Coronasomnia: ఇమ్యునిటీని తగ్గిస్తుంది - ‘coronasomnia’: everything you need to know about covid-19 and insomnia
close
Updated : 28/05/2021 05:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronasomnia: ఇమ్యునిటీని తగ్గిస్తుంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మానవాళికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. ఒంటరిగా వచ్చి, రూపాంతరం చెంది, ముప్పుతిప్పలు పెడుతోంది. దీనికి తోడు కొత్త కొత్త రోగాలను, సమస్యలను తీసుకొస్తుంది. అందులో ఒకటి నిద్రలేమి(ఇన్‌సోమ్నియా). కరోనా సోకినవాళ్లలో తమకొచ్చిన వ్యాధి ఎప్పుడు తగ్గుతుందో, ఏమవుతుందోననే ఆందోళన ఉంటుంది. సోకని వాళ్లలో తమకు ఎక్కడ సోకుతుందేమోననే భయం. చాలామంది ఇలాంటి ఆందోళనల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే కరోనా వల్ల వచ్చే ఈ సమస్యను వైద్యులు కరోనాసోమ్నియాగా అభివర్ణించారు. దీన్ని అధిగమించడానికి మందులు తీసుకుంటే ఉపశమనం లభించకపోగా, అది జీవక్రియల మీద తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లతో రోగనిరోధక శక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

నిద్రలేమికి కారణాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కరోనా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే కరోనా వార్తలు ఎక్కువగా చూడటం, నిస్సహాయంగా ఉండటం, వైరస్‌ బారిన పడ్డాక తమ కుటుంబ సభ్యులను కలవడానికి కుదరకపోవడం, ఒంటరితనం లాంటి విషయాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్ల అది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే శారీరక శ్రమ లేకపోవడం, పగటినిద్ర, మొబైల్‌, ల్యాప్‌టాప్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల తెరలను ఎక్కువసేపు చూడటం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీంతోపాటు లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం కోల్పోవడం, కెరీర్‌ గురించి ఆందోళన, ఖర్చులు పెరుగుతూ సరైన సంపాదన లేకపోవడం తదితర ఇబ్బందుల వల్ల కొంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇవే కాకుండా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరంలో నొప్పులు, నిరాశ, పీడకలలు, జ్వరంలాంటివి కూడా రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తాయి. నిద్రలేమి సమస్య వల్ల రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. 

ఏం చేయాలి..
కరోనా వేళ నిద్రలేమి సమస్యను తరిమికొట్టాలంటే ముందు దాని గురించి వచ్చే నెగెటివ్‌ వార్తలను చూడటం తగ్గించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న వారి గురించి వివరాలు తెలుసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి. పగటి నిద్రను మానుకోవాలి. ఎలక్ట్రానిక్‌ తెరలను చూసే సమయం తగ్గించుకోవాలి. పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినడం, కళలను అభ్యసించడం లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను తరిమికొట్టవచ్చు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని