
తాజా వార్తలు
నటిపై గుర్రుగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్
అప్పుడు సపోర్ట్ చేసి.. ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారు..!
ముంబయి: బాలీవుడ్ నటి అంకితా లోఖండేపై నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇంతకాలం సపోర్ట్ చేసిన కొంతమంది నెటిజన్లే ఇప్పుడు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వాళ్లు ఉన్నట్టుండి అంకితపై తీవ్ర అసహనానికి గురికావడానికి కారణమేమిటంటే.. దాదాపు 10 సంవత్సరాల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పూత్-అంకితా లోఖండే ‘పవిత్ర రిష్తా’ అనే ధారావాహికలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం.. బ్రేకప్ చెప్పుకోవడం.. అనంతరం ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా మారడం జరిగింది. ఆ తర్వాత అంకితకు విక్కీ జైన్‌తో పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన అంకిత.. సదరు నటుడి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సోషల్‌మీడియా వేదికగా వరుస వీడియోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, తన స్నేహితుడు విక్కీ జైన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోని తాజాగా అంకిత ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు. సదరు వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. జంట బాగుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది మాత్రం.. ‘సుశాంత్ మృతి చెందాడనే బాధలో మేమందరం ఉంటే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తావా?’, ‘సుశాంత్ వల్లే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ప్రస్తుతం ఆయన మృతిచెందారనే బాధలో ఉన్నాం. ఇలాంటి సమయంలో మీరిలా సంతోషంగా ఉన్న వీడియోలు పోస్ట్ చేయడం ఏం బాలేదు. కాబట్టి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేముందు ఒక్కసారి ఆలోచించుకోండి’ అంటూ వరుసగా విమర్శలతో కూడిన కామెంట్లు చేస్తున్నారు.