దంచికొట్టిన ఆస్ట్రేలియా.. భారత్‌ లక్ష్యం 375 - Aaron Finch and Steve smith centuries helps Australia to set big score infront of Team India
close
Updated : 27/11/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దంచికొట్టిన ఆస్ట్రేలియా.. భారత్‌ లక్ష్యం 375

ఆరోన్ ఫించ్‌, స్టీవ్‌స్మిత్‌ శతకాలు 
మెరిసిన మాక్స్‌వెల్, డేవిడ్‌ వార్నర్ 

సిడ్నీ‌: తొమ్మిది నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న టీమ్‌ఇండియాకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ  స్కోర్‌ చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్ ‌స్మిత్‌ (105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (69; 76 బంతుల్లో 6x4), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (45; 19 బంతుల్లో 5x4, 3x6) తమ వంతు పాత్ర పోషించారు. తొలుత ఫించ్‌, వార్నర్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిలకడగా పరుగులు తీసి, తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధ శతకం తర్వాత ధాటిగా ఆడిన వార్నర్‌ షమి బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌కు తొలి వికెట్‌ లభించింది. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌ మరోసారి చెలరేగాడు. బౌండరీలతో మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ఫించ్‌తో కలిసి రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం (108) నిర్మించాడు. శతకం పూర్తి చేసుకున్నాక ఫించ్‌ ధాటిగా ఆడుతూ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. జట్టు స్కోర్‌ 264 వద్ద అనవసరపు షాట్‌ ఆడి కీపర్‌ చేతికి చిక్కాడు. అనంతరం మాక్స్‌వెల్‌ వచ్చీ రాగానే బౌండరీల వర్షం కురిపించాడు. అతడు మరికొంతసేపు క్రీజులో ఉండి ఉంటే జట్టు స్కోర్‌ 400 దాటేలా కనిపించింది. భారత బౌలర్లు సరైన సమయంలో రాణించారు. అర్ధశతకానికి చేరువైన మ్యాక్సీని షమీ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో జడేజా చేతికి చిక్కాడు. అనంతరం ఆలెక్స్‌ క్యారీ (17; 13 బంతుల్లో 2x4)తో జోడీ కట్టిన స్మిత్‌ ఆఖరి ఓవర్‌ వరకూ క్రీజులో ఉన్నాడు. 49వ ఓవర్‌లో శతకం పూర్తి చేసుకున్న స్మిత్‌ని షమి బౌల్డ్‌ చేశాడు. దాంతో కంగారూల స్కోర్‌ 374/6గా నమోదైంది. టీమ్‌ఇండియా బౌలర్లలో షమి 3 వికెట్లు.. బుమ్రా, సైని, చాహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని