తన సపోర్ట్‌ లేకపోతే సూసైడ్‌ చేసుకునేవాళ్లం - Alitho Saradaga Special Chat show with Sai Kumar and Aadi
close
Updated : 29/07/2020 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన సపోర్ట్‌ లేకపోతే సూసైడ్‌ చేసుకునేవాళ్లం

ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా అతను ప్రవేశిస్తే సంచలనం..

భాష ఏదైనా, హీరో ఎవరైనా అతను గొంతు సాయం చేస్తే ఆ పాత్ర చిరస్థాయి జ్ఞాపకం..

అతను కనపడని నాలుగో సింహం అయినా, కనిపించే  మూడు సింహాల కన్నా పవర్‌ ఎక్కువ.. పౌరుషం ఎక్కువ... అంతేకాదు, వెండితెరపై అతని నటనను చూసి, వావ్‌.. అన్న గుండెలు ఎన్నో... బుల్లితెరపై అతని ప్రదర్శన చూసి, మనోడు అనుకున్న మనసులు ఇంకెన్నో... ఆయనే డైలాగ్‌ కింగ్‌ అనిపించుకున్న సాయికుమార్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన తల్లిదండ్రులు, సినీ కెరీర్‌ ఇలా ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఈ షోకు రావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?

సాయికుమార్‌: రావాలని నాకూ ఉండేది. నేను టైమ్‌ను నమ్ముతా. ఆ సమయం వస్తే కానీ ఏదీ జరగదు. అదే విధంగా తెలియని భయం కూడా ఉంది. ఎందుకంటే నేను ఏంటన్నది అందరికీ తెలుసు. నా లోపల ఉన్న వ్యక్తి నీకు మాత్రమే తెలుసు. అవన్నీ బయటకు లాగితే.. (వెంటనే ఆలీ అందుకుని.. అన్నీ విషయాలు బయటకు లాగుతా.. అందుకే ఈ షోకు పిలిచా)

మీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మీరు బాగా ప్రేమించే వ్యక్తి ఎవరు?

సాయికుమార్‌: తప్పకుండా నా భార్య సురేఖ. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. నేను పెద్ద కొడుకుని. అమ్మ తర్వాత తల్లిగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదే!

మీ అమ్మానాన్నలది ప్రేమ వివాహమట కదా! ఎలా కలిశారు?

సాయికుమార్‌: అమ్మానాన్న సినిమా ఇండస్ట్రీని ఇరగదీసేద్దామని వచ్చారు. ఇద్దరూ స్టేజ్‌ ఆర్టిస్ట్‌లే. నాన్న లిమిటెడ్‌ యాక్టర్‌. ఆయనలో తెలియని గాంభీర్యం ఉంటుంది. అమ్మ ఏ పాత్రనైనా అలవోకగా చేసేస్తారు. నాన్న కళ్లేపల్లి అగ్రహారం నుంచి, అమ్మ కర్ణాటకలోని భాగేపల్లి నుంచి చెన్నై చేరుకున్నారు. అప్పట్లో అమ్మకు ఆంగ్లో ఇండియన్‌ అసిస్టెంట్‌లు కూడా ఉండేవారు. ఆవిడకు హార్స్‌రైడింగ్‌ కూడా వచ్చు. ఆ స్థాయిలో ఉన్న అమ్మను నాన్న తన ప్రేమతో పడేశారు. ‘అనార్కలి’ వేషంలో అమ్మను చూసి నాన్న ఇష్టపడ్డారు. 1960 వరకూ ఆమె నటించారు. ఆ తర్వాత నాన్న ప్రేమకు ఓకే చెప్పి, పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లికి నాన్న వాళ్ల కుటుంబం ఒప్పుకోలేదు. తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మేము పుట్టాం. అప్పట్లో నాన్న చాలా బిజీ. ఆయన గొంతు వల్ల వరుసగా డబ్బింగ్‌ అవకాశాలు వచ్చాయి. అమ్మ కూడా చాలా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. అయితే పెద్ద ఫ్యామిలీ కావడంతో గడవడానికి కష్టంగా ఉండేది. మాకు అన్నం పెట్టి తను పస్తులు ఉండేది. నాకు ఊహ తెలుసు కాబట్టి అవన్నీ అర్థమయ్యేవి. అలాంటప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారిని సాయం అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ నాన్నకు ఇష్టం ఉండేవి కావు.

సురేఖను బయటకు తీసుకెళ్తానంటే మీ మామయ్య కంగారు పడ్డారట!

సాయికుమార్‌: నేను ఎక్కడ  చెడ్డదారి పడతానోనని ఒక స్నేహితురాలిగా అమ్మ ఎన్నో మంచి విషయాలు చెప్పేది. చివరకు నా మేనత్త కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నా. మా నిశ్చితార్థం అయిన తర్వాత  తనని బయటకు తీసుకెళ్తానంటే మా మామగారు కంగారు పడ్డారు. సినిమా వాళ్ల మీద అప్పట్లో ఒక రకమైన అభిప్రాయం ఉండేది కదా! ‘గుడికి తీసుకెళ్తానులెండి’ అంటే పంపారు. మేము గుడికి వెళ్లి కూర్చొన్న తర్వాత నా కళ్ల వెంట నీళ్లు రావడం మొదలయ్యాయి. ‘సురేఖ.. నేను ఎంత సంపాదించినా అది మా అమ్మకే ఇస్తా. మా నాన్న నాకు అన్నీ గైడ్‌ చేస్తారు. మాది పెద్ద కుటుంబం. మనం విడిగా ఉండటం కుదరదు. నీకుండే ప్రాముఖ్యత నీకు తప్పకుండా ఉంటుంది. ఏనాటికైనా మా అమ్మ స్థానం నీదే’ అని చెప్పా. అప్పటి నుంచి అమ్మలేని లోటు తనే తీర్చింది.

మీ కెరీర్‌ను సురేఖ ఎలా సపోర్ట్‌ చేశారు!

సాయికుమార్‌: ‘ఈశ్వర్‌ అల్లా’ సమయంలో సురేఖ సపోర్ట్‌ చేయకపోతే మా ఫ్యామిలీ అంతా  ఆత్మహత్య చేసుకునేవాళ్లం. ‘నేను సూసైడ్‌ చేసుకుంటా’ అని నాన్న ఫోన్‌లో నాతో అన్నారు కూడా. అప్పుడు నేను నా చెల్లెలు కమల ఇంట్లో ఉన్నా. నా దురదృష్టం ఏంటంటే.. ‘పోలీస్‌స్టోరీ’ మంచి విజయం సాధించిన తర్వాత నా ప్లానింగ్‌ మిస్సయింది. అప్పుడు సురేఖ లేకపోతే నాన్నను పోగొట్టుకునేవాడిని. అప్పట్లో ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తిట్టిన వాళ్లూ ఉన్నారు. ‘అనవసరంగా సినిమా తీశారు’ అంటూ మాట్లాడితే బాధగా ఉంటుంది కదా! దాన్ని అంత ఈజీగా తీసుకోలేం. ‘శర్మ కూడా సినిమా తీస్తే.. ఇలాగే ఉంటుంది’ అన్న మాటలు వినిపించాయి. ఆ రోజుల్లో రెండు కోట్ల ప్రాజెక్టు. మంచి పాటలు.. నటులు కూడా ఉన్నారు. అయితే, అందులో నాన్న విలన్‌గా చేయడం మేము వేసిన రాంగ్‌స్టెప్‌. ఎందుకంటే క్లైమాక్స్‌లో నేను నాన్నను కొడుతుంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. తండ్రీ కొడుకులన్న ఫీల్‌ ఉంటుంది. బయ్యర్ల కోసం సినిమా వేశారు. ఎవ్వరికీ నచ్చలేదు. చాలా టెన్షన్‌ పడ్డాం. చాలామందికి డబ్బులు కట్టాలి.

అప్పుడు నాన్న ఫోన్‌ చేసి, ‘ఇప్పటి వరకూ నా జీవితం ఒకటి. మీరంతా కలిసి నన్ను రోడ్డుమీదకు తీసుకొచ్చారు. కాబట్టి రేపు సినిమా విడుదల కాకపోతే నేను చచ్చిపోతా’ అన్నారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మా ఇద్దరి సంభాషణలో మరో గదిలో ఉన్న నా భార్య సురేఖ ఇంకో ఫోన్‌లో వింటూ ఉన్నది. ఆ మరుసటి రోజు పంచాయతీకి సురేఖ వచ్చింది. దాసరిగారు మాట్లాడుతూ.. ‘నీ భర్తలో మంచి టాలెంట్‌ ఉంది. రెండు కోట్లే కదా! రిస్క్‌ చేయండి. మరో మార్గం ద్వారా అవి వస్తాయి. అవసరమైతే సాయితో నేను సినిమా చేస్తా’ అని మాలో ధైర్యాన్ని నింపారు. ఆ రెండు కోట్ల అప్పులు తీర్చడానికి ఆరేడేళ్లు పట్టింది. ఆ తర్వాత నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు అప్పులు కడుతూనే ఉన్నా. నీకు(ఆలీ)ఏమైనా డబ్బులు బాకీ ఉన్నామా? ఒక వేళ ఉన్నా, నువ్వు అడిగేవాడివి కాదులే(నవ్వులు) (వెంటనే ఆలీ అందుకుని.. శర్మగారిని చూస్తే ఒక తండ్రి చూసిన భావన కలిగేది)

ఇటీవల ఎన్నికల అఫిడవిట్‌ సమర్పిస్తే, దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాకు ఎన్నో కోట్ల ఆస్తి ఉందనుకుంటున్నారు. కానీ, ఐదు కోట్లు కూడా దాటలేదు. ‘ఈశ్వర్‌ అల్లా’ తర్వాత చేసిన 15 సినిమాల రెమ్యునరేషన్‌తో అప్పులు తీర్చా. అమెరికా వెళ్తే, డబ్బులు ఎగ్గొట్టి వెళ్లానని నాకు నోటీసులు పంపారు. పోలీసులు నా దగ్గరకు వచ్చి ‘సర్‌ మీరు చేసిన సినిమాలు చూసి మేము పోలీసులం అయ్యాం. కోర్టుకు రాకండి’ అనేవారు. అందరి ఆశీర్వాదల వల్ల ఆ అప్పుల నుంచి బయటపడ్డా.

ఆ సినిమాకు దాసరి వచ్చి క్లాప్‌ కొడితే, సింగిల్‌ టేక్‌లో డైలాగ్‌ చెప్పినట్లు ఉన్నారు?

సాయికుమార్‌: అవును! ఓపెనింగ్‌కే అంత భారీ డైలాగ్‌ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయారు.

మీ తమ్ముళ్లు, చెల్లెళ్ల గురించి..?

సాయికుమార్‌: కమల సంగీత విద్వాన్‌. ప్రియ మంచి డ్యాన్సర్‌. ఆమెది ప్రేమ వివాహం. రవి, అయ్యప్పల గురించి అందరికీ తెలిసిందే. వారిద్దరూ కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. నన్ను కూడా చాలామంది ప్రేమించారు. వాళ్లెవరో నీకూ(ఆలీ) తెలుసు. కొందరు చిన్ననాటి స్నేహితులను ఇప్పటికీ కలుస్తుంటా.

మీ నాన్న బర్త్‌డే రోజున మందు బాటిల్‌ గిఫ్ట్‌గా ఇచ్చారట!

సాయికుమార్‌: ఒక పెద్ద స్టార్‌ సినిమా 100రోజులు ఆడింది. తిరుపతిలో ఫంక్షన్‌. నాన్న అందులో ఒక వేషం వేశారు. తనని కూడా రమ్మన్నారు. ఆయన నన్ను పిలిచి ‘నువ్వు కూడా రా’ అన్నారు. నేను రానని చెప్పా. ‘లేదు అందరం విమానంలో వెళ్తున్నాం. ఉదయాన్నే ఆఫీస్‌కు రమ్మన్నారు’ అని అన్నారు. ఆటోలో ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ లేరు. సాంకేతిక నిపుణులు వెళ్లే బస్సు మాత్రమే ఉంది. ఏమైందని అడిగితే ‘ఉదయాన్నే అందరూ విమానంలో వెళ్లిపోయారు. మిమ్మల్ని బస్సులో రమ్మన్నారు’ అన్నారు. అంతే నాన్న అలిగారు. ఎలాగో ఆయన్ను బతిమాలి బస్సులో తీసుకెళ్లా. తీరా అక్కడకు వెళ్తే, భారీగా జనం రావడంతో ఫంక్షన్‌ అనుకున్నంత బాగా జరగలేదు. వెంటనే ముగించారు.

ఆ తర్వాత తిరుపతికి కొద్దిదూరంలో మూన్‌లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. వెళ్లేటప్పుడు ఎవరికీ విమానం లేదు. సూపర్‌ డీలక్స్‌ బస్సు పెట్టారు. అందరం డిన్నరకు వెళ్లాం. అయితే, మమ్మల్ని గేటు బయట ఆపేసి, ‘మీరు  ఇక్కడకు రావొద్దు. ఉదయం వచ్చిన బస్సులో వెళ్లిపోండి’ అని ఒక స్టార్‌ ప్రొడ్యూసర్‌ అన్నాడు. నాన్నకు కన్నీళ్లు ఆగలేదు. ‘సర్‌.. నేను ఈ ఫంక్షన్‌కు అర్హుడిని కాదు. దయచేసి నాన్నను పంపండి. కావాలంటే నేను ఆ బస్సులో వెళ్లిపోతా’ అని చెప్పినా వినిపించుకోలేదు. బాధతోనే బస్సు ఎక్కిన నాన్నకు మరో షాకిచ్చారు. అన్నం పొట్లాం, మందు బాటిల్‌ ఇచ్చి, ‘పండగ చేసుకోండి’ అన్నారు. నాన్న కోపంతో ఆ మందు బాటిల్‌ను నేలకేసి కొట్టారు. ‘స్కాచ్‌ తాగడానికి నేను అర్హుడిని కాదనమాట’ అంటూ ఎంతో బాధపడ్డారు. అప్పుడే అనుకున్నా ఎప్పటికైనా నాన్నకు స్కాచ్‌ కొనివ్వాలని. అమెరికా వెళ్లినప్పుడు అప్పట్లో 100 డాలర్ల పెట్టి ‘బ్లూలేబుల్‌’ స్కాచ్‌ కొన్నా. ఇది చూసిన గుమ్మడిగారు ‘భలే కొడుకువయ్యా’ అన్నారు!

‘తరంగణి’ చిత్రానికి డబ్బింగ్‌ చెబితే మంచి పేరొచ్చిందట!

సాయికుమార్‌: అవును! ఆ చిత్రానికి రూ.500 ఇచ్చారు. ఆ తర్వాత రూ.250 రెమ్యునరేషన్‌ పెంచితే నన్ను తీసేశారు. ఇండస్ట్రీని నమ్ముకున్నందుకు ఇప్పుడు అందరం బాగున్నాం. నాన్న పరాజయాలు చవి చూడటం వల్ల నా పరిస్థితి కూడా అదే అవుతుందని భయపడ్డారు. అందుకే చదువుకోమని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు పూర్తయింది. ఈ క్రమంలోనే డబ్బింగ్‌లు చెప్పటం అలవాటైంది. ఏవీఎన్‌ మూర్తి అనే సింగర్‌ తొలిసారి డాక్యుమెంటరీ చేయించారు. అందుకు రూ.250 ఇచ్చారు. అమ్మ చాలా సంతోషపడింది. ఆ తర్వాత ‘తరంగిణి’ ఆఫర్‌ వచ్చింది. ‘సుమన్‌ అని కొత్త ఆర్టిస్ట్. ఈ సినిమా హిట్టయితే మంచి హీరో అవుతాడు. అతనికి డబ్బింగ్‌ నువ్వు చెప్పొచ్చు’ అని పొట్టి పంతులు అనే ఆయన నన్ను తీసుకెళ్లారు. నా వాయిస్‌ టెస్ట్‌ చేశారు. కోడిరామకృష్ణ అగ్రిమెంట్‌ రాయించుకుని రూ.500 ఇచ్చారు. 14రోజుల పాటు డబ్బింగ్‌ చెప్పా. ఆ తర్వాతి సినిమాకు రూ.250 పెంచితే నన్ను తీసేశారు. లక్ష్మీకాంత్‌ అనే నటుడు డబ్బింగ్‌ చెప్పాడు. అది ఆడలేదు. దాంతో ‘పండంటి కాపురానికి 12 సూత్రాలు’ అనే చిత్రానికి రూ.1,116 ఇచ్చి మళ్లీ నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వెయ్యి నూట పదహార్లతో మొదలై ఇటీవల రాజశేఖర్‌ సినిమాకు రూ.10లక్షల వరకూ రెమ్యునరేషన్‌ తీసుకున్నా.

మొత్తం ఎన్ని సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు?

సాయికుమార్‌: దాదాపు వెయ్యికు పైగా చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పా. నాకు నచ్చకపోతే చేసేవాడిని కాదు. రాకేష్‌ రోషన్‌ ‘కరణ్‌ అర్జున్‌’ అనే సినిమా తీశారు. సల్మాన్‌-షారుఖ్‌లు నటించారు. బాలుగారి థియేటర్‌లో డబ్బింగ్‌ జరుగుతోంది. ‘దక్షిణాదిలో డబ్బింగ్‌ చెప్పేవాళ్లలో ఇద్దరే సూపర్‌స్టార్‌లు. ఒకరు సాయికుమార్‌.. మరొకరు రత్నకుమార్‌(ఘంటసాల తనయుడు)’ అని ఆయనకు చెప్పారట. దాంతో రూ.25వేలు ఆఫర్‌ చేశారు. నాకు ఎవరైనా ఆఫర్‌ ఇచ్చి అడ్వాన్స్‌ ఇస్తే నా భార్య సురేఖ వాటిని వాడేది కాదు. ఎందుకంటే ఒక వేళ నేను డబ్బింగ్‌ చెప్పకపోతే వచ్చి తీసుకుపోతారని భయం. మరుసటి రోజు నేను థియేటర్‌కు వెళ్లా. షారుఖ్‌కు డబ్బింగ్‌ చెప్పటం మొదలు పెట్టా. ఎన్ని రకాలుగా చెప్పిన నప్పటం లేదు. ఇదే విషయాన్ని రాకేశ్‌ రోషన్‌కు చెబితే, ‘నాకూ అదే ఫీలింగ్‌. మీ జడ్జిమెంట్‌ ఇంత కరెక్ట్‌గా ఉండటం వల్లే మంచి పేరు తెచ్చుకున్నారు’ అని కితాబిచ్చారు. ‘ఖుదాగవా’కు అమితాబ్‌గారి డబ్బింగ్‌ చెప్పా! ‘సినిమాకు నువ్వు చెప్పిన డబ్బింగ్‌ విని నా అంత హైట్‌ ఉంటావనుకుంటే నువ్వేంటి ఇంతే ఉన్నావు’ అని సరదాగా అమితాబ్‌ అన్నారు.

ఎన్ని అవార్డులు వచ్చాయి!

సాయికుమార్‌: ఒక్కటి కూడా రాలేదు. ఎందుకంటే నేను డబ్బింగ్‌ చెప్పినప్పుడు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు అవార్డులు లేవు. ఇదే విషయాన్ని జ్యూరీలో ఉన్న గుమ్మడిగారికి చెబితే, ఆయన సిఫారసు చేశారు. అది అమలయ్యే సమయానికి నేను డబ్బింగ్‌లు మానేశా.

‘పోలీస్‌స్టోరీ’కి మొదట హీరో మీరు కాదట!

సాయికుమార్‌: ‘లాకప్‌డెత్‌’ సినిమా చేస్తున్న సమయంలో థ్రిల్లర్‌ మంజుగారు పరిచయం అయ్యారు.  కన్నడలో పోలీస్‌ సినిమాలంటే శంకర్‌నాగ్‌, ఆ తర్వాత దేవరాజ్‌లకు మంచి పేరుంది. దేవరాజ్‌తో చాలా సినిమాలు చేశా. ఈ కథ ఆయన చేయాల్సింది. కానీ కుదరలేదు. కథ విన్న తర్వాత నన్ను కూడా చేయమంటారేమో అనుకున్నా. కానీ, అడగలేదు. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలను కూడా అనుకున్నారు. వాళ్లూ సెట్‌ కాలేదు. ‘ఎవరితో చేస్తారు మాస్టర్‌’ నేనే అని అడిగా. ‘ఇది వన్‌సైడ్‌ కథ. హీరోయిన్‌, పాటలు, రొమాంటిక్‌ సీన్లు ఉండవు. అందుకే కుమార్‌ గోవింద్‌ను అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయా.

అదే సమయంలో అమ్మ నన్ను పుట్టపర్తి తీసుకెళ్లింది. బాబా బర్త్‌డే సెలబ్రేషన్‌లో నేను, సునీల్‌ గావస్కర్‌గారు, ఆల్విన్‌ కల్చరన్‌(వెస్టిండీస్‌) అంతా కంపీరింగ్‌ చేస్తున్నాం. అమ్మ నన్ను పిలిచి ‘బాబాగారికి నీ కోరికలు ఓ లెటర్‌పై రాసి ఇవ్వు. ఆయన తీసుకుంటే అన్నీ అయిపోతాయి’ అని చెప్పింది. ఏవేవో రాసి, ‘మా అమ్మానాన్నలు నా సక్సెస్‌ చూడాలి. నటుడిగా నాకు మంచి పొజిషన్‌ ఇవ్వండి’ అని కూడా రాసి ఇచ్చా. అంతా అయిపోయిన తర్వాత అందరికీ బట్టలు పెడుతున్నారు. నా దగ్గరకు వచ్చే సరికి ‘ఏరా బంగారం నీకెలాంటి బట్టలు కావాలి’ అని అడిగారు. ‘మీ ఇష్టం బాబా’ అని చెప్పా. పురుషులకు పంచెలు, మహిళలకు చీరలు ఇస్తుంటే నాకు మాత్రం ఒక సఫారీ సూట్‌ ఇచ్చారు. ‘ఐఏఎస్‌, ఐపీఎస్‌లా ఇవి వేసుకుంటే నీకు బాగుంటుంది’ అన్నారు. నాకు అర్థం కాలేదు. సర్లేనని తీసుకున్నా. ఇదే విషయాన్ని అమ్మకు చెబితే ‘వాళ్ల మాటల్లో ఏదో పరమార్థం ఉంటుంది’ అన్నారు.

ఇక నేను నా షూటింగ్‌ పనుల్లో బిజీ అయిపోయా. ‘సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌’ క్లైమాక్స్‌లో నా పాత్ర చనిపోతుంది. సాధారణంగా షూటింగ్‌ చేసేటప్పుడు ఎవరైనా చనిపోయినట్లు సన్నివేశం తీస్తే, అంతా అయిపోయిన తర్వాత కెమెరాను చూసి నవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నేను కూడా ఆ సీన్‌ అయిపోయిన తర్వాత కెమెరా వంక చూస్తూ నవ్వాను. సడెన్‌గా థ్రిల్లర్‌ మంజు మాస్టర్‌ నా దగ్గరకు వచ్చి, ‘పాత సాయి చచ్చిపోయాడు. అగ్నిగా కొత్తసాయి పుడతాడు. నీకో బ్యాడ్‌ న్యూస్‌ ‘పోలీస్‌స్టోరీ’లో నువ్వు హీరో’ అని చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన జోక్‌ చేశారేమో అనుకున్నా. మరుసటి రోజు పిలిస్తే వెళ్లి కథ విన్నా. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ‘ఈ సినిమా హిట్టయితే సినిమాలు చేస్తా. లేకపోతే ఇక చేయను’ అని చెప్పేశా. అద్భుతమైన స్పందన వచ్చింది.

(మధ్యలో సాయికుమార్‌ తనయుడు ఆది వచ్చి షోలో జాయిన్‌ అయ్యారు)

ఇంతకంటే మంచి కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్‌ అయ్యావా?

ఆది: ఎప్పుడూ అలా ఫీల్‌ కాలేదు. నా అసలు పేరు ఆదిత్య. తొలి సినిమా ప్రొడ్యూసర్‌ పేరు మారిస్తే బాగుంటుందని సలహా ఇస్తే ‘ఆది’గా మార్చుకున్నా.

ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు.

ఆది: ‘బ్లాక్‌’ అనే సినిమాతో పాటు ‘శశి’ అనే మరో సినిమా చేస్తున్నా. దాదాపు అయిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ‘జంగిల్‌’ అనే మరో సినిమా చేస్తున్నా.

మీరు క్రికెట్‌ బాగా ఆడతారు. మరి సినిమా ఫీల్డ్‌కు ఎందుకు వచ్చారు?

ఆది: పదో తరగతి అయిపోయిన తర్వాత డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటానని చెబితే నాన్న లారెన్స్‌ మాస్టర్‌ దగ్గర జాయిన్‌ చేశారు. అక్కడ నేర్చుకుంటూ ఉండగా, సినిమాలపై ఆసక్తి పెరిగింది. అయితే, అండర్‌-19 క్రికెట్‌లో ప్రజ్ఞాన్‌ ఓజా, రాయుడులతో కలిసి ఆడా.

సాయికుమార్‌: ఆది అటు అండర్‌-19 క్రికెట్‌ ఆడాడు. ఇటు సినిమాల్లోకి వచ్చాడు. నా కుమార్తె జ్యోతి డాక్టర్‌ అయింది. ‘కలికాలం’ సినిమా ఫంక్షన్‌ జరిగితే దానికి ఆది వెళ్లాడు. చిరంజీవిగారు ఎత్తుకుని షీల్డ్‌ ఇచ్చారు.

నీ తండ్రికి ‘డైలాగ్‌ కింగ్‌’ అని పేరుంది. అది కాకుండా నువ్వొక టైటిల్‌ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు?

ఆది: మోస్ట్‌ సెల్ఫ్‌లెస్‌ పర్సన్‌. ఆయన గురించి కంటే పక్కవాళ్ల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మా కుటుంబం ఈ స్థితిలో ఉన్నామంటే నాన్నగారి వల్లే. ఆయనకుండే టాలెంట్‌కు ఇంకా పెద్ద స్టార్‌ అవ్వాల్సింది.

మీరు పాటల కంటే ఫైట్‌లు ఎక్కువ చేశారనుకుంటా!

సాయికుమార్‌: 100 సినిమాలు చేస్తే 500 ఫైట్స్‌ చేసి ఉంటాను. పాటలంటే నాకు వణుకు వచ్చేస్తుంది. డ్యాన్స్‌ పెద్దగా చేయలేను. ‘అంతఃపురం’ చిత్రంలో సౌందర్యతో చేసిన సాంగ్‌లాంటివి అయితే ఓకే! ‘అసలేం గుర్తుకురాదు..’ పాటను ఆదితో రీమిక్స్‌ చేయాలని ఆలోచన ఉంది.

ఆది: ఈ పాట ఎప్పుడు వచ్చినా అమ్మ చూడదు(నవ్వులు)

మీ నాన్న(సాయి) నిన్ను ఎప్పుడైనా కొట్టారా?

సాయికుమార్‌: వీడే(ఆది) నన్ను కొట్టడానికి వచ్చాడు. కోపంతో ఊగిపోతూ ఆఖరికి గోడను కొట్టేసి వెళ్లిపోయాడు.(నవ్వులు)

ఆది: అది కావాలని చేయలేదు. వింబుల్డన్‌ చూస్తుంటే  నాన్న, జ్యోతి వచ్చి నన్ను ఆటపట్టించడం మొదలు పెట్టారు. దాంతో కోపం వచ్చి, నాన్న మీదకు వెళ్లిపోయి, చివరకు గోడను కొట్టేసి వెళ్లిపోయా.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని