సినిమాలు గుప్పెడు వివాదాలు బోలెడు..! - Controversies In Cine Industry In 2020
close
Updated : 26/12/2020 16:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సినిమాలు గుప్పెడు వివాదాలు బోలెడు..!

ఈ ఏడాది ఇండస్ట్రీలో తెరపైకి వచ్చిన కాంట్రవర్సీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా సినిమా విడుదలలు లేక వెండితెర కళ తప్పింది. కానీ, వివాదాలు మాత్రం బోలెడు చోటుచేసుకున్నాయి. మనదేశ చలనచిత్ర పరిశ్రమకు పెద్దన్నగా చెప్పుకునే బీటౌన్‌లో బంధుప్రీతి, మాదకద్రవ్యాలు, మీటూ ఆరోపణలు చోటు చేసుకోవడంతో ప్రతిఒక్కరూ ఉలిక్కిపడ్డారు. మరోవైపు కన్నడ చిత్రపరిశ్రమలో సైతం డ్రగ్స్‌కేసు తెరపైకి రావడంతో సినీ పరిశ్రమ గురించే అందరూ మాట్లాడుకున్నారు. మరికొన్ని రోజుల్లో 2020 ముగుస్తుండడంతో ఈ ఏడాది ఇండస్ట్రీలో చోటుచేసుకున్న వివాదాల గురించి ఓసారి తెలుసుకుందాం.

మైక్‌లో చెప్పేశారు..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ ఏడాది ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకూ ‘మా’లో ఉన్న గొడవల గురించి చెవిలో చెప్పుకున్న వారందరూ ఒక్కసారిగా బహిరంగంగా చర్చించుకునేందుకు ఈ వేడుక ఓ ప్రధాన ఉదాహరణగా మారింది. ‘మంచిని మైక్‌లో చెబుదాం.. చెడును చెవిలో చెప్పుకుందాం’ అంటూ ఆవిష్కరణ వేడుకలో చిరంజీవి ఇచ్చిన పిలుపును విస్మరిస్తూ నటుడు రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. ‘మా’ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినప్పటికీ తన శ్రమను ఎవరూ గుర్తించలేదంటూ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. రాజశేఖర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజు.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ‘మా’ కమిటీకి సూచించారు. ఈ వివాదంపై రాజశేఖర్‌ సతీమణి జీవిత వివరణ కూడా ఇచ్చారు.

పెద్దన్నను కుదిపేసిన ఆత్మహత్య..

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్ మరణం భారతీయ చలన చిత్రపరిశ్రమకు పెద్దన్నగా చెప్పుకునే బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేసింది. ‘ఆత్మహత్య నేరం. ఆత్మహత్యకు పాల్పడవద్దు’ అంటూ సినిమాలో సందేశాలు ఇచ్చిన ఆయన ఈ ఏడాది జూన్ 14న ముంబయిలోని తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి అందర్నీ షాక్‌కు గురి చేశారు. సరైన అవకాశాల్లేక మానసికంగా కుంగుబాటుకు గురైన ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించినప్పటికీ సుశాంత్‌ని బాలీవుడ్‌ బడా వ్యక్తులు కావాలనే హత్య చేశారంటూ పలువురు నెటిజన్లు ఆరోపణలు చేశారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు నటి కంగనారనౌత్‌ సైతం అనుమానాలు రేకెత్తించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కేసును ఎన్సీబీ, సీబీఐ సంస్థలు దర్యాప్తు చేశాయి.

సెలబ్రిటీలు కంగారుపడ్డారు..

ఈ ఏడాది బాలీవుడ్‌ ఇండస్ట్రీపై పడిన పెద్ద మచ్చ బంధుప్రీతి. అప్పటివరకూ పరిశ్రమలో ఉన్న తారలందరూ ఒక్కటే అని భావించిన సినీ ప్రియులు ఈ విషపూరితమైన సంస్కృతితో ఉలిక్కిపడ్డారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మరణంతో ఇది తెరపైకి వచ్చింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టిన వ్యక్తికి ఎంత టాలెంట్‌ ఉన్నాసరే అవకాశాలు ఇవ్వరని.. అదే స్టార్‌కిడ్స్‌కి మాత్రం టాలెంట్‌ లేకపోయినా ఆఫర్స్‌ ఇచ్చేస్తారంటూ పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీనికితోడు కంగనారనౌత్‌.. ఇండస్ట్రీలో తాను కూడా బంధుప్రీతి కష్టాలు చవిచూశానంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఈ బంధుప్రీతి కారణంగా బాలీవుడ్‌లో స్టార్‌కిడ్స్‌, బడా నిర్మాతలుగా చెప్పుకునే కరణ్‌జోహార్‌, మహేశ్‌భట్‌, ఆలియాభట్‌, సారా అలీఖాన్‌, తదితరులకు ఆన్‌లైన్‌లో ఫాలోయింగ్‌ కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది. నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు దూరంగా ఉండేందుకు పలువురు తారలు తమ సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల్లో కామెంట్‌ సెక్షన్‌ను కొంతకాలంపాటు మ్యూట్‌ చేశారు కూడా.

మత్తు చిత్తు చేసింది..

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణంతో తెరపైకి వచ్చిన మరో విషయం డ్రగ్స్‌. పలు సందర్భాల్లో సుశాంత్‌కి తాను డ్రగ్స్‌ అందించానని, బీటౌన్‌లోని పలువురు తారలు మాదకద్రవ్యాలు సేవిస్తుంటారని సదరు నటుడి ప్రియురాలు రియాచక్రవర్తి ఎన్సీబీ విచారణలో తెలియజేసిందని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. మరోవైపు బీటౌన్‌ తారలకు కరణ్‌జోహార్‌ పార్టీ ఇచ్చిన ఓ వీడియో కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో ఎన్సీబీ అధికారులు.. బాలీవుడ్‌ నటీమణులు దీపికాపదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌లను వేరువేరుగా కొన్ని గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. అంతేకాకుండా దీపిక‌, సుశాంత్‌ సింగ్‌ మేనేజర్లు కూడా ఈ విచారణలో భాగమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై మరోసారి కంగన తన గళం విప్పారు. బాలీవుడ్‌లో 90 శాతం మంది నటీనటులు డ్రగ్స్‌ తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌లో దుమారం రేపాయి.  రవీనాటాండన్‌, అనుభవ్ సిన్హా.. కంగన చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా కన్నడ చిత్రపరిశ్రమలోనూ డ్రగ్స్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. నటీమణులు రాగిణి, సంజనా గల్రానీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాణిగారి ఆఫీస్‌పై బీఎంసీ కన్ను..

ఓవైపు బీటౌన్‌పై కన్నెర్ర చేస్తూనే.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. ముంబయి నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగన వ్యాఖ్యలు చేసిన సమయంలో బీఎంసీ అధికారులు.. అక్రమ కట్టడంగా పేర్కొంటూ పాలీహిల్స్‌లోని ఆమె కార్యాలయాన్ని కొంతమేర కూల్చివేశారు. బాంబే హైకోర్టు జోక్యంతో కంగన ఆఫీస్‌ కూల్చివేతను అధికారులు మధ్యలోనే నిలిపివేశారు.

‘మీటూ’కూడా వదల్లేదు..

ఈ ఏడాది బీటౌన్‌కు చేదు అనుభవాలను అందించిందనే చెప్పాలి. ఓ పక్క బంధుప్రీతి.. డ్రగ్స్‌ కేసు.. వీటిని మర్చిపోయేలోపే మీటూ వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ నటి పాయల్‌ ఘోష్‌ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బీటౌన్‌కు చెందిన పలువురు తారలు ఆయనకి బాగా క్లోజ్‌ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

కన్నడ ఇండస్ట్రీ ఆగ్రహం.. నటుడు సారీ

కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల టాలీవుడ్ నటుడు విజయ్‌ రంగరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి.. కన్నడ అగ్ర కథానాయకులను ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేశాయి. ఉపేంద్ర, యశ్, సుమలత, సుదీప్, పునీత్‌ రాజ్‌కుమార్‌తోపాటు పలువురు తారలు, కన్నడనాట ప్రజలు విజయ్‌ రంగరాజుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో, విజయ్‌ రంగరాజు క్షమాపణలు చెబుతూ కన్నీరుమున్నీరైన ఓ వీడియోని విడుదల చేశారు.

ఇవీ చదవండి..

రాజ్‌తరుణ్‌.. ఎప్పటికీ నీతోనే ఉంటా: అవికాగోర్‌

ఆ బాలుడి కలను నిజం చేసిన అల్లు అర్జున్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని