Latest Telugu News, Headlines, Breaking News, Articles
close
 • సినీ నటి ప్రియాంక జవాల్కర్‌ తన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
 • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తన జన్మదినం సందర్భంగా భద్రాచలంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
 • యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. లండన్‌లో సుమారు పది రోజుల ఐసోలేషన్‌ తర్వాత రెండు టెస్టుల్లోనూ నెగెటివ్‌ రావడంతో డుర్హమ్‌లో బయో బుడగలోకి మళ్లీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రిషభ్‌ పంత్‌తో కలిసి దిగిన ఫొటోను రవిశాస్ర్తి తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
 • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో వివిధ చోట్ల దారులు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం పంజాగుట్ట ప్రధాన కూడలి వద్ద కనిపించిందీ దృశ్యం
 • సూర్యాపేటలోని అమరవీరుడు కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహానికి ఎన్‌సీసీ క్యాడెట్లు జోరువానలోనూ నివాళి అర్పించారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా విగ్రహం వద్దనే ఉండి దేశభక్తిని చాటారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కర్నల్‌ సంతోష్‌బాబును కీర్తిస్తూ స్ఫూర్తిగీతాలను పాడారు.
 • వరంగల్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు నిండి జలకళ సంతరించుకున్నాయి. నగరంలోని ములుగు రోడ్డు ఇలా జలమయమవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
 • ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో తీర్చిదిద్దిన #Cheer4India సైకత శిల్పం ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడా బృందాలు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
 • విశాఖ ఉక్కు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ భాజపా నేతలు కేంద్రమంత్రి రామచంద్ర ప్రసాద్‌సింగ్‌కు దిల్లీలో వినతిపత్రం అందజేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 • జగనన్న కాలనీలు పేరుతో యు.కొత్తపల్లి మండలం కొమరగిరి, కాకినాడ గ్రామీణ ప్రాంతం నేమాంలో నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఇవి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువుల్ని తలపిస్తున్నాయి. కొమరగిరిలో 16వేలు, నేమాంలో 9వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ సామగ్రి కూడా వర్షంలో తడుస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
 • ఈ చిత్రంలో కన్పిస్తున్న దిబ్బ మొత్తం రొయ్యలు, చేపల నుంచి తీసిన వ్యర్థాలను పోగు చేస్తే వచ్చింది. కాకినాడ నగరం నుంచి ఎన్టీఆర్‌ బీచ్‌కు వెళ్లే మార్గంలో పారిశ్రామికవాడ వద్ద కొందరు అనధికారికంగా వీటిని ఎండబెట్టి కోళ్ల దాణాగా మారుస్తున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఈ వ్యర్థాలు మొత్తం కుళ్లిపోతున్నాయి. దుర్వాసన వెదజల్లడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 • నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. సహాయక చర్యల్లో భాగంగా ఓ బాలింతను ఇలా తెప్పపై సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
 • హైదరాబాద్‌ నగరంలోని సోమాజిగూడ డివిజన్‌ వరద ముంపు ప్రాంతాల్లో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని తొలగించేలా చర్యలకు ఉప క్రమించాలని జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలను ఆమె ఆదేశించారు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు పరిష్కారం చూపుతానని ఈ సందర్భంగా మేయర్ స్థానికులకు భరోసా ఇచ్చారు.
 • ఒలింపిక్స్‌లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే టోక్యో చేరుకున్నారు. హంగేరీకి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మారియా ఫేజ్‌కస్‌ ఇలా ఒలింపిక్స్‌ రింగులతో కూడిన హెయిర్‌ కట్‌తో మెరిసి మీడియా దృష్టిని ఆకర్షించారు.
 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామ పంచాయతీల్లో ఇసుక వాగు, లోతు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో దాదాపు 16 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గొందిగూడెంలో ఇసుక వాగు దాటడానికి వీలుకాకపోవడంతో వైద్య అవసరాల కోసం వెళుతున్న కొందరు గర్భిణులు ఒడ్డునే అవస్థలు పడుతున్నారు. ఓ అంబులెన్స్‌ సైతం నిలిచిపోయింది.
 • గత రెండ్రోజులుగా భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో చార్మినార్‌ సందర్శనకు వచ్చిన పలువురు ఇలా గొడుగులతో కనిపించారు.
 • శ్రీరాంసాగర్‌ జలాశయానికి(ఎస్సార్‌ఎస్పీ) భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,88,325 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 81.696 టీఎంసీలుగా ఉంది. ఎస్సార్‌ఎస్పీ 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
 • ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటాలని అభిలషిస్తూ.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన క్రీడాభిమాని రాజ్‌కుమార్‌ హర్యానీ ఈ విధంగా తన శరీరంపై జాతీయ పతాక రంగుల్ని నింపుకొన్నాడు.
 • లద్దాఖ్ ప్రాంతంలోని 5,359 మీటర్ల ఎత్తైన ఖర్ దుంగ్లా పర్వతాన్ని అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ చిన్నారులు రిత్విక శ్రీ, భవ్యశ్రీ, యశశ్విత, సూర్య, భువన్‌ ఫొటోను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌లో పంచుకొని అభినందించారు. పదేళ్లు కూడా నిండని ఈ ఐదుగురు చిన్నారుల సాహసం ముచ్చటగొలిపిందని పోస్టు పెట్టారు.
 • హైదరాబాద్‌లో నిర్వహించిన సూత్ర లైఫ్‌స్టైల్‌, ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌కు సినీనటి రాశీ సింగ్‌ హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
 • దిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది రైతులు పార్లమెంటు సమీపంలో నిరసన స్వరం వినిపించారు.
 • తిరుపతి కపిలేశ్వరస్వామి పవిత్రోత్సవాల్లో రెండో రోజైన గురువారం స్వామివారికి గ్రంథి పవిత్ర సమర్పణ చేశారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్యక్రమాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.
 • ఈ నెల 24న తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా తాను 6 అంబులెన్స్‌లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు 90 ఇచ్చారని గుర్తు చేశారు.
 • మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో నాలుగో రోజు ప్రజాదీవెన యాత్ర కొనసాగిస్తున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నప్పటికీ ఇల్లంతకుంట మండలం మర్రివానిపాలెం గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు గొడుగులు చేతబూని ఈటల వెంట నడుస్తున్నారు.
 • కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ మాత్రమే ఆయుధమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పడానికి నిదర్శనం ఈ చిత్రం. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా గొడుగులతో టీకా కేంద్రానికి తరలివచ్చారు. హైదరాబాద్‌లోని సూరారం టీకా పంపిణీ కేంద్రం వద్ద కనిపించిందీ రద్దీ.
 • ఎగువన కురిసిన వర్షాలతో బొగత జలపాతం ఉప్పొంగుతుండగా.. ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు జనం పోటెత్తారు. చిరుజల్లులతో తడిసి ముద్దవుతున్నవేళ జలపాతం నుంచి జాలువారుతున్న జల సవ్వడితో పర్యాటకులు తన్మయులయ్యారు.
 • మేఘాలు కమ్మిన ఆకాశం.. ముసురు జల్లులు.. ఒంటికి చక్కిలిగింతలు పెట్టినట్లుగా వీస్తున్న పిల్లగాలుల మధ్య మయూరం వయ్యారంగా నడుస్తూ కనువిందు చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ పురివిప్పి నాట్యం చేసింది. నిజామాబాద్‌ ఖిల్లా జైలు భవనంపై బుధవారం తీసిన చిత్రమిది.
 • ఈ దృశ్యాన్ని చూస్తే రాయిపై ఎండిన ఆకులా మైమరిపిస్తుంది కదూ.. పరీక్షించి చూస్తే అది కీటకం. శత్రువుల నుంచి రక్షించుకోవడానికి, ఆహార అన్వేషణకు ఆకులా కనిపించే దేహాకృతి దీనికి ఉపకరిస్తుంది. బుధవారం యాదగిరిగుట్ట శివారులో ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కింది. ఇది గొల్లబామ పురుగు జాతికి చెందిన కీటమని, పంటలకు ఎలాంటి నష్టం చేకూర్చదని మండల వ్యవసాయ అధికారి రాజేశ్‌ తెలిపారు. వర్షాకాలంలోనే ఇవి ఎక్కువ కనిపిస్తాయని పేర్కొన్నారు.
 • వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారి రంగురంగుల పూలతో వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. కరుణాపురం సమీపంలో రోడ్డు మధ్య విభాగిని ఇలా పలు రకాల పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
 • ఉద్యానమైతే ఏంటి.. ప్రకృతివనమైతే ఏంటి చెట్లుంటే చాలన్నట్లుంది అధికారుల తీరు. పట్టణాల్లోని వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల కొరతతో చెట్లున్న చోటునే ప్రకృతి వనాలుగా మారుస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో రెండేళ్ల క్రితం ఉద్యానాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులకు ఆహ్లాదం పంచుతోంది. ఇటీవల దాని బోర్డును ప్రకృతివనంగా మార్చేసి మమ అనిపించారిలా.
 • ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
 • ఆకాశంలో విహరిస్తున్న మైనాకు గోడపైన ఆహారం కనిపించింది. వెంటనే అక్కడి జొన్నగింజ నోట కరచుకుని రివ్వున ఎగిరింది. సమీపంలోని తన పిల్ల వద్దకు చేరి ప్రేమతో నోటిలో నోరుపెట్టి తినిపించింది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం నవభారత్‌నగర్‌లో కనిపించిందీ దృశ్యం.
 • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టల్లోని పాండవ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వర్షాలకు గుట్టలపై నుంచి వరద నీరు కిందికి జాలువారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ఈ అందాలను తిలకించటానికి చాలా మంది తరవస్తున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను పలువురు చరవాణుల్లో బంధిస్తున్నారు.
 • కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి, లక్ష్మీ పంపుహౌస్‌ ప్రాంతాల్లో వన్యప్రాణులు సందడి చేస్తున్నాయి. సందర్శకులకు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. వేసవి కాలంలో దాహార్తి తీర్చుకోవడానికి వచ్చేవి. తాజాగా బుధవారం గ్రావిటీ కాలువ సమీపంలోకి జింకల గుంపు వచ్చింది. కాలువ వెంట పరుగులు పెడుతూ కనిపించాయి.
 • కశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్లే జాతీయ రహదారి ఇది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి భారీ వాహనాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ అవసరాల నిమిత్తం పరిమితికి మించి లోడుతో రోడ్డుపై ప్రయాణిస్తుండటంతో ఇతర వాహన చోదకులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధిక లోడు వాహనాలను నియంత్రించాలని కోరుతున్నారు. - ఈనాడు, అనంతపురం
 • రాజమహేంద్రవరంలోని రైలు కమ్‌ రోడ్డు వంతెనపై ఏర్పడిన హరివిల్లు కనువిందు చేసింది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు చూసినప్పుడు హరివిల్లు ఇలా నదికి హారంలా.. వాహన చోదకులకు స్వాగత ద్వారంలా కనిపించింది.
 • చిత్రంలో నలుపు, పసుపు వర్ణాల రెక్కలతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది సీతాకోక చిలుక కాదు. అదో రకం రంగు రెక్కల తూనీగ. రెండు జతల రెక్కలతో మెల్లమెల్లగా ఎగిరే ఇవి చూపరులను సీతాకోకచిలుకలుగా భ్రమింపజేస్తాయి. ఈ చిత్రంలోనిది మగ తూనీగని, ఆడ తూనీగలకైతే రెక్కలపై మచ్చలు ఎక్కువగా ఉంటాయని జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావు తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ తూనీగ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కులో కనువిందు చేసింది.
 • అమ్మ ప్రేమను తన పిల్లలకే కాకుండా ఇతర పిల్లలకు కూడా పంచే గొప్పగుణం తల్లికి మాత్రమే ఉంటుంది. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. ఆహారం కోసం చెట్టుపైకెక్కిన ఒక అమ్మకోతి పిల్లను మరో అమ్మకోతి జాగ్రత్తగా కాపుకాస్తున్న దృశ్యాలివి. ఎక్కడికీ వెళ్లకుండా, కిందపడకుండా పట్టుకుని ఒడిలో పెట్టుకుచూసుకుంది. వాళ్ల అమ్మరాగానే తన వద్దకు వదిలేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడి వద్ద కనిపించిన దృశ్యాలివి.
 • ఈ చిత్రం చూస్తే కోనసీమ గుర్తొస్తోంది కదూ.. కానీ కరవు సీమగా పేరుపొందిన అనంతపురం జిల్లాలోనిది. జిల్లాలోనే పెద్దదిగా పేరొందిన బుక్కపట్నం చెరువును గత రెండేళ్లు హంద్రీనీవా జలాలతో నింపారు. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు చిత్రావతి నది పొంగిపొర్లింది. చెరువుకు భారీగా వర్షపు నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండింది. దీనికింద 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే వరినాట్లు వేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చగా.. కోనసీమలా కనిపిస్తోంది.
 • ప్రకృతిలో అనేక అందాలు దాగి ఉంటాయి. అలాంటి దృశ్యమే జిల్లాలోని మద్దూరు గ్రామ కరకట్ట వెంబడి కృష్ణా నది వద్ద కనిపించింది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఒరవడితో ఎక్కువగా ఉండటంతో కరకట్ట వైపునకు పడవలు ఇలా అంచుకు చేరాయి. బుధవారం ఈ దృశ్యం కనిపించింది.
 • కృష్ణా జిల్లా అవనిగడ్డ కరకట్టపై ఇసుక రీచ్‌ ఒకటి మాత్రమే నడుస్తుండడంతో లారీలు కిలోమీటర్‌ మేర నిలబడిపోయాయి. కృష్ణా నదిలో నీరు రావడం, భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో చాలా రీచ్‌లలో ఇసుక తవ్వకాలు ఆపేశారు. అప్పారావుపేట- ఐనపూరు మధ్యలోని ఈ రీచ్‌ వద్ద కిలోమీటర్‌కు పైగా వాహనాలు కరకట్టపై నిలబడిపోయాయి. దీంతో అవనిగడ్డ- విజయవాడ రహదారిలో ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. రాత్రి సమయంలో గంటల పాటు వాహనాలు కరకట్టపై నిలబడిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
 • బక్రీద్‌ సందర్భంగా ఖుర్బానీ ఇచ్చే గొర్రెపొట్టేళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. పాతబస్తీలోని సుల్తాన్‌షాహీకి చెందిన ఆదిల్‌ అనే వ్యాపారి పంజాబ్‌ జాతికి చెందిన ఆరు పొట్టేళ్లు పెంచాడు. రెండేళ్ల పాటు వాటికి కాజు, పిస్తా వంటి ఎండు ఫలాలు దాణాలో కలిపి అందించారు. బక్రీద్‌ నేపథ్యంలో వీటిని విక్రయించడానికి తలాబ్‌కట్ట మార్గంలో ఓ స్టాల్‌ ఏర్పాటు చేశారు. సుల్తాన్, టిప్పు, షేర్‌ఖాన్‌ తదితర పేర్లతో ఉన్న ఈ పొట్టేళ్లలో సుల్తాన్‌ అనే పొట్టేలును వేలంలో రూ.లక్షకు విక్రయించారు.
 • అసలే వర్షాకాలం.. ఎటు నుంచి ఎలాంటి ముప్పు ముంచు కొస్తుందో తెలియదు. అందుకుతోడు రహదారులపై అడ్డదిడ్డంగా కేబుల్‌ వైర్లు. గాలివానకు తెగి పడిన వీటిని రోజుల తరబడి తీసే నాథులే లేరు. కూకట్‌పల్లిలో పాదబాటపై పరిస్థితి ఇది.
 • రెండో దశ కరోనా తగ్గుముఖం పట్టింది. లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించి చాలా రోజులు కావొస్తోంది. నగరవాసులంతా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో అప్పట్లో సొంతూర్లకు వెళ్లిన వారూ తిరిగి ఉపాధి పనుల కోసం నగరానికి చేరుకుంటున్నారు. బుధవారం ఎల్‌బీ నగర్‌ వద్ద కనిపించిందీ దృశ్యం.
 • హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరానికి వచ్చిన బండారు దత్తాత్రేయను బుధవారం రాజ్‌భవన్‌లో భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఉపాధ్యక్షురాళ్లు డాక్టర్‌ మాలతి, వీణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గీతారాణి, కార్యదర్శి జ్యోతి తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు.
 • వర్షం కురుస్తున్నా వీరు వరుస కట్టింది ఆకలి తీర్చుకోవడం కోసం. నిరాశ్రయులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆకలితో అలమటించే వారి కోసం సికింద్రాబాద్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ బుధవారం భోజనం పంపిణీ చేస్తుండగా ఇలా బారులు తీరారు. మరోవైపు భోజనానికి వచ్చేవారు లేక నాంపల్లి అన్నపూర్ణ క్యాంటీన్‌లో నిర్వాహకుడు ఇలా ఎదురు చూపులు చూస్తున్నాడు.
 • సీతాకోక చిలుక మీకెంత అందంగా అయినా కనిపించవచ్చు. ఆకలేస్తే నాకది కేవలం ఆహారం మాత్రమే అన్నట్లుంది ఈ గ్రీన్‌ బీ ఈటర్‌ పక్షి తీరు.. గాలిలో గిరికీలు కొడుతూ తుమ్మెదలు, కీటకాలను వేటాడి తినే ఈ బుల్లిపిట్ట.. రెక్కలల్లార్చుకుంటూ అనూహ్యంగా దగ్గరకే వచ్చిన సీతాకోకచిలుకను తన పొడవాటి ముక్కుతో ఇట్టే పట్టేసింది. ఆపై గుటుక్కుమనిపించింది. హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో బుధవారం కెమెరా కంటికి చిక్కిన చిత్రమిది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న