సచిన్‌ భాయ్‌.. పాజీ ఎలా అయ్యాడంటే.. - Ashish Nehra recalls how Sachin Tendulkar named Sachin Paji
close
Published : 15/08/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌ భాయ్‌.. పాజీ ఎలా అయ్యాడంటే..

అంతా హర్భజన్‌ సింగే చేశాడు: నెహ్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు ఎన్నో పేర్లున్నాయి. అభిమానులు ముద్దుగా లిటిల్‌మాస్టర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌, బ్యాటింగ్‌ మ్యాస్ట్రో అంటూ పిలుచుకుంటారు. అయితే సచిన్‌కి మరో పేరు కూడా ఉంది. అదే సచిన్‌ పాజీ. సహజంగా ఇది బయటివాళ్లు ఎవరూ అనకపోయినా తన సహచరులు లేదా జూనియర్లు అలా ప్రేమతో పిలుస్తారు. పాజీ అంటే పెద్దన్న అని అర్థం. అంతకుముందు పాజీ అని 1983 ప్రపంచకప్ విజేత కపిల్‌దేవ్‌ని మాత్రమే పిలిచేవారు. 2003 ప్రపంచకప్‌ నుంచీ టీమ్‌ఇండియా క్రికెటర్లు తెందూల్కర్‌ను కూడా అదే గౌరవంతో పిలవడం మొదలుపెట్టారు. కాగా, అలా పిలవడానికి అసలు కారణం వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అట. అది కూడా అప్పుడు లీగ్‌ దశలో పాకిస్థాన్‌పై మ్యాచ్‌ గెలిచాకే అలా పిలవడం ప్రారంభించామని మాజీ పేసర్‌ నెహ్రా పేర్కొన్నాడు. తాజాగా అతడు స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ నిర్వహించిన ‘2003 ప్రపంచకప్‌ సీక్రెట్స్‌’  కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘2003 ప్రపంచకప్‌ కన్నా ముందు టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేం సచిన్‌ను అతడి పేరు పెట్టి పిలిచేవాళ్లం లేదా సచిన్‌ భాయ్‌ అనేవాళ్లం. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ గెలిచాక సచిన్‌ను పాజీ అని తొలిసారి పిలవడం మొదలుపెట్టాం. హోటల్‌కు వెళ్లాక భజ్జీ ఒక పాట పాడాడు. పాజీ నంబర్‌ 1 అంటూ రాగం తీశాడు. దాంతో అప్పటి నుంచీ అందరం పాజీ అని పిలవడం ప్రారంభించాం. అంతకుముందు ఒకే పాజీ ఉండేవారు అది కపిల్‌దేవ్‌ మాత్రమే’ అని నెహ్రా వివరించాడు. ఇక అదే కార్యక్రమంలో మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ కూడా మాట్లాడాడు. పాక్‌తో అదే మ్యాచ్‌లో అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్‌ ఆడిన అప్పర్‌ కట్‌ సిక్స్‌ను కొనియాడాడు. తెందూల్కర్‌ అలాంటి షాట్‌ ఆడడం చాలా అరుదుగా చూశానని, అతడి బ్యాట్‌ చాలా బరువుగా ఉంటుందని కైఫ్‌ చెప్పాడు. సుమారు 150 కిమీ వేగంతో వచ్చే బంతిని అలా సిక్స్‌గా మలచడం అద్భుతమని కితాబిచ్చాడు. కాగా ఆ మ్యాచ్‌లో లిటిల్‌ మాస్టర్‌ విరోచితంగా బ్యాటింగ్‌ చేసి 98 పరుగుల వద్ద అక్తర్‌ బౌలింగ్‌లోనే ఔటవ్వడం తెలిసిందే. అయినా, పాక్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

సచిన్‌ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌ అభిమానుల్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల్ని మురిపించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని