close

తాజా వార్తలు

అందుకే రష్మి నా లైఫ్‌: సుడిగాలి సుధీర్‌

‘జబర్దస్త్‌’ వదిలి వెళ్లను

కొన్ని వేల అందగత్తెల హృదయాలను స్కాన్‌ చేస్తే కనిపించే ఒకే ఒక్క రూపమతను. ఆడగాలులన్నీ ఇష్టపడే సుడిగాలి అతను. ఎందుకంటే అతని మాట మాయాజాలం.  నవ్వు ఇంద్రజాలం. ఒకసారి అతనికి సబ్‌స్క్రైబ్‌ అయితే చాలు నవ్వుల గంట ప్రతి గంటకూ మోగుతుంది. అతనే ‘సుడిగాలి’ సుధీర్‌. మేజిషియన్‌గా, బుల్లితెర నటుడిగా, యాంకర్‌గా, ప్రస్తుతం హీరోగా అలరిస్తున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా..’ కార్యక్రమానికి వచ్చి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

యాంకర్‌, జబర్దస్త్‌, హీరో, డ్యాన్సర్‌ ఏ సుధీర్‌ అని పిలవాలి? 
సుడిగాలి సుధీర్‌: ఫ్యామిలీ సుధీర్‌ అని పిలిస్తే చాలు(నవ్వులు)

ఇటీవల హీరోగా మారినట్లు ఉన్నారు?
సుడిగాలి సుధీర్‌: ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో పాటు, నేనూ శ్రీను, రాంప్రసాద్‌ కలిసి ‘త్రీమంకీస్‌’ అనే చిత్రంలో నటించాం. మేము తోకలేని కోతులమని దర్శకుడే ‘త్రీమంకీస్‌’అని పేరు పెట్టారు.

మీ సొంతూరు ఏది? ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చావు?
సుడిగాలి సుధీర్‌: మాది విజయవాడ. నన్ను నటుడిగా వెండితెరపై చూడాలన్నది మా అమ్మ కల. 

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి వెళ్తామంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. మరి నీకెలా ఒప్పుకొన్నారు?
సుడిగాలి సుధీర్‌: చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల దగ్గరి నుంచి నాకు మంచి సపోర్ట్‌ ఉంది. చదువు ఆపేసి వెళ్తానన్నా వాళ్లు ఒప్పుకొన్నారు. నేను ఎప్పటికైనా మంచి పొజిషన్‌కు వస్తానన్నది వాళ్ల నమ్మకం. ఇంటర్మీడియట్‌ ఆరేళ్లు కష్టపడి చదివా.(నవ్వులు)

ఉద్యోగం చేయలేదా?
సుడిగాలి సుధీర్‌: హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో ఒక కాల్‌ సెంటర్‌లో జాబ్‌ చేద్దామని ఇంటర్వ్యూకు వెళ్లా. నాతో పాటు ఇంటర్‌ చదవి, బీటెక్‌ కూడా పూర్తి చేసిన వాళ్లు అందులో సెలక్ట్‌ కాలేదు. నేను ఎంపికయ్యా. మొదటి రౌండ్‌ ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది ఈజీగానే పాసయ్యా (నవ్వులు). ఆ తర్వాత రెండు రౌండ్‌లు నాకు చుక్కలు కనిపించాయి. కంప్యూటర్‌లో క్వశ్చన్‌ పేపర్‌ ఇస్తే, నోటికి వచ్చిన జవాబులు పెట్టేశా. ఆ తర్వాత ముఖాముఖిలో నేను ఇంగ్లిష్‌లో మాట్లాడటం వాళ్లకు నచ్చింది. దాంతో ఉద్యోగానికి ఎంపికయ్యా. అయితే, నేను అప్పట్లో ప్యారడైజ్‌ దగ్గర ఉండేవాడిని. అక్కడి నుంచి అమీర్‌పేట వరకూ వెళ్లాల్సి రావడంతో నేనే చేరలేదు. 

కొన్నాళ్లు డ్యాన్స్‌ స్కూల్‌ కూడా నడిపినట్లు ఉన్నావు?
సుడిగాలి సుధీర్‌: విజయవాడలో ఉండగా మా నాన్నగారికి యాక్సిడెంట్‌ అయింది. ఆయన షుగర్‌ పేషెంట్‌ కావడంతో ఏదైనా ఇబ్బంది అయితే, కాలు తీసేస్తారేమోనని భయం ఉండేది. ఆపరేషన్‌ చేసేటప్పుడు కూడా బ్లడ్‌ కావాల్సి వచ్చింది. అదంతా ఒక టెన్షన్‌ ఎపిసోడ్‌. ఆ తర్వాత  ఇంట్లో అవసరాల కోసం ఒక డ్యాన్స్‌ స్కూల్‌ ఓపెన్‌ చేసి, నాకు తెలిసిన డ్యాన్స్‌ను పిల్లలకు నేర్పేవాడిని. ఇప్పుడు నేను సెటిల్‌ అయిన తర్వాత ఆయనను బాగా చూసుకుంటున్నా. రిటైర్‌మెంట్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయమని చెప్పా.

నీ తొలి సంపాదన రూ.93అట?
సుడిగాలి సుధీర్‌: అప్పట్లో చిన్న చిన్న ట్రిక్స్‌తో మేజిక్‌ చేసేవాడిని. అలా ఒక స్కూల్‌లో మేజిక్‌ షో చేస్తే ఆ డబ్బులు ఇచ్చారు. వచ్చిన మొత్తం ఖర్చు పెట్టకూడదని రిక్షా కూడా ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లి ఆ మొత్తాన్ని మా నాన్నకు ఇచ్చా. ఆయన కూడా చాలా సంతోషించారు. 

సాధారణంగా తొలి సంపాదన తల్లికి ఇస్తారు?మరి మీరేంటి తండ్రికి ఇచ్చారు?
సుడిగాలి సుధీర్‌: ఇంట్లో డబ్బుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మా నాన్న బాగా మేనేజ్‌ చేస్తారు. అమ్మకు ఇస్తే, అన్నీ దాచిపెట్టి, మళ్లీ మా నాన్నకు అప్పు ఇస్తారు. ఇప్పటికీ మా అమ్మకు నాన్న రూ.3లక్షల వరకూ అప్పు ఉన్నారట. ఒక వేళ మా అమ్మ దాచుకున్నా, మే బాగుండాలని మా కోసం పూజలు చేయించడానికి ఖర్చు పెడతారు.

ఐదో తరగతిలో ఉండగానే అమ్మాయికి లైన్‌ వేశావట!
సుడిగాలి సుధీర్‌: చిన్నప్పుడు ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే లింకులు పెడతారు కదా! అలా నేను ఒక అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్‌ ఏదో ఒకటి అనేవారు. కొన్నిరోజులకు ఆ అమ్మాయిని నేను కూడా ఇష్టపడ్డా. 5వ తరగతిలో ఇష్టపడితే, 9వ తరగతికి తను కూడా ఒప్పుకొంది. ఈ విషయం వాళ్లింట్లో తెలిసి గొడవలు అయ్యాయి. ఆ దెబ్బతో స్కూల్లో బాయ్స్‌ను, గాళ్స్‌ను వేర్వేరు తరగతుల్లో కూర్చోబెట్టారు. నేను పదో తరగతి పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అందరినీ కలిపేశారు.

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ అవకాశం ఎలా వచ్చింది?
సుడిగాలి సుధీర్‌: ఈటీవీలో ‘ఢీ’ షో చేస్తున్నప్పటి నుంచి నాకు కథలు చెప్పటం మొదలు పెట్టారు. అంతకుముందు రెండు మూడు కథలు వినిపించినా నాకు నచ్చలేదు. దర్శకుడు ఈ సినిమా లైన్‌ చెప్పగానే నచ్చేసింది. పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని చెబితే, ఏకంగా నిర్మాతతో సహా వచ్చేశారు. వెంటనే అగ్రిమెంట్‌పై సంతకం పెట్టమన్నారు. చెక్‌ కూడా ఇచ్చేశారు. పూర్తి కథ కూడా నాకు నచ్చింది.

తెలుగు ఇండస్ట్రీకి మీరు హిమేష్‌ రేష్మియా అట!
సుడిగాలి సుధీర్‌: అలా ఏమీలేదు(నవ్వులు) కథ ఏది డిమాండ్‌ చేస్తే అదే తీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో రొమాన్స్‌ అంతగా లేదు. 

మొత్తం మీరెంత మంది?
సుడిగాలి సుధీర్‌: నాకు ఒక అక్క, తమ్ముడు. అక్కా- బావ కెనడాలో ఉంటారు. వాళ్లకు ఒక పాప. తమ్ముడికి పెళ్లయిపోయింది. మాతోనే ఉంటాడు. వాడిది లవ్‌ మ్యారేజ్‌. నా పెళ్లికి ఇంకా సమయం ఉంది(నవ్వులు)

ఒక అందమైన అమ్మాయిని చూస్తే సుధీర్‌ లోపల ఏమనుకుంటాడు? బయట ఏమననుకుంటాడు?
సుడిగాలి సుధీర్‌: సాధారణంగా అందమైన అమ్మాయి కనపడితే అస్సలు చూడను. మనకెందుకులే అని వెళ్లిపోతా. (నవ్వులు)

మీ జీవితంతో ఒక వ్యక్తికి థ్యాంక్స్‌... మరో వ్యక్తి వార్నింగ్‌ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? 
సుడిగాలి సుధీర్‌: నా తల్లిదండ్రులకు ఎప్పటికీ థ్యాంక్స్‌ చెబుతూనే ఉంటా. ఎందుకంటే నాకు జన్మనిచ్చి, నన్ను ఇంతలా ప్రోత్సహించారు. అలాంటి తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం. వాళ్ల ఆశీర్వాదం వల్లే నేను ఎదిగా. వాళ్లు లేకపోతే నేను లేను. ఇక వార్నింగ్‌ ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు. అందరూ నాకు సాయం చేసిన వాళ్లే. నేను చదువుకునే సమయంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే, అమెరికాలో ఉండే మా అన్నయ్య ఆదుకున్నారు. మా అక్క పెళ్లికి కూడా బంధువులు సాయం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నాకు నేనే వార్నింగ్‌ ఇచ్చుకుంటా. 

సుడిగాలి సుధీర్‌ అంటే బుల్లితెర ఐటమ్‌రాజా అంటారు? నిజమేనా?
సుడిగాలి సుధీర్‌: ఇదేం నిజం కాదు. నేనేంటో మీకు తెలుసు. అమెరికా వెళ్లినప్పుడు కూడా మనం వారం రోజులు కలిసే ఉన్నాం. మీరు(ఆలీ) అన్నీ చూశారు కదా!

అవును.. అప్పట్లో నువ్వు వెన్ను నొప్పితో బాధపడేవాడివి కదా! ఎందుకు వచ్చింది?
సుడిగాలి సుధీర్‌: ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ, ఏడాది పాటు, నరకం అనుభవించా. ఎందుకు బతికి ఉన్నానా? అనిపించింది. వెన్నెముకలో ఉండే ఒక నరంపై కణిత వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. అది క్యాన్సర్‌ కణిత లేక మామూలు కణిత కూడా తెలియదు. దాని వల్ల విపరీతమైన నొప్పి వచ్చేది. పగవాడికి కూడా ఆ బాధ వద్దు. ఇంట్లో పడుకొని ఉండగా, ఎవరైనా పిలిస్తే ఆ వైపు తిరగగానే షాక్‌ కొట్టినట్లు అనిపించేది. కారులో ఎక్కలేకపోయేవాడిని, కనీసం డోరు తీయడానికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడేవాడిని. అలాగే ఏడాది పాటు షూటింగ్‌లు చేస్తూ ఉన్నా. ఈ విషయం ఎవరికీ తెలియదు.  సర్జరీ అయిన తర్వాత కొంతమందికి తెలుసు. స్కిట్‌లు చేస్తున్న సమయంలోనూ విపరీతంగా నొప్పి వచ్చేది. ఆ బాధను తట్టుకుంటూనే వాటిని పూర్తి చేసేవాడిని. అయితే,  ఆపరేషన్‌ చేయించుకోవడానికి డాక్టర్ల దగ్గరకు వెళ్తే, ‘సర్జరీ కాస్త క్లిష్టమైంది. ఏదైనా తేడా జరిగితే నడుం నుంచి కింది భాగమంతా చచ్చుపడిపోతుంది’ అని అన్నారు. నాకు భయమేసింది. ‘అందరినీ ఎంటర్‌టైన్‌ చేయడం మన ఉద్యోగం. కాళ్లు చచ్చుపడిపోతే మంచంలోనే ఉండిపోవాలి’ అని మొండిగా ఇంకొన్నిరోజులు షూటింగ్‌లకు వెళ్లా. నొప్పి పెరిగిపోయింది. ఒక్కోసారి ఏడుపు వచ్చేసేది. నాలో నేనే ఏడ్చేవాడిని. ఒక రోజు రిస్క్‌ తీసుకుని ఆపరేషన్‌ వెళ్లిపోయా. నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నన్ను ప్రేమించే ప్రేక్షకుల దీవెనల వల్లే ఆపరేషన్‌ విజయవంతమై ఇప్పుడు మీ ముందు ఉన్నా.

మేజిక్‌ షోలు చేసుకునే సుధీర్‌కు మెగాస్టార్‌ కాఫీ కలిపి ఇచ్చారట!
సుడిగాలి సుధీర్‌: మన జీవితంలో ‘ఇది చాలు’ అనుకుంటాం కదా! అలాంటి సందర్భమది. నేను ఫ్లాట్‌ కొనుకున్నా. దాని గృహ ప్రవేశానికి ఆయనను పిలుద్దామని ఫోన్‌ చేస్తే, వచ్చి కలవమన్నారు. నేనూ తమ్ముడు ఆయన ఇంటికి వెళ్లాం. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నేను చేస్తున్న షోల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘ఇల్లు కొనుకున్నాను సర్‌. గృహ ప్రవేశానికి పిలుద్దామని వచ్చా’ అని చెప్పడంతో మాట్లాడుతూ మధ్యలో లేచి వెళ్లి కొద్దిసేపటి తర్వాత వచ్చారు. ఇలోగా కాఫీలు వచ్చాయి. ‘నువ్వు ఏం తాగుతావు’ అని అడిగారు. ‘టీ, కాఫీలు నాకు అలవాటు లేదు సర్‌’ అని చెప్పా. ‘అయితే పాలు తాగు’ అని అన్నారు. అంతటి పెద్ద వ్యక్తి ఎదురుగా ఉంటే, టీ, కాఫీలు తాగుతూ సమయం ఎలా వృథా చేయగలం. అందుకే మాట్లాడుతూనే ఉన్నా, మధ్యలో మరోసారి ‘పాలు చల్లారిపోతున్నాయి. తాగు’ అన్నారు. అయినా, నేను తీసుకోలేదు. దీంతో ఆయనే కుర్చీలో నుంచి లేచి చక్కెర వేసి స్వయంగా పాలు కలిపి ఇచ్చారు. ఈ ఒక్క సంఘటన నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అలా మాట్లాడుతూ ఉంటే, గిఫ్ట్‌ తీసుకొచ్చి ఇచ్చారు. వెళ్లిపోతుంటే,  మా అమ్మానాన్నలకు బట్టలు పెట్టారు. అది చూసి భావోద్వేగంతో మా తమ్ముడు ఏడ్చేశాడు. నాకు, కన్నీళ్లు ఆగలేదు. 

ఈ సంఘటన కన్నా ముందు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చేస్తుండగా పవనకల్యాణ్‌గారు చిరంజీవిగారికి పరిచయం చేశారు. అప్పుడు ఆయన ‘నాకెందుకు తెలియదు. ఇతను వేణు. ఇతను సుడిగాలి సుధీర్‌..’ అంటూ నా గురించి చెప్పడం ఆశ్చర్యమేసింది. అంతటి స్టార్‌ మమ్మల్ని గుర్తు పెట్టుకోవడం నిజంగా సంతోషమనిపించింది. ఇది కాకుండా నేను చదువుకున్న స్కూల్లో నన్ను సన్మానం చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. 

అసలు బుల్లితెరపై ఎలా వచ్చారు?
సుడిగాలి సుధీర్‌: చిన్నప్పుడు దూరదర్శన్‌తో పాటు ఇంకొన్ని ఛానళ్లలో కొన్ని మేజిక్‌ షోలు చేశా. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ‘లోకల్‌ టీవీ’లో స్ట్రీట్‌ మేజిక్‌ చేయడం మొదలు పెట్టా. ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకున్నా. అదే సమయంలో శ్రీనుకు వేణు అన్న ఫోస్‌ చేసి, ‘ఈటీవీలో జబర్దస్త్‌ షో చేసే అవకాశం వచ్చింది. నాకు  టీమ్‌ కావాలి. నువ్వు చేస్తావా’ అని అడిగాడట. అప్పటికే శ్రీను ఇంకో ఛానల్‌లో పనిచేస్తుండటంతో కుదరలేదు. అప్పుడు ‘సుధీర్‌కు యాక్టింగ్‌ అంటే ఇష్టం. తను చేస్తాడు’ అని చెప్పాడట. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి, ఆడిషన్‌కు వెళ్లమన్నాడు. వేణు అన్నకు టైమ్‌ అంటే టైమ్‌.. ప్రాక్టీస్‌ అంటే ఆ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా, ప్రాక్టీస్‌ చేయాల్సిందే. నన్ను మధ్యాహ్నం 3గంటలకు రమ్మంటే నేను వేరే పనుల వల్ల 5.00గంటలకు వెళ్లా. దీంతో వేణు అన్నకు విపరీతమైన కోపం వచ్చింది. అది బయటకు కనపడనీయకుండా, మిగిలిన వాళ్లు చేస్తున్న ప్రాక్టీస్‌ను గమనించమన్నాడు. నేను కొద్దిసేపు చూసిన తర్వాత ఆకలిగా ఉండటంతో టిఫిన్‌ చేయడానికి బయటకు వెళ్లిపోయా. వేణు అన్నకు ఇంకా కోపం వచ్చింది. స్కిట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వాళ్లకు ఒకే చెప్పేసి బయటకు వచ్చేశాడు. నేను టిఫిన్‌ చేస్తుంటే, నా దగ్గరకు వచ్చి ‘ఇంటికి వెళ్దాం వస్తావా’ అన్నాడు. కారులో బయలుదేరాం. ‘మొదటి స్కిట్‌. బాగా చేయాలి. ఆర్టిస్ట్‌లు సరిగా కుదరలేదు’ అన్నాడు. ‘నేను ఒకసారి ట్రై చేయనా’ అని అడిగితే, ‘నీకు స్క్రిప్ట్‌ మొత్తం తెలియదు కదా! నువ్వు ప్రాక్టీస్‌ కూడా చేయలేదు’ అన్నాడు. ‘నాకు గుర్తుంది’ అని మొత్తం చేసి చూపిస్తే, ఆశ్చర్యపోయాడు. నామీద కోపంతో నేను చేయాల్సిన క్యారెక్టర్‌ వేరే అతనికి ఇచ్చాడు. మళ్లీ ఫోన్‌ చేసి, తనకి మరోసారి అవకాశం ఇస్తానని చెప్పి, నన్ను ఆ పాత్రకు ఎంపిక చేశాడు. అలా ఫిబ్రవరి 2, 2013లో జబర్దస్త్‌లో నా ప్రయాణం మొదలైంది. 

‘జబర్దస్త్‌’ షోలో ఎక్కువ బౌండింగ్‌ ఎవరితో ఉంటుంది?
సుడిగాలి సుధీర్‌: అందరితోనూ చక్కగా మాట్లాడతా. శ్రీను, రాంప్రసాద్‌, సన్నీలతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటా. 

‘జబర్దస్త్‌’ షో వదిలేసి మరో ఛానల్‌లో అవకాశం వస్తే వెళ్లిపోతారా?
సుడిగాలి సుధీర్‌: అలా వెళ్లను. వేరే ఛానల్‌లో కూడా అవకాశం వచ్చింది. చేయడానికి వెళ్తానేమో. ఒకవేళ ‘జబర్దస్త్’ ప్రొడక్షన్‌ వాళ్లు వద్దంటే ఆ ఛానల్‌కు వెళ్లను. 

వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందా?
సుడిగాలి సుధీర్‌: కొంచెం స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. అంతే తప్ప మరో ఆలోచనలేదు. 

మీ జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పుకోవాలని అనుకుంటున్నారా?
సుడిగాలి సుధీర్‌: మా మావయ్యకు. ఆయన మేజిషియన్‌. ఆయన వల్లే నేను మేజిక్‌ నేర్చుకున్నా. ఆ తర్వాత ఫిలింసిటీలో కొన్నాళ్లు  జాబ్‌ చేశాను. ఇక అమ్మమ్మ వాళ్లు కూడా మమ్మల్ని ఎంతో ఆదుకున్నారు. వాళ్లకు కూడా ఎప్పటికీ రుణ పడి ఉంటా.

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’లో ధన్య బాలకృష్ణన్‌ హీరోయిన్‌ కదా! నీ పేరు చెప్పగానే ఒప్పుకొందా?
సుడిగాలి సుధీర్‌: కొత్త వ్యక్తిని హీరోగా పెట్టి తీస్తున్నామని చెబితే, ‘కొత్తవాళ్లతో నేను చేయను’ అని చెప్పిందట. ఆ తర్వాత సుధీర్‌ అని చెబితే ‘ఏ సుధీర్‌’ అని అడిగిదంట. ఈటీవీలో షోలు చేసే సుధీర్‌ అని చెప్పారట. అంతేకాకుండా నా గురించి వాళ్ల స్నేహితులను కూడా అడిగిదంట. నేను చాలా పాపులర్‌ అని తెలియడంతో సినిమా చేయడానికి ఒప్పుకొంది.

ఎక్కడ చూసినా సుధీర్‌-రష్మి జంట చాలా పాపులర్‌. దీనిపై ఏం చెబుతావు?
సుడిగాలి సుధీర్‌: బయట అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మాది కేవలం ఆన్‌ స్క్రీన్‌ కెమెస్ట్రీ మాత్రమే. మేమిద్దరం ఏడేళ్ల నుంచి ఒకే షోలో కలిసి ప్రయాణం చేస్తున్నాం. తనపై పంచ్‌లు వేయడం, తను కూడా సరదాగా తీసుకోవడం ఇవన్నీ ప్రేక్షకులను అలరించడానికే తప్ప ఏమీ లేదు. 

రష్మిపై నీ అభిప్రాయం ఏంటి?
సుడిగాలి సుధీర్‌: తను చాలా ఇబ్బందులు ఎదుర్కొని పైకి వచ్చింది. ఆమె జీవితంలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాత తనపై ఇష్టం కన్నా గౌరవం మరింత పెరిగింది. 

నిన్ను ఒక జంతువుతో పోల్చుకోమంటే దేనితో పోల్చుకుంటావు?
సుడిగాలి సుధీర్‌: గుర్రం. అలిసిపోకుండా పరిగెత్తాలి. 

దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రాలలో ఒకరిని మాత్రమే కౌగలించుకోమంటే...
సుడిగాలి సుధీర్‌: రష్మి ఎక్కడ ఉందని అడుగుతా(నవ్వులు) ఆన్‌ స్క్రీన్‌ ఒన్లీ రష్మి.

జబర్దస్త్‌: అమ్మ
గెటప్‌ శ్రీను: తను కూడా అమ్మలాంటి వాడే.
అనసూయ: బ్యూటిఫుల్‌ గాళ్‌
రష్మి: నా లైఫ్‌. ఎందుకంటే సుధీర్‌ అనగానే మొదట వచ్చే చర్చ రష్మి. జనాలు ఇవాళ నా గురించి మాట్లాడుకుంటున్నారంటే తన వల్లే. Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.