ఈ విషయం ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు - Alitho Saradaga chat show with Bandla Ganesh
close
Updated : 03/09/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ విషయం ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు

శ్రమించు.. తపించు.. నిరూపించు.. నటించు.. నవ్వించు.. నిర్మించు. ఈ పదాలకు ప్రాణం పోస్తే అతను. ఈ పదాలకు రూపం వస్తే అతను. తనలోని టాలెంట్‌తో తనని తాను నిర్మించుకుని నటుడయ్యాడు. ఎదుటివారిలోని టాలెంట్‌ను క్వాలిటీగా సినీ ప్రపంచానికి అందించే నిర్మాత అయ్యాడు. ఆయనే బండ్ల గణేశ్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

నిర్మాత.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. యాక్టర్‌‌.. బండ్ల గణేశ్‌ అని పిలవాలా? లేక ఇంకో పేరు ఉంది దానితో పిలవాలా?

బండ్ల గణేశ్‌: మీ తమ్ముడు గణేశ్‌ అని పిలవండి. దిల్లీకి రాజైనా ఆలీకి తమ్ముడు..(నవ్వులు)

మనిద్దరం ఎప్పుడు కలిశామో గుర్తుందా?

బండ్ల గణేశ్‌: 31ఏళ్ల కిందట కలిశాం అనుకుంటా. పద్మాలయా స్టూడియోలో రామానాయుడిగారి సినిమా ‘ప్రేమఖైదీ’ సందర్భంగా కలిశాం. అప్పుడే ఇనిస్టిట్యూట్‌లో చదువు ముగిసింది. సినిమాలో పిల్లలు కావాలని అడిగితే, మేం వచ్చాం. అదే నా జీవితంలో తొలిసారి సినిమా షూటింగ్‌కు వెళ్లడం. డైరెక్టర్‌ గారితో మాట్లాడి నేను పాటలో కనపడే అవకాశం కూడా ఇప్పించావు. ఇద్దరం కలిసి ఒక రూమ్‌లో ఉందామని అనుకున్నాం. నేను మధురానగర్‌లో ఇల్లు కూడా చూశా. కానీ, నువ్వు నా కన్నా ముందు స్టార్‌.. సూపర్‌స్టార్వి అయిపోయావు. నా బండి మొదలవడం కాస్త లేటు.

మీ సొంతూరు ఏది?

బండ్ల గణేశ్‌: నాన్నది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తెలగాయపాలెం గ్రామం. నాకు ఏడాది వయసున్నప్పుడే కర్ణాటక వెళ్లిపోయాం. 1983 వరకూ అక్కడే ఉన్నాం. ఆ తర్వాత షాద్‌నగర్‌ వచ్చేశాం. ఒకప్పుడు షాద్‌నగర్‌ గణేశ్‌ అంటే బాగా తెలిసేది. ఇప్పుడు బండ్ల గణేశ్‌ అంటే గుర్తు పడుతున్నారు. 

ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది?

బండ్ల గణేశ్‌: చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉండేది. ఇంటర్మీడియట్‌ తప్పా. పదో తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్‌ వచ్చి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేరా. ‘ప్రేమఖైదీ’ చేసిన తర్వాత షాద్‌నగర్‌ వెళ్లిపోయి, ఇంటర్మీడియట్‌ చేరా. రెండేళ్ల తర్వాత అన్ని సబ్జెక్ట్‌లు తప్పా. ఇక చదువు నా వల్ల కాదని మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చి జీవిత నావను నడపడం మొదలు పెట్టా.

మరి ఒడ్డుకు చేరినట్లేనా?

బండ్ల గణేశ్‌: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా! జీవితం ప్రకృతి లాంటిది. ఎండాకాలం.. వర్షాకాలం..శీతాకాలం ఉంటాయి.

ఇండస్ట్రీలో నీ ప్రయాణం ఎలా సాగింది?

బండ్ల గణేశ్‌: తొలుత నటుడిని అయ్యాను. ఆ తర్వాత మేనేజర్‌గా ‘వజ్రం’, ‘చినరాయుడు’ చిత్రాలకు పనిచేశా. ఒకసారి నేను, శ్రీకాంత్‌ షిర్డీ వెళ్తే, అక్కడికి ఎస్వీ కృష్ణారెడ్డి గారు వచ్చారు. మాటల సందర్భంలో నాకు వేషం ఇస్తానని చెప్పారు. అలా ‘వినోదం’లో నాకు మంచి పాత్ర దక్కింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయితే నేనెప్పుడూ కష్టాలు పడుతూనే ఉన్నా. ఫలానా పాత్రకు గణేశ్‌ కావాలన్న సందర్భం ఒక్కటి కూడా రాలేదు.

మరి నిర్మాత ఎందుకు కావాల్సి వచ్చింది?

బండ్ల గణేశ్‌: నేను అవ్వాలని అనుకోలేదు. దేవుడు లాంటి పవన్‌కల్యాణ్‌గారు నన్ను నిర్మాతను చేశారు. ఆయనతో నా ప్రయాణం సాగుతుంటే ‘గణేశ్‌ నిన్ను నిర్మాతను చేస్తా’ అన్నారు. ఆ తర్వాత వెళ్లి పూరి జగన్నాథ్‌ను కలిస్తే, వెంటనే ఒప్పుకొన్నారు. ప్రకటన కూడా చేశాం. అయితే, ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. మధ్యలో ఎన్నికలు రావడంతో పవన్‌ బిజీ అయిపోయారు. దీంతో రవితేజతో ‘ఆంజనేయులు’ తీశా. నాకు బాగానే డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ‘తీన్‌మార్‌’ ఆఫర్‌ ఇచ్చారు.

‘తీన్‌మార్‌’ ఫెయిల్‌ కావడం వల్ల బండ్ల గణేశ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ ఇచ్చానని చెప్పారు నిజమేనా?

బండ్ల గణేశ్‌: 100శాతం నిజం. ‘తీన్‌మార్‌’ షూటింగ్‌ జరుగుతుండగా, ‘దబాంగ్‌’ మంచి హిట్టయిందని టాక్ వినిపించింది. ఆ సినిమా కొని రవితేజతో తీద్దామని అనుకున్నా. ఎందుకంటే పవన్‌ డేట్స్‌ కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. అలాంటిది నేను మళ్లీ అడిగితే బాగోదేమోనని అనుకున్నా. ఒకరోజు నన్ను పిలిచి ‘ఆ సినిమా నేను నాగబాబుకు చేసి పెడతా’ అన్నారు. ఈలోగా ‘తీన్‌మార్‌’ ఫ్లాప్‌ కావడంతో ఆ ఆఫర్‌ నాకు వచ్చింది. ఈ విషయంలో త్రివిక్రమ్‌గారు ఎంతో సాయం చేశారు. ఆ సినిమాలో మీరూ(ఆలీ) ఉన్నారు. మొదటి నుంచి సూపర్‌హిట్‌ అని అనేవారు. అలాగే అయింది. నా ప్రతి సినిమాలోనూ మీరు ఉన్నారు.

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

బండ్ల గణేశ్‌: మా మావయ్య కూతురే కాబట్టి నేను ఎంగేజ్‌మెంట్‌కు కూడా వెళ్లలేదు. ఏకంగా పెళ్లి పీటల మీదే చూశాను.

మీ తల్లిదండ్రుల తర్వాత మీ ఇంట్లో ఎవరి సపోర్ట్‌ బాగా ఉంటుంది?

బండ్ల గణేశ్‌: మా ఎదుగుదల కోసం నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. మా నాన్నకు 73ఏళ్లు ఇంకా పనిచేస్తూనే ఉంటారు. టీ, కాఫీలు తాగరు. నాన్‌వెజ్‌ కూడా తినరు. నా తల్లిదండ్రుల తర్వాత మా అన్నయ్య నన్ను బాగా ప్రోత్సహిస్తారు. ఇప్పటి వరకూ నీది-నాది అనే తేడా లేకుండా కలిసి ఉంటున్నాం. ఆ తర్వాత నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నా భార్య. గత మూడేళ్ల నుంచి అన్ని విషయాల్లో నా భార్య సహకారం మర్చిపోలేను.

మీరు ఏ హీరోని అడిగినా డేట్స్‌ ఇస్తారు? కానీ,ఎందుకు సినిమాలు తీయడం లేదు?

బండ్ల గణేశ్‌: అనుకోకుండా జరిగింది. వరుసగా ఐదారేళ్లు సినిమాలు చేశా. ‘టెంపర్‌’ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు ఫైనల్‌ అయ్యాయి. అయితే, వాళ్లు కొత్త దర్శకులు కావడం, మనం చెప్పింది వాళ్లు ఒప్పుకోకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదు. అయితే, అదే సబ్జెక్ట్‌తో వాళ్లు వేరే నిర్మాతతో ఆ సినిమా తీశారు. అవి ఫ్లాప్‌ అయ్యాయి. మళ్లీ పెద్ద సినిమాతోనే ఎంట్రీ ఇద్దామని ఆగా. త్వరలో ఒక పెద్ద సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

స్కూల్లో ‘శివ’టైపులో ఒక గ్యాంగ్‌ మెయింటేన్‌ చేసేవారట!

బండ్ల గణేశ్‌: నేను సరిగా స్కూల్‌కు వెళ్లేవాడిని కాదు. షాద్‌నగర్‌ నుంచి రైలు ఎక్కి హైదరాబాద్‌ వచ్చి సినిమాలు చూసి వెళ్లేవాడిని.

ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరు స్ఫూర్తి?

బండ్ల గణేశ్‌: చిరంజీవిగారు. ఆయన సినిమాలే ఎక్కువగా చూసేవాడిని.

చిరంజీవితో ఎందుకు చేయలేదు?

బండ్ల గణేశ్‌: తప్పకుండా చేస్తా. అందులో ఎలాంటి అనుమానం లేదు.

బతికితే బండ్ల గణేశ్‌లా బతకాలి? అన్నట్లు ప్లాన్‌ చేస్తున్నారట!

బండ్ల గణేశ్‌: అదేం లేదండీ. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. మనం పడిన కష్టాలు మన పిల్లలకు తెలియదు. అందుకే జీవితంలో కష్టపడి బతకాలని చెబుతుంటా. ఇటీవల నాకు కరోనా వచ్చింది. అప్పుడు నా ఆలోచనాధోరణి మారిపోయింది. అంతకుముందు వరకూ కాస్త నిర్లక్ష్యంగా ఉండేవాడిని. మనం ఇలా బతకకూడదని అప్పుడు అనిపించింది. దీంతో అప్పటి నుంచి ఎవరితోనూ గొడవలు లేకుండా, హాయిగా, సంతోషంగా, నిజాయతీగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందరూ గొప్పవాళ్లే.

ఎవరికీ తెలియకుండా చాలామందికి సాయం చేస్తారట!

బండ్ల గణేశ్‌: నేను 10-15మంది పిల్లలను చదివిస్తున్నా.

ఎస్వీ కృష్ణారెడ్డి-ఈవీవీ వీరిద్దరిలో ఎవరికి ఫస్ట్‌ ప్లేస్‌ ఇస్తారు?

బండ్ల గణేశ్‌: అమ్మానాన్నల్లో ఎవరికి మొదటి స్థానం అన్నట్లు ఉంది. ‘ప్రేమఖైదీ’ ద్వారా మీ వల్లే(ఆలీ) ఈవీవీగారు పరిచయం. నేను ఆయనతో క్లోజ్‌గా ఉండేవాడిని. ఆయన నన్ను అమెరికా తీసుకెళ్దామని అనుకున్నారు. అప్పుడు నా వీసా రిజెక్ట్‌ అయింది. దాన్ని ఓకే చేయించడానికి అప్పటి సీఎం చంద్రబాబునాయుడుగారి కార్యాలయానికి వెళ్లాం. కేవలం నా కోసం మీరంతా వచ్చారు. అలా ఆయన నాకు ఎంతో సాయం చేశారు. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డిగారు నా తండ్రిలాంటి వారు. ‘వినోదం’లో మంచి పాత్ర ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు.

సడెన్‌గా రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?

బండ్ల గణేశ్‌: అసెంబ్లీలో కూర్చొని ‘అధ్యక్షా..’ అనాలని కోరిక. అది మనకు వర్కవుట్‌ కాదని తర్వాత తెలిసింది. ఇక సినిమాలు.. యాక్షన్‌.. కట్‌లు మనకు సరిపోతాయని అనిపించింది. రాజకీయాల కన్నా ఒక నిర్మాతగా బండ్ల గణేశ్‌కు ఎక్కువ పాపులారిటీ ఉంది.

ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చేసినట్లు ఉన్నారు?

బండ్ల గణేశ్‌: చిన్న వేషం. అనిల్‌ రావిపూడి నా స్నేహితుడు. గతంలో మహేశ్‌బాబుతో ‘బిజినెస్‌మెన్‌’ చేశా. ఆయనతో నేను చేసిన సినిమాలన్నీ హిట్‌.

ఒక హీరోకు, ఒక డైరెక్టర్‌కు థ్యాంక్స్‌ చెప్పమంటే ఎవరికి చెబుతారు?

బండ్ల గణేశ్‌: పవన్‌కల్యాణ్‌.. డైరెక్టర్‌లలో పూరీ జగన్నాథ్‌.

ఒకప్పుడు నిర్మాతకు ఉన్న విలువ ఇప్పుడు లేదని అంటుంటారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా?

బండ్ల గణేశ్‌: అదంతా ఉత్తిదే. ‘ఆ రోజుల్లో ఆర్టిస్ట్‌లు చాలా గొప్పవాళ్లు’ అంటారు. అంటే ఇప్పుడు గొప్ప వాళ్లు కాదని అర్థమా? ఆ రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ అలా ఉంది. ఇప్పుడిలా ఉంది. నిర్మాతకు ఎప్పుడూ విలువ ఉంటుంది. వయసు మళ్లిన వాళ్లు చెప్పే కబుర్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఎంత సంపాదించినా రామానాయుడు ఇచ్చిన రూ.1,100 జాగ్రత్తగా పెట్టుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారట!

బండ్ల గణేశ్‌: నా 16ఏళ్ల వయసులో రూ.1,100 సంపాదించా. అవి తీసుకుని కోఠి వెళ్లి చర్మాస్‌లో రెండు ప్యాంట్‌లు, రెండు షర్ట్‌లు కొన్నా. అక్కడ నుంచి ‘వైభవ్‌’ అనే బట్టల షాప్‌నకు వెళ్లి, అమ్మకు చీర తీసుకున్నా. మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చా. నాయుడుగారంటే నాకు చాలా ఇష్టం.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్‌ సందర్భంగా కృష్ణవంశీతో గొడవైందని విన్నాం?

బండ్ల గణేశ్‌: చిన్న చిన్న మనస్పర్థలు వచ్చిన మాట వాస్తవం. అందులో ఎవరిదీ తప్పులేదు. సినిమా జరిగేటప్పుడు నిర్మాత-దర్శకుడికి 100 అభిప్రాయ భేదాలు వస్తాయి. అంతమాత్రాన గొడవపడినట్లు కాదు. కృష్ణవంశీ గ్రేట్‌ డైరెక్టర్‌. మొన్న కూడా సినిమా చేద్దామని అడిగా.

ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు కారణం?

బండ్ల గణేశ్‌: మాది చిన్న ఫ్యామిలీ. ఒక్కసారిగా బావిలో నుంచి సముద్రంలో పడ్డా. చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చా. బయటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియదు. నాది గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదు. ఇక ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. ప్రపంచంలో చాలామంది కన్నా నేను అదృష్టవంతుడిని. ‘భగవంతుడా నాకు మంచి సినిమాలు తీసే అవకాశం ఇవ్వు. పదిమంది దర్శకులను పరిచయం చేసే అవకాశం ఇవ్వు’ అని ప్రార్థిస్తుంటా. నేను దేవుడిని బాగా నమ్ముతా. నేను బాగా చదివి ఉంటే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యేవాడిని. ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మా కోళ్లఫారంలో గుడ్లు ఏరుతూ ఉండేవాడిని.

నాకు రియల్‌ ఎస్టేట్‌, పౌల్ట్రీలో బాగానే డబ్బులు వచ్చాయి. కానీ, పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి నాకు సినిమా ఆఫర్‌ ఇవ్వకపోతే ఇవ్వన్నీ కోల్పోయేవాడిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఒక హీరోగా, మనిషిగా ఆయనంటే నాకు ఎంతో ఇష్టం.

‘ప్రేమఖైదీ’ నాటిరోజులు గుర్తున్నాయా?

బండ్ల గణేశ్‌: అవును 100మంది ఉండేవాళ్లం. తెరపై కనపడేలా అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అడిగా. షూటింగ్‌ అయిపోయిన తర్వాత మీకు రూ.7,500 చెక్‌ ఇచ్చారు. నేను చెక్‌ చూడటం అదే మొదటిసారి. ‘అన్నా చెక్‌ ఇచ్చారా?’ అని నేను అంటే, ‘తీసుకోరా’ అని ఇచ్చేశావు.

మీ టార్గెట్‌ ఏంటి?

బండ్ల గణేశ్‌: సినిమాలు తీయడం. మనం సినిమాలో నటిస్తే మన కుటుంబం బాగుంటుంది. అదే సినిమాను నిర్మిస్తే, 200 కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి.

ఈ మాటలు ఈ మధ్యనే నేర్చుకున్నారా?

బండ్ల గణేశ్‌: అవును! మీతో ఫ్రెండ్‌షిప్‌ చేయటం మొదలు పెట్టిన దగ్గరి నుంచి నేర్చుకున్నా. (మధ్యలో ఆలీ అందుకుని, అప్పుడైతే బ్లేడ్‌ సంగతి నేను చెప్పేవాడిని కాదు కదా) మీరు బ్లేడ్‌ సంగతి చెప్పలేదు కానీ, కత్తి సంగతి చెప్పారు. దాన్ని నేను బ్లేడ్‌గా మార్చా.

నిర్మాతగా కెరీర్‌ ప్రారంభించిన కొద్దిరోజులకే అగ్ర హీరోల డేట్స్‌ సంపాదించారు ఎలా సాధ్యం?

బండ్ల గణేశ్‌: కష్టపడితే ఎవరికైనా ఇస్తారు. ‘ప్రేమఖైదీ’ సినిమా షూటింగ్‌ సమయంలో 100మంది ఉంటే మీరు(ఆలీ)నన్నే ఎందుకు పిలిచి డైరెక్టర్‌గారికి పరిచయం చేశారు. నా ఫీలింగ్స్‌, నా బాధ, నా హావభావాలు మీకు నచ్చాయి. అది బండ్ల గణేశ్‌. వాళ్లు ఇష్టపడే విధంగా ఉంటేనే ఇక్కడ ఉండాలి. నా ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే కుదరదు కదా!

మీకు ఏదైనా కష్టం వస్తే ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్తారట!

బండ్ల గణేశ్‌: అవును! ఇంట్లో చెప్పుకోలేని విషయాలు కూడా వాళ్లతో పంచుకుంటా. దేవుడి దయ వల్ల చాలా పెద్ద పెద్ద వాళ్లు నాతో స్నేహంగా ఉంటారు.

ఏదో ఒక సినిమా షూటింగ్‌ సందర్భంగా చేదు అనుభవం ఎదురైందట!

బండ్ల గణేశ్‌: అప్పుడే ఇనిస్టిట్యూట్‌ పూర్తయింది. షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ రావాలంటే బస్సెక్కి రావాల్సిందే. అప్పుడు చిత్ర పరిశ్రమ ఇక్కడకు రాలేదు. నటీనటులు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హోటల్‌లో ఉండి షూటింగ్‌ పూర్తి చేసుకుని వెళ్లేవారు. ఒకరోజు షూటింగ్‌ పూర్తయ్యే సరికి చీకటి పడిపోయింది. షాద్‌నగర్‌ వెళ్లి, మళ్లీ ఉదయాన్నే రావడటం కష్టం. అప్పుడు ఒక మేనేజర్‌ను బతిమిలాడుకొంటే వాళ్ల గదిలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. అయితే, కింద పడుకోవాలి.  నాకు రాత్రి 7గంటలకు నిద్రపోవటం అలవాటు. వాళ్లు కబుర్లు చెప్పుకొంటూ రాత్రి 10గంటలైనా పడుకోలేదు. ఆ రూమ్‌లో ఉన్న ఒక వ్యక్తి బాగా తాగి వాంతి చేసుకున్నాడు. ఆ రాత్రి అక్కడ గడపటం ఎంతో బాధగా అనిపించింది. అప్పుడు ఇండస్ట్రీలో ఉండకూడదని అనుకున్నా. ఇంటికి వెళ్లిపోయా. నాన్న సినిమాలు చేయాల్సిందేనని పట్టుబట్టడంతో మళ్లీ అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టా. 

గణేశ్‌ తలుచుకుంటే ట్రంప్‌ను కూడా క్షణాల్లో కలుస్తారట నిజమేనా?

బండ్ల గణేశ్‌: ఏదో పబ్లిసిటీ కోసం అలా మాట్లాడా. ట్రంప్‌ను కలవడం అంత సులభమా?

ఈ హీరోయిన్ల గురించి మీ అభిప్రాయం?

అమలాపాల్‌: మంచి అమ్మాయి.

కృతి కర్బంద: నా ‘తీన్‌మార్‌’ సినిమాలో నటించింది.

కేథరిన్‌: ‘ఇద్దరమ్మాయిలతో’ సెకండ్‌ హీరోయిన్‌

కాజల్‌: నాకు ఇష్టమైన హీరోయిన్‌. చాలా అభిమానం. అద్భుతమైన వ్యక్తిత్వం కల అమ్మాయి.

నయనతార: మొదటి చిత్రం హీరోయిన్‌

శ్రుతిహాసన్‌: ‘గబ్బర్‌ సింగ్‌’ హీరోయిన్‌గా పెట్టడానికి చాలా భయపడ్డా. అసలు ఆ సినిమాలో వద్దనుకున్నా. ఇదే విషయాన్ని పవన్‌కల్యాణ్‌గారికి చెబితే, ‘ఎందుకు’ అని అడిగారు. ‘ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాఫ్‌ అండీ’ అన్నా.‘నువ్వు తీసిన సినిమాలేమైనా హిట్టా’ అన్నారు. అంతే నోర్మూసుకుని శ్రుతి హాసన్‌ ఓకే చేశా. చాలా మంచి అమ్మాయి. కమల్‌హాసన్‌ కుమార్తె అయి ఉండి కూడా చాలా మంచి ప్రవర్తనతో ఉంటారు.
త్రిష: ‘తీన్‌మార్‌’లో హీరోయిన్‌. మంచి నటి.

ఈ హీరోయిన్‌లలో నంబర్‌ వన్‌.. నంబర్‌ టు ఎవరు?

బండ్ల గణేశ్‌: కాజల్‌, శ్రుతి హాసన్‌.

త్రివిక్రమ్‌, మీరూ మంచి స్నేహితులు కదా! మరి ఆయనతో ఎందుకు సినిమా చేయలేదు?

బండ్ల గణేశ్‌: తప్పకుండా తీస్తా. నా ‘తీన్‌మార్‌’కు ఆయనే రచయిత. నా మనసు బాగోపోతే, ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడతా. నా సొంత విషయాలు ఆయనకు ఒక్కడికే చెబుతా. ఆయనకు చెబితే బ్యాంకు లాకర్‌లో వేసినట్లే.

ఇండస్ట్రీలో బతకాలంటే బండ్ల గణేశ్‌లా బతకాలి అంటారు? ఏంటి కథ?

బండ్ల గణేశ్‌: ఈ విషయం నేను ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. చాలా కష్టాలు పడి వచ్చిన కుటుంబం నాది. చిన్న రైతు కుటుంబం. కరెంటు కూడా లేని ఇంట్లో బతికాం. మేము ఏ రోజూ ఇబ్బంది పడకుండా నాన్న మమ్మల్ని పెంచారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డా. నేను ఊరికే బండ్ల గణేశ్‌ను కాలేదు. నాకు తెలిసి, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నా నోటి తొందర వల్ల నేనే నష్టపోయా. నాకు సినిమా అంటే ఫ్యాషన్‌. దాని కోసమే బతుకుతా. నేను గొప్ప నటుడిని కాదు. అద్భుతమైన సన్నివేశం ఒక్కటీ చేసిన దాఖలాలు లేవు. అయినా వంద సినిమాలు చేశా. ఎందుకంటే అందరితోనూ మర్యాదగా, మంచిగా ఉంటా. అవకాశాల కోసం ఎదుటివాళ్లను బతిమిలాడుకోవడం, ప్రార్థించడం  తప్పుకాదు. మన కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థిస్తున్నాం కదా! ఇది కూడా అంతే. మనకు సాయం చేసే ప్రతి ఒక్కడిలోనూ దేవుడిని చూస్తేనే మనం పైకి వస్తాం. నేను ఇండస్ట్రీకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. నా తొలి సినిమా ‘ఆంజనేయులు’ కూడా అప్పు తీసుకొచ్చి చేశా. నేను చేసేది మస్కా అనుకున్నా, మాయ అనుకున్నా పర్వాలేదు.

వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారు?

బండ్ల గణేశ్‌: బండ్ల గణేశ్‌గానే పుట్టాలనుకుంటున్నా

రాంగోపాల్‌వర్మ?
బండ్ల గణేశ్‌: నవ్వు...

మొన్న ఎన్నికల్లో మీరు సీఎం అయితే ఏం చేసేవారు?

బండ్ల గణేశ్‌: కామెడీ చేయడానికి కూడా హద్దు ఉంటుంది. ఎమ్మెల్యే అయితే చాలనుకున్నా. ఏకంగా సీఎంను ఎలా అవుతా.

మీకో గులాబీ ఇస్తే ఎవరికి ఇస్తారు?

బండ్ల గణేశ్‌: నా భార్యకు ఇస్తా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని