రివ్యూ: లక్ష్మి - Akshay Kumar Laxmii Movie hindi movie review
close
Updated : 10/11/2020 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రివ్యూ: లక్ష్మి

చిత్రం: లక్ష్మి

నటీనటులు: అక్షయ్‌కుమార్‌, కియారా అడ్వాణీ, శరద్‌ ఖేల్కర్‌ తదితరులు

సంగీతం: తనిష్‌ బాగ్చి, శశి-ఖుషి

నేపథ్య సంగీతం: అనూప్‌ కుమార్‌, అమర్‌ మోహిల్‌

సినిమాటోగ్రఫీ: పళణిస్వామి, ఖుష్‌ చబ్రియా

ఎడిటింగ్‌: రాజేశ్‌పాండే

నిర్మాత: తుషార్‌కపూర్‌, షబీనాఖాన్‌, ప్రఫుల్‌ సాలుంకే, సంపత్‌, యోగిరాజ్ ‌శెట్టి, రవీంద్ర ఠాకూర్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్‌

బ్యానర్‌: ఫాక్స్‌ స్టూడియోస్‌

విడుదల: డిస్నీ+హాట్‌స్టార్‌.. 09-11-2020

కాంచన (ముని-2).. తెలుగు/తమిళ భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం. రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్‌ కామెడీ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. లారెన్స్‌, శరత్‌కుమార్‌, కోవై సరళ తదితరులు తమదైన నటనతో నవ్వులు పంచుతూనే భయపెట్టారు. వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ వరుస చిత్రాలతో అలరిస్తున్న బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రలో ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. ‘లక్ష్మీబాంబ్‌’గా థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. టైటిల్‌ విషయంలో వివాదం తలెత్తడంతో ‘లక్ష్మి’గా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తెలుగు ‘కాంచన’కు హిందీ ‘లక్ష్మి’కి ఏమైనా మార్పులు చేశారా? రెండు వైవిధ్యమైన పాత్రల్లో అక్షయ్‌ ఎలా నటించారు?

కథేంటంటే: ఆసిఫ్‌ (అక్షయ్‌కుమార్‌) రష్మి(కియారా అడ్వాణీ) ప్రేమించుకుంటారు. పెద్దల నిర్ణయాన్ని కాదని పెళ్లి చేసుకుంటారు. ఆసిఫ్‌కు సొంతవాళ్లు ఎవరూ ఉండరు. మార్బుల్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. అదే సమయంలో మూఢ విశ్వాసాలపై పోరాటం చేస్తుంటాడు. దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తే గాజులు తొడుక్కుంటానని అందరితోనూ సవాల్‌ విసురుతాడు. మూడేళ్ల తర్వాత రష్మి తల్లి ఆమెకు ఫోన్‌ చేసి అల్లుడితో కలిసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఆసిఫ్‌ తన భార్యను తీసుకుని అత్తారింటికి వస్తాడు. అయితే, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో రష్మి తండ్రి ఆసిఫ్‌పై కోపంతో ఉంటాడు. ఒకరోజు చుట్టు పక్కల ఉన్న పిల్లలందరూ కలిసి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆసిఫ్‌ వారిని తీసుకుని ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్తాడు. ఆ స్థలంలో శవాన్ని పాతి పెట్టారని తెలియక వికెట్లు పాతుతాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. పిల్లలు భయంతో పారిపోతారు. ఆ వికెట్లను తీసుకుని ఇంటికి వచ్చిన ఆసిఫ్‌కు కుళ్లు వాసన రావడంతో నిమ్మగడ్డి ఉన్న కుండీలో వాటిని ఉంచి నీటితో శుభ్రం చేస్తాడు. అప్పటి నుంచి ఆసిఫ్‌ అత్తారింట్లో రోజుకో రకంగా వింతలు జరుగుతుంటాయి. ఒకరోజు ఆ నిమ్మగడ్డితో కాచిన టీని ఆసిఫ్ తాగుతాడు. అప్పటి నుంచి ఆసిఫ్‌ మహిళలా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అతడికి దెయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు నిర్ధారణకు వస్తారు. మరి ఆసిఫ్‌కు పట్టిన ‘లక్ష్మి’(శరద్‌ ఖేల్కర్‌)దెయ్యం కథ ఏంటి? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు ఆ దెయ్యం ఆసిఫ్‌ను వదిలి పెట్టిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: వెండితెరపై తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన చిత్రం ‘కాంచన’. ఇప్పటికీ టెలివిజన్‌లో ప్రసారమవుతుంటే కొద్దిసేపైనా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు. భయపెడుతూ నవ్వించడమే హారర్‌-కామెడీ చిత్రాలకు ఉన్న అడ్వాంటేజ్‌. తెరపై పాత్రలు భయపడుతుంటే దాని నుంచి వచ్చే హాస్యం మనకు వినోదాన్ని పంచుతుంది. తమిళ చిత్రంలో కామెడీ కాస్త అతి అనిపించినా, అంతర్లీనంగా ఇచ్చిన సందేశంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయగా, అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. దీంతో దర్శకుడు రాఘవ లారెన్స్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ప్రథమార్ధంలో చాలా మార్పులు చేశారు. కథను అత్తారింటికి షిఫ్ట్‌ చేశారు. అంతేకాకుండా కథానాయకుడి పాత్రను మూఢ విశ్వాసాలపై పోరాడే వ్యక్తిగా చూపించారు. తమిళ సినిమాల్లో కనిపించే ఓవరాక్షన్‌ లేకుండా సన్నివేశాలను ఇందులో రాసుకున్నారు.

ఎప్పుడైతే ఆసిఫ్‌ ఒంట్లోకి దెయ్యం ప్రవేశించిందో కథ మరో మలుపు తిరుగుతుంది. లక్ష్మిగా మారిన ఆసిఫ్‌ మహిళగా వింతగా ప్రవర్తించడం, ఇంట్లో వాళ్లను భయపెట్టడం అలరిస్తుంది. ఆసిఫ్‌కు దెయ్యం పట్టినట్లు తెలుసుకునేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించే తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. ఆసిఫ్‌కు పట్టిన దెయ్యం లక్ష్మి ఎవరు? ఆమె కథ ఏంటి? ఎలా హత్యకు గురైందన్న విషయం తెలిసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడూ భావోద్వేగానికి గురవుతాడు. లక్ష్మిని హత్య చేసిన వారిపై ఆసిఫ్‌ సాయంతో ఆమె ఎలా పగ తీర్చుకున్నది అనేది మిగిలిన కథ. మాతృక ‘కాంచన’ను కొద్ది మార్పులతో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు లారెన్స్‌. పాత్రలు, ప్రథమార్ధంలో కథా నేపథ్యం మినహా పెద్దగా మార్పుల జోలికి వెళ్లలేదు. 2011లో వచ్చిన ‘కాంచన’ చిత్రాన్ని అక్షయ్‌ ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నారో ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఇప్పటికే ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లోనే, ఓటీటీ వేదికగానో ఎంతో మంది చూసి ఉంటారు. అలాంటప్పుడు ఈ కథను ఎంచుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఏమీ కనపడలేదు. బహుశా ఇలాంటి పాత్ర కూడా ఒకటి చేస్తే బాగుంటుందని అక్షయ్‌ భావించి ఉండవచ్చు. ఇప్పటివరకూ హిందీ ప్రేక్షకులు మాతృక(కాంచన)ను చూసి ఉండకపోతే ‘లక్ష్మి’ అలరిస్తుంది.

ఎవరెలా చేశారంటే: యువ కథానాయకులకు పోటీగా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు అక్షయ్‌కుమార్‌. ఏడాదిలో నాలుగైదు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. గతంలో ఆయన ‘విక్రమార్కుడు’ రీమేక్‌ ‘రౌడీ రాథోడ్‌’లో నటించి మెప్పించారు. ఇప్పుడు ‘కాంచన’లో వైవిధ్యమైన నటన కనబరిచారు. ఆసిఫ్‌గా, లక్ష్మిగా ఆయన నటన హైలైట్‌. చీరకట్టు కోవడం, మహిళలా హావభావాలు పలికించడం, వయ్యారంగా నడవటం ఇలా ప్రతి సన్నివేశంలో ఆయన నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ‘భం భోలే శివ’ పాటలో అక్షయ్‌ నృత్యం అలరిస్తుంది. కేవలం యాక్షన్‌ చిత్రాలే కాదు, ‘లక్ష్మి’లాంటి విభిన్న పాత్రల్లోనూ తాను మెప్పించగలనని మరోసారి నిరూపించారు. కియారా అడ్వాణీ అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర శరద్‌ ఖేల్కర్‌. మాతృకలో శరత్‌కుమార్ పోషించిన హిజ్రా పాత్రను ఆయన పోషించారు. తనదైన హావభావాలు, నటనతో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. తనిష్‌ బాగ్చి పాటలు బాగున్నాయి. హారర్‌ చిత్రాలకు నేపథ్య సంగీతమే బలం. ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెట్టేందుకు, సన్నివేశాలు మరింత రక్తికట్టడంలో దీనిదే కీలకపాత్ర. అనూప్‌ కుమార్‌, అమర్‌ మోహిల్‌ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. పళణి స్వామి సినిమాటోగ్రఫీ బాగుంది. విదేశాల్లో తెరకెక్కించిన పాటలు బాగున్నాయి. అదే సమయంలో భయపెట్టే సన్నివేశాలను చక్కగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి సినిమాలను తీయడం దర్శకుడు రాఘవ లారెన్స్‌కు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆయనకు ‘ముని’ సిరీస్‌లో నాలుగు సినిమాలు తీశారు. దర్శకుడిగా బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాన్ని ఆయన చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ప్రథమార్ధంలో కథా నేపథ్యాన్ని మార్చడంతో పాటు, ‘కాంచన’లో ఉన్న ఓవర్‌ కామెడీ జోలికి పోలేదు. బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేశారు.

బలాలు బలహీనతలు
+ అక్షయ్‌కుమార్‌, శరద్‌ ఖేల్కర్‌ - అందరికీ తెలిసిన కథే కావటం
+ సాంకేతిక బృందం పనితీరు - నెమ్మదిగా సాగే ప్రథమార్ధం

చివరగా: కేవలం అక్షయ్‌ కోసమే ఈ ‘లక్ష్మి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని