నా ఇల్లు హైదరాబాద్‌.. క్రేజీ ఫైనల్‌.. ఓపెనర్‌నే కదా - DC vs SRH what players opinion
close
Published : 09/11/2020 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా ఇల్లు హైదరాబాద్‌.. క్రేజీ ఫైనల్‌.. ఓపెనర్‌నే కదా

దిల్లీ×హైదరాబాద్‌ పోరు గురించి ఎవరేమన్నారంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2020 ముగింపునకు చేరుకుంది. సీజన్‌లో ఇంకొక్క మ్యాచే మిగిలుంది. దుబాయ్‌ ఆతిథ్యమిచ్చే ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయితో దిల్లీ తలపడనుంది. 13 సీజన్లలో ఫైనల్‌ చేరుకోవడం దిల్లీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో ఆ జట్టు హైదరాబాద్‌ను 17 పరుగుల తేడాతో ఓడించింది. శ్రేయస్ సేన నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో వార్నర్‌ బృందం 172/8కే పరిమితం అయింది.  కాగా ఈ పోరు తర్వాత ఎవరెవరు ఏమన్నారంటే?


అద్భుత క్షణాలివి: అయ్యర్‌

ఫైనల్‌ చేరుకున్నందుకు అద్భుతంగా అనిపించిందని దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. సీజన్‌లో తమ ప్రయాణం ఒడుదొడుకుల మధ్య సాగిందని పేర్కొన్నాడు. ‘మా జట్టంతా ఓ కుటుంబం. ప్రతి ఒక్కరు శ్రమించిన తీరుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం నాకెన్నో పాఠాలు నేర్పించింది. సారథిగా ఎన్నో బాధ్యతలు చూసుకున్నా. కోచ్‌లు, సహాయక సిబ్బంది నుంచి నాకెంతో సాయం లభించింది. అంతేకాకుండా చక్కని జట్టు ఉండటం నా అదృష్టం. కొన్నిసార్లు జట్టులో మార్పులు తప్పవు. ముంబయి కఠినమైన జట్టు. దానిపైనా స్వేచ్ఛగా ఆడాలనే అనుకుంటున్నా. హైదరాబాద్‌లో రషీద్‌ కీలకమని తెలుసు. అతడికి వికెట్లు ఇవ్వకుండా ఆడాలనుకున్నాం. పవర్‌ప్లేలో మెరుపు ఆరంభం కావాలనే ఉద్దేశంతో స్టాయినిస్‌ను పంపించాం. అతడు ఎక్కువసేపు ఆడితే పరుగులు వస్తాయని భావించాం’ అని శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు.


హైదరాబాద్‌ నా ఇల్లు: వార్నర్‌

హైదరాబాద్‌ తనకు రెండో ఇళ్లని, ఫ్రాంచైజీ యాజమాన్యం కుటుంబమని డేవిడ్‌ వార్నర్‌ అంటున్నాడు. వచ్చే ఏడాది భారత్‌లో టోర్నీ ఆడి మెరుగైన ప్రదర్శన చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘నిజం చెప్పాలంటే మాకెవ్వరూ ఏమీ అవకాశాలివ్వలేదు. ముంబయి, దిల్లీ, బెంగళూరు గొప్ప జట్లు. మేమీరోజు ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ సారి మేం నటరాజన్‌ను కనుగొన్నాం. అతడు అద్భుతంగా బంతులేశాడు. రషీద్‌, మనీశ్‌ పాండే సైతం అంతే. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞతలు. క్యాచులు వదిలేస్తే మ్యాచులు వదిలేసినట్టే. ఫీల్డింగ్‌లో మా వైఖరి మారకపోతే కష్టం. ఈ సీజన్‌లో ఇదే మమ్మల్ని ముంచింది. కీలకమైన సాహా, భువి లేకపోవడంతో కష్టమైంది. అయినప్పటికీ మిగతా ఆటగాళ్లు వారివారి పాత్రలను చక్కగా పోషించారు. అభిమానులు మాకు అండగా ఉన్నారు’ అని డేవీ పేర్కొన్నాడు.


ముంబయిపై ఇదే ప్రదర్శన: రబాడా

ఇండియన్‌ టీ20 లీగులో దిల్లీ తొలిసారి ఫైనల్‌ చేరుకున్నందుకు సంతోషంగా ఉందని దిల్లీ పేసర్‌ కాగిసో రబాడా అన్నాడు. ఫైనల్‌కు ముందు దొరికిన సమయంలో విశ్రాంతి తీసుకుంటామని మరింత చురుగ్గా తయారవుతామని పేర్కొన్నాడు. సుదీర్ఘమైన టోర్నీలో ఆటగాళ్లు అలసిపోవడం మామూలేనని తెలిపాడు. అయితే ప్లేఆఫ్స్‌కు ముందే అందరూ పుంజుకున్నారని పేర్కొన్నాడు. ‘ఇది నా రోజు. చివరి ఓవర్లో బాగా వేశానని చెప్పలేను. కానీ కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఏదేమైనా గెలుపు ముఖ్యం. కెరీర్‌లో చాలాకాలంగా ఆఖరి ఓవర్లు వేస్తూనే ఉన్నాను. క్వాలిఫయర్‌ మ్యాచులో ఆడినట్టే ఫైనల్లో ఆడాలని కోరుకుంటున్నాను. మాపై గత మ్యాచులో వార్నర్‌ అద్భుతంగా ఆడాడు. అతడో గొప్ప ఆటగాడు. అందుకే అతడిని త్వరగా ఔట్‌చేయాలని అనుకున్నాం. ఛేదన మొదట్లోనే వికెట్లు తీయడంతో మాపై ఒత్తిడి పోయింది. దిల్లీ తన చిరకాల కోరికను తీర్చుకుంటుందనే అనుకుంటున్నా’ అని రబాడా ధీమా వ్యక్తం చేశాడు.


ఓపెనింగ్‌ అనుభవం ఉంది: స్టాయినిస్‌

బిగ్‌బాష్ లీగులో గతంలో ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉందని దిల్లీ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ అన్నాడు. ఇండియన్‌ టీ20 లీగులో ఆ అవకాశం రావడం బాగుందని పేర్కొన్నాడు. ‘ముందు ఏం జరుగుతుందో తెలియదు. మొదట్లో స్వింగ్‌ కనిపించింది. దూకుడు పెంచే ముందు బంతిని పరిశీలించాను. గతంలో బీసీసీఐ లీగులో ఆడాను కానీ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. క్వారంటైన్లో కష్టంగా  ఉన్నా ప్రేరణ లభించింది. ముంబయి గొప్ప జట్టు. నిలకడగా రాణించింది. మేం అత్యుత్తమంగా ఆడితేనే గెలుస్తాం. అబుదాబి వికెట్‌ బాగుంది. అందుకే వ్యూహాలు మార్చి వైడ్‌యార్కర్లు వేశాను’ అని స్టాయినిస్‌‌ అన్నాడు.


సిగ్గనిపిస్తోంది: విలియమ్సన్‌

ఫైనల్‌ చేరుకోనందుకు బాధగా అనిపించిందని హైదరాబాద్‌ కీలక ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. భారీ లక్ష్యం కారణంగా రిస్క్‌ తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘దిల్లీ అద్భుతమైన జట్టు. మాలాగే వాళ్లు కూడా సహజమైన ఆటతీరు కోసం ప్రయత్నిస్తున్నారు. సమష్టిగా రాణించి ఆధిపత్యం చలాయించారు. మాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఛేదనలో రిస్కు తీసుకోక తప్పలేదు. శుభారంభం దక్కకపోయినా మధ్యలో ధాటిగా ఆడి పరిస్థితుల్ని చక్కబెట్టాం. గెలుపు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేక పోయాం. ఫైనల్స్‌కు చేరకపోవడం సిగ్గుగా అనిపిస్తోంది. అయితే మా ఆటగాళ్లు తమ ప్రదర్శన పట్ల గర్వపడొచ్చు’ అని కేన్‌ పేర్కొన్నాడు.


కోరుకోని ఫలితమిది: వీవీఎస్‌

దిల్లీతో క్వాలిఫయర్‌-2 మ్యాచులో  కోరుకున్న ఫలితం రాలేదని హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. అయితే జట్టు సమష్టి ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఒక బృందంగా మాకిదో గొప్ప ప్రయాణం. మాకు మద్దతుగా నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ మమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. త్వరలోనే కలుద్దాం’ అని వీవీఎస్‌ ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని