భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం - Bharat Biotech halves Covaxin phase2 clinical trial
close
Updated : 15/10/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం

రెండోదశ క్లినికల్‌ పరీక్షల పరిమాణం సగానికి తగ్గింపు

దిల్లీ: కొవిడ్ 19 నివారణ కోసం దేశీయ సంస్థ భారత్‌ బయోటెక్‌, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)తో కలసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కొవాక్జిన్’గా వ్యవహరిస్తున్న ఈ టీకా తయారీ ప్రయత్నాలు రెండో దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వాలెంటీర్ల సంఖ్యను భారత్‌ బయోటెక్‌ తగ్గించినట్లు ఆంగ్లవార్త సంస్థ బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొంది. వీలైనంత త్వరగా మూడోదశ ప్రయోగాలను చేపట్టేందుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఈ దిగ్గజ ఫార్మా సంస్థ పేర్కొన్నట్లు చెప్పింది.

భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ తొలిదశ ప్రయోగాలను 350 మంది వాలెంటీర్లతో విజయవంతంగా నిర్వహించింది. ఇక రెండో దశ క్లినికల్‌ ప్రయోగాలను తొలుత 750 మంది వాలెంటీర్లపై జరపాలని నిర్ణయించారు. అయితే, తాజా నిర్ణయం ప్రకారం ఈ సంఖ్యను 380కి తగ్గించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వ్యాక్సిన్‌  ప్రయోగాలు జరిగే ప్రదేశాల సంఖ్యను సంస్థ కుదించింది. తొలిదశ ప్రయోగాలు వయోజనులపై జరిపామని.. రెండో దశలో వ్యాక్సిన్‌ను 12 ఏళ్లకు పైబడిన చిన్నారులపై కూడా ప్రయోగించనున్నామని పరిశోధకులు వెల్లడించారు. ఈ రెండు దశల్లో పాల్గొన్న వాలెంటీర్లలో ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఎదురుకాలేదని వారు స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది మొదట్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలకు కూడా భారత్‌ బయోటెక్‌ డీసీజీఐ అనుమతి పొందింది. అయితే, ఇందుకు రెండో దశకు సంబంధించి భద్రత, వ్యాధినిరోధకత తదితర పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా డీసీజీఐ ఆదేశించింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని