో ఈ ఏడాది కంది సాగుచేశారు. అరకొరగా పండిన పంటను రహదారిపై నూర్పిడి చేస్తున్నారు. పంట సాగుకు 13 వేలు ఖర్చు చేయగా కనీసం కూలీల ఖర్చులు కూడా రావని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని పలువురు కంది రైతులది ఇదే పరిస్థితి.

 • విజయవాడలో రోడ్లను సుందరీకరించామని చెబుతున్నా వర్షంపడితే అంతా దుర్భరంగా తయారవుతోంది. వరదనీటి మళ్లింపు పథకం అర్ధంతరంగా వదిలేయడమే ఇందుకు కారణం.  నిర్మలా కాన్వెంట్‌ రోడ్డులో డివైడర్లు ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం టైల్స్‌తో దారులు వేశారు. గురువారం వర్షానికి ఇలా తయారయ్యింది. 

 • కృష్ణా జిల్లా అవనిగడ్డ పట్టణం లంకమ్మ మాన్యంకు చెందిన ఎన్‌.శంకరరావు పెంచుతున్న నాటు కోడి పెట్ట గురువారం పెట్టిన గుడ్డు గోలీకాయ సైజులో ఉండటంతో పరిసరాల గృహస్థులు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఆ కోడి మొదటి విడత పెట్టిన గుడ్లు సాధారణ స్థాయిలో ఉండగా, రెండో విడతలో పెట్టిన ఆరో గుడ్డు మాత్రం చిన్నగా ఉందని యజమాని చెప్పారు.

 • ఖమ్మం జిల్లాలో 1.03 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 43 వేల ఎకరాల్లో మిరప పంట వేశారు. ఈ క్రమంలో కొమ్మకుళ్లు, వేరుకుళ్లు, తామర పురుగు సోకింది. వేలాది రూపాయలు వెచ్చించి మందులను పిచికారి చేసినా అంతంతమాత్రపు దిగుబడులే వచ్చాయి. ఉన్న పంటనైనా కాపాడుకోవడానికి మిర్చిని కల్లాల్లో ఎండబెట్టారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి మిర్చి ఇలా నీటిపాలైంది.

 • కుమురం భీం జిల్లా పెంచికల్‌పేట మండలం పాలరాపుగుట్టలో మూడేళ్ల కిందట 25 వరకు రాబందులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. అధికారులు తర్వాత నిర్వహణ మరిచారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కమలాపూర్, సిరోంచ అటవీ ప్రాంతాల్లో అక్కడి అధికారులు రాబందుల కోసం రెస్టారెంట్లు సహా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక్కడివన్నీ వలసవెళ్లాయి. అయితే ఇటీవల పాలరాపుగుట్టలో కనిపించిన ఒకటి, రెండు రాబందుల చిత్రాలను వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు.  

 • మంత్రి కేటీఆర్‌ గురువారం రాత్రి ట్విటర్‌లో వేసిన ప్రశ్న ఇది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సముదాయమిది. చూడగానే మరేదో దేశంలో ఉందన్నట్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని ఉంచి ఆయన చేసిన చమత్కారమిది. 

 •  వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శివ, కేశవుల క్షేత్రమైన శ్రీకాళహస్తిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీసోమస్కందమూర్తి, జ్ఞానాంబికలు ముక్కంటి ఆలయం నుంచి శేష, యాళీ వాహనాలపై కొలువుదీరారు. మేళతాళాలు, భక్తజన నామస్మరణల మధ్య పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 

 • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురం రైతు పోకల మురళి. తన నాలుగు ఎకరాల జామ తోటలో 20 పెట్టెలు ఏర్పాటు చేసి తేనెటీగలు పెంచుతున్నారు. పెట్టెలో 8 కాలనీలు, ఒక ఫీడర్‌ ఉంటుందని, ఒక్కో పెట్టెతో 4 కిలోల స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అవుతుందంటున్నారు. పూలు పూసే ప్రతి పంటలో అంతర్గతంగా వీటిని పెంచవచ్చని చెబుతున్నారు. దానికి సంబంధించిన చిత్రమే ఇది...

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని