అదే నా జీవితంలో చివరిరోజు అనుకున్నా! - Alitho Saradaga funny chat show actor Satyadev
close
Updated : 14/10/2020 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే నా జీవితంలో చివరిరోజు అనుకున్నా!

అతని యాక్టింగ్‌ చూస్తే ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటుడిగా అనిపిస్తాడు. పాత్రలో ఒదిగిపోయిన తీరు చూస్తే, ఈ పాత్ర ఇతని కోసమే పుట్టిందేమో అనిపిస్తాడు. ‘బ్లఫ్‌ మాస్టర్‌’గా  గారడీ చేసినా, ‘ఉమా మహేశ్వరరావు’గా హాస్యం పంచినా అతనికే చెల్లింది. తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సత్యదేవ్‌. కేవలం వెండితెరపైనే కాదు, ఓటీటీ వేదికగానూ తన హవా చూపిస్తున్నాడు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి సరదా సంగతులు పంచుకున్నారిలా..

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సత్యదేవ్‌ అయ్యాడా? లేక ముందు నుంచీ అదే పేరా?

సత్యదేవ్‌: మొదటి నుంచీ నా పేరు అదేనండీ.

మీ సొంతూరు ఏది?

సత్యదేవ్‌: విశాఖపట్నం

మీ కుటుంబం నేపథ్యం ఏంటి?

సత్యదేవ్‌: నాన్న ఒకప్పుడు ఈనాడులో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి ఈనాడుతో అనుబంధం ఉండేది. ఈటీవీలో నా సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మ గృహిణి. చెల్లెలు-బావ వైద్యులు. నాకు వివాహం అయింది. నా భార్య ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేది. ప్రస్తుతం నాకు అన్ని విషయాల్లో సహకరిస్తోంది. మాది ప్రేమ వివాహం.

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?

సత్యదేవ్‌: 2011. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో ప్రభాస్‌గారికి నలుగురు ఫ్రెండ్స్‌ ఉంటారు. అందులో నేనూ ఒకడిని. అది నా మొదటి అవకాశం. నా స్నేహితుడు రుషి ప్రసాద్‌ ద్వారా హైదరాబాద్‌లో ఆడిషన్‌కు వచ్చా. చూడగానే యాక్టర్‌ అయ్యే లక్షణాలు లేవు అని నన్ను కాస్త డిప్రెషన్‌కు గురి చేశాడు. అనవసరంగా వెళ్లానేమో.. మొత్తం గాలి తీసేశాడు అనిపించింది. ఆ మరుసటి రోజు ఆయనే నాకు ఫోన్‌ చేసి రమ్మన్నారు. నన్ను పరీక్షించడానికి అలా చేశారేమో. ఆయన అలా అనడం వల్లే ప్రతి సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నా.

హీరోగా మొదటి సినిమా ఏది?
సత్యదేవ్‌: ‘జ్యోతిలక్ష్మి’. నా స్నేహితుడు ప్రదీప్‌ మద్దాలి ఫోన్‌ చేసి, ఆడిషన్స్‌ జరుగుతున్నాయని చెప్పి రమ్మన్నాడు. 1000 మంది వచ్చారు. అప్పుడప్పుడే ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్నా. ‘అసురన్‌’, ‘ముకుంద’ చిత్రాల్లో సైడ్‌ విలన్‌ పాత్రలు పోషించా. ఏ పాత్ర చేయాలి? ఎలా ఆడిషన్‌ ఇవ్వాలో తెలియలేదు. ఇది కూడా విలన్‌ పాత్ర అనుకుని నెగెటివ్‌ పాత్ర చేసి చూపించా. అక్కడే ఉన్న ఛార్మిగారు ‘ఇది ఓకే. పాజిటివ్‌ పాత్ర ఏదైనా ఉంటే చెయ్‌’ అన్నారు. కొద్దిసేపు సమయం తీసుకుని అది కూడా చేసి చూపించా. వారం తర్వాత పూరి జగన్నాథ్‌గారు పిలిచి ‘బాగుంది. కొంచెం లావుగా ఉన్నావు. బరువు తగ్గి వస్తావా’ అన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గా. అప్పుడు సినిమాలో నేనే హీరోనని చెప్పారు. ఆయన అలా చెప్పగానే త్రివిక్రమ్‌గారు చెప్పినట్లు ‘అక్కడి నుంచి లేచి జేబులో రెండు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయా’ కొద్దిసేపు నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది.

హీరోయిన్‌ ఎవరని పూరిని అడగలేదా?

సత్యదేవ్‌: ఛార్మి లీడ్‌ రోల్‌ చేస్తున్నారని అసిస్టెంట్‌ డైరెక్టర్ల ద్వారా తెలిసింది. నాది విలన్‌ పాత్ర అనుకుని ఆడిషన్‌ ఇచ్చా. అదే అనుకుని బరువు కూడా తగ్గా.

పూరితో పనిచేయడం ఎలా అనిపించింది?

సత్యదేవ్‌: ఒక వేళ ఆయన వద్దకు నేనూ, అమితాబ్‌గారు ఒకేసారి వెళ్లినా ఆయన ఇద్దరినీ ఒకేరకంగా ట్రీట్‌ చేస్తారు. పెద్ద నటుడు, చిన్న నటుడు అన్న తారతమ్యం ఉండదు. అది నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది.

సాఫ్ట్‌వేర్‌గా ఇంజినీర్‌గా పని చేసే మీరు ఇండస్ట్రీకి వైపు ఎందుకు రావాలనిపించింది?

సత్యదేవ్‌: ఇండస్ట్రీలోకి రావాలనే జాబ్‌ చేసేవాడిని. వైజాగ్‌లో సినిమా షూటింగ్స్‌ తప్ప వేరే ప్రొడక్షన్స్‌ హౌస్‌లు ఉండేవి కావు. అడపాదడపా దసపల్లాలో ఆడిషన్స్‌ జరుగుతుండేవి. రూ.200 కడితే ఆడిషన్‌ అని చెప్పి, డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవారు. ‘ఐశ్వర్యరాయ్‌ని ప్రేమించాలంటే అనకాపల్లి నుంచి కాదు. ముంబయి వెళ్లాలి’ అనే డైలాగ్‌లో చెప్పినట్లు నేను వైజాగ్‌లో ఉండి ఎంత ప్రయత్నించినా ఏమీ అవట్లేదు. దీంతో హైదరాబాద్‌ రావాలనుకున్నా. సినిమాలంటే ఏ తెలుగింట్లోనైనా భయపడతారు. అందుకే జాబ్‌ చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆరేళ్లు పనిచేశా. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ వరకూ జాబ్‌ చేస్తూనే ఉన్నా.

వన్డే మ్యాచ్‌లా వన్డే జాబ్‌.. ఏంటది?

సత్యదేవ్‌: మధ్యలో ఒక జాబ్‌ వచ్చింది. నా పైన ఒక మేనేజర్‌ ఉండేవారు. నాకు పై బటన్‌ పెట్టుకునే అలవాటు లేదు. అలా పెట్టుకుంటే నాకు ఊపిరి ఆడదు. ఒకరోజు ఆ కంపెనీ సీఈవో వచ్చాడు. ఆయన రాగానే ‘సత్య పై బటన్‌ పెట్టు’ అని మేనేజర్‌ అన్నాడు. ఆయనేమో ‘ఫరవాలేదు లే’ అంటే.. ‘ఇలాంటివి మనం మొదట్లోనే తుంచేయాలి సర్‌’ అన్నాడు మేనేజర్‌. ఎందుకులే అని నేను కూడా బటన్‌ పెట్టా. ఆ తర్వాత కాస్త ఓవరాక్షన్‌ చేశాడు. ‘సర్‌ నేను భోజనం చేసి వస్తా’ అని చెప్పా. ఇప్పటివరకూ మళ్లీ వెళ్లలేదు.

ఇండస్ట్రీలో ఒక్కో నటుడికి ఒక్కో బిరుదు ఉంది. మిమ్మల్ని లాక్‌డౌన్‌ స్టార్‌ అంటున్నారట! ఓటీటీ మొత్తం కవర్‌ చేసినట్లు ఉన్నారు.

సత్యదేవ్‌: నాకు సినిమా, ఓటీటీ రెండూ ఒకేలా హెల్ప్‌ అయ్యాయి. సినిమా అనేది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌‌. ఓటీటీ ఐపీఎల్‌లాంటిది. అక్కడున్న ఆటగాళ్లు రెండు వేదికల్లోనూ ఆడతారు. దేని మార్కెట్‌ దానికుందని నా అభిప్రాయం(మధ్యలో ఆలీ అందుకుని, ఆ ఇంటర్నేషనల్‌మ్యాచ్‌ ఆడితే డబ్బులు అంతగా ఇవ్వరు. కానీ, ఐపీఎల్‌ ఆడితే బాగా వస్తాయి.. నవ్వులు)

 

‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఎప్పుడు అయిపోయింది?

సత్యదేవ్‌: గతేడాది అక్టోబర్‌లోనే షూటింగ్‌ పూర్తయింది. డబ్బింగ్‌ కూడా లేదు. లైవ్‌ వాయిస్‌ను సింక్‌ చేశారు. అసలు డబ్బింగ్‌ లేదు. హరి చందన, రూప ఇద్దరూ కొత్త హీరోయిన్లు. నేను, నరేశ్‌, సుహాస్‌ తప్ప మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఈ 9ఏళ్లలో నేను చూడని స్థాయికి నన్ను తీసుకెళ్లింది. నేను దేనికోసమే చూశానో ఆ స్థాయికి వెళ్లింది.

అఫ్గానిస్థాన్‌ వెళ్తే పోలీసులు అరెస్టు చేశారట!

సత్యదేవ్‌: ‘హబీబ్‌’ అనే హిందీ సినిమా చేశాం. ఇంకా అది పూర్తి కాలేదు. సినిమా ప్రొడ్యూసర్‌లలో ఒకరిది అఫ్గానిస్థాన్‌. నిజానికి మా షూటింగ్‌కు మంగళవారం నుంచి అనుమతి ఉంది. కానీ.. మంగళవారం సెంటిమెంట్‌తో ఒక చిన్న షాట్‌ తీద్దామని. ఒకరోజు ముందే షూటింగ్‌ ప్రారంభించాం. కెమెరా ఎక్కడో నాలుగో అంతస్థు బిల్డింగ్‌లో ఉంది. నేను ఫోన్‌ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళుతుంటా.. అదే సీన్‌. దాన్ని మూడునాలుగు టేక్‌లు తీశాం. షూట్‌ అయిపోగానే డైరెక్టర్‌ వాళ్లంతా ఆ బిల్డింగ్‌లోనే ఉండి సీన్‌ ఎలా వచ్చిందని చూస్తున్నారు. నేను.. ఫోన్‌ మాట్లాడుకుంటూ అటూ ఇటు తిరగడం చూసిన పోలీసులకు నాపై అనుమానం కలిగింది. ఆత్మాహుతి దాడి చేసేవాడు అనుకొని నన్ను అరెస్టు చేశారు. అయితే, అంతకుముందు ఆ ప్రాంతంలో 9 ఆత్మాహుతి దాడులు జరిగాయట. ఈరోజు నవ్వుతూ చెప్తున్నాను కానీ.. ఆ సందర్భంలో నా జీవితానికి అదే చివరి రోజు అని భయమేసింది.

అక్కడికి 500కు పైగా జనం వచ్చారు. చంపేయండి వాళ్లను అని అరుస్తూ మాపై బాటిళ్లు విసిరారు. నాతో పాటు రజాన్‌ అనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉన్నాడు. పోలీసులు పాస్‌పోర్టు అడిగారు. నేనేమో కాస్టూమ్‌లో ఉన్నాను. ఆ సమయంలో నా దగ్గర పాస్‌పోర్టు లేదు. నాతో ఉన్న రజాక్‌ తన దగ్గర ఉందని చెప్పాడు. అయితే.. చూపించమని పోలీసులు అడిగారు. అతనేమో తన పాస్‌పోర్టు సాక్సులో పెట్టుకున్నాడు. తీయడానికి కిందకి వంగాడు. పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. అందరూ గన్‌ లోడ్‌ చేశారు. ఇండియన్‌ ఎంబసీ, అఫ్గానిస్థాన్‌ ఎంబసీ అధికారులు వచ్చారు. మొత్తం గొడవ సద్దుమణిగింది. షూటింగ్‌ రద్దు చేసుకొని తిరిగి వెళ్లిపొమ్మన్నారు. మేం కష్టపడి వాళ్లను ఒప్పించాం. ఆ తర్వాత 40  రోజులు అక్కడే ఉన్నాం. అలా అక్కడ ఎపిసోడ్ పూర్తయింది.

అసలు అఫ్గానిస్థాన్‌ వచ్చినప్పుడు పాస్‌పోర్ట్‌ చెక్‌ చేస్తూ, ‘ఈ దేశానికి ఎందుకు వచ్చారు’ అని అడిగింది. ‘షూటింగ్‌ కోసం..’ అని చెప్పా. ఆమె పై నుంచి కిందకు చూసింది. ‘సినిమా షూటింగ్‌ కోసం మేడమ్‌’ అన్నా. ‘ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా, మా దేశమే దొరికిందా’ అని అన్నది.(నవ్వులు)

మరో ప్రకాశ్‌రాజ్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట.. నిజమేనా.?

సత్యదేవ్‌: ప్రకాశ్‌రాజ్ అవుదామని రాలేదు. ఆయనను రీప్లేస్‌ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన, నసీరుద్దీన్‌షా, కమల్‌హాసన్‌, మెగాస్టార్‌ వీళ్లంతా నా స్ఫూర్తి. చిన్నప్పుడు టీవీలో మెగాస్టార్‌ పాట వేస్తేనే భోజనం చేసేవాడిని. చిరంజీవిగారి పాటలకు మా చిన్నమ్మలు అందరూ డ్యాన్స్‌ చేసేవారు. టీవీలో పాట రావాలి.. దానికి వాళ్లు డ్యాన్స్‌ చేయాలి. అప్పుడే తినేవాడిని.

‘అత్తారింటికి దారేది’ సమయంలో త్రివిక్రమ్‌ అడిగి మరీ మీ నంబర్‌ తీసుకున్నారట.?
సత్యదేవ్‌: అవును. త్రివిక్రమ్‌ గారు నా నంబర్‌ తీసుకోవడం లైఫ్‌లో నేనెప్పుడూ మర్చిపోలేను. అదే నా కెరీర్‌ ప్రారంభం. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్’‌, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేశాను. అత్తారింటికి దారేది సినిమాలో సమంతను ఏడిపిస్తున్నానని షాపింగ్‌ మాల్‌ అంతా తిప్పి తిప్పి పవన్‌కల్యాణ్‌ మమ్మల్ని కొడతారు. ఆ సీన్‌ అయిపోయిన తర్వాత నా ఫోన్‌ తీసుకుని, ఒక నెంబర్‌కు ఫోన్‌ చేసి, ‘నేను ఇటలీ వెళ్తున్నాను. వచ్చిన తర్వాత సత్యదేవ్‌ను నేను కలవాలి. ఇది నంబర్‌’ అని చెప్పి పెట్టేశారు. ఎందుకు కలవమన్నారని అసిస్టెంట్‌ డైరెక్టర్లను అడిగితే, ‘పవన్‌కల్యాణ్‌ సర్‌ మిమ్మల్ని కాలు మీద కొట్టగానే మీరు కుంటుతూ పరిగెత్తడం సర్‌ గమనించారు. అది ఆయనకు నచ్చింది’ అని చెప్పారు. అయితే.. ఈ రోజువరకు త్రివిక్రమ్‌ గారిని కలవలేదు. ఆయన బిజీగా ఉంటారు కదా..! కలవాలని ప్రయత్నిస్తున్నాను.

మీరు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎవరు..?

సత్యదేవ్‌: నా బెస్ట్‌ఫ్రెండ్‌ భార్గవ్‌. ఈ విషయం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. నేను జాబ్‌ మానేసిన సమయంలో.. నెల నెలా వాడి జీతం నుంచి నాకు కొంత డబ్బు పంపించేవాడు. ‘పర్వాలేదు నువ్వు ప్రయత్నించు. నువ్వు మంచి పొజిషన్‌కు వచ్చిన తర్వాత ఇవ్వొచ్చులే’ అనేవాడు. నేనెప్పుడూ వాడికి థ్యాంక్స్‌ చెప్పలేదు. మా అమ్మానాన్న, నా భార్య దీపిక కూడా బాగా సపోర్ట్‌ చేస్తుంటారు. నేను షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు నా కుటుంబాన్ని నా భార్య చూసుకుంటుంది. నాకు సంబంధించి చాలా విషయాల్లో ఆమే నిర్ణయం తీసుకుంటుంది. నేను జాబ్‌ చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ‘నువ్వు ఉద్యోగం మానేసి, దృష్టి అంతా సినిమాలపైనే పెట్టు’ అని ధైర్యం చెప్పింది. ఆ సమయంలో నాకు నెలకు రూ.1.50లక్షల జీతం వచ్చేది.

తర్వాత సినిమాలో కాలేజ్‌ స్టూడెంట్ పాత్రనా..?

సత్యదేవ్‌: ‘తిమ్మరసు’ అని ఒక సినిమా చేస్తున్నాను. లాయర్‌ బేస్డ్‌ థ్రిల్లర్‌. తర్వాత  ‘స్కైలాబ్‌’ పడిపోయిన నేపథ్యంలో కామెడీ డ్రామాలో నటిస్తున్నా. తర్వాత నితిన్‌ అన్నతో కలిసి ఇంకో సినిమా చేస్తున్నాం. ప్రస్తుతానికి అంతా సజావుగా సాగుతుంది.

ఇళయరాజా మీ నటనను బాగా మెచ్చుకున్నారట..?

సత్యదేవ్‌: అవును, ‘మన ఊరి రామాయణం’లో నా నటన ఆయనకు బాగా నచ్చిందట. ఆ సినిమా డైరెక్టర్‌ ప్రకాశ్‌రాజ్‌. నా పుట్టినరోజు సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి.. ఇళయరాజాగారు సాధారణంగా ఎవరినీ పొగడరు. కానీ, మీ నటన ఆయనకు బాగా నచ్చిందట అని చెప్పారు.

‘కొదమ సింహం’ సినిమా చూసి ఇంట్లో ఫైట్‌ చేస్తే, తలకు గాయమైందట!
సత్యదేవ్‌: ‘కొదమ సింహం’లో చిరు తాడును పట్టుకుని వస్తుంటే విలన్‌లు దాన్ని కట్‌ చేస్తారు. ఆ సన్నివేశం నాకు చాలా ఇష్టం. ఇంట్లో దూరదర్శన్‌ కేబుల్‌ ఉంటే, దాన్ని పట్టుకుని వేలాడుతుంటే తెగి ఓ టేబుల్‌పై పడ్డాను. తలకు పెద్ద దెబ్బ తగిలింది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే, తుప్పు పట్టిన సూదితో కుట్లు వేశాడు. దాని వల్ల సెప్టిక్‌ అయి, మొత్తం ఓపెన్‌ అయిపోయింది. అదే ఈ మచ్చ. నేను నటుడిని అయిన తర్వాత చిరంజీవిగారిని కలిసి జరిగింది మొత్తం చెప్పా. నవ్వుకున్నారు.

పాటలు పాడతారట.. డబ్బింగ్‌ కూడానా..?

సత్యదేవ్‌: ‘బ్లఫ్‌ మాస్టర్‌’కు ఒక పాట పాడాను. ఆ తర్వాత ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గరికి వెళ్లి నేను సినిమాలో ఒక పాట పాడాను అని చెప్పాను. ‘నువ్వు పాడలేదు. మాట్లాడావంతే. అది పాట కాదు.. నువ్వు మాట్లాడుతుంటూ మ్యూజిక్‌ వేశారంతే’ అన్నారు(నవ్వుతూ). నేను ‘నవాబ్‌’లో శింబుకు, ‘సాహో’ నీల్‌ నీతీశ్‌లకు చెప్పాను. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో సూర్యకు చెప్పాను. ఆ సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ, డేట్స్‌ వల్ల కుదరలేదు. ‘కనీసం డబ్బింగ్‌ అయినా చెప్పు’అని దర్శకురాలు సుధ కొంగర అడిగితే చెప్పాను.

దీపావళి సందర్భంగా పెద్ద ప్రమాదం తప్పిందట!
సత్యదేవ్‌: ప్రతి దీపావళికి నాకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి సీమ టపాకాయ్‌ తీసుకుని నెయిల్‌ పాలిష్‌ బాటిల్‌లో పెట్టి కాల్చాను. ఆ తర్వాత వెళ్లి దాన్ని ముట్టుకుంటే ‘ఠాగూర్‌’లో జ్యోతిక బాడిలా బూడిద అలా కుప్పకూలిపోయింది. మరుసటి రోజు మా వీధిలో పిల్లలందరినీ పిలిచి ఇలాగే చేశా. అందరికి తలో ఒక చోట గుచ్చుకుపోయింది. వాళ్ల తల్లిదండ్రులు మా ఇంటిపైకి గొడవకు వచ్చారు.

ఒక ఫ్యాన్‌ మీ హోటల్‌ బిల్‌ కట్టారంట ఎందుకు..?

సత్యదేవ్‌: ఒకరోజు నేను డైరెక్టర్‌తో కలిసి హోటల్‌లో భోజనం చేస్తున్నాం. ఒక వ్యక్తి నన్ను తదేకంగా చూస్తున్నారు. గుర్తుపట్టి అలా చూస్తున్నారేమో అనుకున్నా. భోజనం చేసిన తర్వాత బిల్‌ అడిగితే, ‘ఆయన కట్టేశారు’ అని వెయిటర్‌ చెప్పాడు. వెళ్లి ‘బిల్లు ఎందుకు కట్టారండీ’ అని అడిగా. తనని తాను పరిచయం చేసుకుని ‘‘బ్లఫ్‌ మాస్టర్‌’లో మీ నటన నచ్చింది. నాకు మీతో సెల్ఫీ వద్దు, ఆటోగ్రాఫ్‌ వద్దు. నా ఆత్మ సంతృప్తి కోసం మీ తిన్నదానికి బిల్లు కట్టాను. అది సంతోషం చాలు’ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కథ మీ దగ్గరికి వచ్చిందట.?

సత్యదేవ్‌: ఆ సినిమా దర్శకుడు మున్నా నాకు మంచి స్నేహితుడు. ముందు ఆ కథ నాకు చెప్పారు. ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నా. రెండు ఒకే సమయంలో చేయడం కుదరదని నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సినిమాలో ప్రదీప్‌ బాగా చేశాడట. ‘నీలి నీలి ఆకాశం’ పాటకు మంచి స్పందన కూడా వచ్చింది.  ఆ విషయంలో నేను కూడా హ్యాపీగా ఉన్నా. 9 సంవత్సరాల నా కెరీర్‌లో 25 సినిమాలు చేశాను. 

పాయింట్‌ బ్లాక్‌లో గన్ను పెట్టినప్పుడు మీ ఫీలింగ్‌..?

సత్యదేవ్‌: ఇంత బతుకు బతికి అఫ్గానిస్థాన్‌లో చనిపోతున్నామా..? అనిపించింది.

ఎక్కువసార్లు చూసిన సాంగ్‌..?

సత్యదేవ్‌: ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి’. స్కూల్‌లో ఉన్నప్పుడు ఆ పాట వల్ల చాలా ప్రైజ్‌లు కూడా వచ్చాయి.

ద్విచక్రవాహనంపై మీరు వెళ్లిన అత్యధిక స్పీడ్‌?

సత్యదేవ్‌: 110కి.మీ.

మీ మొదటి జీతం ఎంత?

సత్యదేవ్‌: రూ.8వేలు, అమ్మకు ఇచ్చేశా.

పూరి మీకు ఇచ్చిన ప్రశంస?

సత్యదేవ్‌: ‘సత్య నీ కళ్లు చాలా బాగుంటాయి’ అని చెప్పారు.

నీ పేరు ముందు ఎలాంటి బిరుదు రావాలని ఉంది..?
సత్యదేవ్‌: మంచి నటుడిగా ఎప్పటికైనా ఒక జాతీయ పురస్కారం తీసుకోవాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని