
తాజా వార్తలు
బ్యూటీలు మేకప్‌ను వదిలేశారోచ్..!
డీ-గ్లామర్‌గానూ ఫిదా చేస్తున్నారు..
హీరోయిన్.. ముఖానికి రంగులు అద్దుకుని, గ్లామర్‌గా హీరో పక్కన మెరిసే అందాల భామ. గ్యాప్ దొరికితే చాలు.. ‘ట..చ..ప్..’ అంటూ మేకప్‌మెన్‌ను పిలుస్తుంటారు. ఇది ఒకప్పటి ఫార్ములా.. ఇప్పుడు నటీమణుల ధోరణి మారింది. కంటెంట్ నచ్చితే డీ-గ్లామర్ పాత్రలకూ సై అంటున్నారు. సమంత, నయనతార, ఐశ్వర్య రాజేష్, తాప్సీ తదితరులు మేకప్ లేకుండానూ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించారు. కీర్తి సురేశ్, రష్మిక, ప్రియమణి తదితరు ఇలాంటి పాత్రలతో ఫిదా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా డీ-గ్లామర్ లుక్‌లోనూ వహ్వా అనిపించిన బ్యూటీలవైపు ఓలుక్ వేద్దాం..
అప్పటి వరకు సమంత నటించిన చిత్రాలు, పాత్రలు ఓ ఎత్తు. ‘రంగస్థలం’లో ఆమె నటన మరో ఎత్తు. మేకప్ లేకుండా పల్లెటూరి అమ్మాయి ‘రామలక్ష్మి’లా కనిపించిన తీరు అభిమానుల్ని కట్టిపడేసింది. ‘చిట్టిబాబు’ రామ్ చరణ్‌కు పోటీగా నటించి, సినిమా విజయంలో తనదైన పాత్ర పోషించారు. మరోపక్క సామ్ తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మెన్ 2’లోనూ డీ-గ్లామ్ రోల్ పోషించారు. ఉగ్రవాదిగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. |
ఇన్నాళ్లూ గ్లామర్ రోల్స్‌తో అలరించిన రకుల్‌ప్రీత్ సింగ్ తొలిసారి దిగువ మధ్యతరగతి అమ్మాయిగా దర్శనమివ్వబోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో రకుల్ గత చిత్రాలకంటే చాలా భిన్నంగా కనిపించబోతున్నారు. ఆమె లంగాఓణీలో సెట్లో ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి. |
‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ తర్వాత కీర్తి సురేశ్ త్వరలో ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె నటిస్తున్న సినిమా ‘సాని కాయిధమ్’. సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లో కీర్తి డీ-గ్లామర్ లుక్‌లో దోషిగా పోలీసుల కస్టడీలో కనిపించారు. ఆమె ముందు ఆయుధాలు కూడా కనిపించాయి. అరుణ్ మహేశ్వరన్ దర్శకుడు. సెల్వరాఘవన్ నటిస్తున్న పూర్తిస్థాయి పాత్ర ఇదే కావడం విశేషం. |
‘కుమారి21 ఎఫ్’తో అందరి దృషిని ఆకర్షించిన హెబ్బా పటేల్ ఆపై పలు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘ఈడోరకం ఆడోరకం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ తదితర చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ‘ఒరేయ్ బుజ్జిగా..’ తర్వాత హెబ్బా ‘ఓదెల రైల్వే స్టేషన్’లో నటించారు. ఇందులో ఆమె సింపుల్‌గా చీర కట్టుకుని, ఓ పల్లెటూరిలో జీవించే మహిళగా కనిపించడం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. |
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీస్తున్న ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్ మునుపెన్నడూలేని లుక్‌లో తయారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. కథానాయిక రష్మిక కూడా అదే తరహాలో డీ-గ్లామర్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఆమె చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నారు. మరి ఆమె ఎలా కనిపించబోతున్నారో వేచి చూడాలి. అదేవిధంగా ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’లో ప్రియమణి కూడా పల్లెటూరి మహిళగా నటిస్తున్నారు. |
‘ఆర్ఎక్స్ 100’ తర్వాత పాయల్ రాజ్‌పూత్ మరోసారి బోల్డ్ పాత్రలో అలరించారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ ‘అనగనగా ఓ అతిథి’లో డీ-గ్లామర్‌గా కనిపించారు. ఈ క్రైమ్ డ్రామాలో పాయల్ డబ్బు కోసం హత్య చేయడానికైనా వెనకాడని పల్లెటూరి అమ్మాయిగా నటించారు. నవంబరు 13న ఆహాలో విడుదలైన చిత్రం మంచి రివ్యూలు అందుకుంది. |
మాలీవుడ్ నటి అపర్ణ బాలమురళి 2015లో నటిగా అరంగేట్రం చేశారు. పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ.. ‘ఆకాశం నీ హద్దురా’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. సూర్య సతీమణి ‘సుందరి’ పాత్రలో సాధారణ మహిళగా మేకప్ లేకుండా కనిపించారు. ఈ సినిమాతో ఆమెకు కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. |
‘వరల్డ్ ఫేమస్ లవర్’తో తెలుగు వారిని ఆకట్టుకున్న నటి ఐశ్వర్యరాజేశ్. ఇందులో ఆమె కూడా సహజంగా కనిపించారు. బొగ్గు గనిలో పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి విజయ్ దేవరకొండ భార్య పాత్రలో పల్లెటూరి అమ్మాయి సువర్ణగా నటించారు. ఈ సినిమాలో ఐశ్వర్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రాంతి మాధవ్ దర్శకుడు. ఐశ్వర్య ఇప్పటికే పలు చిత్రాల్లో ఇదే తరహాలో నేచురల్‌గా కనిపించారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతోపాటు కమర్షియల్ సినిమాలతోనూ హిట్లు అందుకుంటున్న నయనతార ‘ఐరా’లో మేకప్ లేకుండా నటించారు. ఈ చిత్రానికి కె.ఎం. సర్జున్ దర్శకుడు. హారర్ కథాంశంతో రూపొందించిన చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై, మంచి టాక్ అందుకుంది. అదేవిధంగా మర్డర్ డ్రామా ‘దండుపాళ్యం 2’లో నటి సంజన లుక్ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి వరకు మోడ్రన్ గర్ల్‌గా కనిపించిన ఆమె ఒక్కసారిగా చిరిగిన చీర కట్టుకుని, రోడ్డు పక్కన కనిపించారు. ప్రత్యేకించి సంజన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. శ్రీనివాస రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలైంది. దండుపాల్యంకు చెందిన ముఠా నేరచరిత్ర ఆధాంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. |
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం