మరణం వీరి స్నేహాన్ని విడదీసింది..! - A Story On Balu And Bharathi Raju Friendship
close
Published : 27/09/2020 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరణం వీరి స్నేహాన్ని విడదీసింది..!

స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం బాలు-భారతీరాజా

హైదరాబాద్‌: ‘‘కొన్ని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేము.. ఈ బాధను ఎలా పంచుకోవాలో తెలియడం లేదు.. మా ప్రార్థనలు, వేడుకోళ్లు దేవుడు ఆలకించినట్లు లేదు..’ ఎస్పీబీని చూసేందుకు శుక్రవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సమయంలో దర్శకుడు భారతీ రాజా చెప్పిన మాటలివి. తన ప్రాణ స్నేహితుడు మృతి చెందాడనే వార్తను ఆయన జీర్ణించుకోలేక.. భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే వయసులో తనకంటే పెద్దవాడైన భారతీరాజాతో తనకున్న స్నేహబంధం గురించి బాలు ఓసారి ఈ విధంగా తెలియజేశాడు.

‘భారతీరాజా ఒకానొక సమయంలో పెట్రోల్‌బంక్‌లో పనిచేశాడు. అప్పటి నుంచే నాకు అతనితో పరిచయం ఉంది. పెట్రోల్‌ బంక్‌లో పనిచేసిన స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకోవడానికి అతను ఏ రోజూ ఇబ్బందిపడలేదు. గర్వపడ్డాడు. నిజం చెప్పాలంటే, వయసులో నాకంటే పెద్దవాడు అయినప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడం మాకు తెలియదు. ఒకవేళ నేను గౌరవమిచ్చినా భారతీరాజాకి మాత్రం కోపం వచ్చేది. మేమిద్దరం పరిచయమైన కొత్తలో.. భారతీరాజా, తమిళంలో నాటకాలు రాసుకుని.. నటించేవాడు. అతని నాటకాలకి నేను ప్లేబ్యాక్‌ పాడేవాడిని, ఫ్లూట్‌ కూడా వాయించేవాడిని. ‘ఆరాధన’ విడుదలయ్యాక ఆ సినిమాలో రాజేశ్‌ఖన్నా ధరించిన జుబ్బాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఆ సమయంలో నా దగ్గర ఉన్న ఆర్థిక స్థోమతతో ఓ క్రీమ్‌కలర్‌ జుబ్బా కుట్టించుకున్నాను. ఓరోజు దాన్ని ధరించి.. భారతీరాజా దగ్గరికీ వెళ్లాను. అదే సమయంలో నాటకంలోని ఓ సన్నివేశం కోసం అతనికి జుబ్బా కావాల్సి వచ్చింది. వెంటనే నా దగ్గరికి వచ్చి.. ‘అరేయ్‌ నాటకంలోని ఓసీన్‌ కోసం నాకు నీ చొక్కా కావాలి. కావాలంటే మనిద్దరం చొక్కాలు మార్చుకుందాం’ అన్నాడు. సరే అని.. నా చొక్కా అతనికిచ్చి అతని చొక్కా నేను ధరించా. సన్నివేశంలో భాగంగా ఎమోషనల్‌ అయిన భారతీరాజా.. నా చొక్కా చింపేశాడు. దాంతో ఆరోజు అతను బనియన్‌తోనే ఇంటికి వెళ్లాడు.’

‘భారతీరాజా ఓ గొప్ప దర్శకుడు. సినిమాల్లోకి రాకముందే నాకెన్నో కథలు చెప్పాడు. విశ్వనాథ్‌గారి కచేరీల కోసం నేను ఎక్కువదూరం ప్రయాణం చేయాల్సి వస్తే.. భారతీరాజాని నాతోపాటే తీసుకువెళ్లేవాడిని. జర్నీలో ఉన్నప్పుడు అతను నాకెన్నో కథలు వినిపించి.. ఏదో ఒకరోజు తప్పకుండా సినిమాలు తీస్తాననేవాడు. అలా, ఓసారి మేమిద్దరం కలిసి ‘పదహారేళ్ల వయసు’ చిత్రాన్ని తమిళంలో నిర్మించాలనుకున్నాం. కానీ ఆ సమయంలో మా ఇద్దరి దగ్గర డబ్బుల్లేవు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. భారతీరాజాతో సినిమా చేయడానికి ఓ నిర్మాత ముందుకొచ్చారు. ఆ విషయాన్ని నాతో చెప్పి.. స్ర్కిప్ట్‌ కావాలని అడిగాడు. అయితే ఆ స్ర్కిప్ట్‌ కనిపించకుండాపోయిందని తెలిసి నన్ను తిట్టి.. మళ్లీ స్ర్కిప్ట్‌ రాసుకున్నాడు. ఇలా మా ఇద్దరి మధ్య ఎన్నో మధురానుభూతులున్నాయి’ అని ఎస్పీ బాలు తెలియజేశారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని