• తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ పాలకవర్గ సభ్యులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.

 • ‘ఆర్మీ డే’ సందర్భంగా జైసల్మేర్‌లోని భారత్‌-పాక్‌ బోర్డర్‌లో అతి పెద్ద మువ్వన్నెల జాతీయ జెండాను ప్రదర్శించారు. 225ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు వివిధ సందర్భాల్లో దేశంలోని వేర్వేరు చోట్ల దీన్ని నాలుగుసార్లు ప్రదర్శించారు. ప్రపంచంలోనే ఖాదీతో చేసిన అతిపెద్ద జాతీయ జెండా ఇదే కావడం విశేషం.

 • తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ప్రభల తీర్థం వేడుకను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. తీర్థ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో కొత్తపేట జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా వెలుగులు చూపరులను ఆకట్టుకున్నాయి.

 • తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్వయంగా ఆమె పొంగల్‌ వంటకాన్ని వండారు. కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్‌ సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. అక్కడి గోశాలలో గోపూజ చేశారు.

 • పదో శతాబ్దానికి చెందిన మేక తలతో ఉన్న యోగిని విగ్రహం ఉత్తర్‌ప్రదేశ్ లోఖరిలోని ఆలయంలో ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని అక్రమంగా లండన్‌కు తరలించారు. కాగా భారత ప్రభుత్వం తిరిగి మన దేశానికి చేర్చింది. ఈ ఫొటోను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

 • టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయి చాను మణిపూర్‌లో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెను అభినందించారు. ప్రజలకు ఈ రకంగా సేవ చేసే అవకాశం కల్పించిన సీఎంకు చాను కృతజ్ఞతలు తెలిపారు.

 • సంక్రాంతి వచ్చేసింది. ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో బంధు మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు పెడుతున్నారు. వాటిలో ఈ ఫొటో కొంచెం భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూనే.. వేడుకలో మాస్కు తప్పక ధరించాలని చెబుతున్న ఈ ఫొటో వైరల్‌గా మారుతోంది.

 • సినీ నటుడు బాలకృష్ణ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, బావ దగ్గువాటి వెంకటేశ్వరరావుతో కలిసి వారి నివాసంలో సందడి చేశారు. ఈ సందర్భంగా గుర్రం ఎక్కి అభిమానులను అలరించారు.

 • ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంతో పాటు పొంగల్‌ వండి సంబురాలు నిర్వహించారు. ఈ సంక్రాంతి అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు.

 • కోడిపందేల బరుల వద్ద పందెంరాయుళ్లకు డబ్బు కొరత లేకుండా నిర్వాహకులు ఫోన్‌పే ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు బరి వద్ద శుక్రవారం ఒక వ్యక్తి జూదరులకు నగదు కొరత లేకుండా చేసేందుకు ఫోన్‌పే ద్వారా నగదు ఖాతాలోకి జమ చేయించుకుని కొంత మొత్తం కమిషన్‌ తీసుకుని నగదు చెల్లిస్తున్నారు. పండుగ సీజన్‌ కావడం, ఏటీఎంలలో నగదు కొరత ఉండటంతో డిజిటల్‌ యాప్‌ల ద్వారా బరుల వద్దే చెల్లింపులు చేస్తన్నారు. ఫోన్‌ నంబర్లు, స్కానింగ్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా జూదరులకు నగదు చెల్లించారు.

 • తెలుగు ప్రజల పెద్ద పండగ సంక్రాంతి వేళ పర్యటకులు మన్యానికి పోటెత్తారు. లంబసింగి, తాజంగి, చెరువులవెనం ప్రాంతాలకు దూరప్రాంతాల నుంచి తరలివచ్చారు. మంచు అందాలతోపాటు గిలిగింతలు పెట్టే చలిని ఆస్వాదించారు. తాజంగి జలాశయం వద్ద జిప్‌ లైనర్‌పై విహరించడంతోపాటు జలాశయం అందాలను తిలకిస్తూ సందడి చేశారు.

 • సంక్రాంతి సందర్భంగా అమరావతి రైతులు తూళ్లూరులో వినూత్నంగా నిరసన తెలిపారు. మహిళలు పొంగల్‌ పాత్రలను నెత్తిన పెట్టుకొని ర్యాలీ చేశారు. పురుషులు, చిన్నారులు పతంగులు, బెలూన్లతో తరలివచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

 • ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్ షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాకిలిలో అందమైన రంగవల్లులను వేశారు. జాతీయ రహదారిని తలపించే డిజైన్ ముగ్గును తయారు చేశారు. డివైడర్లు, ప్రకృతి, నల్లని జాతీయ రహదారి, దానిపై గొబ్బెమ్మలకు బదులు వాహనాలు పెట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌, లైన్‌ డిసిప్లిన్‌పై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం చేపట్టారు.

 • కరోనా విజృంభిస్తున్న తరుణంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇక్కడి లిఫ్ట్‌లను సెన్సార్‌ ద్వారా పనిచేసేలా మార్చారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి మొదటి, రెండో అంతస్తుకు వెళ్లే ప్రయాణికులు లిఫ్టు వద్ద బటన్‌ నొక్కాల్సిన అవసరం లేకుండా సెన్సార్‌ ముందు అరచేయి పెట్టగానే అది తెరుచుకుంటుంది.

 • వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర శివాలయంలో నక్షత్ర తాబేళ్లు సంచరిస్తూ భక్తులను ఆనందపరుస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడ తాబేళ్లను సంరక్షిస్తున్నారు. ముఖ్య పర్వదినాల్లో పరమ శివుడి సన్నిధిలో ఇవి కూడా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాయి. అరుదైన నక్షత్ర తాబేళ్లను కాపాడుతుండడం విశేషం.

 • ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి వైఫై క్యాంపస్‌గా మారబోతోంది. ఇప్పటికే సేవలు అందుతున్నప్పటికీ.. నిర్వహణ సరిగా లేక తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో విద్యార్థులు సొంత మొబైల్‌ డాటాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రాంగణాన్ని పూర్తిస్థాయి వైఫై కేంద్రంగా తీర్చిదిద్ది ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారు.

 • చలితో ఒణుకుతున్న ప్రతి మేనికి శుక్రవారం వేకువజామునే భోగి మంట వెచ్చని ఊపిరిలూదింది. నూతన వస్త్రాలు ధరించిన పిల్లాపాపలు, పండగకు వచ్చిన అతిథులతో పెద్దలంతా మమేకమై అల్పాహారంతో రోజును ఆరంభించారు. వాకిట్లో పెట్టిన గొబ్బిళ్లు ఆడటానికి వచ్చిన యువతుల నోట వినిపించిన పాటల పల్లవితో పల్లెలన్నీ పండగ పల్లకీ ఎక్కాయి.

 • ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం భోగి సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తజనంతో పులకించింది. శివసత్తుల పునకాలు, ఒగ్గుపుజారుల డోలు వాయిద్యాల నడుమ ఆలయం జనజాతరగా మారింది. అర్చకులు, పురోహితులు, వేదపారాయణదారుల ఆధ్వర్యంలో వేకువజాము నుంచే మల్లన్నకు శైవాగమోక్తా ప్రకారం విశేష పూజలందించారు.

 • భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెల్లో కొత్త శోభ సంతరించుకుంది. మహిళలు ఉదయాన్నే కల్లాపి చల్లి, వాకిట్లో రంగవల్లులు వేయగా ఆకట్టుకున్నాయి. భోగి మంటలు ఏర్పాటు చేసి వాటి చుట్టూ తిరుగుతూ యువతీయువకులు కోలాటాలు ఆడి సందడి చేశారు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని