
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాలకు త్రివిక్రమ్ విరాళం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు విరాళాన్ని అందించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కోసం కృషి చేస్తోన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు ప్రముఖులు సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనవంతు సాయంగా తెలంగాణకు రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించనున్నారు.
రోజురోజూకీ కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 606 కొవిడ్-19 కేసులు నమోదవగా... అందులో తెలంగాణ నుంచి 41 కేసులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇటు ఆయా రాష్ట్రప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నాయి. అంతేకాకుండా స్వీయ నిర్బంధం, వ్యక్తిగత శుభ్రత అనేవి కరోనా నివారణకు ముఖ్యమైన మార్గాలని ప్రభుత్వాలతోపాటు ఇటు సినీ ప్రముఖులు చెబుతున్నారు.
అనిల్ రావిపూడి, కొరటాల శివ..
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, కొరటాల శివ సైతం తెలుగు రాష్ట్రాలకు తమవంతు సాయం ప్రకటించారు. ఈ మేరకు అనిల్ రావిపూడి తెలంగాణ రాష్ట్రానికి రూ.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5 లక్షలు విరాళం కింద అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కొరటాల శివ సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కూడా..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తరఫున దిల్‌రాజు, శిరీష్.. కరోనా నివారణకు ఎంతో కష్టపడుతోన్న రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.