దిల్లీలో రోజుకు లక్ష టెస్టులు: కేజ్రీవాల్‌ - Centre Promises 750 ICU Beds Daily Testing to Be Hiked to 1 Lakh to Arrest Covid 19 Spread in Delhi
close
Published : 15/11/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో రోజుకు లక్ష టెస్టులు: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ రోగుల కోసం అదనంగా ఐసీయూ పడకలను సమకూర్చేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. దిల్లీలో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల, నియంత్రణ చర్యలకు సంబంధించి ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సహా, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, అధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..  ‘దిల్లీలో అక్టోబర్‌ 20 నుంచి కేసుల పెరుగుదల ప్రారంభమైంది. కేసుల నియంత్రణకు సంబంధించి సమావేశంలో చర్చించాం. ప్రస్తుతానికి ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల కోసం తగినన్ని పడకలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ఐసీయూ బెడ్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ విషయంలో కేంద్రం అదనంగా 750 ఐసీయూ పడకలను అందించేందుకు హామీ ఇచ్చింది. ఐసీయూ పడకల సంఖ్య పెంచేందుకు యంత్రాలను సమకూర్చడంలో సైతం కేంద్రం సహాయం చేసేందుకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం రోజుకు 60వేల కొవిడ్‌ టెస్టులు చేస్తున్నాం. ఆ సంఖ్యను మరింత పెంచుతూ దినసరి కొవిడ్‌ టెస్టులను లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ఐసీఎంఆర్‌ సైతం సహకరించేందుకు హామీ ఇచ్చింది’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

కరోనా కట్టడికి అమిత్‌షా సూచించిన చర్యలు

దిల్లీలో కరోనా కట్టడికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి అమిత్‌షా 12 ముఖ్యమైన పాయింట్లను ఈ సమావేశంలో సూచించారు. ఆ వివరాల్ని ఆయన ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ‘దిల్లీలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను రెండు రెట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాం. రాజధానిలో కొవిడ్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఐసీఎంఆర్‌కు చెందిన మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్లను రంగంలోకి దించి పరీక్షలు నిర్వహించాలి. దిల్లీలోని ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యంతో పాటు మౌలిక సదుపాయాలను పెంచాలి. ఐసీయూ పడకల సంఖ్యను పెంచాలి. ఆక్సిజన్‌ సదుపాయాలతో ఛతర్‌పుర్‌లో 10వేల పడకల కొవిడ్‌ సెంటర్‌ అందుబాటులోకి తీసుకురావాలి. కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, స్క్రీనింగ్‌, లక్షణాలు ఉన్న వారిని నిర్బంధించడం చేయాలి. దిల్లీలో ఆరోగ్య కార్యకర్తల కొరత దృష్ట్యా సీఏపీఎఫ్‌ నుంచి అదనపు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని అందించేందుకు నిర్ణయించాం. ఇళ్లలో ఉండే కొవిడ్‌ రోగులను ట్రేస్‌ చేసి ఆస్పత్రులకు తరలించాలి. ప్లాస్మా దానం కోసం ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసి బాధిత వ్యక్తులకు అందించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డా.ఏకే పాల్‌, ఐసీఎంఆర్‌ నేతృత్వంలోని కమిటీ దీనిపై త్వరలో నివేదిక ఇస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు దిల్లీ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ సిలిండర్లను కేంద్రం నుంచి అధిక మొత్తంలో అందజేసేందుకు నిర్ణయించాం’’ అని కొవిడ్‌ కట్టడికి తీసుకున్న చర్యలను వివరించారు.
దిల్లీలో కరోనా వైరస్‌ కేసులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అమిత్‌షాను కోరిన విషయం తెలిసిందే. దిల్లీలో గత కొద్ది రోజులుగా నిత్యం 7వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నవంబర్‌ 11న రికార్డు స్థాయిలో 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాజధాని నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా వైరస్‌ వ్యాప్తి విషయంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని