కొవిడ్‌ టీకా.. నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌ - Covid Vaccination dry run in 4 states Telugu states are included or not
close
Updated : 25/12/2020 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ టీకా.. నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లు గత కొంతకాలంగా శరవేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో టీకా సన్నాహక కార్యక్రమాన్ని వచ్చే వారం నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ‘డ్రై రన్‌’ కార్యక్రమాన్ని టీకా రిహార్సల్‌ అని చెప్పవచ్చు. దీనిలో పంజాబ్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి  రెండు జిల్లాల చొప్పున ఎంపిక చేసి.. మొత్తం ఎనిమిది జిల్లాల్లో డిసెంబర్‌ 28, 29లలో నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిసింది.

ఏమిటీ డ్రై రన్‌?

రెండ్రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో టీకా ఇవ్వటం మినహాయించి.. మిగిలిన అన్ని దశలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లు, టీకా అనంతరం ఎదురయ్యే పరిణామాలపై ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నామో తెలుసుకుంటారు. కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్వహణ, రవాణా ఏర్పాట్లు, సామాజిక దూరం పాటించేలా ప్రజలను అదుపుచేసే విధానం అమలును కూడా ప్రత్యక్షంగా చూస్తారు. అంతేకాకుండా వ్యాక్సినేటర్లు, టీకాలను వేసే ఇతర సిబ్బంది విధి విధానాల గురించి కూడా అధ్యయనం చేస్తారు.
అసలు టీకాలు వేసే ఆవరణ వ్యాధి వ్యాప్తికి నిలయం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల అమలును పరిశీలిస్తారు. కాగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సంబంధిత రాష్ట్రాలకు అందజేసింది.

టీకా కమిటీలు

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాకు పలు అంచెల నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో రెండు, కేంద్ర స్థాయిలో ఒకటి మొత్తం మూడు కమిటీలు భాగంగా ఉంటాయి. టీకా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు ఇవి తరచు సమావేశమవుతూ.. వ్యాక్సిన్‌ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. అంతేకాకుండా వైద్యాధికారులు, వ్యాక్సినేటర్లు, వారి ప్రత్యామ్నాయ సిబ్బంది, కోల్డ్‌ చైన్‌ నిర్వాహకులు, సూపర్వైజర్లు, ఆశా సమన్వయకర్తలు తదితరులు వివిధ స్థాయిల్లో భాగస్వాములుగా ఉంటారు.

టీకా నిల్వ..

ఆయా వ్యాక్సిన్లను ప్ర్యత్యేకంగా నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సిన నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 28,947 కోల్డ్‌చైన్‌ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా టీకా అందజేసే మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, కరోనా యోధులకు సరిపడా మోతాదులను నిల్వ చేసేందుకు సరిపోతాయని కేంద్రారోగ్య శాఖ ప్రకటించింది.

ట్రైనర్ల శిక్షణ పూర్తి

కరోనా కట్టడిలో టీకా వేసే  సిబ్బంది ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో శిక్షణా కార్యక్రమం దేశవ్యాప్తంగా మొదలైంది. ఇందులో భాగంగా 2360 సెషన్లలో, ఏడువేల మంది ట్రైనర్లకు శిక్షణ లభించింది. పూర్తి టీకా ప్రక్రియను నిర్వహించేందుకు, సంబంధిత కోవిన్‌ ‌పోర్టల్‌ను ఉపయోగించటంలో వీరికి శిక్షణనిచ్చారు. అంతేకాకుండా  కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌, కోవిన్‌ పోర్టల్‌ సంబంధిత సందేహాలు తీర్చేందుకు జాతీయ స్థాయిలో 1075, 104 హెల్ప్‌లైన్‌ వ్యవస్థలను కూడా బలోపేతం చేశారు.

కేంద్రం తొలి విడతగా 30 కోట్ల మందికి టీకా అందజేయనున్న సంగతి తెలిసిందే.  ఇక కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయాల్సిన ప్రజలను ‘నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సినేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ నిపుణుల బృందం మూడు సమూహాలుగా విభజించింది. వీరిలో ఆరోగ్య సిబ్బంది సుమారు ఒక కోటి మంది, కరోనా యోధులు రెండుకోట్ల మంది, నిర్దేశిత వయోపరిమితిలో ఉన్నవారు 27 కోట్లమంది ఉన్నారు.

ఇవీ చదవండి..

కొత్త కరోనా రకాన్ని ఎదుర్కొనేలా టీకా..

మన టీకాపై ప్రపంచ దేశాల దృష్టిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని