రోజారమణి దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం - ​​​​​​​Lifetime Achievement for actros Rojaramani and her husand Chakrapani from Vamsi groups and UK Telugu Association
close
Updated : 19/10/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోజారమణి దంపతులకు జీవిత సాఫల్య పురస్కారం

వాషింగ్టన్‌: ప్రముఖ నటి రోజారమణి ఆమె భర్త నటుడు చక్రపాణి దంపతులకు అమెరికాలోని వంశీ ఇంటర్నేషనల్‌ ఇండియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు సమాఖ్య సంయుక్తంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశాయి. అమెరికాలో గానకోకిలగా పేరుగాంచిన శారద ఆకునూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్‌ 17, 2020న ఆన్‌లైన్‌ మాధ్యమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపకుడు శిరోమణి వంశీ రామరాజు, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు సమాఖ్య ట్రస్టీ డా.వి.పి.కిల్లి పాల్గొన్నారు. రోజారమణి, చక్రపాణి కుమారుడు, ప్రముఖ హీరో తరుణ్‌, కుమార్తె అమూల్య వారికి జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా హీరో తరుణ్‌ మాట్లాడుతూ.. తన తల్లి రోజారమణి భక్త ప్రహ్లాద చిత్రంలో నటించి జాతీయ పురస్కారం అందుకోగా.. తాను అంజలి చిత్రానికిగానూ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం జీవితంలో గొప్ప అనుభూతి అని గుర్తుచేసుకున్నారు.  

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ కూడా పాల్గొన్నారు. రోజారమణితో కలిసి ‘వస్తాడే మా బావ’, ‘భారతంలో ఒక అమ్మాయి’ చిత్రాల్లో నటించినట్లు గుర్తుచేసుకున్నారు. ఆమె నటనా కౌశలాన్ని ప్రశంసించారు. ఆమెను డబ్బింగ్‌ కళాకారిణిగా తానే పరిచయం చేశానని తెలిపారు. అనంతరం ఆమె సుహాసిని, రాధ, మీనా, విజయశాంతి వంటి టాప్‌ హీరోయిన్స్‌కు డబ్బింగ్‌ చెప్పారన్నారు. అలా మొత్తం 400 చిత్రాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారన్నారు. ఇక ఆమె భర్త చక్రపాణి ఒడియాలో పౌరాణిక పాత్రల్లో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారని తెలిపారు. రోజారమణి మాట్లాడుతూ.. కళలకే అంకితమైన తమ జీవితం ఎంతో ఆనందంగా గడిచిందన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం గాయని శారద ఆకునూరి పాటలు, వ్యాఖ్యానం అలరించాయి. సీనీ దర్శకులు రేలంగి నర్సింహారావు, తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, డా.ప్రసాద్‌ తోటకూర, హాంకాంగ్ నుంచి జయశ్రీ పీసపాటి‌, ఆస్ట్రేలియా నుంచి విజయ గొల్లపూడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివర్లో జరిగిన సంగీత కార్యక్రమంలో అమెరికాలోని రాధికా నోరి, వైజాగ్‌లోని రాజేంద్రప్రసాద్‌ పాలు అలరించాయి. డా.తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని