నా జీవితంలో ‘ఛీ’ అనుకునే సంఘటన అది - Alitho Saradaga funny chat show with actor Priyadarshi
close
Published : 10/09/2020 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా జీవితంలో ‘ఛీ’ అనుకునే సంఘటన అది

అతడు కరెంటు తీగలా సన్నగా ఉంటాడు..

తన సహజ నటనతో హాస్యనటుడిగా శభాష్‌ అనిపించుకున్నాడు..

తనదైన కామెడీ టైమింగ్‌తో వారెవ్వా అనిపించున్నాడు..

ఎంటర్‌టైనింగ్‌ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు..  నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు తనని తను నిరూపిచుకుంటూ చిత్రసీమలో స్వశక్తితో ఎదుగుతున్న నటుడు ప్రియదర్శి.  ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారిలా..

మీ పేరులో ఉన్న ‘ప్రియ’ ఎవరు?

ప్రియదర్శి: ప్రియ అని వేరుగా ఏమీ లేదు. మా తాతయ్య గారి పేరు వచ్చేట్టు నాకు ప్రియదర్శి అని పేరు పెట్టారు. బుద్ధుడికి మరోపేరు ప్రియదర్శి. ఆయన లక్షణాలు నాలో రావాలని ఆ పేరు పెట్టారు. ఆ లక్షణాలు వచ్చేయో రాలేదో తెలియదు కానీ, మంచి పేరైతే వచ్చింది.

ఇండస్ట్రీలో మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు? ఎవరి పేరు చెబుతారు?

ప్రియదర్శి: నేను కృతజ్ఞతా భావాన్నినమ్ముతా. ఇక్కడికి రావడానికి చాలా రోజులు పట్టింది. చాలా మంది నాకు సహాయం చేశారు. ఇప్పుడు మాట్లాడాలంటే మీరే నన్ను తీసుకువచ్చారు. నేను మీకు(ఆలీ) కూడా క్రెడిట్‌ ఇస్తాను. ఎంతో మంది రచయితలు, దర్శకులు, నన్ను నమ్మిన స్నేహితులు ఎంతో మంది నాకు స్ఫూర్తిగా, అండగా నిలిచారు. నన్ను ప్రోత్సహించి, పని ఇచ్చారు. ఈ సీట్లో నేను కూర్చున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

మొదటిసారి నన్ను(ఆలీ) ఎక్కడ చూశావు?

ప్రియదర్శి: 2009లో  ‘బ్రహ్మి 10లక్షలు’ షో జరిగింది. కౌన్‌ బనేగా కరోడ్‌పతి స్టైల్‌లో బ్రహ్మనందం గారు ఈ షోను హోస్ట్‌ చేశారు. ప్రతి ఆదివారం ఒక గెస్ట్‌ వచ్చేవారు. మీరు(ఆలీ) వస్తున్నారని ఆ లిస్ట్‌ లో ఉంది. బ్రహ్మనందంగారితో కలిసి వచ్చారు. నేను గేటు దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోయా. అందరికి హాయ్‌ చెబుతూ మీరు లోపలికి వెళ్లారు. ఇది నా జీవితంలో మర్చి పోలేని సంఘటన. అప్పుడే మొదటి సారి నేను  మిమ్మల్ని చూశాను. ఎప్పటికైనా మీలా అవ్వాలని అనుకున్నా. నేను ఈ రోజు మీతో ఉన్నాను థ్యాంక్యూ సో మచ్‌.

మీ నాన్న ఏం చేస్తుంటారు?

ప్రియదర్శి: మా నాన్న ఈ మధ్యనే ప్రొఫెసర్‌గా రిటైర్‌ అయ్యారు. అమ్మ గృహిణి‌. మా చెల్లెలు భారతీయ నావికాదళంలో లెప్టినెంట్‌ కమాండర్‌. నా భార్య రచయిత్రి. నవలలు రాస్తుంది. నేను నటుడిని.

అనుకోకుండా ఇటు వచ్చావా లేకపోతే స్నేహితుల ప్రోద్బలంతో వచ్చావా?

ప్రియదర్శి: నాకు ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా. ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’ చూసి, సినిమాలంటే  ఇంత బాగుంటాయా అని అనిపించింది. వారి నటన చూసి ముగ్ధుడినైపోయాను. మనల్ని సినిమా ఇంతగా కదిలిస్తుందా? అనిపించింది. ఈ సినిమాలు నాకు స్ఫూర్తినిచ్చాయి. ఎప్పటికైనా చిరంజీవిలా కావాలని అనుకునేవాడిని. ఆ తర్వాత చిన్నతనం పోయి, రచయిత కావాలి, దర్శకుడు కావాలి అని అనుకున్నాను. మా నాన్న ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది. ఆయన కవితాత్మకంగా పద్యాలు రాసేవారు.

సినిమా పరిశ్రమకు వస్తానంటే మీ తండ్రి ప్రోత్సహించారా?

ప్రియదర్శి: లేదు. ఎందుకంటే, మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అలాంటి వారు సినిమాల్లోకి వెళ్లడమంటే ఎంతో కష్టం. కనీసం సినిమా నేపథ్యం ఉంటే అవకాశాలైనా వస్తాయి. ఒక టీవీలో ‘సీతాకోక చిలుక’ వేస్తే ఇంట్లో అందరం కలిసి చూస్తున్నాం. మా నాన్న బాగా చదువుకున్నారు కాబట్టి సినిమాలను విశ్లేషించేవారు. అప్పుడే మీ(ఆలీ) గురించి చెబుతూ ‘వీళ్ల నాన్న గారు ఒక టైలర్‌ నీకు తెలుసా. ఆ వయసులోనే ఆలీ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లా ఎంత బాగా యాక్ట్‌ చేస్తున్నాడో చూశావా?’ అని చెప్పారు. అప్పుడు అనిపించింది. మీరు(ఆలీ) చేయగలిగితే నేనెందుకు చేయలేను అని నాకనిపించేది. ఇలా చాలా విషయాలను మ్యాగజైన్‌లలో చదివి నాకు చెప్పేవారు. నేను కూడా పుస్తకాలు చదివి ఎన్నో తెలుసుకునేవాడిని. అవన్నీ నా మెదడులో ఉండిపోయాయి. మా ఇంట్లో వారు కూడా ‘ఇది చెయ్‌.. అది చెయ్‌..’అని ఎప్పుడు చెప్పలేదు. అయితే ‘స్థిరంగా ఒక ఉద్యోగం ఉంటే మంచిది’ అని అన్నారు. 

‘మల్లేశం’ చూసి మీ నాన్న ఏమన్నారు?

ప్రియదర్శి: చూశారు. ఏమీ మాట్లాడలేదు. భావోద్వేగంతో ఆలింగనం చేస్తున్నారు. మా అమ్మ కూడా  నన్ను గట్టిగా పట్టుకుని కన్నీటి పర్యంతమైంది.(మధ్యలో ఆలీ అందుకుని.. మీరు ఎవరి జీవిత కథలో అయితే నటించారో ఆ చింతకింది మల్లేశంతో కలిసి నేను కొన్ని రోజులు ట్రావెల్‌ చేశాను. అమెరికా వెళ్లినప్పుడు ఆయన తనని తాను పరిచయం చేసుకున్నారు. ‘పద్మశ్రీ’ అందుకున్న గర్వం ఆయనలో కొంచెం కూడా అనిపించదు. చాలా సాదాసీదాగా ఉంటారు. కల్మషం లేకుండా మాట్లాడతారు. లాక్‌డౌన్‌ సమయంలో మా ఇంట్లో పిల్లలు ‘మల్లేశం’ సినిమా చూస్తుంటే నేను కూడా కొద్దిసేపు చూశాను. దర్శకుడు మిమ్మల్ని ప్రధాన పాత్రకు ఎంచుకోవడం బాగుంది.)

ఈ కథ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలతో తీర్చిదిద్దారు కదా!

ప్రియదర్శి: చాలా ఎక్కువ సంఘటనలను తీసుకొని ఈ సినిమాను తీశాం. చెప్పాలంటే ఈ చిత్రంలో ఆయన పడ్డ కష్టాలను మేము 20శాతం మాత్రమే చూపించాం. ఇంకా చాలా ఉన్నాయి.

‘పెళ్లి చూపులు’ మీ కెరీర్‌ను మార్చింది. దాంట్లో ‘నా చావు నేను చస్తాను’ డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది కదా!

ప్రియదర్శి: (నవ్వులు) తరుణ్‌ భాస్కర్‌ రాశారు.

ఇప్పుడు ఏటీఎం దొంగల్ని చూస్తున్నాం. మీరు చిన్నప్పుడే ఆ పని మొదలు పెట్టారట!

ప్రియదర్శి: చిన్నప్పుడు సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. మా ఇంట్లో పాకెట్‌ మనీ ఇచ్చేవారు. అవసరం ఉన్నప్పుడు అడిగి తీసుకోవడమే. ప్రతిసారీ సినిమా చూడటానికి డబ్బులు అడిగితే ఇవ్వరు కదా! అందుకే నాన్న ఏటీఎం కార్డు తీసుకుని ఓ వంద డ్రా చేసేవాడిని. ఇప్పుడు వచ్చినట్లు అప్పుడు మెస్సేజ్‌ వచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి  పాస్‌బుక్‌ను బ్యాంకుకు తీసుకెళ్తే, ప్రింట్‌ చేసి ఇచ్చేవారు. ఆరేడు నెలల తర్వాత ఇంట్లో విషయం తెలిసి, దెబ్బలు కూడా పడ్డాయి.

‘ఫ్రెండ్స్‌ కోసం ప్రాణాలిస్తా’ అన్నారట. స్నేహమంటే అంత ఇష్టమా!

ప్రియదర్శి: ఇంటర్మీడియట్‌, డిగ్రీ చదువుతున్న రోజుల్లో కాలేజ్‌కు వెళ్లడం అంతగా నచ్చేది కాదు. స్నేహితులతో కలిసి సరదాగా తిరిగేవాడిని. ఇప్పటికీ నాతో చాలా స్నేహంగా ఉంటారు. కాలేజ్‌ తర్వాత నా స్నేహితుల్లో కొంతమంది కలిసి షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసేవాళ్లం. ఒక కెమెరాతో తీస్తే, మరొకరు డైరెక్ట్‌ చేసేవాళ్లు. ఇంకొకరు నటించేవారు. నేను ఈ స్థాయిలో ఉండటానికి వాళ్లు కూడా ఒక కారణం. నా భార్య కూడా మంచి స్నేహితురాలు. నాకు ఎంతో సహకరించింది.

‘ఈగ’తో మీ ప్రేమ పుట్టిందని తెలిసింది? దాని వెనుక ఉన్న కథేంటి?

ప్రియదర్శి: అప్పుడప్పుడే రిచా నేనూ ఒకరికి ఒకరం దగ్గరవుతున్నాం. ఫోన్‌లో బాగా మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ‘ఈగ’ విడుదలైంది. తనకి తెలుగు అంతగా రాదు. ఒక రోజు నాకు ఫోన్‌ చేసి, ‘ఈగ సినిమాకు వెళ్దామా’ అని అడిగింది. నేనూ సరేనన్నా. మొదటిసారి మేము చూసిన సినిమా అది. తను కాలేజ్‌లో నా సీనియర్‌. వాళ్లది ఆగ్రా దగ్గర బృందావనం.

మీరు వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నప్పుడు ఏ సంఘటన మిమ్మల్ని బాధించిందట!

ప్రియదర్శి: అప్పట్లో నేను కొన్ని పెళ్లిళ్లకు వీడియోలు తీశాను. ఒకరోజు ఓ పెళ్లికి వెళ్తే, స్టేజ్‌పైకి ఎక్కి వీడియో తీస్తుండగా, పెళ్లికూతురు తండ్రి ‘ఏయ్‌ స్టేజ్‌ దిగు. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని కసురుకున్నారు. చాలా బాధనిపించింది.

మీరు ఇంగ్లీష్‌ మాట్లాడుతుంటే, డిక్షనరీ వెంట పెట్టుకుని తిరగాలట!

ప్రియదర్శి: నేను ఎంఏ చేస్తున్న సమయంలో కొన్ని కఠిన పదాలు ఉండేవి. మాటల్లో అవి కూడా వచ్చేవి. ‘ఏం‌ మాట్లాడుతున్నావు రా.. మేము డిక్షనరీ తెచ్చుకోవాలా’ అని అనేవారు.

‘నటన కాకుండా ఏకేమైనా చేస్తే బాగుంటుంది’ అని ఎప్పుడైనా అనిపించిందా?

ప్రియదర్శి: నాకు మంచి స్క్రీన్‌ప్లే రాయాలని ఉంది. అందులో మీరు(ఆలీ) విలన్‌గా చేయాలి.

మీరు ఆడిషన్‌కు వెళ్లినప్పుడు మీకు నచ్చింది చేయమంటే ఏం చేస్తారు?

ఇప్పుడు తలుచుకున్నా మనసులో బాధగా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా?

ప్రియదర్శి: చాలా సందర్భాలు ఉన్నాయి. మా బాబాయ్‌తో నాకు మంచి రిలేషన్‌షిప్‌ ఉండేది. నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఒకరోజు సడెన్‌గా చనిపోయారు. ఆయన చనిపోయిన నాలుగేళ్లకు నేను యాక్టర్‌ అయ్యా. నా కుటుంబ సభ్యులందరూ సినిమా చూశారు. ఆయన కూడా చూసి ఉంటే బాగుండేదేమో అని ఇప్పటికీ బాధపడుతుంటా. (మధ్యలో ఆలీ అందుకుని, నా స్టార్‌డమ్‌ను మా పెద్దక్క చూడలేకపోయిందని నేను ఇప్పటికీ బాధపడుతుంటా. ఆ రోజు ‘నా తమ్ముడి నిద్రపోతున్నాడు కదా’ అని ఆమె ఊరుకుని ఉంటే ఆ సినిమాలో నా స్థానంలో వేరే వాళ్లు ఉండేవాళ్లు. అందుకు ఆమె పేరును నా కుమార్తెకు పెట్టుకున్నా)

‘టాలీవుడ్‌’ అన్న పదం నచ్చదట!

ప్రియదర్శి: ప్రతిదాన్ని మనం కేటగిరీలుగా విభిజిస్తున్నాం. ఈ పేర్లు కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయని నా అభిప్రాయం. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే సింపుల్‌గా ఉంటుంది.

‘టాలెంట్‌ లేకపోతే ఇండస్ట్రీలో కనికరం ఉండదు’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారట!

ప్రియదర్శి: అవును! ప్రతి వ్యక్తికి ఏదో ఒక పని గురించి కరెక్ట్‌గా తెలియాలి. అప్పుడే ఉద్యోగం వస్తుంది. ఉదాహరణకు వడ్రంగం పనిచేయాలంటే దాని గురించి తెలిసి ఉండాలి. ఇండస్ట్రీ కూడా అంతే. టాలెంట్‌, మంచితనం ఉన్న నటుడికి ఎప్పుడూ గౌరవం ఉంటుంది.

ఎవరో ఒక వ్యక్తి ఫోన్‌ చేసి, ‘మీరు 20వేలు గెలుచుకున్నారు’ అనగానే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లారట!

ప్రియదర్శి: (నవ్వులు) ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఛీ’ అనుకునే వరెస్ట్‌ సంఘటన ఒక ఉంటుంది కదా! అదే ఇది. ఒక క్లబ్‌ వాళ్లు నాకు ఫోన్‌ చేసి, ‘ఇటీవల మీరు సిటీ సెంటర్‌లో షాపింగ్‌ చేశారు కదా. మీరు రూ.28 వేల విలువైన గిఫ్ట్‌లు గెలచుకున్నారు’ అని చెప్పారు. అప్పటికీ నాకు అనుమానమే. ఎందుకంటే నా చిన్పప్పుడు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ‘మీరు ఏదైనా ఫిట్టింగ్‌ పెడితే, చాలా సీరియస్‌ అవ్వాల్సి వస్తుంది’ అని చెప్పాను. ‘అదేం లేదు సర్‌. మీరు మీ ఫ్యామిలీతో రండి. మంచి గిఫ్ట్‌’ అని అన్నారు. అప్పుడు నేను చందానగర్‌లో ఉండేవాడిని. అందరినీ క్యాబ్‌లో తీసుకుని వెళ్లాను. లోపలికి వెళ్లగానే అర్థమైంది. ‘సర్‌.. మీ మా హాలిడే ప్యాకేజ్‌ తీసుకుంటే, మీకు ఈ సదుపాయాలు ఉంటాయి. ఇది బెస్ట్‌ హాలిడే ప్యాకేజ్‌’ అంటూ మొదలు పెట్టారు. ఒళ్లు మండిపోయింది. ఈ తతంగం అంతా బ్లాగ్‌లో రాశా. చాలా వైరల్‌ అయింది.

గతంలో ‘స్పైడర్‌’లో మహేశ్‌బాబుతో ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌తో నటించడం ఎలా అనిపించింది?

ప్రియదర్శి: మహేశ్‌బాబుగారు చాలా ప్రొఫెషనల్‌. ఇప్పుడు ప్రభాస్‌తో నటించడం సంతోషంగా ఉంది. కరోనా కేసులు మొదలవుతున్న సమయంలో మేము జార్జియా వెళ్లి షూటింగ్‌ చేసి వచ్చాం. మేము వచ్చిన మూడో రోజు నుంచి ‘జనతా కర్ఫ్యూ’ పెట్టారు.

గత ఐదు నెలల్లో ఏం చేశారు? వంటలు నేర్చుకున్నారా?

ప్రియదర్శి: ఏమీ చేయలేదు. నాది క్లీనింగ్‌ సెక్షన్‌. మా ఆవిడ వంట చేసేది. నేను క్లినింగ్‌ పనులు చూసేవాడిని. కషాయాలు రోజూ తాగుతున్నా. మొదట్లో దాన్ని తాగడం వల్ల ఇబ్బంది పడ్డా. కొన్ని సమస్యలు వచ్చాయి. అవి కూడా కరోనా లక్షణాలకు దగ్గరగా ఉండటంతో భయం వేసింది. తుమ్మినా, దగ్గినా కరోనానేమోనన్న భయం ఏర్పడిపోయింది.

ఎప్పుడు దర్శకత్వం వహిస్తారు?

ప్రియదర్శి: ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. నటుడిగా ఇంకా మంచి సినిమాలు చేయాలి.

తెలంగాణ భాషలో మీకు బాగా నచ్చిన పదం ఏది?

ప్రియదర్శి: అమ్మ

ఇది నా జన్మహక్కు ఏ విషయంలో అనుకుంటారు?

ప్రియదర్శి: నాకు నచ్చినట్లు బతకడం

ఇండస్ట్రీలో ఉన్న మీ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌కు ఒక పేరు పెట్టమంటే?

ప్రియదర్శి: కపాలకండ్రీస్‌(నవ్వులు)

మీ భార్య.. మీ చెవిలో చెప్పిన సీక్రెట్‌?

ప్రియదర్శి: ఐ లవ్‌ వ్యూ టు

విజయ దేవరకొండ గురించి ప్రపంచానికి తెలియని సీక్రెట్‌?

ప్రియదర్శి: స్టేజ్‌పైకి వచ్చినప్పుడు బాగా మాట్లాడే విజయ్‌ దేవరకొండ.. బయట పెద్దగా మాట్లాడడు.

తరుణ్‌ భాస్కర్‌: స్నేహితుడు

రాహుల్‌ రామకృష్ణ: మిత్రుడు

ఆలీ: స్ఫూర్తి

ఒకసారి మస్తాన్‌ అనే కుర్రాడు ఎలాగో రామానాయుడు స్టూడియోస్‌లోకి వచ్చి నన్ను కలిశాడు. ‘అన్నా నా పేరు మస్తాన్. నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. హిందూ పేరు పెట్టుకుంటే అవకాశాలు వస్తాయా’ అని అన్నాడు. ‘ఇలాంటివి ఎవరు చెబుతున్నారు. మతంతో సంబంధం లేని ప్రదేశం ఇది’ అని చెప్పి మీ(ఆలీ) గురించి చెప్పా. అలాంటి వారికి మీరేమైనా సలహా ఇస్తారా?
ఆలీ: పేరు మార్చుకోవటం వల్ల మనకు వేషాలు వస్తాయనుకోవడం తప్పు. మన దగ్గర టాలెంట్‌ ఉంటే, ఏ పేరు ఉన్నా, ఆ పేరు పెట్టే పిలుస్తారు. ఇక్కడ చాలా మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఇక్కడి నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన మన హిందూ సోదరులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్లు కూడా అదే ఫీలయితే, అక్కడ ఖాన్‌లు, పఠాన్‌లు తప్ప ఎవరూ ఉండరు. ఇక్కడ టాలెంట్‌ ముఖ్యం. మనం తినే ఆహారం పండించే వ్యక్తి హిందువా? ముస్లిమా? మనకు తెలుసా? మతం మన గుండెల్లో ఉండాలి. దానిపై అభిమానం, ప్రేమ ఉండాలి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని