ట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు? - Biden to receive Covid vaccine as Trump remains on sidelines
close
Published : 22/12/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్రంప్‌ సార్‌.. ఇంకెప్పుడు?

టీకా తీసుకొనేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అమెరికాలో గతవారం కరోనా నిరోధక టీకా పంపిణీ భారీ స్థాయిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు కొవిడ్‌ టీకా రెండు మోతాదుల్లో ఒకటి కూడా తీసుకోని అత్యున్నత స్థాయి వ్యక్తుల్లో ట్రంప్‌ ఒకరు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ, సెనేట్‌లో ప్రముఖ నేత మిచ్‌ మెక్‌కానెల్‌ తదితరులు ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కాగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ నేడు టీకా తీసుకోనున్నారు. అంతేకాకుండా కరోనా ప్రచారంలో భాగంగా తాము టీకా తీసుకున్న విషయాన్ని బహిరంగ ప్రచారం కల్పించాలని వారంతా నిర్ణయించుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌.. అందుకు వ్యతిరేకంగా సాగదీత ధోరణి ప్రదర్శించటం పలు విమర్శలకు దారితీస్తోంది. దీని వల్ల ప్రజల్లో, ప్రత్యేకించి తమ సొంత రిపబ్లికన్‌ పార్టీలో వ్యాక్సిన్‌ భద్రత పట్ల సందేహాలు తలెత్తగలవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీకా తీసుకోండి అధ్యక్షా..

ట్రంప్‌ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటొనీ ఫౌచీ అన్నారు. ఇప్పటికే కొవిడ్‌ సోకి నయమైన వారు వ్యాక్సిన్‌ తీసుకోవటం సురక్షితమేనని అమెరికాలో కొవిడ్‌ వ్యవహారాల సాధికార సంస్థ  ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌ కార్యక్రమ ప్రధాన సలహాదారు మొన్సెఫ్‌ స్లవోయి అన్నారు. తద్వారా వారికి మరింత పటిష్టమైన, దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌తో సహా ఇప్పటికే కరోనా సోకిన వారు టీకా తీసుకోవటం తప్పనిసరి అని ఆయన వెల్లడించారు.

కొవిడ్‌ సోకిన 90 రోజులకు..

దేశంలో 3 లక్షల 17 వేల మందిని పైగా పొట్టన పెట్టుకున్న మహమ్మారికి చరమగీతం పాడేందుకు అందరూ కరోనా తీసుకోవాలని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్ సలహా మండలి సూచించింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ సురక్షితం, ప్రభావవంతమైందని.. దీనిని కరోనా సోకటంతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చని తెలిపింది. కాగా, కొవిడ్‌ సోకి చికిత్స తీసుకున్న వారు టీకా తీసుకునేందుకు కనీసం 90 రోజులు వేచి ఉండాలని మండలి సూచించింది.

సమయం కోసం వేచిచూస్తున్నా..

కరోనా వ్యాక్సిన్‌ వల్ల సంభవించగల ప్రమాదాలను గురించి ఆధార రహిత సమాచారాన్ని గురించి ట్రంప్‌ గతంలో పలు ప్రకటనలు చేశారు. ట్రంప్‌ దంపతులకు అక్టోబర్‌లో కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 90 రోజుల గడువు ఇంకా ముగియని సంగతి నిజమే అయినప్పటికీ.. కనీసం వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకుంటాననేది అధ్యక్షుడు ఇంకా ప్రకటించలేదు. టీకా తీసుకునేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నానంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించి ఊరుకున్నారు. టీకా ఎప్పుడు తీసుకోవాలనేదానిపై ఆయన ఇంకా వైద్య నిపుణులతో చర్చిస్తూనే ఉన్నారని శ్వేతసౌధం ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి..

భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌?

కొత్త రకం కరోనా.. టీకా పనిచేస్తుందా?మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని