ఆ హీరోయిన్‌ను చొక్కా పట్టుకుని అడగమన్నా - Alitho sardaga special chat show with Actor Naveen Chandra
close
Updated : 24/09/2020 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హీరోయిన్‌ను చొక్కా పట్టుకుని అడగమన్నా

తెరపై అతడు ‘అందాల రాక్షసి’ వెంటపడ్డ సూర్యుడు..

వీర రాఘవుడితో పోరాడిన ధీరుడు..

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల నటుడు..

కేవలం కథానాయకుడు మాత్రమే కాదు, హీరోని ఎదిరించిన ప్రతి నాయకుడు..

ప్రేక్షకులను మెప్పించిన సహజ నటుడు..

అతడే నవీన్‌ చంద్ర. తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆయన ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా.

ఏంటి బ్రదీప్‌. ఈ పేరు ఎక్కడిది?

నవీన్‌ చంద్ర: నేను పుట్టింది హైదరాబాద్‌. పెరిగింది బళ్లారి. డ్యాన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. బళ్లారి, బెంగళూరులలో చాలా డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఉండేవి. కొరియోగ్రాఫర్‌ అవకాశాల గురించి కూడా ప్రయత్నించాను. నటుడు అవుదామని బళ్లారి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను. మొదటిసారి నేను హైదరాబాద్‌ వచ్చినప్పుడు తరుణ్‌, త్రిష నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ షూటింగ్ చూశాను. మొదటిసారిగా కెమెరామెన్‌ సెంథిల్‌ నాపై ఫొటో షూట్‌ చేశారు. మేనేజర్‌ గిరిధర్‌ గారి వల్ల ఆ ఫొటోలు చెన్నై చేరాయి. అక్కడి నుంచి నాకు మొదటిసారి అవకాశం వచ్చింది. ‘నీ పేరు నవీన్‌ చంద్ర కదా. న్యూమారాలజీ ప్రకారం నీ పేరు మార్చుకుంటే బాగుంటుంది’ అని చెప్పి నా పేరు బ్రదీప్‌గా మార్చారు. ‘మీరు ఏమైనా చేయండి సినిమాను మాత్రం మొదలు పెట్టండి’ అని చెప్పాను. ఆ పేరుతో తమిళ్‌లో ఎవరూ లేరు.

మెడలో తులసి మాల వెనుక కథేంటి?

నవీన్‌ చంద్ర: ఇది తులసి మాల కాదండీ. నేను స్నేహితులతో కలిసి హిమాచల్‌ వెళ్లాను‌. ఒక వృద్ధ మహిళ తన చేతితో ఈ మాలను చేస్తోంది. ‘ఎంత’ అని అడిగాను. రూ.10అని మాత్రమే చెప్పింది. అద్భుతంగా ఉందని చెప్పి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇష్టంగా తీసుకున్నాను‌. మా అమ్మ తులసి మాల ఇచ్చినప్పుడు ఏదైతే భావన కలిగిందో, ఆవిడను చూసినప్పుడు నాకు అదే భావం కలిగింది. అందువల్ల ఇది కొనుక్కున్నాను‌. ఈ మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ తీయలేదు‌. సెంటిమెంట్‌గా అలానే ఉంచేశాను. షూటింగ్‌లో కూడా అవసరమైతే తప్ప తీయను. 

మీకు నమ్మకాలు ఉన్నాయా?

నవీన్‌ చంద్ర: ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. ఇప్పుడు మా అమ్మ వల్ల నమ్మడం మొదలు పెట్టా. కాలేజీ స్నేహితులు, రెబల్స్‌, గొడవలు పెట్టుకోవడం ఎక్కువైపోయింది. బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండేది. కానీ, డ్యాన్స్‌, సినిమాలంటే పిచ్చి. బళ్లారి నుంచి గుంతకల్ 59 కి.మీ. చిరంజీవి గారి సినిమా వస్తుందంటే బాక్స్‌ తీసుకెళ్లడానికి అందరం గొడవ పడేవాళ్లం. ఇతర హీరోల అభిమానులు సమయానికి విడుదల కాకుండా చేయాలని అడ్డుకునేవారు. బైక్‌పై నేను, నా మిత్రుడు బాక్స్‌ను తీసుకొని వచ్చి సమయానికి సినిమా వేసేవాళ్లం.

చిరు ఎదుట ఆయన పాటకు డ్యాన్స్‌ చేయడం ఎలా అనిపించింది?

నవీన్‌ చంద్ర: అమెరికాలో ఒకసారి ఆయన పాటకు డ్యాన్స్‌ చేశా. ఆ తర్వాత దసపల్లా హోటల్‌లో ‘రంగస్థలం’ పాటకు చేశా. ఆయనను చూసే నేను డ్యాన్స్‌ నేర్చుకున్నాను. నాకు ఆయనే స్ఫూర్తి. 

తెలుగులో చిరు, తమిళంలో ఎవరు స్ఫూర్తి?

నవీన్‌ చంద్ర: కమల్‌ హాసన్‌గారు‌. (మధ్యలో ఆలీ అందుకుని.. నా పేరు చెబుతావని అనుకున్నా) నేను మిమ్మల్ని చూసి కూడా చాలా స్ఫూర్తిని పొందాను‌. మనిద్దరం కలిసి ‘జూలియెట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌’ చేశాం. నెక్లెస్‌ రోడ్డులో షూటింగ్‌ చేసినప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను‌. ‘నేను రోజూ రన్నింగ్‌, ఎక్సర్‌సైజులు చేస్తాను‌. మనం ఇద్దరం కలిసి పరిగెత్తినప్పుడు మీరు నాతో సమానంగా పరిగెత్తారు. నా ట్రైనింగ్‌లో ఏమైనా తప్పుందా లేదా మీరు నా కంటే ఎక్కువగా రన్నింగ్‌ చేస్తారా?’ అని అడిగాను. ఫైట్‌ సీన్‌లో నా గుండెల వరకూ మీ కాలు లేపారు. మీ శరీరం ఎటు అంటే అటు వంగుతుంది.

మీరు ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడతారు?

నవీన్‌ చంద్ర: భారత్‌లో పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. అప్పట్లో నేను సంజయ్‌ గాంధీనగర్‌ కాలనీలో ఉండేవాడిని. అక్కడ అన్ని మతాల వారు ఉంటారు. అన్ని రకాల భాషలు మాట్లాడతారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడతాను. బెంగాళీ, కొంకణి బాగా అర్థమవుతుంది.

మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు?

నవీన్‌ చంద్ర: మా అన్నయ్య కర్ణాటక ఆర్‌టీసీలో పనిచేస్తుంటారు. మా నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్యకు ఆ ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆకౌంటెంట్‌ క్లర్క్‌గా పని చేస్తున్నారు.

మీకు ఏమీలేని సమయంలో ఒక రచయిత మిమ్మల్ని తన గదికి తీసుకెళ్లి, అన్నం పెట్టి, కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారట!

నవీన్‌ చంద్ర: నాకు మా అమ్మ తర్వాత ఆయనే‌. నటుడిగా అవకాశాల కోసం నేను ప్రయత్నిస్తున్నాను‌. మొదటి సారి వెండితెరపై నేను ‘ఖైదీ’ చూశాను‌. అమ్మకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్‌, సావిత్రిలాంటి మహానటులంటే ఆమెకు ఎంతో ఇష్టం. అమ్మ వల్లే నాకు సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. హైదరాబాద్‌కు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ‘సంభవామి యుగేయుగే’ దర్శకులు వచ్చి మాకు ముగ్గురు అబ్బాయిలు కావాలన్నారు. ఆ రోజు నా డ్యాన్స్‌ చూసి ఆ సినిమాలో లీడ్‌ క్యారెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకు రచయిత యతిరాజ్‌ లక్ష్మీభూపాల్‌.

ఆ సినిమా చేస్తున్న సమయంలో ఆయన నాకు బాగా దగ్గరయ్యారు. ఆ సినిమా ఫలితం తారుమారైంది. ఆ తర్వాత ఎక్కడ ఉండాలో నాకు తెలియలేదు. తమిళ సినిమాలు కొన్ని చేశాను. అవి విడుదల కాలేదు‌. నాకు వచ్చిన రెమ్యునరేషన్‌లోనే మా ఫ్యామిలీని చూసుకోవాల్సి వచ్చేది. ఒక చిన్న గదిలో ఆయన ఉండేవారు. ‘నవీన్‌ నీలో చాలా టాలెంట్‌ ఉంది ప్రయత్నించు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రా’ అని చెప్పారు. దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి ‘నేను వచ్చేశా’ అని అన్నాను. మర్యాద.. తెలుగు మాట్లాడటం.. నటుడిగా మనం ఎదగాలంటే ఎంత కృషి చేయాలి? ఇతరులతో పని చేసేటప్పుడు ఏవిధంగా ప్రవర్తించాలి? ఇలా అనేక విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. చపాతీలు, వంట చేయడం కూడా నేర్చుకున్నాను. ‘ఓ బేబీ’ సినిమాకు కూడా ఆయనే రచయిత. 

‘అందాల రాక్షసి’ అవకాశం ఎలా వచ్చింది?

నవీన్‌ చంద్ర: నేను తమిళ్‌లో ‘తేరుడం వీధియిలే’ అనే సినిమా చేశాను. బాగా వచ్చింది. అయితే, దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ఆగిపోయింది. ఫలితంగా నేను కుంగుబాటుకు లోనయ్యా. ఇంటి దగ్గరి నుంచి ఒత్తిడి ఉంది. ‘ఏంటి నటన అంటున్నావు. నువ్వు బాగా చదివేవాడివి ఆ చదువును కూడా ఆపేశావు. నీ భవిష్యతేంటి’ అని అడిగేవారు. ఏదో తెలియని శక్తి, భూపాల్‌ గారి వల్ల ఈ అవకాశం వచ్చింది. ఒకటిన్నర సంవత్సరం జుట్టు, గడ్డం అలాగే వదిలేశాను. అలాగే వెళ్లి దర్శకుడు హను రాఘవపూడిని కలిశా. ‘నేను చెప్పేదాకా జుట్టు, గడ్డం కట్‌ చేయకు. ఏ సినిమాకు కూడా సంతకం చేయకు’ అని చెప్పారు. నాకు ఉండటానికి ఫ్లాట్‌, సహాయకుడిని ఇచ్చారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఆయనతో జర్నీ చేశాను. అప్పుడే ‘అందాల రాక్షసి’లో అవకాశం వచ్చింది. ప్రజలందరికీ నేను సూర్యగానే తెలుసు. నవీన్‌ చంద్ర అంటే తెలిసేది కాదు.

ఆ సినిమా విడుదల తర్వాత చాలా మంది అమ్మాయిలు మీ వీధిలో తిరిగేవారట నిజమేనా?

నవీన్‌ చంద్ర: అవును‌. సినిమా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. నా దగ్గర బుల్లెట్‌ ఉండేది. సినిమా ఆఫీసులకు కూడా దాని మీదే తిరిగే వాడిని. కారు లేకుంటే బాగోదని చెబితే సెకండ్‌ హ్యాండ్‌లో వైట్‌ కలర్‌ స్విప్ట్‌ డిజైర్ కొనుక్కున్నాను.  నా కారు పార్క్‌ చేసి ఉంటే దానిపై ఏవేవో పిచ్చి రాతలు రాసేవారు. ఒక రకమైన ప్రేమను చూపించేవారు. అమ్మాయిల నుంచి చాలా గిఫ్ట్‌లు వచ్చేవి. కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉన్నాయి (నవ్వులు).

సినిమా షూటింగ్‌ ప్రారంభించే ముందు దర్శకుడితో పాటు నిర్మాతతో పది రోజులు సహవాసం చేస్తారట!

నవీన్‌ చంద్ర: నా ఆలోచన ఏంటంటే దర్శకుడు ఎక్కడో కూర్చుని ఆలోచన చేస్తే, ఒక చిన్న లైన్‌ వస్తుంది. ఆ లైన్‌ని పట్టుకుని కథ సిద్ధం చేసి, చాలా మందికి పని ఇస్తున్నారు. నా ఫేస్‌ను ఆ సినిమాకు వాడుతున్నారు. ఆ కథలోని కష్టాలు, ఇష్టాలు అర్థం చేసుకుంటే పూర్తిగా రాణించగలను అని నా నమ్మకం‌. అందుకే సినిమా మొదలయ్యే ముందు వారితో కలిసుంటా.

‘అందాల రాక్షసి’ హిట్టా, ఫట్టా?

నవీన్‌ చంద్ర: ఫలితం ఏదైనా నా దృష్టిలో హిట్‌. నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆ సినిమాతో వచ్చిన జీవితం ఎక్కడా ఆగిపోలేదు‌. ‘జులాయి’, ‘అందాల రాక్షసి’ ఒకేసారి విడుదలయ్యాయి. సినీ మ్యాక్స్‌లో ‘జులాయి’ మొదటి షో అయిపోయిన అనంతరం తర్వాత షో ‘అందాల రాక్షసి’ వేస్తుంటే త్రివిక్రమ్‌ గారు నిలబడి మరీ ఆ సినిమాను చూశారు. అది గుర్తు పెట్టుకునే ‘అరవింద సమేత’లో పాత్ర ఇచ్చారు. త్రివిక్రమ్‌గారిని కలిసినప్పుడు ‘ఆ పాత్రకు నేనెందుకు సర్‌’ అని అడిగాను. ‘అందాల రాక్షసి’లో నేను నిన్ను చూశాను. నీతో ఎప్పుడైనా పని చేయాలనుకున్నాను. ఆ సినిమానే ఇది అని చెప్పారు.

మనిద్దరం(ఆలీ-నవీన్‌) కలిసి ఒక సినిమాను చేశాం. టాకీ అయిపోయింది. ఆ నిర్మాతకు ఏదో ఇబ్బంది వస్తే కొన్ని రోజులు ఆ సినిమా ఆగిపోయింది. ఈలోగా అందులో హీరోయిన్‌ పెద్ద నటుడి పక్కన సినిమా చేసి, అది హిట్టయింది. ఆ తర్వాత నీతో సాంగ్స్‌ చేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఎవరా హీరోయిన్‌?

నవీన్‌ చంద్ర: ఇప్పుడు ఆమె పేరు చెప్పటం కరెక్ట్‌ కాదేమోనండీ. ఆ పరిస్థితుల్లో తను చేసింది కరెక్ట్‌ కావొచ్చు. ఆ హీరోయిన్‌ స్థానంలో నేను ఉండుంటే తప్పకుండా సాంగ్స్‌ పూర్తి చేసేవాడిని. ఆ తర్వాత నేను కూడా మాట్లాడాను. ప్రొడక్షన్‌ హౌస్‌తో ఆమె ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఆ తర్వాత వచ్చి పాటలు పూర్తి చేసింది.

చీమను చూస్తే పారిపోతారట? ఎందుకు?

నవీన్‌ చంద్ర: చిన్నప్పుడు పెదాల మీద కుట్టింది‌. గండు చీమ అయితే వెంటనే చంపేసే వాడిని. కానీ, చిన్న ఎర్ర చీమ కుట్టి నన్ను వణికించింది. చీమను చూస్తే తప్పుకొని వెళ్లిపోతాను‌. చంపను. అమ్మా.. ఇక్కడ చీమలున్నాయి అని చెప్పి వెళ్లిపోతాను‌.

స్కూల్లో పేరెంట్స్‌ను తీసుకురమ్మంటే నకిలీ వాళ్లను తీసుకెళ్లారట!

నవీన్‌ చంద్ర: బళ్లారి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో అద్దిన గుండం అనే ప్రాంతంలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. గూడ్స్‌ రైలు మాత్రమే వెళ్లేది. నాకు కొంత మంది మిత్రులు ఉండేవారు. స్కూల్లో అటెండెన్స్‌ అయిపోగానే టీచర్‌కు కనపడకుండా వాళ్లతో కలిసి గూడ్స్‌ రైలు ఎక్కేవాడిని. ఈ విషయాన్ని మా మేథమెటిక్స్‌ టీచర్‌ రుక్మిణి మేడమ్‌ గమనించి ప్రిన్స్‌పాల్‌కు చెప్పారు. మమ్మల్ని తల్లిదండ్రులతో రమ్మని నోటీస్‌ బోర్డులో పెట్టారు. ఆ నోటీస్‌ అన్నయ్య చూశాడని నాకు తెలియదు. ఇంట్లో చెబితే తిడతారని నకిలీ తల్లిదండ్రులను తీసుకెళ్లా. అదే సమయంలో మా అమ్మ, అన్నయ్య వచ్చారు. అంతే అందరం ప్రిన్సిపల్‌ ముందు దొరికిపోయాం. ఇంటికి వెళ్లాక నాన్న నన్ను మామూలుగా కొట్టలేదు. చిన్నప్పుడు చాలా చిలిపిగా ఉండేవాడిని.

‘ఆర్‌.ఎక్స్‌ 100’లో అవకాశం మొదట మీకే వచ్చిందట కదా!
నవీన్‌ చంద్ర: ‘అందాల రాక్షసి’ విడుదలైన తర్వాత నా లుక్‌ చూసి అజయ్‌ భూపతి నన్ను కలిశారు. కథ నచ్చడంతో ఇద్దరం చేద్దామని అనుకున్నాం. కానీ, నిర్మాతలు దొరకలేదు. నేను కూడా అప్పటికి రెండు, మూడు సినిమాలు మాత్రమే చేయడంతో ఎవరూ ముందుకు రాలేదు. అజయ్ కూడా నా కోసం ఏడాది పాటు ఆగారు. కార్తికేయతో ఆ సినిమా ఓకే అయ్యాక వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు. ‘నవీన్‌ జీ ఏమీ అనుకోవద్దు. మనం  బాగా ప్రయత్నించాం. కుదరలేదు. వేరే వాళ్లతో ఆ సినిమా ఓకే అయిపోయింది’ అని చెప్పారు. నేనూ సరేనన్నాను. అప్పుడే దర్శకుడు పడే ఇబ్బందులు కూడా నాకు తెలిసి వచ్చాయి. అప్పటి నుంచి దర్శకులంటే నాకు విపరీతమైన గౌరవం పెరిగిపోయింది. నాతో కలిసి చేస్తే అంత పెద్ద విజయం లభించేదో కాదో నాకు తెలియదు. కానీ, ఆ సినిమా విజయం సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 

‘అందాల రాక్షసి’ విడుదలైన తర్వాత ఒక అమ్మాయి ఇంట్లో నుంచి డబ్బులు, నగలు తీసుకొచ్చి వెళ్లిపోదామని మీకు ఫోన్‌ చేసిందట. నిజమేనా?

నవీన్‌ చంద్ర: అప్పట్లో ఫోన్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేయటం, ట్రూ కాలర్స్‌ ద్వారా ఎవరు చేస్తున్నారో తెలుసుకునే సదుపాయం లేదు. ‘అందాల రాక్షసి’ సమయంలో ప్రమోషన్స్‌ కోసం చాలా మందికి నంబర్‌ ఇచ్చాం. నా నంబర్‌ ఎలాగో ఆ అమ్మాయికి తెలిసింది. సినిమా విడుదలైన మూడో రోజు సాయంత్రం నుంచి కాల్స్‌ చేయడం ప్రారంభించింది. ఎవరో అభిమానులు సినిమా బాగుందని చెప్తారనుకున్నాను. ఆ అమ్మాయి ఫోన్‌ చేసినప్పుడు ఎత్తడంతో నేనేనని తెలిసిపోయింది. ఆ అమ్మాయి ఒక నిమిషం కూడా వదలకుండా నాన్‌స్టాప్‌గా ఫోన్‌ చేయడం మొదలెట్టింది. నేను చాలా వరకూ పట్టించుకోలేదు. రాత్రి సమయంలో మెసేజ్‌లు వస్తున్నాయి. అందువల్ల ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేశాను.

తెల్లవారుజామున ఫోన్‌ ఆన్‌ చేయగానే ‘నేను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏడో నెంబరు ప్లాట్‌ఫామ్‌పై ఉన్నాను’ అని మెసేజ్‌ పెట్టింది. నాకు కాస్త ఆందోళనగా అనిపించి, నా మిత్రుడికి ఫోన్‌ చేశాను. నా స్నేహితుడు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మొత్తం విషయం చెప్పి ‘ఏం చేయాలి’ అని అడిగాను.‘నువ్వు ఏం భయపడకు. ఏం కాదు’ అని చెప్పాడు. ఆ తర్వాత తను వెళ్లి, ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నాడు. ‘నవీన్‌ చంద్రను కలిస్తే ఏం చేస్తావు’ అని అడిగాడు. ‘పెళ్లి చేసుకుంటా’ అని చెప్పింది. నా ఫ్రెండ్‌ వెంటనే నాకు ఫోన్‌ చేసి రమ్మన్నాడు. నేను వెళ్లగానే ఆ అమ్మాయి భోరున ఏడ్చేసింది. ప్లాట్‌ ఫాంపై ఆమె ఏడుస్తుంటే నాకు భయమేసింది. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీని పిలిచి విషయం మొత్తం చెప్పాం. వాళ్లు మాకు థ్యాంక్స్‌ చెప్పారు. ఎందుకంటే తను ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అన్నీ తీసుకుని వచ్చేసిందట.

తలచుకోగానే ఏడుపు వచ్చే సంఘటన!

నవీన్‌ చంద్ర: నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పుడు బాగా ఏడ్చేశా. ఆ రోజు నుంచి నేను ఆంజనేయస్వామిని నమ్మడం మొదలు పెట్టాను. ప్రస్తుతం నాన్న  ఉంటే  నా సక్సెస్‌ను చూసి ఆనందించేవారు. కనీసం ప్రయోజకుడిని అయ్యానని సంతోషపడేవారు.

ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా, ‘నవీన్‌ చంద్ర మంచోడు’ అంటారు. అంత సింపుల్‌గా ఉండటం ఎలా అలవాటైంది?

నవీన్‌ చంద్ర: నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు‌. ప్రతి నిమిషం (మంచి, చెడు) ఏవిధంగా ఉన్నా సరే దానిని అనుభవించాలని నేను అనుకుంటాను. ఎవరినీ ప్రశ్నించను. అది వారి జీవితం. ఎవరి జీవితాన్నీ మనం ఆటంక పరచకూడదు. మా నాన్న దగ్గర నేర్చుకుంది అదొక్కటే‌. నువ్వు నీ లాగా ఉండు. ఎవరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నించకు అని చెప్పారు.  

మీ చిన్నప్పుడు ఏ సంఘటనను గుర్తు చేసుకుంటే నీకు బాగా నవ్వు వస్తుంది.

నవీన్‌ చంద్ర: చాలా ఉన్నాయి‌. నేను, మా అన్నయ్య బాగా కొట్టుకునేవాళ్లం. మా అన్నయ్య మామిడిపండ్లు కోయడంలో మంచి నిపుణుడు. ఒక దెబ్బకు కాయల్ని కింద పడేసేవాడు. నాకు చెట్లు ఎక్కాలంటే కొంచెం భయం. అందువల్ల కొంచెం నాకు సమయం పట్టేది. ఎందుకంటే చీమలు ఉంటాయని నేను భయపడతాను. ఒక సారి మా అన్నయ్య మామిడి కాయ కోసి తర్వాత చాలా ఎత్తు నుంచి పడిపోయాడు. దేవుడి దయ వల్ల కింద బురద ఉండటంతో అన్నయ్యకు ఏమీ కాలేదు. కానీ, కాలుకి చిన్న దెబ్బ తగిలింది. మామిడి పండు కూడా చితికిపోయింది. నేను చాలా గట్టిగా నవ్వేశాను. మా అన్నయ్య అమ్మకు ఎప్పుడూ నా మీద ఫిర్యాదు చేసేవాడు. అందువల్ల కిందపడటంతో నేను చాలా ఎంజాయ్‌ చేశాను. కానీ, ఇప్పటికి ఆ సంఘటన తలచుకుని నేను బాధ పడుతుంటా. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది.

బాగా భయమేసిన సందర్భం?

నవీన్‌ చంద్ర: ‘దళం’ సినిమా షూటింగ్‌ సమయంలో బాగా భయపడ్డా. ఆ సినిమాలో డమ్మీ గన్స్‌తో ఫైట్‌ సీన్‌ తీస్తున్నారు. కొండపైన షూటింగ్‌. నేను పరిగెత్తుకుంటూ వెళ్లాలి. సడెన్‌గా నాకు ఏదో అడ్డం వచ్చింది. పట్టేసినట్లు అనిపించింది. దర్శకుడు కట్‌ చెప్పగానే చూసుకుంటే నా కాలిని పాము చుట్టేసుకుని ఉంది. చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకవేళ పాము కరిచి ఉంటే నేను ట్రీట్‌మెంట్‌ తీసుకోవడానికి మూడున్నర గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. నన్ను పాము కరిచిందని చెబితే షూటింగ్‌ ఆగిపోతుంది. అందుకే, దాన్ని గట్టి పట్టుకుని పక్కన వదిలేశా. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత కాలు చూసుకుంటే పాము కరిచినట్లు ఎక్కడా గుర్తులు లేవు. దాంతో ఊపిరి పీల్చుకున్నా.

‘ఎవరు’లో ఒక సీన్‌ను నాలుగు విభిన్న కోణాల్లో తీశారట!

నవీన్‌ చంద్ర: కథలో భాగంగా ఒక రేప్‌ సీన్‌ షూట్‌ చేశారు. ఒక పాత్ర ఏడాది గ్యాప్‌ చూపించాలి. ఒక సన్నివేశంలో ఫిట్‌గా ఉండాలి. మరో సన్నివేశంలో కాస్త సన్నగా ఉండాలి. ఐదు రోజుల్లో ఆ సీన్లు షూట్‌ చేశాం. అన్ని రోజులు దాదాపు తిండి మానేసి ఉన్నాను. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. అలాంటి సీన్లు వచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తారు. కానీ, అడవి శేష్‌, దర్శకుడు రాంజీ డీల్‌ చేసిన విధానం అందరికీ నచ్చింది. ఆ రేప్‌ సీన్‌ జరిగే సమయంలో రెజీనాకు చెప్పాను. ‘నేను నా లిమిట్స్‌ దాటను. ఒక వేళ దాటానని  అనిపిస్తే, నా కాలర్‌ పట్టుకుని అడగండి’ అని చెప్పాను. ఆ సీన్‌ చేయడానికి ఒప్పుకున్న ఆమెకు నిజంగా  హ్యాట్సాఫ్‌  చెప్పాలి.

ఇండస్ట్రీలో అవమానపడిన సందర్భాలు ఉన్నాయా?

నవీన్‌ చంద్ర: చాలా ఉన్నాయి. వాటి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఒక వ్యక్తికి నేను చాలా థ్యాంక్స్‌ చెప్పాలి. నేను ఒక ఇనిస్టిట్యూట్‌లో డ్యాన్స్‌ క్లాస్‌లు చెప్పేవాడిని. తేజగారి దగ్గర రామానంద్‌ అనే క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ఉన్నారు. ఆయన నాకు ఒక ఆఫర్‌ ఇచ్చారు. ‘నువ్వు నా ఇనిస్టిట్యూట్‌కు వచ్చి, డ్యాన్స్‌ నేర్పించు. నీకు ఫ్రీ యాక్టింగ్‌ క్లాస్‌లు’ అన్నారు. సరేనని నేను యాక్టింగ్‌ క్లాస్‌కు వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నన్ను ‘ఎందుకు వచ్చేస్తారయ్యా.. ఎర్రబస్సు ఎక్కి’ అంటూ మాట్లాడారు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే.. నేను ఎర్రబస్సులో రాలేదు.. రైల్లో వచ్చాను. నేను నటుడిని కావాలన్న కోరిక కలిగించింది బళ్లారి ఆడియన్స్‌. నేను చేసిన ప్రతి స్టేజ్‌ షోకు వాళ్లు కొట్టిన చప్పట్లే నాలో స్ఫూర్తిని నింపాయి.

ఈ సినిమాలో మీది అద్భుతమైన పాత్ర అని చెప్పి షూట్‌ చేసి, ఎడిటింగ్‌లో తీసేసిన సందర్భాలు ఉన్నాయా?

నవీన్‌ చంద్ర: ఈ విషయం చాలామందికి తెలియదు. ఒక సినిమా విషయంలో ఇలా జరిగింది. అయితే, ఒక సినిమాను ఎలా ప్రొజెక్ట్‌ చేయాలి? ఏమేమి ఉంచాలి? అన్నది ఆ దర్శకుడికి మాత్రమే తెలుసు. నా స్వార్థం కోసం నేను పట్టుబట్టకూడదు కదా! ఆ సినిమా పెద్ద హిట్టయింది. బాగా డబ్బులు వచ్చాయి. ఆ సమయంలో నా పాత్ర తగ్గించినందుకు బాధపడ్డా. సినిమా హిట్టయినందుకు సంతోషపడ్డా. అదే ‘నేను లోకల్‌’. ఈ సినిమా చేసే ముందు నాకు అసలు సినిమాలే లేవు. హీరోగానూ ఒక్క సరైన హిట్‌ లేదు. బెక్కం వేణుగోపాల్‌గారు ఆ సినిమా తీసుకొచ్చి ‘నువ్వు చెయ్‌ నవీన్‌’ అన్నారు. ఆ తర్వాత కూడా ఏ సినిమా చేయాలన్నా పెద్ద కన్ఫ్యూజన్‌ ఉండేది. అప్పుడే  నన్ను రాజా రవీంద్ర అనే ఒక గొప్ప వ్యక్తి కలిశారు. ‘నాకు ఒక నెల సమయం ఇవ్వు’ అన్నారు. ఒక నెల పాటు అలాగే ఖాళీగా కూర్చొన్నా. ‘నా కెరీర్‌ అయిపోయిందా? వేరే జాబ్‌ చూసుకోవాలా’ ఇలా ఎన్నో ఆలోచనలు. ఆ తర్వాత రాజా రవీంద్ర వచ్చారు. అప్పటి నుంచి ఆర్నెల్ల పాటు అసలు నేను ఖాళీగా లేను.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లతో పని చేయడం ఎలా అనిపించింది?

నవీన్‌ చంద్ర: ఎన్టీఆర్‌, నేనూ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే సీన్‌ ఒకటి ఉంటుంది. ఆ సమయంలో ఆయన డైలాగ్స్‌ చెప్పుకొంటూ వెళ్తుంటే నేను అలా చూస్తుండి పోయా. సింగిల్‌ టేక్‌. అప్పుడు నాకు ఎన్టీఆర్‌ కనిపించలేదు. కేవలం వీర రాఘవుడు మాత్రమే కనిపించాడు. ఆ వైబ్రేషన్స్‌ నాకు కూడా తగిలాయి. నేను కూడా అలా డైలాగ్‌ చెప్పేశా.

నిజ జీవితంలో మీలో విలన్‌ ఉన్నారట! ఎగ్జామ్‌లో కాపీ రాస్తూ దొరికిపోతే లెక్చరర్‌ను బెదిరించారట

నవీన్‌ చంద్ర:అవునండీ. నా స్నేహితులు, చుట్టుపక్కల వారి ప్రభావం నాపై ఉండేది. అప్పుడు నా జేబులో బటన్‌ చాక్‌ ఉండేది. తీసి, టేబుల్‌పై పెట్టా, అంతే ఆయన వెళ్లిపోయారు.

మీ కెరీర్‌లో నవ్వుకున్న రూమర్‌ ఏదైనా ఉందా?

నవీన్‌ చంద్ర: ‘త్రిపుర’ సమయంలో జరిగింది. ప్రొడ్యూసర్స్‌ మొదటిగా మా పెళ్లి పోస్టర్‌ను విడుదల చేశారు. దాంతో బళ్లారిలో అందరూ నాకు పెళ్లయిపోయిందా? అని అడిగేవారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని