ఆశ్చర్యం, అద్భుతం ఆయన ప్రతిబిం‘బాలు’ - Best songs of SP balasubrahmanyam
close
Published : 26/09/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆశ్చర్యం, అద్భుతం ఆయన ప్రతిబిం‘బాలు’

అనుకోనిది జరిగితే ఆశ్చర్యం..

అది మహత్తరమైనదైతే అద్భుతం..

ఆ అద్భుతాన్ని అనుకున్న ప్రతిసారీ ప్రదర్శించగలగడం కేవలం పూర్వ జన్మ పుణ్యం.

ఆ పుణ్యాన్ని తన నైపుణ్యంగా మలచుకున్న ఒకే ఒక గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. అందరినీ వదిలి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది.

అప్పటికి ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం వంటి గాయకులు నాలుగు దిక్కులా ఆక్రమించేసుకొని ఏలుతుంటే - వెన్నలా మృదువుగా - ఈ నాలుగు గళాలకూ భిన్నంగా ఉండే గొంతుతో ప్రేక్షకుల గుండె తలుపులు తట్టారాయన. అప్పుడప్పుడు ఒకటీ అరా మంచి పాటలతో ఒక్కోసారి సినిమాకి మూడు నాలుగు పాటలతో శ్రోతల హృదయాలలో మెలమెల్లగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే అద్భుతాన్ని ప్రదర్శించాలి, అది వైవిధ్యంగా ఉండాలి. ఆ సమయంలోనే ‘గులేబకావళి కథ’, ‘దాగుడుమూతలు’, ’పూలరంగడు’ సినిమాల్లో ముద్దు ముద్దు మాటలతో పద్మనాభం చేసిన కామెడీ ప్రేక్షకులను తెగ నవ్వించడమే కాదు అతని బ్రాండ్‌గా ముద్ర వేసుకుంది. ఈలోగా ఎన్టీఆర్‌ సంస్థలో పాడడానికి టి.వి. రాజు దగ్గరి నుంచి పిలుపు. అది కూడా ఓ వైపు ఎన్టీఆర్‌కి ఓ పాట, మరో వైపు పద్మనాభానికి మరో పాట. ఓ వైపు అనుకోని అదృష్టం మరో వైపు కాదనలేని అవకాశం. ఈ రెండిటికీ తానెప్పుడూ ప్రయత్నించలేదు. కానీ పిలుపు వస్తే ప్రయత్నలోపం ఉండకూడదు. ఎన్టీఆర్‌కీ, ఏఎన్నార్‌కీ ఘంటసాల ప్లేబ్యాక్‌ బాగా అలవాటు పడిపోయిన రోజులవి.

ఇక మిగిలింది పద్మనాభం పాట. అంతకు ముందు ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ లోనూ, ‘ఆస్తులు-అంతస్తులు’ లోనూ పద్మనాభం కోసం పాడినా అక్కడి వేదిక వేరు. ఇది టి.వి రాజు, ఎన్టీఆర్‌ల సినిమా. ’అమ్మమ్మమ్మ ఏం మొగుడివి ?’ అనే పల్లవితో సాగే కొసరాజు గీతం. ఎల్లారీశ్వరితో ఇలాంటి టీజింగ్ పాటలంటే ఆవిడెలా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. పైగా అందరూ ఆవిడలాగే పాడాలని కోరుకునే వారు కూడా. గత్యంతరం లేదు. ఎక్కడైనా ఏదో వైవిధ్యం చూపించాలి. ’మంగళగిరి గోపురంలా నెత్తి మీద పిలకుంది’ అని ఎల్లారీశ్వరి ఎద్దేవా చేస్తే ’మాయల ఫకీరు ప్రాణమూ చిలక లోనె వున్నది’ అంటూ ’మా నాన్న ప్రాణమూ నా పిలక లోనె వున్నది’ అని కౌంటరిచ్చే దగ్గర పద్మనాభం ముద్దు ముద్దు మాటల తీరును యథాతథంగా అనుకరించాడాయన. అంతే .. ‘అద్భుతం ’ అంటూ ఆశ్చర్యపోయారంతా. ఆ తర్వాత కూడా రెండో స్థానంలో ఉన్న హీరోలకు, చిన్నా చితకా హీరోలకు, అప్పుడప్పుడూ కమెడియన్స్‌కూ పాడుతూ బిజీ ఉన్నా సరే మళ్లీ మరోసారి అలాంటి ప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇది టాప్ కమెడియన్ రాజ్‌బాబుకి. ’బడిపంతులు’ సినిమాలో..’ఓరోరి పిల్లగాడా’ పాటలో.. అందులో అతని టైపు ’ఒయ్ ... ఓయ్, ఆ , ఆ’ కౌంటర్ లతో, కిచ కిచ నవ్వులతో యధాతథంగా దించేశాడు రాజ్ బాబుని. ఈ సారి జనం ‘ఆశ్చర్యం ... అద్భుతం’ అనలేదు. పాటని పదే పదే విన్నారు. పడి పడి నవ్వారు. ’ఇలాంటివి బాలూ కాకపోతే ఇంకెవరు చేస్తారు ?’ అంటూ ఆయన్ని , ఆయన టాలెంట్‌ని నమ్మారు.

అలా బాల సుబ్రహ్మణ్యం ‘బాలు’ అయిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కి ‘మాయా మశ్చీంద్ర’ లో పాడే అవకాశం.. ‘ప్రణయ రాగ వాహిని’ పాటతో. వీలైనంతలో సాధ్యమైనంతగా ఎన్టీఆర్‌ పద్ధతిలో గళంలో మాధుర్యంతో పాటు గాంభీర్యాన్ని కూడా నింపుకొంటూ పాటని ఆవిష్కరించాడు. ‘బాలు గొంతు ఎన్టీఆర్‌కి కూడా భలేగా నప్పిందే’ అనుకున్నారు జనం. ’నువ్వు పాడకపోతే నా పాట ఏం కావాలి ?’ అని సత్యం వంటి సంగీత దర్శకుడు అడిగే స్థాయికి, ‘పాటలో బాలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ వల్ల చాలా మందికి నటించడం సులువైపోయింది’ అని రమేశ్ నాయుడు స్టేట్ మెంట్ ఇచ్చే స్థానానికి, ‘ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్‌కి నా మొదటి పాట బాలుయే పాడాలి’ అని చక్రవర్తి సెంటిమెంట్‌గా ఫీలయ్యే పొజిషన్‌కు చేరుకున్న బాలు.. ఆ క్రమంలో బాలుగారు అయిపోయారు. భగవదత్తమైన సునిశిత పరిశీలనతో అబ్బిన నైపుణ్యాన్ని జత చేసి అటు ‘ఎరక్కపోయి వచ్చాను’ పాటతో ఏయన్నార్‌ని, ఇటు ‘చిత్రం హాయ్ భళారే విచిత్రం’ పాటతో ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల మనసుల్లో ముద్ర కొట్టి మరీ నిలబెట్టారు. ఆ తర్వాత నుంచీ బాలుగారి స్వర పేటిక రకరకాల ప్రయోగాలకు పీఠిక అయిపోయింది. ’రావణుడే రాముడైతే’ లోని ’ఉప్పు చేపా పప్పు చారు’ పాటలో మందు కొట్టిన ఏయన్నార్ పాడినట్టుగా పాడితే ’ప్రేమంటే తెలుసా నీకు ?’ పాటలో అక్కినేని డైలాగులు చెబుతూ పాడితే ఎలా వుంటుందో చూపించారు. అలాగే ’బహుదూరపు బాటసారి’ లో కూడా ... పాటని డైలాగుల్తో కలిపి పాత్రని సజీవంగా సాక్షాత్కరింప జేశారు.

ఇక ‘ముద్దుల కొడుకు’ లోని ‘దగాలు చేసి దిగాలు పడ్డ’ పాటలో అయితే పాట మాత్రం సుశీలది. మధ్యమధ్యన వచ్చే డైలాగులన్నీ బాలూ గారివి . కేవలం డైలాగులే ... అది కూడా ఏయన్నార్ కే. ఆ పాటని ఇప్పుడు మరోసారి విని చూడండి. బాలూ గారికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఈ పాట తర్వాతో , ఎప్పుడో స్వయంగా ఏయన్నార్ గారే తమాషాగా అన్నారట బాలూ గారితో - ‘ఏవిటి ... డబ్బింగ్ చెప్తారా నాకు ?’ అని. కమెడియన్లలో ఆయన చాలా ఆలస్యంగా పాడింది అల్లు రామలింగయ్య గారికే . వాటిలో ముఖ్యమైనవి ముత్యాలు వస్తావా (మనుషులంతా ఒక్కటే) , రాణీ ఓ రాణి (చిలక జ్యోస్యం) . ఈ పాటలు విన్నాక ఆయన ’ మరీ నేనంత ముక్కుతో పాడతానంటావా ?’ అని అడిగారంట బాలూని. ఇప్పటివరకూ చెప్పినవి బాలు తనలోని సునిశిత పరిశీలనకు అనుకరణ విద్యను జోడించి, వాటికి అభినయ కళను జతచేసి అద్భుతంగా ఆవిష్కరించిన స్మైలు రాళ్లు అనదగిన మైలు రాళ్ల లాంటి పాటలు. సంభ్రమాశ్చర్యాలకీ, అద్భుతానికి వీటన్నిటికీ కలిపి ఒకే ఒక నిర్వచనం బాలు రూపంలో మనందరికీ కనిపిస్తుంది.. వినిపిస్తుంది. ఇలాంటి సృష్టి నభూతో న భవిష్యతి అనిపిస్తుంది. అందుకే ఆయన గళం-అనర్గళం.
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని