ప్రభాస్‌ లైఫ్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు..! - Actor prabhas birthday special story
close
Updated : 23/10/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ లైఫ్‌.. కొన్ని ఆసక్తికర విషయాలు..!

బర్త్‌డే స్పెషల్‌

అతడు సత్తా ఉన్న ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’.. ఒంట్లోని అణువణువు పౌరుషంతో కదం తొక్కే ‘మిర్చి’లాంటి కుర్రాడు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘డార్లింగ్‌’.. సినిమా అంటే ప్రాణం పెట్టే ‘యోగి’.. బాక్సాఫీస్‌ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే  ‘బాహుబలి’.. ఎలాంటి రికార్డులైన అతని ముందు ‘సాహో’ అనాల్సిందే.. ‘రెబల్‌ స్టార్‌’ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. త్వరలో ‘రాధేశ్యామ్‌’ అంటూ విక్రమాదిత్యగా ప్రేమను పంచడానికి వస్తున్నాడు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

* ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. డార్లింగ్‌, ప్రభ, పబ్సీ ఆయన ముద్దుపేర్లు. సినీ నిర్మాత సూర్యనారాయణ రాజు కుమారుడు. మద్రాసులో జన్మించారు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. భీమవరంలోని డీఎన్‌ఆర్‌ పాఠశాలలో చదువుకున్నారు. హైదరాబాద్‌ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. ఆపై ఇంజినీరింగ్‌ చేశారు.

* ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభాస్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తన తొలి సినిమా ‘ఈశ్వర్‌’ సమయంలో ‘నన్నెవరైనా చూస్తారా?’ అని భయపడ్డారట. నిజానికి ‘డార్లింగ్‌’కు సిగ్గు కాస్త ఎక్కువ. దీనికి గురించి అడిగితే.. ‘సెట్లో ఇప్పటికీ బిడియం ఉంటుంది. కానీ కెమెరా ఆన్‌ అయితే అది మాయమవుతుంది. నిర్మాతలు డబ్బులు ఇస్తున్నారు కదా (నవ్వుతూ)’ అని చెబుతారు.

* ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు. నిజానికి నేటి స్టార్స్‌ ఏడాదిలో రెండు, మూడు సినిమాలకు సంతకం చేసి, నటిస్తున్నారు. అలాంటిది ప్రభాస్‌ కేవలం ‘బాహుబలి’ ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం గొప్ప విషయం. ఆయనలోని ఆ గుణమే నేడు ఈ స్థాయికి తీసుకొచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

* ప్రభాస్‌ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా కలిసి నటించిన ‘యాక్షన్‌ జాక్సన్‌’లో అతిథిగా కనిపించారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 

* నటుడు కావాలని ప్రభాస్‌ ఎప్పుడూ కోరుకోలేదట. హోటల్ నడపాలని అనుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు. ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట. షూటింగ్స్‌ లేని సమయంలో అక్కడే కాలక్షేపం చేస్తారని తెలిసింది.

* టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రభాస్‌ వివాహం కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వృత్తి జీవితంతో బిజీగా ఉన్న ఆయన పెళ్లిని పక్కన పెడుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత దాదాపు వందల పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చాయట. ఫలానా అమ్మాయిని మనువాడబోతున్నారంటూ వార్తలు కూడా ప్రచారమయ్యాయి. దీనిపై ప్రభాస్‌ స్పందిస్తూ.. ‘విజయాల్లో ఉన్నప్పుడు మంచో చెడో.. ఏదో రకమైన వదంతులు వస్తూనే ఉంటాయి. ‘బాహుబలి’ జరుగుతున్నన్నాళ్లూ నాపై కూడా వచ్చాయి. కొన్ని మాటల్లో చెప్పలేనివీ ఉన్నాయి. నా పెళ్లి గురించి కూడా ఆన్‌లైన్‌లో వదంతులు సృష్టించారు. పెళ్లి కూతురంటూ ఒక మోడల్‌ ఫొటోలు పోస్ట్‌ చేశారు. అలాంటివి ఆగడం కోసమైనా పెళ్లి చేసుకోవాలిక (నవ్వుతూ)’ అని అన్నారు.

* స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్‌ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.

* సేవా కార్యక్రమాల్లో ప్రభాస్‌ చురుకుగా పాల్గొంటుంటారు. ఆయన పలు ట్రస్టులకు ప్రతి ఏడాది ఆర్థిక సాయం చేస్తుంటారనే విషయం కొందరికే తెలుసు. ప్రచారం చేసుకోవాలనే వ్యక్తి ఆయన కాదు. నల్గొండలోని అంధుల పాఠశాలకు కూడా ఓసారి వెళ్లి వచ్చారు. హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో రూ.1.50 కోట్లు విరాళంగా ప్రకటించారు.

* ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్‌ ఎంతో ఫిట్‌గా కనిపించారు. పాత్ర డిమాండ్‌ చేయడంతో బరువు పెరగాలని దర్శక, నిర్మాతలు అన్నారట. 82 కిలోల బరువున్న ఆయన ‘అమరేంద్ర బాహుబలి’ కోసం 105 కిలోల బరువు పెరిగారు. ఆ తర్వాత ‘శివుడు’ పాత్ర పోషించడానికి 88 కిలోలకు తగ్గారు. ఆయన అంకితభావానికి మెచ్చి దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాలో ఉపయోగించిన ఓ ఆయుధాన్ని కానుకగా ఇచ్చారు.

* ‘బాహుబలి 2’ తర్వాత భారీ యాక్షన్‌ చిత్రం ‘సాహో’తో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. దీని తర్వాత ప్రభాస్‌ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్నారు. ఇటలీలో చిత్రీకరణ జరుగుతోంది.  అదేవిధంగా నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమాతోపాటు ‘ఆది పురుష్’లోనూ నటించనున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని