బాలూ.. మొదటిసారి మరణం ఒంటరైంది..! - Celebrity Condolence To BAlu
close
Published : 26/09/2020 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలూ.. మొదటిసారి మరణం ఒంటరైంది..!

సినీ ప్రముఖుల అశ్రునివాళి

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగింది. కరోనా నుంచి ఇటీవల కోలుకున్న ఆయన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఎస్పీబీ మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. బాలుతో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్‌, పరశురామ్‌ సోషల్‌మీడియా వేదికగా బాలుకి కన్నీటి నివాళులర్పించారు. 

దేంటో...
రాసుకున్న ప్రతీమాట
మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది..
ఒక్క పాటేంటి..
ప్రతీ వాక్యం, కథా, నవల ఏదైనా సరే..
వాటి గొంతు మాత్రం మీదే..
అంతలా మాలో అంతర్భాగమైపోయింది.. మీ గాత్రం
మీ పాటలు వింటూనో..
మీ రాగాలు హమ్‌ చేస్తూనో..
మీ గాత్రమాధుర్యం గురించి చర్చిస్తూనో..
ఎన్నో గంటలు.. కాదు..
రోజులు, సంవత్సరాలు బతికేశాం.. బతికేస్తాం..
ఆ రోజులన్నీ మీవే కదా..
మీరు మాతో గడిపినవే కదా..
అంటే ఒకే రోజు కొన్ని కోట్ల రోజులు బతకగల నైపుణ్యం మీది..
ఇంకా మీకు మరణం ఏంటి..??
మరణం పిచ్చిది..
పాపం తనొచ్చాక మీరుండరని అనుకుంది..
ఇలా వచ్చి..
అలా చేయి పట్టుకుని తీసుకెళ్లి పోవచ్చు అనుకుంది.
కానీ ఎక్కడ చూసినా మీరే,
ఎక్కడ విన్నా మీ పాటే..
మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే..
మా హృదయాలలో..
మా అంతరంగాలలో..
అజరామరమైన మిమ్మల్ని..
ఎలా తీసుకెళ్లాలో దానికర్థంకాలేదు..
మిమ్మల్ని తీసుకెళ్లడమంటే..
ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికర్థమైంది..
మొదటిసారి మరణం ఒంటరైంది.
ఏం చేయాలో తెలియక.. బిత్తర చూపులు చూస్తోంది..
దిక్కుతోచక భోరున ఏడుస్తోంది..
‘మృతిలో తలదాచుకున్న బతుకు..
శృతిలో కలిపింది నిన్ను జతుకు..
మళ్లీ మీ పాటే దానికి ఓదార్పు..
పోన్లెండి బాలు సార్‌..
ఈసారికి దాన్ని క్షమించేయండి..
ఇంకెప్పుడూ రాదులేండి..
(‘‘మరణంతో నిజమయ్యే ఈ బతుకు.. ఒక కలయేలే..
కల నిజాల సంధిరేఖ కలిసిపోవు నీలోనే..’’ ఎప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి..
అది కూడా మీ గొంతుతోనే) - సుకుమార్‌

లాలిజో.. లాలిజో..’
నేను మొదట విన్న పాట.. ‘మీ పాట’
అన్నం తినాలంటే ‘మీ పాట’
ఆకలి తీరాక కూడా ‘మీ పాట’
అమ్మాయిని చూస్తే ‘మీ పాట’
ఆ అందాన్ని పొగడాలంటే ‘మీ పాట’
ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేయాలంటే ‘మీ పాట’
ఆ అమ్మాయి ఛీ కొట్టాక ఇంకో అమ్మాయికి మూవ్‌ అవ్వాలన్న ‘మీ పాటే’
అంతెందుకు..
అమ్మకి బాగాలేనపుడు ‘మీ పాట’
అమ్మ చనిపోయినప్పుడు ‘మీ పాట’
అంధకారంతో భాగ్యనగరముకు పయనమైనపుడు ‘మీ పాట’
అవమానాలతో అర్ధభాగం చచ్చిపోయినపుడు కూడా ‘మీ పాటే’
‘అర్చన’ని చూసినప్పుడు ‘మీ పాట’
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ‘మీ పాట’
మాకు అబ్బాయి పుట్టినప్పుడు ‘మీ పాట’
మా అబ్బాయి పెద్దోడు అవుతున్నప్పుడు ‘మీ పాటే’
సినిమా హిట్‌ అయితే ‘మీ పాట’
నెక్ట్స్‌ సినిమా పోయినప్పుడు ‘మీ పాట’
కసితో లేచి కొట్టాలి అన్నప్పుడు ‘మీ పాట’
అలిసిపోయి నిద్రపోయినప్పుడు ‘మీ పాటే’
మీకు తెలీదు బాలు గారు నా జీవితం మొత్తం తెలీకుండానే మీ పాటతోనే ప్రయాణం సాగింది. సాగుతుంది. సాగిస్తాను కూడా.
అంతెందుకు.. ఇప్పుడు కూడా మీ పాటే..
‘నీవు మావలె మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది’ - పరశురామ్‌

 

‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన వ్యక్తి ఎస్పీబాలుని వెంటాడి తీసుకువెళ్లిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయనతో నేను ఎన్నో సంవత్సరాలు పాటు పనిచేశాను. మేమిద్దరం కలిసి ఎన్నో పాటలు పాడాం. బుల్లితెర వేదికగా ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమంతో ఎంతో మంది గాయనీగాయకులను ఆయన తయారుజేశారు. దేవుడికి కన్నుకుట్టినట్లుంది. మనందర్నీ దుఖఃసాగరంలోపడేయాలనుకున్నాడు. అందుకే మనకెంతో ఇష్టమైన వ్యక్తిని తీసుకువెళ్లిపోయాడు. ఎస్పీబీ ఇక లేరు.. అనే మాట వినగానే ఎంతో బాధాకరంగా అనిపించింది. ఆయన మరణం ఎంతోమంది అభిమానులను కలచివేసింది. అందరూ గుండెనిబ్బరంతో ఉండాలని ఆశిస్తున్నాను.’ - సుశీల

‘మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు. పరిమితి ప్రాణానికే కానీ ప్రతిభకు కాదు. కనుమరుగు ఖాయానికే కానీ కీర్తికుండదు. అవధులు ఆయుష్షుకే కానీ యశస్సుకి కాదు. బాలూ అన్నయ్య.. మీ మంచితనం, మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు.. వెండితెర, బుల్లితెర సాక్షిగా మా గుండెతెరపై శాశ్వతం. స్ఫూర్తిదాయకం. ప్రాణాన్ని అనంతవాయువులకు, పాటని అశేష అభిమానులకు వదిలివెళ్లిన గానగంధర్వులైన మీకు వందనం, అభివందనం, పాదాభివందనం. అన్నయ్యా.. మీరూ, మీ మాట, మీ పాట.. చిరస్మరణీయం. ఓ శాంతి’ - సాయి కుమార్‌ 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని