మూడో సారి.. యాక్షన్‌ స్వారీ - Director And Heros Hat Trick Combo
close
Published : 14/12/2020 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో సారి.. యాక్షన్‌ స్వారీ

హీరో-దర్శకుడు... కథానాయకుడు-నాయిక... ఇలా కాంబినేషన్లపై అభిమానులు అంచనాలు పెంచుకుంటుంటారు. ఎక్కువ సినిమాల మార్కెట్‌ వీటిపైనే నడుస్తుంటుంది. అలా తొలి కలయికలోనే మంచి విజయం అందుకున్నారు కొందరు దర్శకులు-కథానాయకులు. రెండో సినిమాతోనూ అదే హవా కొన  సాగించారు. పాత ఫార్ములా పక్కన పెట్టి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జట్టుకట్టి  హ్యాట్రిక్‌ యాక్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏఏ చిత్రాలు చేస్తున్నారు? మూడో సినిమాలో చూపుతున్న భిన్నత్వం ఏమిటో చదివేయండి.

ఇలా ఈ దర్శకులందరూ మూడో ప్రయత్నంలో తమ కథానాయకుడిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. హిట్‌ కాంబినేషన్లగా పేరు తెచ్చుకున్న వీళ్లంతా మూడోసారి యాక్షన్‌ చిత్రాలతో విజయం    అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


బోయపాటి శ్రీను- బాలకృష్ణ కలయిక గురించి చెప్పాల్సిందేముంటుంది. వీళ్లిద్దరూ కలిశారంటే  రికార్డుల మోత అనాల్సిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇవి రెండూ బాలకృష్ణలోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మూడో  చిత్రం ‘బీబీ 3’ (వర్కింగ్‌ టైటిల్‌ )తెరకెక్కుతోంది. ఈసారీ యాక్షన్‌  నేపథ్యమే అయినా వైవిధ్యంగా ఉండేందుకు బాలయ్యను అఘోరా పాత్రలో చూపించబోతున్నారు బోయపాటి. దాంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్‌  పెరిగింది. చిత్రీకరణ ఇటీవలే హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ అలరిస్తోంది.


‘డాన్‌ శీను’తో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు గోపీచంద్‌ మలినేని, రవితేజ. ఈ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘బలుపు’. ఈ రెండు చిత్రాలు యాక్షన్‌ నేపథ్యంలో సాగేవే. డాన్, రౌడీ షీటర్‌గా చూపించిన గోపీ ఇప్పుడు రవితేజను పోలీసు అధికారిగా    పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం వీళ్లు కలిసి పనిచేస్తున్న చిత్రం ‘క్రాక్‌’. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. ఇందులో పోలీసు అధికారి వీర శంకర్‌ పాత్రలో కనిపించనున్నాడు రవితేజ. ఇటీవలే గోవాలో పాట షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలకానుంది.


సుకుమార్, అల్లు అర్జున్‌ ఇద్దరి కెరీర్‌లోనూ చిరస్థాయిగా నిలిచే చిత్రం ‘ఆర్య’. వన్‌సైడ్‌ లవ్‌ అంటూ తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టారు. ఆ తరువాత కొనసాగింపుగా ‘ఆర్య 2’ని పరిచయం చేశారు. ఈ రెండు ప్రేమకథలు యువతను బాగా ఆకర్షించాయి. దాంతో ఈ కాంబోలో ఎప్పుడెప్పుడు మరో సినిమా వస్తుందా? అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ రెండింటికీ భిన్నంగా ‘పుష్ప’ని ప్రకటించి సినీ వర్గాల్ని సైతం ఆశ్చర్యంలో పడేశారు. ఈ కథలో స్టైల్‌కి ఏమాత్రం అవకాశం లేని ‘పుష్ప’రాజ్‌గా స్టైలిష్‌స్టార్‌ని చూపించి అవాక్కయ్యేలా చేయడమే కాదు అందరి దృష్టిని తమవైపు తిప్పుకొన్నారు సుకుమార్‌. ప్రేమికుడిగా రెండు చిత్రాల్లో అమ్మాయిల చుట్టూ తిరిగిన అర్జున్‌ ఇప్పుడు అడవి బాట పట్టాడు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇటీవలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షెడ్యూల్‌ పూర్తిచేసుకుందీ   ఈ సినిమా. ఇప్పుడు హైదరాబాద్‌లోనే రెండో షెడ్యూలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


కిషోర్‌ తిరుమల, రామ్‌ కలిసి ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రేమ, స్నేహం, కామెడీ అంశాలతో ముడిపడి ఉన్న ఈ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ యాక్షన్‌ థ్రిల్లర్‌ని ఎంచుకున్నారు. తమిళ చిత్రం ‘తడం’ రీమేక్‌గా ‘రెడ్‌’ని తీసుకొస్తున్నారు. ఈ కాంబినేషన్‌లోనే కాదు రామ్‌ కెరీర్‌లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. దాంతో ఈ సినిమా ప్రత్యేకత సంతరించుకుంది. 2021 సంక్రాంతి బరిలో నిలిపేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ చిత్రంలోని ‘కౌన్‌ అచ్చా...’ అంటూ సాగే సినిమా థీమ్‌ పాటని ఇటీవల విడుదల చేశారు. కల్యాణ్‌ చక్రవర్తి రచించిన గీతమిది. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. మణిశర్మ స్వరకర్త.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని