78 లోనూ నాన్‌స్టాప్ డ్యాన్సింగ్! - 78 year old grandmother fulfills childhood dream becomes dancing sensation
close
Published : 02/08/2021 16:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

78 లోనూ నాన్‌స్టాప్ డ్యాన్సింగ్!

Photo: Screengrab

ఆమెకు డ్యాన్స్ అంటే ప్రాణం. అందులోనే తన జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ కట్టుబాట్ల పేరుతో కుటుంబ సభ్యులు అడ్డు తగిలారు. సంప్రదాయాల పేరుతో సమాజం కూడా ఆక్షేపించింది. కొన్ని రోజులకు పెళ్లి, పిల్లల బాధ్యతల్లో పడిపోయి ఆమె కూడా తన ఆకాంక్షను తనలోనే అణచివేసుకుంది.

78 ఏళ్ల వయసులో ‘టిక్‌టాక్‌’ స్టార్!

అయితే కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదంటూ మలి వయసులో మళ్లీ డ్యాన్స్‌పై ప్రేమ పెంచుకుంది. నేటి తరం డ్యాన్సర్లకు దీటుగా అద్భుతమైన హావభావాలతో కాలు కదుపుతోంది. టిక్‌టాక్‌ స్టార్‌గా మారి మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంటోంది. ఆమే నేపాల్‌కు చెందిన 78 ఏళ్ల కృష్ణ కుమారి తివారీ.

మనసుకు నచ్చిన పనులు చేస్తూ!

‘మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అంటూ ఎందరో మహిళలు మలి వయసులో మనసుకు నచ్చిన పనులు చేస్తున్నారు. ఎవరేమనుకుంటారోనన్న సందేహాలను పక్కన పెట్టి ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను తిరిగి సంపాదించుకుంటున్నారు. నచ్చిన రంగంలో తమ ప్రతిభానైపుణ్యాలను చాటుకుంటున్నారు. నేపాల్‌లోని గోర్ఖా జిల్లాకు చెందిన కృష్ణకుమారి కూడా ప్రస్తుతం ఇదే చేస్తున్నారు.

పంజరం నుంచి బయటపడిన పక్షిలా!

చిన్నప్పటిలా కట్టుబాట్లు లేవు.. పెళ్లి, పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. కావాల్సినంత సమయమూ దొరుకుతోంది. దీంతో పంజరం నుంచి బయటపడిన పక్షిలా మళ్లీ తన నాట్య ప్రతిభను పట్టాలెక్కించారు కృష్ణకుమారి. ఏడు పదులు దాటినా ఎంతో వేగంగా కాళ్లు కదుపుతూ, అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ఆమె చేస్తున్న డ్యాన్స్‌లకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పలుకుతున్నారు. అందుకే ఆ చుట్టపక్కల జరిగే పెళ్లిళ్లు, పార్టీలు ఇతర శుభకార్యాలకు కృష్ణకుమారినే ఆహ్వానిస్తున్నారు.

ఇక ఆమె చేస్తున్న డ్యాన్స్‌ వీడియోలను ఆమె కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా టిక్‌టాక్‌లో ఆమె వీడియోలకు ఊహించని స్పందన వస్తోంది. దీంతో టిక్‌టాక్‌లో ఈ బామ్మను అనుసరించే ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల ఈ డ్యాన్సింగ్‌ సెన్సేషన్ వీడియోకు ఏకంగా 2 కోట్లకు పైగా వ్యూస్, 65 వేలకు పైగా కామెంట్లు రావడం విశేషం.

డ్యాన్స్‌ చేస్తూనే కన్ను మూయాలనుంది!
ఈ సందర్భంగా తన డ్యాన్స్‌ వీడియోల గురించి మాట్లాడుతూ ‘నేను డ్యాన్స్‌లో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. కానీ అప్పటి సమాజంలోని కట్టుబాట్లు నా ఆకాంక్షకు అడ్డు తగిలాయి. నేను డ్యాన్స్‌ చేస్తుంటే చాలామంది నేను సిగ్గులేనిదాన్నని ఆడిపోసుకునేవారు. దీంతో నా తల్లిదండ్రులు కూడా నాకు సహకరించలేదు. దీంతో డ్యాన్స్ చేయాలన్న ఆకాంక్షను నాలోనే అణచివేసుకున్నాను. అయితే ఇప్పటికీ డ్యాన్స్‌పై ప్రేమ అలాగే ఉంది. అందుకే ఇప్పుడిలా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్నాను. సమాజమే కాదు...ఇప్పుడు నన్నెవరూ ఆపలేరు. నా పిల్లలు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నా టిక్‌టాక్‌ వీడియోలకు వస్తున్న స్పందనను చూస్తుంటే మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేయాలనిపిస్తోంది. నాకు డ్యాన్స్‌ చేస్తూనే కన్ను మూయాలనే కోరిక ఉంది’ అంటోందీ గ్రాండ్‌ ఓల్డ్‌ వుమన్.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని