జొమాటోలో ‘బాబా కీ దాబా’ - Baba Ka Dhaba Listed on Zomato
close
Published : 09/10/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జొమాటోలో ‘బాబా కీ దాబా’


దిల్లీ: సామాజిక మాధ్యమాలను సరిగా వినియోగించుకుంటే అద్భుతాలనే సృష్టిస్తాయి. కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడుస్తాయి. వారికి ఒక జీవితాన్నిస్తాయి. దిల్లీలో మామూలు సమయాల్లో ఎవరికి కనిపించని ఓ చిన్న హోటల్‌  ‘బాబా కీ దాబా’నే అందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు దాని గురించి ఒక్కరాత్రిలో ప్రపంచానికి తెలిసింది. ఫుడ్ డెలివరీ యాప్‌ జొమాటో కూడా తమ సేవలను ఆ హోటల్‌కు అందిస్తామని తెలిపింది. ఇప్పుడు ఆ వృద్ధ యజమానుల కన్నీళ్లు..ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..

దిల్లీలోని మాలవీయ నగర్‌లో ‘బాబా కీ దాబా’ పేరుతో వృద్ధ దంపతులు నడుపుతోన్న చిన్న హోటల్‌లో ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తుంటారు. గత 30 సంవత్సరాలుగా వారికి అదే జీవనాధారం. ఇన్నాళ్లూ వచ్చిన ఆదాయంతో ఎలాగో నెట్టుకొచ్చినా.. కరోనా వారిపై కోలుకోని దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించినా.. మునపటిలా వారి కనీస అవసరాలకు సరిపడా కూడా ఆదాయం కూడా రావడం లేదు. వీరి కన్నీటి గాథ ఫుడ్ బ్లాగర్ వసుంధరా టంకా శర్మకు తెలిసింది. వారు పడుతున్న ఇబ్బందులను అందరి దృష్టికి తేవాలని, వారికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ‘వారి కన్నీళ్లు నా హృదయాన్ని ముక్కలు చేశాయి. దిల్లీ వాసులారా మీకు అవకాశం వస్తే మాలవీయ నగర్‌లోని ‘బాబా కీ దాబా’ వద్ద ఆహారం తినండి’ అంటూ అభ్యర్థించారు. అలాగే ఆ వీడియోలో దాబా యజమాని కాంతా ప్రసాద్(80) మాట్లాడుతూ కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. వసుంధర అభ్యర్థన, అతడి కన్నీరు నెటిజన్ల హృదయాలు ద్రవించాయి. అంతేకాకుండా ఈ వీడియో ఒక్క రాత్రిలోనే వైరల్ గా మారడంతో దాబాకు ప్రచారం లభించింది. సినీనటి సోనమ్ కపూర్‌, క్రికెటర్ అశ్విన్‌, ఐపీఎల్ టీమ్ దిల్లీ క్యాపిటల్స్ కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. 

అలాగే ఫుడ్‌ డెలివరీ యాప్ జొమాటో ఈ చిన్న దాబాను తన వెబ్‌సైట్‌లోని హోటళ్ల జాబితాలో చేర్చినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ‘బాబా కీ దాబా ఇప్పుడు జొమాటో జాబితాలో చేరింది. ఇప్పుడు వారి ఆహారాన్ని కూడా డెలివరీ చేసేందుకు వీలుగా మా సంస్థ ఉద్యోగులు ఈ వృద్ధ దంపతులతో కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని మా దృష్టిలో పడేలా చేసినందుకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. కాగా, జొమాటో నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల్లో ఆ దాబా ముందు చాలా మంది గుమిగూడినట్లు కనిపిస్తుండటం విశేషం.

ఆకస్మికంగా తమ జీవితాల్లో వచ్చిన మార్పుపై కాంతా ప్రసాద్ దంపతులు మాట్లాడుతూ..‘భారత్ మొత్తం మాతో ఉన్నట్లు అనిపిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో మాకు అసలు వ్యాపారమే లేదు. బతకడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మా వద్దకు చాలామంది వినియోగదారులు వస్తున్నారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన వారందరూ చల్లగా ఉండాలి’ అంటూ ఆశీర్వదించారు. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని