close

తాజా వార్తలు

‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’

‘హైదరాబాద్‌ పరిశ్రమకు నేను గెస్ట్‌నే’

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగి నుంచి రచయితగా, సినీ నటుడిగా, మాటల రచయితగా ఇలా ఎన్నో రంగాల్లో ప్రేక్షకులను అలరించిన గొల్లపూడి మారుతీరావు(80) గురువారం మృతిచెందారు. హైదరాబాద్‌ సినీ పరిశ్రమకు తాను ఓ గెస్ట్‌నే అని మారుతీరావు ఓ సందర్భంలో తెలిపారు. ఆయన సినీ ప్రయాణానికీ సంబంధించిన విశేషాలు ఆయన మాటల్లోనే..


అది నా అదృష్టం..

‘గణితం విద్యార్థినైన నేను ప్రభుత్వ ఉద్యోగిగా, రచయితగా, నటుడిగా, మాటల రచయితగా ఇలా చెప్పుకుంటూపోతే అన్నీ ప్రసార మాధ్యమాలతో ప్రేక్షకులను అలరించాను. మొదటి నుంచి ప్రసారమాధ్యమాల్లో కొనసాగుతూ ఒకదానికొకటి పొంతన ఉన్న ఇతర మాధ్యమాల్లోకి రావడం జరిగింది. ఇలా అన్నీ ప్రసార మాధ్యమాల్లోకి రావడం నా అదృష్టం.’


నా సినీ గురువు ఆయనే..

‘సినిమాల్లోకి వచ్చే సమయానికే నేను 15 రచనలు చేశాను. అప్పట్లో నేను దాశరథి కలిసి ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేశాం. ఆ సమయంలో ఓరోజు దాశరథి వచ్చి.. ‘మారుతీరావు నిన్ను దుక్కిపాటి మధుసూదనరావు కలవాలనుకుంటున్నారు’ అని చెప్పారు. అలా ఓ రోజు మధుసూదనరావుగారిని కలిశాను. ‘మారుతీగారు నాకో పిక్చర్‌ రాసి పెట్టాలి’ అని మధుసూదనరావుగారు నన్ను అడిగారు. అలా నేను అనుకోకుండా ‘డాక్టర్‌ చక్రవర్తి’ రచయితగా పనిచేశాను. ఆయనే నా సినీ గురువు.’


కథారచయితగా మొదటి నంది అవార్డు

‘‘1963-64లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డును ఇవ్వడం ప్రారంభించింది. ‘ఆత్మగౌరవం’ చిత్రంతో మొదటి కథా రచయితగా నంది అవార్డును అందుకున్నాను. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు డైరెక్టర్‌గా ఇది మొదటి సినిమా. కథా రచయితగా ఇది నా రెండో సినిమా. ఈ సినిమాకి నేను , యద్దనపూడి సులోచన కథ రాశాం. మా ఇద్దరికి నంది అవార్డు వరించింది.’’


కెరీర్‌లో అవి గొప్ప చిత్రాలు

‘‘ఏ నటుడి జీవితంలోనైనా విలక్షణమైన పాత్రలు మొదటి పదేళ్లలో వస్తే అతని కెరీర్‌ బలపడుతుంది. అలాంటి పాత్రలు నాకు మొదటి ఐదు సినిమాల్లో వచ్చాయి. ‘ఆలయ శిఖరం’, ‘అభిలాష’ లాంటివి నాకు వచ్చిన గొప్ప సినిమాలు. సహ నటుడిగా నేను సంవత్సరానికి 25 సినిమాల్లో నటించాను. ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సంవత్సరానికి 25 సినిమాల చొప్పున 10, 15 సంవత్సరాలు పనిచేయడం నా అదృష్టం.’’


అలా బాలచందర్‌ నుంచి రఘుకు..

‘‘కళ్లు’ కథను నేను ఓ రోజు కె.బాలచందర్‌గారికి చెప్పాను. ఆయన మాలాంటి వారందరికీ దేవుడు. ఆయనకు కథ బాగా నచ్చింది. ఆయన వెంటనే నా రచనకు సంబంధించిన హక్కులు సొంతం చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత నేను రాసిన ‘కళ్లు’ రచన మనోజ్‌ కుమార్‌గారికి తెలిసింది. ఆ సమయంలో ఓ రోజు ఎల్వీ ప్రసాద్‌గారి అబ్బాయి ఆనంద్‌ నా దగ్గరికి వచ్చి.. ‘మారుతీగారు మీరు ఎంత ఆస్తి సంపాదించాలనుకుంటున్నారు? ఆ ఆస్తి అంతా నేను ఇప్పిస్తా. మనోజ్‌ కుమార్‌ గారికి ఈ సినిమా రైట్స్‌ కావాలని అడిగారు’ అని చెప్పారు. నేను వెంటనే కళ్లు మూసుకుని ‘దక్షిణ భారతదేశం మొత్తం గర్వంగా చెప్పుకునే దర్శకుడు కె.బాలచందర్‌గారు. ఆయనకు నేను రైట్స్‌ ఇచ్చేశాను.’ అని చెప్పాను.

కానీ బాలచందర్‌గారు ఆ సినిమా తెరకెక్కించలేదు. దానికి ‘మూగకళ్లు’ అని టైటిల్‌ పెట్టి జయశంకర్‌, జయసుధను పెట్టి ఓ షెడ్యూల్‌ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఆయన్ని కలిసినప్పుడు ‘సినిమా తీయలేదు ఏంటి సార్‌’ అని అడిగాను. ‘మారుతీరావు నువ్వు రాసిన కథకు నేను న్యాయం చేయలేనేమో అనుకుని మానేశాను.’ అని చెప్పారు. ఆ తర్వాత ఆ కథను ఎన్‌.వి.రఘు ‘కళ్లు’ సినిమాగా తెరకెక్కించారు.’’


అందుకోసం కథలు రాయలేదు

‘‘సినిమాలకు ఉపయోగించే విధంగా నేను ఎప్పుడూ కథలు రాయలేదు. నా రచనలను చూడడానికి మాత్రమే పరిమితి చేయలేదు. ఆలోచించే విధంగా రచనలు చేశాను. ప్రయత్నం చేసినా సరే నా రచనలను సినిమాలుగా చేయలేరు. ఏ గుడ్‌ నోవల్‌ నీడ్‌ నాట్‌ టూబీ ఏ గుడ్ ఫిల్మ్‌. ఏ గుడ్‌ ఫిల్మ్‌ నీడ్‌ నాట్‌ టూబీ ఏ గుడ్‌ నోవల్‌.


అది ఓ ట్రాజెడీ

‘‘నేను అనుకోని పరిస్థితుల్లో కొంతకాలంపాటు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. ‘ప్రేమపుస్తకం’ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నా కుమారుడు మృతిచెందడంతో నేను డైరెక్షన్‌ చేయాల్సి వచ్చింది అది ఓ ట్రాజెడీ. అది ఓ భయంకరమైన జ్ఞాపకం. ఆ సినిమా ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర నుంచి నేను లేచిన తర్వాత ‘ప్రేమపుస్తకం’ సినిమాను ఎప్పుడూ చూడలేదు. మా అబ్బాయి ఫొటోలు కూడా ఎప్పుడైనా కనిపిస్తే వెంటనే తిప్పేస్తుంటాను.’’


హైదరాబాద్‌ పరిశ్రమకు ఓ గెస్ట్‌నే

‘‘హైదరాబాద్‌ సినీ పరిశ్రమలో నేను ఎప్పుడూ గెస్ట్‌నే. మద్రాస్‌లో సినీ పరిశ్రమ ఉన్నప్పడు నేను కుటుంబంలో ఒక భాగాన్ని. ఆ రోజుల్లో కృష్ణగారు, శోభనబాబుగారు, కోటశ్రీనివాసరావు, రావు గోపాలరావు, మోహన్‌బాబు, గిరిబాబు, సత్యనారాయణ అందరూ కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. ఆ రోజుల్లో సినీ రంగంలో పనిచేయడం అనేది కుటుంబ వ్యవస్థ. కానీ ఈరోజుల్లో వ్యక్తిగతమైన సక్సెస్‌. ఇది లోపం కాదు. ఓ పరిణామం.’’


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.