యాహూ: ఫస్ట్‌లో సుశాంత్‌.. టెన్త్‌లో బన్నీ..! - 10 Most Searched Male Celebrities of 2020 in Yahoo
close
Updated : 02/12/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాహూ: ఫస్ట్‌లో సుశాంత్‌.. టెన్త్‌లో బన్నీ..!

ఈ సెలబ్రిటీల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేశారు

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020.. చూస్తూండగానే ఏడాది చివరికి వచ్చేశాం. ఈ ఏడాది అందరి జీవితాల్లో.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎన్నో విషయాలు చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్స్‌ లేకపోవడంతో పలువురు నటీనటులు కుటుంబపోషణ విషయంలో ఇబ్బందులు పడిన విషయం మరువక ముందే నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ ఆకస్మిక మరణంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషీ కపూర్‌, విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ సైతం ఈ ఏడాదిలోనే కన్నుమూశారు. మరోవైపు అమితాబ్‌కు కొవిడ్‌-19గా నిర్ధారణ కావడంతో అందరూ కంగారు పడ్డారు. దీంతో సదరు సెలబ్రిటీల గురించి తెలుసుకునేందుకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తి కనబరిచారు. అలా.. యాహూ వేదికగా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేసిన టాప్‌ 10 సెలబ్రిటీలు వీళ్లే..

1.సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌: బుల్లితెర నటుడిగా కెరీర్‌ను ఆరంభించి.. ‘కై పో చే’తో హీరోగా వెండితెరకు పరిచయమైన సుశాంత్‌.. జూన్‌ 14న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అనుమానం వ్యక్తం చేయడంతో ఎన్సీబీ, సీబీఐ సుశాంత్‌ కేసు విచారణ చేపట్టింది. దీంతో సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ గురించి ఎక్కువమంది సెర్చ్‌ చేశారు.

2.అమితాబ్‌ బచ్చన్‌: అగ్రకథానాయుడు అమితాబ్‌ బచ్చన్‌ కొవిడ్‌-19 బారినపడ్డానని ప్రకటించడంతో అందరూ కంగారు పడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేశారు. బిగ్‌బి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సెర్చ్‌ చేసి తెలుసుకున్నారు. దీంతో ఆయన యాహూ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సన్స్‌(మేల్‌) జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

3.అక్షయ్‌ కుమార్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొడానికి పలువురు సెలబ్రిటీలు కేంద్రప్రభుత్వానికి తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ రూ.25 కోట్లను విరాళంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు ఆయన కథానాయకుడిగా నటించిన ‘లక్ష్మిబాంబ్‌’ టైటిల్‌ విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో ‘లక్ష్మి’గా పేరు మార్చారు.

4.సల్మాన్‌ఖాన్‌: ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-14తో స్టార్‌హీరో సల్మాన్‌ ఈ ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, ఈ ప్రోగ్రామ్‌ కోసం సల్మాన్‌ కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సల్మాన్, ఆయన సోదరుడి పేర్లు తెరపైకి వచ్చాయి.

5.ఇర్ఫాన్‌ ఖాన్‌: బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 20న కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్‌.. తన తల్లి మృతి చెందిన నాలుగు రోజులకే మరణించారు. ఈ విషయం గురించి తెలుసుకుని అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

6.రిషీ కపూర్‌: ఇర్ఫాన్‌ఖాన్‌ మరణవార్త మరువకముందే మరో దిగ్గజ నటుడు రిషీ కపూర్‌ని భారతీయ చిత్ర పరిశ్రమ ఈ ఏడాదిలోనే కోల్పొయింది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఇబ్బందిపడిన రిషీ కపూర్‌ కొన్నిరోజుల చికిత్స అనంతరం ఏప్రిల్‌ నెలలో తుదిశ్వాస విడిచారు. రిషీ మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ.. ఆయన నటించిన సినిమాల గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేశారు.

7.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ఏడాదిలో కన్నుమూశారు. కరోనాతో తీవ్రంగా పోరాటం చేసిన ఆయన సెప్టెంబర్‌ 25న మృతిచెందారు. గాయకుడిగా ఆయన 16 భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడారు.

8.సోనూసూద్‌: ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేసి రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు నటుడు సోనూసూద్‌. వలస కార్మికుల కోసం ఆయన బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ‘ఐయామ్‌ నో మెస్సయ్య’ పేరుతో సోనూ ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. లాక్‌డౌన్‌లో తన అనుభవాల గురించి ఇందులో చర్చించారు.

9.అనురాగ్‌ కశ్యప్‌: దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఈ ఏడాదిలో వేధింపులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనురాగ్‌ తనపై వేధింపులకు పాల్పడ్డాడని నటి పాయల్‌ ఘోష్‌ ఆరోపణలు చేయడంతో ‘మీటూ’ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకి సపోర్ట్‌ చేశారు.

10.అల్లుఅర్జున్‌: ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న బన్నీ... లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కుంటాల వాటర్‌ఫాల్స్‌ సందర్శించారు. లాక్‌డౌన్‌ నియమాలు పాటించలేదంటూ చాలామంది ఆయనపై విమర్శలు కూడా చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని