‘2020’ని మరిపించిన పాటలు - Best Songs of Tollywood 2020
close
Updated : 28/12/2020 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘2020’ని మరిపించిన పాటలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంగీతాన్ని ఆస్వాదించని వారుంటారా..? మనిషికి మనసు బాగాలేనప్పుడు మనశ్శాంతినిచ్చే మందు సంగీతం. ఆహ్లాదాన్ని పంచే ఔషధం సంగీతం. ఈ ఏడాది మొత్తం ఎక్కడ చూసినా కరోనా అనే పదమే కనిపించింది. కరోనా వార్తలే వినిపించేవి. ఇలా కరోనా అందరికీ విసుగుపుట్టించింది. ఈ క్రమంలో కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన సినిమా పాటలు వింటూ మనశ్శాంతిని పొందే ప్రయత్నం చేశారు. ఈ సంవత్సరం విడుదలై ప్రేక్షకులను అలరించిన సినిమా పాటలేమున్నాయో ఓసారి చూద్దాం.

‘మైండ్‌ బ్లాక్‌’ అయ్యిందిగా..

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘మైండ్ బ్లాక్‌’ పాట నిజంగానే అందరి మైండ్‌ బ్లాక్‌ చేసింది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, రష్మిక మందాన జోడీగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ విజయం సాధించిందంటే ప్రధాన కారణం పాటలు. ఇది అభిమానుల చెప్పే మాట. థియేటర్‌కు వెళ్లిన వాళ్లలో చాలామంది ఈ పాట కోసం వెళ్లినవాళ్లే. మహేశ్‌బాబు, రష్మిక కలిసి స్టెప్పేసి థియేటర్‌లోని ప్రేక్షకులతో కేకలు పెట్టించారు. యూట్యూబ్‌లోనూ ఈ పాట రికార్డులు సృష్టించింది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ పాటను శ్రీమణి, దేవీశ్రీ కలిసి రాశారు.

‘రాములో రాములా..’ ఆగం చేసింది..

‘అలవైకుంఠపురములో’ సినిమాలో పార్టీ సాంగ్‌ ‘రాములో రాములా’ ఒక ఊపుఊపేసింది. తమన్‌ తన స్టైల్‌లో సంగీతం అందించగా అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులు బాగా వైరల్‌ అయ్యాయి. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. లాక్‌డౌన్‌ మొత్తం అందరి ఇళ్లలోనూ ఇదే పాట వినిపించింది.

‘నువ్వు నాతో ఏమన్నావో..’ వినిపిస్తూనే ఉన్న బాలు గొంతు

మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా వచ్చిన ‘డిస్కోరాజా’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇందులో ఎస్పీ బాలు పాడిన ‘నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో’ పాట మాత్రం ప్రేక్షకుల చేవిల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటకు తమన్‌ సంగీతం అందించారు. 

‘ఏదారెదురైనా..’

‘ఏదారెదురైనా.. ఎటువెళుతుందో.. అడిగానా..?’ ఈ మధ్య యూట్యూబ్‌లో తెగ వినిపిస్తోన్న పాట ఇది. తమిళ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘జానూ’ సినిమాలో ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ పేరుతో వచ్చిన ఈ పాటను సంగీత ప్రియులు బాగా ఆస్వాదించారు. శర్వానంద్‌, సమంత జోడీగా నటించిన ఈ సినిమాకు ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటను ప్రదీప్‌కుమార్‌ ఆలపించారు. గోవింద వసంత సంగీతం అందించారు. 

‘ఉండీపోవ నువ్విలా.. రెండూ కళ్లలోపలా..’ ఉండిపోయింది

లాక్‌డౌన్‌లో కుర్రకారు మొబైల్‌ ఫోన్లలో మార్మోగిన పాటల్లో ‘ఉండీపోవ నువ్విలా.. రెండూ కళ్లలోపలా..’ ఒకటి. నందు, ప్రియాంకశర్మ జంటగా నటించిన ‘సవారి’ సినిమాలో అన్ని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటను పూర్ణచారి రచించగా.. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. జితేందర్‌ గాత్రం అందించారు.

‘వాట్టే.. వాట్టే.. వాట్టే బ్యూటీ..’ వాట్టే హిట్టు

వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాలోనిదీ పాట. నితిన్‌, రష్మిక ఆడిపాడిన ఈ పాట మంచి విజయం సాధించింది. కాసర్ల శ్యామ్ రచయిత. ధనుంజయ్‌, అమలా చేబోలు కలిసి పాడారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. 

 

అలరించిన ‘ఏమో.. ఏమో.. ఏమో..’

‘రాహూ’ సినిమాలో సిద్‌ శ్రీరామ్‌ పాడిన ‘ఏమో.. ఏమో.. ఏమో’ పాట మెలొడీ ప్రేమికులను బాగా ఆకట్టుకుంది. శ్రీనివాసమౌళి రాసిన ఈ పాటకు ప్రవీణ్‌ లక్కరాజు సంగీంతం అందించారు. సుబ్బు వేదుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అభిరామ్‌, క్రితిగార్గ్‌ హీరోహీరోయిన్లుగా కనిపించారు.

స్టెప్పులేయించిన ‘నక్కిలీసు గొలుసు’

ఉత్తరాంధ్ర జానపదం నుంచి సేకరించిన ‘నక్కిలీసు గొలుసు’ ఎంతోమందితో స్టెప్పులేయించింది. శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ పాట ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని రకాల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పలాస 1978’ చిత్రంలోనిదీ పాట. రఘుకుంచె ఈ పాటను ఆలపించడంతో పాటు సంగీతం కూడా అందించారు.

‘తరగతి గది దాటి..’ అలరించిన పాట

‘కలర్‌ఫొటో’ చిత్రంలోని ఈ పాట ప్రస్తుతం చాలామందికి రింగ్‌టోన్‌గా మారింది. ఈ పాటను కిట్టు విస్సప్రగడ రాయగా.. కాల భైరవ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. సందీప్‌రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యువనటులు సుహాస్‌, చాందినీ చౌదరి ప్రధానపాత్రల్లో నటించారు.

‘హేయ్‌.. ఇది నేనేనా..’

కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినీ అభిమానులు కేవలం పాటలను మాత్రమే ఆస్వాదించగలిగారు. అయితే.. దాదాపు 9నెలల తర్వాత తొలి సారిగా అభిమానులు థియేటర్‌లో చూసిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఈ సినిమాలోని ‘హేయ్‌ ఇది నేనేనా..’ అందర్నీ బాగా అలరించింది. ఈ సినిమాలో సాయితేజ్‌, నభా నటేశ్‌ జంటగా నటించారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని