తొలి టీ20: సిక్సర్ల పండగే మరి! - 1st t20 intl with world cup in mind india start search for perfect combination
close
Updated : 11/03/2021 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలి టీ20: సిక్సర్ల పండగే మరి!

భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లలో సూపర్‌ హిట్టర్లు

మొతేరా వేదికగా శుక్రవారమే తొలిపోరు

అహ్మదాబాద్‌: పొట్టి క్రికెట్లో దూకుడుకు మరోపేరుగా మారింది ఇంగ్లాండ్‌. అవసరమైనప్పుడు గేర్లు మారుస్తూ విజయాలు సాధిస్తోంది భారత్‌. ఈ రెండు జట్లు మొతేరా వేదికగా శుక్రవారం తొలి టీ20లో తలపడుతున్నాయి. ప్రపంచకప్‌కు సన్నద్ధమవ్వడమే కోహ్లీసేన లక్ష్యంగా కనిపిస్తుండగా మెగాటోర్నీ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇదే సువర్ణావకాశమని మోర్గాన్‌ బృందం భావిస్తోంది. అందుకే మొతేరాలో జరిగే సమవుజ్జీల సమరం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది.

మనసులో మాట!

సొంతగడ్డపై జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు కీలక బృందాన్ని సిద్ధం చేసుకోవాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్‌ విజేత, కఠిన పోటీదారైన ఇంగ్లాండ్‌తో సమరమే అందుకు మేలని అనుకుంటున్నాడు. పరుగుల వరదకు అనువైన మొతేరా ఫ్లాట్‌పిచ్‌లే ప్రయోగాలకు మంచిదని అతడి అంచనా. ‘ప్రపంచకప్‌ పరిస్థితుల్లో ఆడటం తమకు దొరికిన మంచి అవకాశం’ అని ఇంగ్లాండ్‌ మదిలోని మాటలను జోస్‌ బట్లర్‌ స్పష్టంగా చెప్పేశాడు. ‘మేం వర్తమానంపై దృష్టిసారిస్తే భవిష్యత్తు దానంతట అదే బాగుంటుంది. ఇది కీలక సిరీస్‌. వ్యక్తిగతంగా, బృందంగా మేమెలా ఉన్నామో తెలుసుకొనేందుకు మంచి వేదిక’ అని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ వివరించాడు.

రాహుల్‌ ఎక్కడ?

ప్రస్తుతం భారత్‌ ముందున్న ఇబ్బంది ‘జట్టు కూర్పు’. ఒక్కో స్థానానికి ఇద్దరు పోటీపడుతున్నారు. ఇది ‘తియ్యని తలనొప్పి’గా వర్ణించినా టీమ్‌ఇండియాకు గతంలో ఇదే చేదుగా మారింది! 2019 వన్డే ప్రపంచకప్ ముందు కోహ్లీసేన విపరీతంగా ఆటగాళ్లను పరీక్షించింది. పొట్టి క్రికెట్లో మేటిగా కనిపిస్తున్న కేఎల్‌ రాహుల్‌కు ఏ పాత్ర ఇవ్వాలో అర్థంకాక రవిశాస్త్రి, కోహ్లీ ప్రస్తుతం సతమతం అవుతున్నారు. నైపుణ్యం, తర్కం ప్రకారం రాహుల్‌కు చోటివ్వడమే న్యాయం. కానీ ఐసీసీ టోర్నీల్లో ధావన్‌కు గొప్ప రికార్డులున్నాయి. రోహిత్‌తో ఓపెనింగ్‌ చేస్తే ‘కుడి-ఎడమ’ వ్యూహ ప్రయోజనమూ లభిస్తుంది. గబ్బర్‌కు చోటివ్వాలని కోహ్లీ భావిస్తే రాహుల్‌కు మిగిలింది నాలుగో స్థానమే. అలాంటప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ చోటు గల్లంతవుతుంది.

సిక్సర్ల మోతే

మొతేరా పిచ్‌లు నెమ్మదివే. ఫ్లాట్‌గా ఉంటాయి. అంటే వికెట్‌కు రెండువైపులా సిక్సర్ల మోత తప్పదు! అలాంటప్పుడు విధ్వంసకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉండాలంటే శ్రేయస్‌, సూర్యకు చోటివ్వక తప్పదు. రోహిత్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌ కళ్లు చెదిరే సిక్సర్లు, బౌండరీలతో అభిమానులను ఆకట్టుకోగలరు. ఇంగ్లిష్‌ జట్టులోనూ ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, బట్లర్‌, మలన్‌ దంచికొట్టే సంగతి తెలిసిందే. అవసరమైతే మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌ సైతం బ్యాటు ఝుళిపించగలరు.

భువీ ఖాయం

యార్కర్ల వీరుడు నటరాజన్‌ లేకపోవడంతో భువీకి చోటు ఖాయం. సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అతడికి అండగా ఉంటాడు. ఉక్కపోత, మందకొడి పిచ్‌లు, నెమ్మది బౌలింగ్‌ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ఇబ్బంది అందరికీ తెలిసిందే. అందుకే వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్ కీలకమవుతారు. రెండో పేసర్‌గా‌ శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనిలో అవకాశం ఒక్కరి ఉంటుంది. మోర్గాన్‌ సేనకు బెన్‌స్టోక్స్‌, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ వంటి ఆల్‌రౌండర్లు, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌ వంటి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని